ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -186
70-న్యు డీల్ ,అమెరికన్ లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-3
అయినా అమెరికా ఇంకా భయ విహ్వాలతతోనే ఉంది .రూజ్ వెల్ట్ మొదటి బాధ్యత ఉదాసీన ,అనుమాన౦ , నమ్మకం లేని స్థితి నుంచి ప్రశాంత స్థితి కల్పించటం ‘’.వాస్తవ స్థితులను గమనించి కు౦గి పోకూడదు .ఇలాటి ఎన్నో ఉపద్రవాలను తట్టుకొన్న దేశం ,జాతి మనది ,ప్రతి సంక్షోభం నుంచీ విజయవంతంగా బయట పడింది .ఇప్పుడు మనం భయ పడాల్సింది భయం గురించి తప్ప మరి దేని గురించి కాదు .మళ్ళీ మనం అభివ్రుద్ధిసాధించి ,విజయం తో విలసిల్లుతాం .సమస్యలు చుట్టుముట్టి ప్రగతిని పక్షవాతానికి గురి చేసింది .దానికి తగిన ట్రీట్ మెంట్ ఇచ్చి మళ్ళీ చైతన్యవంతం చేద్దాం ‘’అని రూజ్ వెల్ట్ ప్రెసిడెంట్ గా పదవీ స్వీకారం చేసిన రోజు జాతిని ఉద్దేశించి చెప్పి ధైర్యం కలిగించాడు .పదవిలోకి రాగానే విస్తృత యాజమాన్యం తో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు .అధిక లాభం ,డివిడెండ్ లపై పన్నులు విధించాడు .ప్రభుతోద్యోగుల జీతాలు పెన్షన్లు తగ్గించాడు ,బాంక్ లపై కంట్రోల్ కోసం కాంగ్రెస్ అనుమతి పొందాడు .డాలర్ విలువ తగ్గించాడు .దేశం లో ఉన్న బంగారాన్ని అంతా బయటికి తీయించి గోల్డ్ స్టాండర్డ్ కల్పించాడు .
ఇది ఆరంభం మాత్రమే .వాషింగ్టన్ లో ఆర్ధిక వేత్తల ,సైంటిస్ట్ ల ,రచయితల టీచర్ల ,రాజకీయ పండితుల ను సమావేశ పరచి చర్చించాడు .ప్రెసిడెంట్ సరళీ కృత విధానాలను ‘’ది బ్రెయిన్ ట్రస్ట్ ‘’అని హేళన చేశారు .లెక్కచేయలేదు .మూడే మూడు నెలల్లో ఆయనా ,ఆయన తో ఉన్న మేధావులు కలిసి ‘’న్యు డీల్ ‘’ప్రయోగానికి సిద్ధమయ్యారు .నేషనల్ ఇండస్ట్రి యల్ రికవరీ యాక్ట్ తో సహా అగ్రికల్చరల్ అడ్జెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ,సివిల్ కన్జర్వేషన్ కార్ప్స్ మొదలైన వాటిని ఏర్పాటు చేశాడు .ఇందులో కొన్ని ఫెయిలయ్యాయి కాని 1933కు అవే అత్యవసరమైనవయ్యాయి .సెక్యూరిటి యాక్ట్ వాల్ స్ట్రీట్ ను నియంత్రించింది .సివిలియన్ కన్జర్వేషన్ కార్ప్స్అరమిలియన్ యువకులకు ఉద్యోగాలు కల్పించింది .హోం ఓనర్స్ లోన్ అసోసియేషన్ తేలికగా తనఖాపై అప్పు సౌకర్యం కల్పించింది .టేనస్సీ వాలీ అధారిటి భూ క్షయాన్ని నివారింఛి పారిశుధ్యం విద్యుత్తూ ,వరద నివారణ లను చేసి దక్షిణ ప్రాంతం లో దరిద్రం లో మగ్గు తున్న వారి పాలిటి ఆశా జ్యోతి అయింది .నేషనల్ ఇండస్ట్రియల్ యాక్ట్ బాలకార్మికులపై నిషేధం విధించి,వస్తువుల ధరలు తగ్గించింది ,అన్యాయపు పనులకు చెక్ పెట్టింది ,ఉద్యోగుల వేతనాలు పెంచింది ,పని చేసే చోట్ల అద్భుత సౌకర్యాలు కలిపించింది ,ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో లేబర్ హక్కులను సాధించింది .లేబర్ యూనియన్ ను సంప్రదించకుండా యజమాని ఉద్యోగాలు ఇవ్వరాదనేది అమలైంది .
