ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -236
87-కొత్త జర్నలిజం ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్
అమెరికా విస్తృత జీవన శక్తి కి ప్రతీక ధామస్ ఉల్ఫ్ .అమెరిక దేశపు హీరో .నిర్మించినది ప్రతిదీ అతి విస్త్రుతమైఉండేది ,నిప్పులు రాల్చే కళ్ళతో నల్ల జుట్టుతో ,కాల గమన హింసతో ,ఏకాకి జీవిత వ్యధతో ,కోల్పోయిన దిగులుతో ఉండేవాడు .వాల్ట్ విట్మన్ లాగా అమెరికాను అన్నికోణాల్లో దర్శించినవాడు ,ఆ జీవితాన్ని ప్రతి స్థాయి లోను అనుభవించి,అమెరికా ప్రేమికుడై ఆరాధన తో నాలుగు నవలలతో సాహిత్య చిరంజీవియై 38 ఏళ్ళు రాకుండానే మరణించిన వాడు . అమెరికా లో నార్త్ కారోలీనా ఆష్విల్ లో 3-10-1900 న జన్మించి ధామస్ క్లేటన్ ఉల్ఫ్ గా నామకరణం చేయబడ్డాడు .తండ్రి రాళ్ళు చెక్కేవాడే అయినా సాహిత్యం అంటే మోజున్నవాడు .కవిత్వాన్ని గట్టిగా ఆనందంగా పఠించేవాడు .ఉల్ఫ్ చిన్నతనం షేక్స్ పియర్ సాలి లోక్వి ల రిథం బట్టీ పట్టటం గ్రే కవి ‘’ఎలిజీ ‘’అప్పగించటం తో గడిచింది .ఈ రెండూ కూడా వేదనా భరితమైనవే .తల్లి ఒక బోర్డింగ్ హౌస్ కీపర్ .టాం ఏడుగురు పిల్లలలో చివరివాడు .కుటుంబ బాధ్యతకూడా మీద పడింది .బాల్యం లోనే ఇంటింటికీ పేపర్లు వేసి ,ఎవరైనా పని చెబితే చేసి ,కొన్ని పెన్నీలు సంపాదిస్తూ నీగ్రో క్వార్టర్ లకు వెళ్లి ఒక నీగ్రో వాడిని బోర్డింగ్ కు కుదిర్చే వాడు ..15 వ ఏట టాం ను నార్త్ కరోలినా యూని వర్సిటికి పంపే స్తోమత వచ్చింది..అక్కడ కాలేజ్ మేగజైన్ కు న్యూస్ పేపర్ కు ఎడిటర్ అయాడు . జర్నలిస్ట్ కాని లాయర్ కాని కావాలనుకోనేవాడు .కాలేజీ లో చివర రెండేళ్లలో చాలా ఏకాంకిక నాటికలు రాశాడు .కాని తానూ ప్రోఫెషనల్ రచయిత అవుతానని కలలో కూడా అనుకోలేదు .ఆతను రాసిన నాటిక ఒకటి కాలేజి స్టేజ్ పై ప్రదర్శింప బడింది .18 వ ఏట వర్జీనియాలో న్యు పోర్ట్ న్యూస్ లో ఉద్యోగం లో చేరాడు .కవితలు నాటక కధలు మనసులో సుళ్లు తిరిగేవి .1920 లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి హార్వర్డ్ వెళ్లి అక్కడ ప్రొఫెసర్ జార్జ్ పియర్స్ కు చెందిన ప్రసిద్ధ ‘’47 వర్క్ షాప్ ‘’లో చేరాడు దీనిలోనే ఆ తర్వాత ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ కూడా చేరాడు .
