ఇది విన్నారా ,కన్నారా !-11
22-వీణ పెదగురాచార్యులు
176-18,19శతాబ్దాలలో జీవించిన పెద గురాచార్యులు తమిళనాడులోనూ గొప్ప వైణిక విద్వాంసులుగా పేరుపొందారు .పాశ్చాత్యులను కూడా మెప్పించిన మహా విద్వాంసులు .షట్కాల వీణ వెంకట రమణ దాసుగారికి తాతగారు కూడా .
177-మైసూర్ ప్రాంతం నుంచి విజయనగరానికి వలసవెళ్లి, గాన విద్యా పీఠాన్ని ,వీణ సంప్రదాయాన్ని నెలకొల్పారు .అప్పటికి త్యాగరాజ కీర్తనలు ఆంద్ర దేశం లో ప్రచారం లోలేవు .అప్పటికి కృష్ణ లీలా తరంగాలు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ,మువ్వ గోపాల పదాలు ,దరువులే బాగా వ్యాప్తిలో ఉండేవి .
178-గురాచార్యులుగారు సంగీత జ్ఞానం తో రచించిన గీతాలు ,తానవర్ణాలు ,తిల్లానాలు ,స్వర పల్లవులు ,శృంగార పదాలు ,కొణుగు శబ్దాలు ,జక్కిణ దరువులు ,సల౦దర్వులు వారి ప్రతిభకు గీటు రాళ్ళు .కొన్ని కాశీ రాజుపైనా ,నారాయణ గజపతి పైనా ,మాడుగుల కృష్ణ భూపతి పైనా రాసి తిరువాన్కూర్ మహా రాజుకు అంకిత మిచ్చారు .
179-పచ్చి మిరియం ఆది అప్పయ్య అనే ప్రసిద్ధ వైణికుని వంశంలో మరో సుప్రసిద్ధ వైణికుడు వీణ శేషన్న గారితాత గారికి సహోదరుడే పెద గురాచార్యులు .
180-పెద గురాచార్యులా వీణ సంప్రదాయమే శాఖోపశాఖలై ఆంద్ర దేశం లో విస్తరించింది .ఈ సంప్రదాయం లోని వారే పట్రాయని నరసింహ శాస్త్రి దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు ,కట్టు సూరన్న ,పొడుగు రామ మూర్తి ,రంగడు ,సర్వప్ప మొదలైన వారు .
23-శ్రీ దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు
181-శ్రీ దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులుగారు (1842-1896)శ్రీ వీణ వెంకట రమణ దాసు ,శ్రీ ములుగు శివానంద శాస్త్రి గారి తండ్రి శ్రీ ములుగు సుందరయ్య ,శ్రీ ఆనంద గజపతి గార్లకు గురువు .వీరితండ్రిగారు విజయనగరాస్థాన విద్వాంసులు .
182-సంగీత త్రయ రచనలు ఆంధ్ర దేశం లో వ్యాప్తి చెందటానికి ముఖ్య కారకులు సోమయాజులుగారే .వీర్రి దగ్గర వీణ నేర్చుకోమని ఆనంద గజపతిని తండ్రి విజయ రామ గజపతి కోరగా ఆయనకు సితార్ పై మోజేక్కువ అవటం తో నేర్వలేదు .సితార్ పై పలికించే ప్రతిదీ వీణపై పలికించవచ్చని చెప్పినా కొడుకు వినలేదు .అప్పుడు తండ్రి తమ ఆస్థానం లోని మహాబత్ ఖాన్,కొడుకు మనవర్ ఖాన్ లను పిలిపించి సితార్ వాదన చేయించి వాటిని దూర్వాసులవారిని వీణపై పలికించమంటే పలికించారు. కాని వీరు వీణ పై పలికి౦చినవాటిని ఖాన్ సోదరులు సితార్ పై పలికించ లేక పోయారు .అప్పటికి జ్ఞానోదయమై ఆనంద గజపతి దూర్వాసుల వారి వద్ద వీణనేర్వటం ప్రారంభించారు
183-ఒక సారి1931లో మద్రాస్ లో మైసూర్ ,పుదుక్కొట వంటి 7 సంస్థాన వీణగాయకుల మధ్య పోటీ జరిగింది .విజయనగరం సంస్థానం చిన్నది కనుక ఏడవ స్థానం ఇచ్చారు .అదిఅవమాన౦ గా భావించి గజపతికి కోపం వచ్చింది .దూర్వాసుల వారు నచ్చచెప్పి పోటీలో పాల్గొన్నారు .పోటీలో ఒక్కొక్కరికి ఇచ్చిన సమయం 20నిమిషాలు మాత్రమే . .దూర్వాసులవారు కల్యాణి ,వసంతరాగాలను అనేక ఇతర సంప్రదాయాలతోను ,పాశ్చాత్య సంప్రదాయం తోనూ మేళవించి గంటన్నర సేపు వాయించారు .సభలోని తెల్ల దొరలూ దొరసానులు ఆనందం తో లేచి నిల్చుని డాన్స్ చేశారు .సోమయాజులుగారు గెలిచినట్లు ప్రకటించి సత్కరించి గౌరవించారు .వైస్రాయ్ ఎల్జిన్ ఆప్పుడిచ్చిన సర్టి ఫికేట్ ఆయన మునిమనవ రాలి ఇంట్లో ఇంకా భద్రంగా ఉంది .
184-సోమయాజులు గారు 72మేళ కర్త రాగాలలో పూసపాటి వంశస్థుల దిగ్విజయాలను క్రుతులుగా రాశారు .అందులో ఒక్కటే లభ్యం గా ఉంది .ఆనంద గజోపతి పై కాంభోజి రాగం లో ‘’ఎందుకీ తొందర ‘’,మోహన రాగం లో ‘’నెరనమ్మినాను’’కృతులు రాసి ఆయనకే అంకితమిచ్చారు .
185-దూర్వాసులవారు స్వర్గస్తులైనప్పుడు శ్రీ దూర్వాసుల రామూర్తి చెప్పిన పద్యం –
‘’వీణయుం జేత బూని కడు విస్మయ ముప్పతిలంగ భైరవిన్ –తానము మేళవించి ,అమృతంబును జిల్కెడు మిమ్ము జూచుచున్
‘’గాణలు హూణు లొక్క గతిగా నుతి జేసిరి గాని ,యంతలో –వీనుల పుణ్యమీ కరణి వీడెను గానము నస్తమించగా’’.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-6-16-ఉయ్యూరు