వీటితో గొడవ ,పేచీలతో పరిస్థితి కొంత భయానకమైంది .దాదాపు పత్రికలన్నీ రిపబ్లికన్ ల చేతుల్లో ఉన్నాయి కనుక అవి విషం కక్కాయి .ఒక పత్రిక కాలం లో న్యు డీల్ ఫాసిస్ట్ విధానం అంది .మరోటి కమ్యూనిస్ట్ విధానం అన్నది .తాను తెచ్చిన ప్రతి కొత్త చట్ట౦ తో వ్యతిరేకులు పెరుతున్నా ,తన సంస్కరణలకే కట్టు బడి ముందుకు కదిలాడు రూజ్ వెల్ట్ .’’సంపద పన్ను ‘ నినాదం ’బాంకర్లను వాణిజ్య వర్గ స్నేహితులను దూరం చేసింది .కాని ఆయనలో కనిపిస్తున్న మానవతా కార్యక్రమాలకు ప్రజా సమూహాలు విపరీతమైన మద్దత్తు నిచ్చాయి. కనుక రెండవ సారి ప్రెసిడెంట్ గా ఎన్నికవటానికి ఢోకాలేదని పించింది .1936లో నామినేషన్ వేసి ఒక ఇంగ్లిష్ జడ్జి చెప్పిన ‘’necessitious men are not free men ‘’అన్న వాక్యం ఉదాహరించాడు .ఎకనామిక్ రాయలిస్ట్ లనుద్దేశించి ‘’better the occasional faults of a government that lives in a spirit of charity than the consistent omissions of a government frozen in the ice of its own indifference ‘’అని మెత్తని చెప్పుతో కొట్టినట్లు చెప్పాడు .
రేడియో ద్వారా సామాన్య జనాన్ని’’ఫైర్ సైడ్ చాట్ ‘’’(కుర్చీలో కూని రాగాలు )పేరుతొ తరచుగా పలకరిస్తూ ప్రతిసారి యాభై వేల మిలియన్ల ప్రజలు రేడియో లో తన ప్రతిమాటా వినేట్లు చేసి మరీ దగ్గరయ్యాడు .ఆయన మాటలు వారిని మంత్రం ముగ్ధం చేసేవి ,అందులోని ప్రతి విషయం వారి గుండెల్లోకి సూటి గా చేరేట్లు చేశాడు తన అత్యద్భుత వాక్చాతుర్యం తో .వివేకం కల రాజకీయ వేత్తగా,తన శక్తి సామర్ధ్యాలను గొప్పగా వ్యక్తీకరించే మహా నటుడిగా ,తన దేశ ప్రజల పాలిటి ఆపద్బా౦ధ వుడిగా ఒక ‘’పెద్దన్న’’ గా వారి మనసులలో నిలిచి ఉండిపోయాడు .ప్రతి ఉపన్యాసమూ ‘’మై ఫ్రెండ్స్ ‘’అంటూ ప్రారంభించి వాళ్ళ మనసుల్ని దోచుకొన్నాడు .వీటన్నిటితో ప్రజలు ఆయనకు సన్నిహితస్నేహితులు అవటమేకాదు వారికి ఆరాధ్య దైవమే అయ్యాడు .రెండో సారి గెలుస్తాడనే అందరూ అనుకొన్నా మొదటి సారికంటే భారీ మెజార్టీతో గెలవటం అందర్నీ ఆశ్చర్య పరచింది .కాన్సాస్ రాష్ట్ర పూర్వ గవర్నర్ ఆల్ఫ్రెడ్ ఏం లండన్ తో ఈ సారి పోటీ .అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల చరిత్ర లో ఎప్పుడూ రాని భారీ మెజారిటీతో గెలిచి ఏక పక్ష విజయం గా నిరూపించాడు .523 లో 521ఎలెక్టో రల్ ఓట్లు సాధించాడు కేవలం రిపబ్లికన్ లకు అధికబలమైన మెయిన్ ,వెర్మాంట్ లలో ఆ రెండూ పోయాయి .