టాం కు రాయటం అవలీలగా వచ్చేసింది .పదాలు నదీ ప్రవాహం లాగా దొర్లుకొంటూ వచ్చేసేవి .అవి తమంతటికి తామే వచ్చి ఎక్కడ ఉండాలో అక్కడ చేరినట్లు ఉండేవి .టాం కోసమే తాము సిద్ధంగా ఉన్నట్లు అనిపించేది .ఆ ప్రవాహం అడ్డూ ఆపూ లేకుండా మహా ప్రవాహంగా చేరి కుదిరి సార్ధకంయ్యేవి .20 వ ఏట రోజూ తనను మోసుకు పోయే ఈశబ్ద ప్రవాహం అకస్మాత్తుగా పొంగి ప్రవహించింది .కొత్త నాటికలు రాస్తున్నాడు బాగున్నాయని అంటున్నారుకాని తిరస్కరింప బడేవి .అందరూ మెచ్చుకోనేవాళ్ళే కాని ప్రదర్శించటానికి ఎవరూ ము౦దు కోచ్చేవారు కాదు .ఇదంతా అతని సహనానికి పరీక్షగా ఉండేది .ఈ సందర్భంగా అతనిలో ఒక రకమైన తాత్విక చింతన ప్రారంభమై ఇలా రాసుకొన్నాడు –‘’I am acquiring patience .i am quite willing to wait for the unveiling exercises .All that really matters right now is the knowledge that I am twenty –three and a golden May is here .The feeling of immortality in youth is upon me .I am young and I can never die .Don’t tell me that I can .Wait until I am thirty .Then I believe you ‘’
కాని అంతగా ఓపిక పట్టలేక హార్వర్డ్ లో ఏం యే .చేసి ,న్యు యార్క్ వర్సిటి వాషింగ్టన్ స్క్వేర్ కాలేజి ఇన్ స్ట్రక్టర్ ఉద్యోగం పొందాడు .చాలా నిబద్ధత తో చదువు చెప్పాడు .తనది ఉద్యోగంగా భావించి నాటక కర్త కావాలనుకొన్నాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ చైర్మన్ హోమర్ వాట్ కు ‘’నా ద్రుష్టి అంతా నాటకాల మీద ఉంది .కొద్ది రోజుల్లో నేను దియేటర్ నాటకాలు రాయగలను అనే దైర్యం ఉన్నవాడిని.అది తప్ప నాకి౦కేదీ చెయ్యాలని లేదు ‘’అని ఉత్తరం రాశాడు .వాళ్లకు చీమకుట్టినట్లుగా కూడా అనిపించలేదు .తన పరిసరాలను ,చుట్టూ ఉన్నవాళ్ళను పెద్దగా పట్టించుకొనే వాడుకాదు .వీళ్ళను ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’లో ‘’స్కూల్ ఫర్ యుటిలిటి కల్చర్స్ ‘’శీర్షిక తో వ్యంగ్యంగా ఏకేవాడు .ఆరేళ్ళు న్యుయార్లో టీచింగ్ లో ఉన్నా క్లాస్ రూమ్ లనుండి విశ్రాంతి గానే గడిపాడు .విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక నవల ఇతి వృత్తం మనసులో మెదిలింది .మళ్ళీ టీచింగ్ లో చేరాల్సివచ్చి ,చేరి మళ్ళీ పారిపోయి 19 26 లో లండన్ లో కనిపించాడు .విదేశం లో ఒంటరిగా ఉంటూ రాయటం మొదలు పెట్టాడు .రెండున్నర ఏళ్ళ తర్వాత న్యు యార్క్ వచ్చి ,పగలు చదువు బోధించటం లో రాత్రుళ్ళు రచనలో గడిపి పుస్తకం పూర్తీ చేశాడు .’’పుస్తకం నన్ను కట్టి పడేసింది నన్ను స్వంతం చేసుకొంది’’అని రాశాడు .ఈ నవలపేరు ‘’ది స్టోరీ ఆఫ్ ఎ నావెల్ ‘’. దీన్ని గురించి ‘’నవల దానికదే రూపు దిద్దుకోన్నది .నాకు ప్రతి యువకుడూ ఇష్టమే .నేను ఆరాధించే రచయితల ప్రభావం నాపై ఉంది .అప్పుడు జేమ్స్ జాయిస్’’యులిసెస్ ‘’తో చాలా ప్రసిద్దుడు .ఈ పుస్తక ప్రభావం నా నవలపై పడింది .అయినా నాదైన యువ శక్తి ,అగ్ని దానిపై బాగా పని చేశాయి .జాయిస్ లాగానే నేనూ నాకు తెలిసిన వస్తువుల గురించి ,ఇప్పటి జీవిత౦ అనుభవం గూర్చి చిన్ననాటి విషయాల గురించి రాశాను .జాయిస్ కున్న సాహిత్య అనుభవం నాకు లేదు .ఇంతకూ ముందు యే పుస్తకామూ నేను ప్రచురించలేదు .నాకు రచయితలూ ,పబ్లిషర్లు ,పుస్తకాలు ,దూరపు ప్రపంచం ఏవీ తెలియవు .చిన్నతనం లో ఎలా రొమాంటిక్ గా లేవో ఇప్పుడూ అలాగే అంది .కాని ఈ నవలలో నేను సృష్టించి చిత్రించిన మనుషులు ,రంగులు విశ్వ వాతావరణం అన్నీ నన్ను తమవాడిని గా చేసుకోన్నాయి .అందుకే నేను ఆ దీప శిఖ తో ఒక యువకుడు ఇంతకూ పూర్వం ఏదీ ప్రచురించనివాడు రాసినట్లు ఇక ముందు అంతా మంచి జరగాలని జరుగుతుందని ఆశ తో రాశాను.’’అని చెప్పాడు .
