హవాయి ద్వీప దీపకాంతులై వెలుగులు చిమ్మిన అయిదుగురు ప్రసిద్ధ మహాళామణులను గురించి తెలుసుకొందాం ..
1-మహిళా విద్య ఆరోగ్య దాయిని -క్వీన్ ఎమ్మా
హవాయి ప్రజల ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించి పోతున్న సందర్భాన్ని గుర్తించి క్వీన్ ఎమ్మా కాలానికా మాకా 1859 లో క్వీన్స్ హాస్పిటల్ కట్టించి ప్రజలను కాపాడింది ..మసూచికం ,కలరా ఇన్ఫ్లు ఎంజా వంటి వ్యాధులకు ఉచిత చికిత్స చేయించి ఆదుకున్నది . 1867 లో సెయింట్ఆండ్రోస్ బాలికా పాఠశాల స్థాపించి బాలికల విద్యకు మార్గదర్శి అయింది . గాత్ర సంగీతం పియానో ,నాట్యంలలో ఆమె అత్యధిక ప్రతిభావంతురాలు .
2- పురుషులతో మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన -కా ఆహుమాను
హవాయి చరిత్రలో కా అహుమాను అత్యంత ప్రేరణాత్మక పాత్ర పోషించి మహిళాభివృద్ధికి దోహదం చేసింది . హవాయి సొసైటీలో ఆమెది అద్వితీయమైన పాత్ర . కామేహ మెహాకు అత్యంత నమ్మకం విధేయతకలిగి వుండి రాణించింది . రాజు కామేహ మెహకు అత్యంత ఇష్టురాలైన భార్యగా దాదాపు ప్రధాన మంత్రి హోదాలో వుండి స్థానిక హవాయి స్త్రీల హక్కులకోసం అవిశ్రాంత కృషి చేసింది . మహారాజుతో మగవాళ్ళు తప్ప వేరెవరు ప్రక్కన కూర్చుని భోజనం చేయని పరిస్థితి ఉండేది .ఈ పద్ధతిని మార్చేసి మగవారితో సమాన హోదాలో ఆడవారుకూడా కూర్చునే అర్హత కలిపించింది . మగవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉన్న అన్ని కార్యకలాపాలలోను ఆడవారుకూడా స్వేచ్ఛగా పాల్గొనే హక్కు కల్పించి కా అహుమాను మహిళా మార్గ దర్శిగా నిలిచింది .
3-ప్రసిద్ధ ఎత్నో బయాలజిస్ట్ -ఇసబెల్లా లోనా ఆబ్బట్
మాలీ లోని హన్నాకు కు చెందిన ఎత్నో బయాలజిస్ట్ ఇసాబెల్లా కాకియా యు యాంగ్ లోనా అబ్బట్ హవాయిలో సైన్స్ లో పి .హెచ్ డి .పొందిన ప్రధమ మహిళ. చైనా ,హవాయిన్ మిశ్రమ జాతికి చెందిన ఈమె హవాయియన్ ఆల్గె ను తన హవాయియన్ తల్లి వలన విని గుర్తించి పరిశోధన చేసింది . అకాడెమిక్ రికార్డ్ ప్రకారం ఆమె ఫసిఫిక్ ఆల్గె పై ఎక్స్పర్ట్ .రెడ్ ఆల్గె అని పిలువబడే కుటుంబానికి చెందిన రోడో మేలాషియా తో సహా 200 స్పెసీస్ ను ఇసబెల్లా కనిపెట్టి రికార్డ్ సృష్టించింది . ఆమె కృషిని గుర్తించి రోడోమెలాషియా ను ´´ఆబ్బొట్టెల్లా ´అని ఆమె పేరు తో గౌరవంగా పిలుస్తున్నారు . తన ప్రతిభా సర్వస్వ0 తో ఆమె ఎనిమిది గ్రంధాలు రాసింది . కాలిఫోర్నియా మాంటెరి పెనిన్సుల కు చెందిన మెరైన్ ఆల్గె గ్రంధానికి సంపాదకత్వం వహించింది . సుమారు 150 రీసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించింది .
4- సర్ఫింగ్ చాంపియన్ -రెల్ సన్
రెల్ కపోలియోకా ఎధు కాయ్ సన్ హవాయికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ సర్ఫింగ్ చాంపియన్ మాత్రమేకాక స్పోర్ట్స్ లో మార్గ దర్శి కూడా . చాలా ప్రశాంత చిత్తం తో దృఢ సంకల్పం తో ఉండే ఈమె చక్కని రైడింగ్ శైలికి ఆద్యురాలు . సర్ఫ్ కమ్యూనిటీ లో ఐక్యత సాధించి ,´ప్రో ఉమెన్స్ కాంపిటీటివ్ సర్ఫింగ్ సర్క్యూట్ ´ఏర్పడటానికి కృషి చేసింది . 1975 లో తనకు అత్యంత అభిమానమైన నార్త్ షోర్ లోని బీచ్ లో మొట్టమొదటి ఫీమేల్ లైఫ్ గార్డ్ అయింది .
రెల్ ను అందరూ అభిమానంగా ´ఆంటీ రెల్ ´అని పిలుస్తారు . ఆమెకు వచ్చిన ´బ్రెస్ట్ కేన్సర్ ´ను ధైర్యం తో ఎదుర్కొని ఆరోగ్యం పొందినందుకు ఆమెను అందరూ గొప్పగా అభినందించి ఆరాధించారు . 1983లో డాక్టర్లు కేన్సర్ ను గుర్తించి ఆమె ఒక ఏడాదికన్నా ఎక్కువ కాలం బ్రతకదని తేల్చి చెప్పారు . 15 ఏళ్ళు అనుక్షణం మరణ యాతనతో పోరాడి గెలిచి 2-1-1998 న మరణించింది రెల్ -ది రియల్ హీరోయిన్ .
5- అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికైన ప్రధమ ఏషియన్ అమెరికన్ మహిళ-పాట్సి టి మింక్
అమెరికన్ కాంగ్రెస్ కు ఎన్నికైన మొదటి ఏషియన్ అమెరికన్ పాట్సి టోకెమోటో మింక్ . ఆమె స్థానికంగాను అమెరికాలోను సంచలనమే సృష్టించింది . 1960 లో పదివేల డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్ ను ఉద్దేశించి టెలివిజన్ లో ప్రసంగించి అబ్బుర పరచింది . ఆ పార్టీలోని మూడువంతులు సభ్యులచేత సివిల్ రైట్స్ పై అభి వృద్ధికరమైన ఆలోచనలకు ఆమోదం తెలియ జేయించిన ఘనత ఆమెది . సివిల్ రైట్స్ కమిషన్ ను శాశ్వత కమీషన్ గా ఉంచటానికి ఆమె చేసిన కృషి బహుధా ప్రశంశనీయమైంది . ´ఫెడరాలిటీ ఫండ్ ఎడ్యుయేషన్ ప్రోగ్రామ్ ´లో లింగ వివక్షతను నిషేధించే ´టైటిల్ 9 ´గ్రంధాన్ని రాసింది . 1972 లో ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఫర్ డెమొక్రాటిక్ పార్టీ కి మొదటి ఏషియన్ -అమెరికన్ మహిళ అయిన గౌరవం పొందింది .
-గబ్బిట దుర్గాప్రసాద్
———————————————————————————————————————————