జర్మనీ రైతుల తిరుగు బాటు బావుటా
స్విట్జర్లాండ్ ,యూరప్ లో అనేక దేశాలలో రైతులకు లాగానే జర్మనీ రైతులు తమకూ స్వతంత్ర ,మర్యాదా పూర్వక ,పీడన రహిత జీవితం కావాలని తిరుగుబాటు చేసి తమకోర్కేలను ‘’12 సూత్రాలలో ‘’నిబంధించారు వీటిని మేమ్మేన్జేన్ లో ప్రవీణుడైన సెబాస్టియన్ లోట్టార్ అనే యాత్రికుడు రాశాడు. ఈయనకు క్రిసోఫర్ షాపెలేర్ సహకరించాడు . బడుగు బలహీన వర్గాల ఆవేదన ఇందులో ప్రతిధ్వనించింది.క్రైస్తవ స్వాతంత్ర భావన ఇందులో సరళ రమణీయంగా ధ్వనించింది.ఆ ద్వాదశ సూత్రాల వివరాలు తెలుసుకొందాం .
1-మేము మా మత బోధకుడిని ఎన్నుకొని నియమించు కొంటాం .ఆయన ప్రవర్తన సరిగా లేకపోతే భర్తరఫ్ చేసి కొత్త వారిని నియమించుకొనే హక్కు అధికారం మాకు ఉండాలి .సువార్తలను యధాతధంగా బోధించేవాళ్ళు మాకు కావాలి విపరీత వ్యాఖ్యాతలు వద్దు.
2-ఇప్పటిదాకా మమ్మల్ని భూస్వాముల బానిసలుగా చూశారు .ఏసు గొర్రెలకాపరి నుంచి అత్యున్నతుని వరకు సమానం గా చూడమని స్వేచ్చ నిమ్మని చెప్పాడు .మేము స్వేచ్చగా బతకాలను కొంటున్నాం. భగవంతుని ఆదేశాలప్రకారం జీవి౦చాలికాని దైహిక భీతి సూత్రాలను అనుసరి౦చి కాదు.
3-చేపలు పట్టటం ,పిట్టలు కొట్టటం పేదవాడికి హక్కు .దాన్ని మాకు ఇవ్వలేదు .మాకు నష్టం చేసి ‘’మానవ పశువులు ‘’‘’అనుభవిస్తున్నాయి .
4-అడవులను ప్రభువులు హక్కు భుక్తం చేసుకొన్నారు .మాకు వాటిపై అధికారం కావాలి .అడవులు ప్రజలందరి హక్కు భుక్తం కావాలి .
5-మేం చేసేపనులు చాలా కష్టంగా ఉన్నాయి .ఇలా పీడించి మమ్మల్ని పిప్పి చేస్తున్నారు .న్యాయం గా మాతో పని చేయించుకోవాలి .
6-భూస్మాముల పీడన ఇక మేము సాహి౦చ లేము .భూస్వాములు మాతో చేసుకొన్న ఒప్పందాలను మేము గౌరవిస్తాం .
7-మేము చెల్లించలేని శిస్తులను బలవంతంగా భూస్వాములు లాక్కో కూడదు .
8-కష్టం చేసేవారికి తగిన ప్రతిఫలం పొందే హక్కు కావాలి .
9-ప్రజలందరికీ చెందిన బీడు భూములను ,పొలాలను కొందరు స్వంతం చేసుకొని హాయిగా అనుభవిస్తున్నారు .అవి ప్రజలందరికి చెందాలి .
10-సమస్యలను పరస్పర అంగీకారం తో దౌర్జన్య రహితంగా పరిష్కరించుకొనే వీలు హక్కు కల్పించాలి .
11-మరణ సుంక దురాచారాన్ని పూర్తిగా రద్దు చేయాలి .అనాధుల ఆస్తులను మర్యాదకు భంగం కలిగించేట్లు కాజేయటం మేము సహించం .
12-ఈ సూత్రాలలో ఏవైనా భగవద్వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయని రుజువు చేస్తే మేమే వాటిని ఉపసంహరించు కొంటాం
ఈ హక్కుల కోసం రైతులు చేసిన తిరుగు బాటును సామంతులు దుర్మార్గం గా రక్తపాతం తో అణచి పారేశారు .దీనితో రైతులు తమ జీవన పరిస్తితులు మరింత అధ్వాన్నమైనాయని గ్రహించారు . ఇలా మత సంఘర్షణలకు సాంఘిక రాజకీయాలతో ముడిపెట్టారు . 1955 లో జర్మనీలో మత ద్వంద్వతానుశాసనం చేసి ఆమోదించారు .దీనితో రాజకీయ విభేదాలు మరింత పెరిగి చివరికి యూరప్ అంతా ముప్ఫై ఏళ్ళ యుద్ధం 1618-నుండి 1648 వరకు వ్యాపించింది .దీనివలన జర్మనీలో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి జర్మని జనాభా లో మూడవ వంతు జనం ఈ త్రిదశ సంగ్రామం లో హతమై పోయారు .
కాని అదే సమయం లో సాహిత్య స్థాయి ఉన్న రచనలు అనేక వచ్చాయి .ఇదొక శుభ పరిణామం .అంతకు ముందు మత సంబంధ కరపత్రాలు ,లాటిన్ లో జీవకారుణ్య సారస్వతం కొన్ని ప్రజాహిత రచనలు మాత్రమే వచ్చాయి 15 వ శతాబ్దం జర్మన్ సాహిత్యం ఇహ లోకానికి ,పర లోకానికి మధ్య ఉయ్యాల లూగింది .ప్రజలలో జీవితేచ్చ నశించలేదు .విధి వైపరీత్యాలను సహించగల శక్తి మీదనే తమ జీవితాన్ని తీర్చి దిద్దు కొనగలగటం మీదనే జీవన సౌఖ్యం ఆధార పడి ఉందని అందరూ గ్రహించారు .ఈ వైమనస్యాల అంతిమ పరిష్కారం 18 వ శతాబ్దం లో హేతు వాదం పూర్తిగా వ్యాప్తి చెందిన తర్వాతే సాధ్యమైంది .ఇవన్నీ నవలలో బాగా వ్యక్తమయ్యాయి .
ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ .
సశేషం
దీపావళి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-16 –ఉయ్యూరు