ఈ నవల నమ్మశక్యం కానంత బృహత్ నవల. .మూడులక్షల యాభై వేల పదాల నవల .దీన్ని ‘’ఓ లాస్ట్ ‘’అనిపిలవాలనుకొన్నాడు .దీని ప్రచురణకు ఇద్దరు మిత్రుల సాయం అందుకొన్నాడు .చివరికి ఈ పుస్తకానికి ‘’లుక్ హోమ్వర్డ్ ఏంజెల్ ‘’అని పేరుపెట్టాడు .29 వ పుట్టిన రోజు విడుదల చేశాడు దీన్ని .తనను తాను మరీ నగ్నంగా ప్రదర్శించుకోన్నానేమో అనుకొన్నాడు .కాని విమర్శకులు చాలా గొప్పగా పెద్ద పెద్ద విశేషణాలతో మెచ్చుకొనే సరికి మహా దానంద౦ పొందాడు .కొందరు దీన్ని వీధి మూలల్లో తిట్టటం ,అతని అభిమాని ఒకామె ఫిర్యాదు చేయటం మనసు ను కల్లోల పరచింది .’’బాబోయ్! ఇది ఫిక్షనే కాని ఎవరి జీవిత చిత్రణా కాదు మొర్రోయ్ ‘’అని చెప్పుకొన్నాడు .అయినా అది ఆయన జీవిత చరిత్రే అనటం లో సందేహం లేదు .దీనిపై ఉల్ఫ్ ‘’మన జీవితాలలో అన్ని క్షణాల మొత్తమే మనం .మనలో ఉన్నదే వాళ్ళలోనూ ఉంది మనం తప్పించుకోవటంకాని ,దాచటానికి కాని ఏదీ ఉండదు .జీవితం మట్టి లోనుంచే ప్రావిర్భావం చెందుతుంది .అందరూ దీన్ని ఉపయోగించాల్సిందే .తప్పించుకోలేరేవ్వరూ . ఒక లైబ్రరీలో సగం చదివి కానిఒక మనిషి ఒక పుస్తకం రాయలేడు అన్నాడు డాక్టర్ జాన్సన్ .అదే విధంగా నవలాకారుడు నగరం లో సగం మంది జనాన్ని పరామర్శిస్తే కాని ఒక పాత్రను మలచ లేడు.’’అని చెప్పుకొన్నాడు .
