శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు
ప.గో జి .తణుకు కు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి నేను ఎలా పరిచయమో నాకు తెలియదుకాని ,20 16 ఆగస్ట్ లో ప్రచురించిన ‘’అమ్మ ‘’కవితా గీతికలు ఆత్మీయంగా పంపగా నిన్ననే అందింది .ఒక సారి అమ్మ ఎలా ఉందొ చూద్దాం – అమ్మంటే అంగడిలో దొరికే బొమ్మకాదని ,గోడకి తగిలించే పటం కాదని చెప్పి ప్రమిదలో దీపంలా చూసుకోమన్నారు .’’అమ్మ ఉంటే అంతులేని సొమ్ముగా ‘’అని సుద్ది చెప్పారు .కన్నవారిని అనాదాశ్రమాలు పాలు చేసే వారికి ఇది కొరడా దెబ్బ .’’తరతరాల పెన్నిధి –తలచుకొంటే సన్నిధి ‘’అంటూ ‘’బతికి నంతకాలం యెద తలుపులు మూశావు -బతుకు బండి ఆగిపోతే –‘’ఇప్పుడు తహతహ లాడే వారిని ఎండ గట్టారు .’’అమ్మ సారధి వారధి ‘’అన్నారు .’’అమ్మ మనసు విరిచి అమ్మ భాష మరిచిన వాడు ‘’లోకం లో చులకన అవుతాడు .’’అమ్మా నాన్న అక్షరాలు చెరగని సత్యాలు ‘’’’చల్లని సంసారం ,చక్కని సంతానం ఉంటె –మెచ్చును ఆ జంట –నడిచోచ్చును సిరి ఆ వెంట ‘’అని చాలా అనుభవం తో చెప్పారు .ఏ భాషలో నైనా అమ్మా నాన్నలకు అర్ధం ,పరమార్ధం ఒకటే .’’తనువున్నంతకాలం తన వారిని కాస్తూ –తరాలు మారినా తరగని మమకారం గుండెల్లో ని౦పేది అమ్మ ‘’’
‘’మూడు ముళ్ళు వేసి ,ఏడడుగులు నడిస్తేచాలదు –ఒకరి నొకరు తెలుసుకొని,ఒకటిగా మసలుతూ ముందుకు అడుగేయాలి ‘’అని కొత్త జంటకు ఆదర్శం బోధించారు .ఒద్దికగా బుద్ధిగా ఉంటె జంట ‘’జే గంట ‘’కొడుతుందని ,అ జంటను చూసిన లోకానికి కన్ను కుడుతుందని లోక రీతి చెప్పారు .’’ఎవరి కేది బంధమో –ఎవరికెంత రుణమో –ఎవరికేది సొంతమో ,-ఎవరు యెటుల అంతమో !’’అని తత్త్వం బోధించారు .అర్ధ రాత్రి స్త్రీ ఒంటరిగా తిరగటానికిస్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్ళు అయినా కుదరనందుకు బాధ పడ్డారు .’’స్త్రీ కి ఇచ్చే గౌరవం ఇదేనా ?అని ప్రశ్నించారు .కృష్ణా పుష్కరాలకు స్వాగతం పలుకుతూ ,ఆనందాన్ని అభివర్ణిస్తూ ‘’అరుగుల చావడి ,అంకెల గారడీ –మాటల ఉరవడి ,మనసున పై బడి –అందేల సవ్వడి ,అడుగుల అలికిడి –ఆడి పాడి ప్రతి రోజూ చేయాలి సందడి ‘’అని ఘనంగా చెప్పారు .చివరగా నవ్యాంధ్ర నిర్మాణానికి చేయీ చేయీ కలపమంటూ ‘’తర తరాల అంత రాలలో తరగని సంతోషం నింపుదాం –అమ్మా జనని నీ కిదే వందనం –పాదాభి వందనం ‘’మాత్రు వందనం తో ముగించారు .హాయిగా చదువుకోవటానికి బాగా ఉన్న అమ్మ మీది ఆత్మీయ గౌరవాల కవితా గీతికలు రాసి ,అమూల్యమైన అమ్మ ను అందరికి ”అమూల్యం ”గానే అందిస్తున్న శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి అభినందనలు .
దసరా శుభా కాంక్షలతో
గబ్బిట దుర్గా ప్రసాద్-30-9-16 –ఉయ్యూరు

