వీక్లీ అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు ) సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

వీక్లీ  అమెరికా -19-2(31-7-17 నుండి 6-8-17 వరకు )

సుందరకాండ పూర్తి ,వరలక్ష్మీ వ్రత ,సరసభారతి 106 వ సమావేశవారం

సరసభారతి 106 వ సమావేశం గా మహర్షి బులుసు సాంబమూర్తి గారి131 జయంతి

 ఈ శ్రావణ శుక్రవారం షార్లెట్ లోని మహిళలందరు సంప్రదాయ పద్ధతిలో పట్టు చీర జాకెట్ తలలో పూలు కళ్ళకు కాటుక ,చేతులకు గాజులతో సాక్షాత్తు అపర లక్ష్మీ దేవి స్వరూపంగా కనిపిస్తుంటే ఎంతో ముచ్చట వేసింది . మన సంప్రదాయ సంస్కృతులను ఇంత గొప్పగా పాటిస్తూ మనందరికి కీర్తి తెస్తూ ,ఆదర్శ ప్రాయమవటం అభినందించదగిన విషయం .భారతీయ మహిళలూ మీకు జోహార్లు .

శ్రీ మతి బులుసు పద్మ తమ ఇంటికి శనివారం రాత్రి టిఫిన్ కు రమ్మనమని చెప్పినప్పటినుంచి  ఆ రోజు ఎలా దాన్ని సరసభారతి కార్యక్రమంగా నిర్వహించాలా అనే ఆలోచన లో మధనపడ్డాను . శ్రీ బులుసు సాంబ మూర్తి గారింట్లో కలుస్తున్నాం కనుక మనమందరం మర్చిపోయిన స్వాతంత్య్ర సమార యోధులు ఆంద్ర రాష్ట్ర అవతారాణానికి శ్రీ పొట్టి శ్రీరాములుగారితో ఉద్యమించిన మహర్షి బులుసు సాంబ మూర్తిగారు జ్ఞాపకం వచ్చి ,బులుసు వారింట బులుసు వారిని జ్ఞాపక0  చేసుకుందామనిపించి ,దానితోపాటు ‘’నవ్వులతో ఆట నవ్వులాట ‘’ను కలిపి అందరూ పాల్గొనేట్లు చేద్దామని అనుకొన్నాను .

5-8-17 శనివారం – .మేము వాళ్ళఇంటికి రాత్రి 7 గంటలకే చేరాం .మిగతావాళ్ళు రావటం ఆలస్యమైంది .వాళ్ళు వచ్చాక ముందు ‘’టిఫిన్ కోర్ట్ ‘’లో ‘’బ్యాటింగ్ ‘’ప్రారంభించాం . పూరీ కూర ,ఇడ్లీ చట్నీ సాంబార్ ,మిర్చిబజ్జీ ,వెజిటబుల్ బిర్యానీ ,జున్ను లపై పడి  వీరంగం చేసాం ..అంతా అయేసరికి రాత్రి 10 అయింది .అప్పుడు అందరం ఒక చోట చేరి సరసభారతి 106 వ కార్యక్రమంగా మహర్షి బులుసు సాంబమూర్తిగారి 131 వ జయంతి ని నవ్వులతో ఆట నవ్వులాట కార్యక్రమం ప్రారంభించాం .అందరూ ఎంతో ఆశ్చర్య పోయారు . బులుసువారింట బులుసువారిపై కార్యక్రమం అనగానే . .యాక్సి డెంటల్ కో ఇన్సి డేన్స్ అంటే ఇదేనేమో కదా . నేను ముందుగా సరస భారతి  సాహితీ ప్రస్థానాన్ని వివరించి బులుసు వారి జీవిత విశేషాలను తెలియ జేశాను .. నేను ఈమాట చెప్పే దాకా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాను అందరూ ఎంతో ఆశ్చర్యానందాలు పొందారు .అలా ఉండాలనే సస్పెన్న్స్ క్రియేట్ చేశా . నా మాటల సారాంశ0-

‘’శ్రీ బులుసు సాంబ మూర్తిగారు తూర్పు గోదావరిజిల్లా కాకినాడ దగ్గర దూళ్ల గ్రామంలో 4-3-1886న జన్మించారు . తండ్రిగారు సుబ్బావధానులుగారు ప్రసిద్ధ వేద పండితులు .సాంబమూర్తిగారు ప్రాధమిక విద్య స్వగ్రామం లో నేర్చి  విజయనగరం మహా రాజాకాలేజి లో ఫిజిక్స్ చదివి డిగ్రీ పొందారు . కొద్దికాలం గుమాస్తాగా లెక్చరర్ గా పనిచేశారు . తర్వాత న్యాయ శాస్త్రం చదివి 1911 లో పాసై కాకినాడ బార్ కౌన్సిల్ లో చేరి  న్యాయవాది అయ్యారు .