పుస్తక విజయం ఆనందం కన్నా ఆందోళన కలిగించింది ఉల్ఫ్ కు .మరోటి రాస్తే యే రకంగా విమర్శకులు స్పందిస్తారో అనే ఆందోళన ఎక్కువైంది .నవల అమ్మకాలు మహా జోరుగా ఉండటం తో న్యు యార్క్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు .గుగ్గెన్ హీం ఫెలోషిప్ అవార్డ్ పొందాడు .మళ్ళీ విదేశాలకు వెళ్లి పారిస్ లో ‘’హోం సిక్’’అయి బుర్రనిండా రాయబోయే రచనల ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరై తుఫానుకు కదిలిపోయినట్లు కదిలిపోయాడు .రెండవది అదే వేగం తో రాసేశాడు .’’నేను రాయలేదు .నవలే నన్ను రాసింది ‘’అన్నాడు పోతనలాగా .దీన్ని ‘’అక్టోబర్ ఫైర్’’అందామనుకొన్నాడు .కాని తట్టుకోలేని ఒడ్లను కూలుస్తూ సాగే ఆ భావాల వరద ,ఉరవడి అతడిని వివశుడిని చేసి పేరు ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’గా మార్చాడు .మొదట్లో దానికి రూపం నిర్మాణం ఏవీ లేవు .ఆతను అన్నది నిజమే .అది ఉద్ధరి౦ప బడని అనంత ఉత్సాహ పూరిత మహా ప్రవాహమే .’’అమెరికాలోని చీకటి వెలుగుల గురించే రాశాను .పది వేల చిన్న పట్టణాల జనాల గురించి రాశాను .నిద్ర మోతు మొహాలగురించి చెప్పాను .నదులు చీకటిలో ఎలా ప్రవహి౦చా యో రాశాను .పది వేల మైళ్ళ తీరం ,దానిపై వరద ఉద్ధృతి ,ఘోరారణ్యాలపై చంద్ర కాంతి మిలమిల ,పిల్లి కళ్ళలోని పసుపు రంగు మెరపు ,చావు,నిద్ర ,మనం సిటి అని ముద్దుగా పిలుచుకొనే శిలా సదృశ మానవ జీవితం ,అక్టోబర్ నెల సోయగం ,పెద్దపెద్ద రాళ్ళూ రాక్షస అరుపులతో రాత్రిళ్ళు పరిగెత్తే రైళ్ళు విధం ,ఉదయం లో స్టేషన్లు ,షిప్స్ గురించి ,హార్బర్ లో జనం ,షిప్ ల వద్ద ట్రాఫిక్ ‘’అన్నీ రాశాను’’ అని చెప్పాడు ఉల్ఫ్ .
అమెరికాకు1931 లో తిరిగొచ్చాక మళ్ళీ మనసంతా నువ్వే అన్నట్లు మనుషులు ,కేకలు ,దీప ప్రభలు ,అదృశ్య ముఖాలు సూర్యరశ్మి రావటంపోవటం పొదలపై ఆకుల రెపరెపలు ,రాయి రప్పా ,ఆకు అలము ,తలుపు చెక్కా –ఒకటేమిటి సమస్త జీవం అతని కళ్ళముందు మనసులో నిండి పరవళ్ళు తోక్కుతూపరవశం కలిగిస్తున్నాయి .సౌత్ బ్రూక్లిన్ లో అసీరియన్ క్వార్టర్ లోని బేస్ మెంట్ లో ఉంటూ తన హీరో యూజీన్ గాంట్ జీవితం పై పేజీల పై పేజీలు గుట్టలు గుట్టలుగా రాసి పారేస్తున్నాడు .అవి లెడ్జేర్ మీద లెడ్జేర్ గా అనేకపెద్ద పెద్ద పాకింగ్ కేసుల నిండా నింపేశాడు .పుస్తకానికిముగింపు పలక లేక పోయాడు .పెర్కిన్సన్ ఏదో సలహా ఇవ్వటం దాన్ని అంగీకరించి మరో ఎపిసోడ్ రాయటం ,బ్రూక్లిన్ వచ్చి రాసింది నెమరేసుకొని ‘’అరె ! ఇదేమీ చాలినట్లు లేదే ‘’అనుకోని మళ్ళీ దాన్ని పెంచి రాయటం తో అంత విస్తృత మైన నవలగా రూపొందింది .