రెండవ సారి అధ్యక్షోపన్యాసం లో మొదట దేశపు చురుకైన ఆరోగ్యానికి చేయవలసింది చాలా ఉందని ,దేశం లో మూడవ వంతు ప్రజలు సరైన నివాసం వస్త్రాలు ,పోషకాహారం లేక ఇబ్బంది పడుతున్నారని ,మిలియన్లజనం వ్యవసాయ ,పారిశ్రామిక ఉత్పత్తులను కొనే సామర్ధ్యం లేకుండా ఉన్నారని ,వారి దారిద్ర్యం పనికి దూరం చేస్తోందని ,వీటినన్నిటినీ సరి చేయాల్సిన తక్షణ అవసరం ఉందని చెప్పాడు .ఆశా వివేకం తో రాగల ఉజ్వల భవిష్యత్తును గురించి చెప్పిన మాటలివి ‘’మొదటి సారి గద్దేనేక్కినప్పుడు నేను స్వార్ధం పదవీ వ్యామోహ శక్తుల పై నాపోరాటం అన్నాను .,ఇప్పడు రెండో సారి పదవీ బాధ్యతతీసుకొంటున్నప్పుడు ఆ శక్తులు వాటి యజమానిని కలిశాయి ‘’అన్నాడు .అయన వ్యతిరేకులు దేన్నీ ఉపెక్షించలేదు .విషపు మాటలతో ద్వేషం కక్కారు .’’మాకియవెలేన్ ఈగోయిస్ట్ ‘’అన్నారు .రూజ్ వెల్ట్ తప్పులూ చేశాడు .సుప్రీం కోర్ట్ లో తోమ్మిదిమందికి బదులు 15 మంది జడ్జీలు ఉండాలని కాంగ్రెస్ ను కోరాడు .ప్రముఖ డెమొక్రాట్ నాయకులే దీన్ని వ్యతిరేకించారు .కనుక వోటింగ్ కు రాకుండానే ఈ సూచన చచ్చిపోయింది .ఆయన్ను ఓడించవచ్చుననే నమ్మకం తో రిపబ్లికన్లు ఎదురు తిరిగారు .కాంగ్రెస్ ఇప్పటివరకు ఆయన సూచనను అంగీకరించే స్థితిలో ఉంది కాని దీనివలన ఆయనకు విస్తృత ఎక్సిక్యూటివ్ అధికారాలు లభి స్తాయని , పబ్లిక్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ తో సహా అన్నిటా ఇష్ట మొచ్చినవారికి కాబినెట్ పదవుల పందారం చేస్తాడని భావించి తిరస్కరించింది .
దేశం రెండు అతి ముఖ్య విషయాలతో సతమతమై గిలగిల లాడుతోంది .అందులో ఒకటి యుద్ధ ప్రమాదం .రెండవది పాత సంప్రదాయాన్ని కాదని నిబంధనలను తుంగలో తొక్కి ,అన్నిటికి విరుద్ధంగా రూజ్ వెల్ట్ మూడవ సారి 1940లో ప్రెసిడెంట్ పదవికి సిద్ధమౌతున్నాడని .మొదటిది రెండోదానికి దారి చూపించింది .చాలాకాలంగా ఇక ప్రెసిడెంట్ పదవి చాలు అనుకొంటూ నే ఉన్నాడు కాని విస్తరిస్తున్న యూరోపియన్ యుద్ధంవలన తటస్థ దేశమైన అమెరికా కు ఇబ్బందులెదురౌతాయేమో నని ,చికాగో లో డెలిగేట్లు మొదటి బాలెట్ లోనే రూజ్ వెల్ట్ ను నామినేట్ చేశారు .దీనితో అమెరికా రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఏర్పరచిన రెండు సార్లు మాత్రమె పోటీ చేయాలనే సంప్రదాయాన్ని కాదని మూడవ సారి నిలబడటానికి సిద్ధమయ్యాడు .58ఏళ్ళ వయసులో దీన్ని సమర్ధించు కొంటూ తానూ నియంతగా మారటం లేదని ,అంతర్జాతీయ విపత్తు సమయం లో ,అన్ని పక్షాలవారు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని అభ్యర్ధించాడు .
యుద్ధానికి దేశాన్ని సన్నద్ధం చేయటమే ఇప్పుడు ఆయన ప్రధాన విషయమై పోయింది .నిర్బంధ సైనిక శిక్షణ అమలు చేశాడు .యాభై పాత డిస్ట్రాయర్ లను 99 ఏళ్ళ లీజ్ కు తీసుకొని అట్లాంటిక్ సముద్ర బ్రిటిష్ స్థావరాల వద్ద నిఘా ఉంచాడు .న్యు డీల్ ను పారిశ్రామిక సంస్థలు అధిక తుపాకుల టాంకు ల ,ఆయుధ సామగ్రి తయారీకోసం కొంత ఉదారం చేశాడు .దీనితో అమెరికాను ‘’ఆర్సేనల్ డెమోక్రసీ ‘’(సాయుధ ప్రజాస్వామ్యం )గా మార్చాడు .ఇంగ్లాండ్ ఫ్రెంచ్ మిలిటరీ సహకారం పొందాడు .అమెరికాలోని అన్ని జపాన్ ,ఇటలీ నౌకలను స్వాధీనం చేసుకొన్నాడు .గ్రీన్ లాండ్ కు సైన్యాన్నిపంపాడు .ఇంగ్లాండ్ ప్రధాని చర్చిల్ తో అతి రహస్య సమావేశం జరిపి ‘’అట్లాంటిక్ చాప్టర్ ‘’రూపకల్పన చేసి నాజీ నియంతృత్వం నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించి యుద్ధానంతర ప్రపంచం సముద్రాలపై అంతర్జాతీయ స్వాతంత్ర్య౦ ,ప్రజల స్వీయ నిర్ణయ హక్కు ,బలవంతపు దాడులులేకపోవటం ,ముడి సరుకులను విజేత ,పరాజిత ,నాశనమైన దేశాలతో సహా అందరూ పంచుకోవటం ‘’అనే అంశాలకు ప్రాముఖ్యత నిచ్చారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-16-ఉయ్యూరు