పెర్కిన్సన్ సహాయం తో మళ్ళీ తగ్గించుకొంటూ వచ్చాడు .అయినా ఒక మిలియన్ పదాలతో మహా నవల అయింది సాధారణ నవలకు రెట్టింపు అన్నమాట .టాల్స్టాయ్ తాత ‘’వార్ అండ్ పీస్ ‘’కు ద్విగుణీకృతం .వర్జీనియా రాత్రి రైల్ ప్రయాణం తో నవల మొదలు పెదదామనుకొన్నాడు .కానీ ఉపోద్ఘాత అధ్యాయమే లక్ష పదాలయింది .అంటే చిన్న సైజు పుస్తకం .దాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది చివరికి .’’ఈ రక్తపాత హత్య నేను భరించలేక పోయాను ‘’అన్నాడు దాన్ని తీసేస్తూ .యాభై వేలపదాలున్నచాప్టర్ లను కుది౦చాడు ‘పుస్తకం పూర్తీ అయింది ఇక ప్రెస్ కు పంపటమే తరువాయి అనుకొన్న సమయం లో ‘’అబ్బే ! ఇదేమీ సంపూర్ణంగా లేదే అసమగ్రంగా ఉందే’’’అనిపించి మళ్ళీ నరికేసినవి మళ్ళీ కుట్టాడు . ఇంకా ఎన్నో చెప్పలేక రాయలేక పోయానే అనే దుగ్ధ ఎప్పుడూ ఉండేది . ఉల్ఫ్ చికాగో వెళ్ళిన సందర్భం లో పార్కిన్సన్ నవలను సంక్షిప్తంగా ఎడిట్ చేసి ప్రింటర్ చేతిలో పెట్టి ఉండకపోతే ఆ నవల ఎన్నటికీ వెలుగు చూసేదికాదు .ఉల్ఫ్ తిరిగొచ్చి నెత్తీ నోరూ మొత్తుకొని తనకింకా ఆరు నెలల సమయం కావాలన్నాడు ‘’నువ్వేమైనా ఫ్లాబర్ట్ లాగా పెర్ఫెక్షన్ కోసం నగిషీలకోసం రాస్తున్నానను కొంటున్నావా?’’అనిచివాట్లు పెట్టి నా ,ప్రూఫ్ పేజీలమీదేతాను రాయాలనుకోన్నది అంతా రాసి ఉల్ఫ్ కోరిక తీర్చుకొన్నాడు .ఇలా రాస్తో తిరిగి రాస్తూ ‘’ఆఫ్ టైం అండ్ ది రివర్ ‘’నవలను పూర్తీ చేయటానికి ఆరేళ్ళుతీసుకొన్నాడు .1935 మార్చ్ లో ఇది వెలుగు చూసింది .
ఈ నవల స్పందన ఎలా వస్తుందో అనే లోపల భయం ఉంది ఉల్ఫ్ కు ‘’నేను నా జీవితాన్ని వినాశకరంగా ఆవిష్కా రించు కోన్నాను .దయనీయమైన తెలివి తక్కువ వాడిగా ప్రవర్తించాను .ఏదో ప్రలోభం బుద్ధి చాంచల్యం తో రాశానేమో ‘’అన్నాడు .పబ్లిష్ అయినరోజు దేశం వదిలి పారిస్ లోఉన్నాడు .మొదటిభాగం లాగానే రెందవదీ విజయం సాధించింది అని వినగానే నమ్మ లేక పోయాడు .తరువాత రాసిన పుస్తకాలలోస్వీయ జీవిత చరిత్రను రాయటం తగ్గించేశాడు .తన హీరో యూజీన్ గాంట్ ను అతని ఆకృతులను మార్చేశాడు ఉల్ఫ్ .తరువాత రెండు నవలలు మొదటి రెండిటి గొలుసు నవలలే అయినా నాలుగూ కలిసి ఒకటే పుస్తకం .ఒక శిఖరాయమాన స్వీయ జీవిత చరిత్ర అయింది .ఇప్పడు హీరో కు జార్జ్ వెబర్ పేరు పెట్టాడు . గాంట్ ను మానసిక వికలాంగ ముఖం ‘’అని అంటే ఇప్పుడు వెబర్ ను ‘’చతికిల పడ్డ మనిషి ‘’అన్నాడు .వెబర్ ను స్నేహితులు ‘’మాంక్ ‘’రుషి అని పిలిచేవారు . వెబర్ అంటే రూపం మార్చుకొన్న కఠినంగా మారిన గాంట్.అని పిస్తాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-31-7-16- ఉయ్యూరు