 1920 లో దేశమంతటా ఉధృతంగా సాగిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు .దేశ భక్త కొండా వెంకటప్పయ్య  పంతులుగారి ఉపన్యాసాలకు ప్రభావితులై న్యాయవాద వృత్తి వదిలేసి స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమం లో పాల్గొన్నారు మహాత్మా గాంధీ జీవిత విధానం నచ్చి 1923 లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ సభలో సభ్యత్వం తీసుకున్నారు . భారత దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని డిమాండ్ చేసిన తొలికొద్దీ మంది నాయకులలో సాంబమూర్తిగారూ ఒకరు . 1930 లో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి నేతృత్వం వహించారు .. 18-4-1930  లో అరెస్టయి వెల్లూర్ జైలు లో నిర్బంధం లో ఉన్నారు . 1937 మద్రాస్ అసెంబ్లీ కి  జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు . అసెంబ్లీలో  అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి సాంబమూర్తిగారిని లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ను చేసింది .ఈ పదవిలో అయిదేళ్ళున్నారు .

 1942 లో క్విట్ ఇండియాఉద్యమం ఊపందుకొన్నప్పుడు గాంధీ ఆదేశం పై రాజకీయనాయకులందరు పదవులను త్యాగం చేయగా సాంబమూర్తిగారు లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ పదవికి రాజయినామా చేసి ఉత్సాహంగా ఉద్యమం నిర్వహించారు .గాంధీగారిలాగానే సాంబమూర్తిగారుకూడా పంచె పై చొక్కాలేకుండా ఉత్తరీయం మాత్రమే ధరించి ఆదర్శ జీవితం గడిపారు .. భారత దేశం 1947 ఆగస్టు 15 న  స్వతంత్రం పొందింది సాంబమూర్తివంటి త్యాగ ధనుల నిస్వార్ధ సేవకు ప్రతిఫలంగా దాన్ని మనం హాయిగా అనుభవిస్తున్నాం .

 అప్పటికి మనం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో ఉన్నాం .ఇప్పుడు ఆంధ్రులకూ స్వతంత్రం కావాలని మద్రాస్ రాష్ట్రం నుండి వేరు చేసి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు శ్రీ పొట్టి శ్రీరాములు శ్రీ బులుసు సాంబమూర్తి శ్రీ ప్రకాశం పంతులు మొదలైన నాయకులు .. ప్రధాని నెహ్రు ఊగిసలాటకు ఆగ్రహించిన పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహార దీక్ష కు సంకల్పించారు .అప్పటిదాకా ఆయనవలన లబ్ది పొందిన కాంగ్రెస్ నాయకులు మొహం చాటేయటం ప్రారంభించారు .శ్రీ రాములు గారి దీక్షకు  స్థలం కానీ ఇల్లు కానీ ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు .అప్పుడు బులుసుసాంబమూర్తిగారు తమ ఇంట్లో సత్యాగ్రహం చేయమని కోరగా ,చేశారు ఆ ఆతర్వాత సంగతులు మనకు తెలిసినవే .. ఆంద్ర రాష్ట్రం మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడింది .కానీ ఆ మహానీయులను తర్వాత ఎవరూ పట్టించుకోలేదు ఉపేక్షకు గురి చేశారు .

  సాంబమూర్తిగారు కాకినాడ చేరి జీవిత చరమాంకం అక్కడే గడిపారు . చేతిలో చిల్లి గవ్వ లేని దీన స్థితి వారిది .కేంద్ర మంత్రి గోవింద వల్లభ పంతుకు  ఈ విషయం తెలిసి ఆర్ధిక సాయం చేశారు .అంతకు మించి ఆదరించిన వారెవ్వరూ లేకపోవటం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం .మహర్షి గా అందరి మన్నన పొందిన బులుసు సాంబ మూర్తిగారూ 2–2-1958 న 72 వ ఏట పరమ పదించారు . ఆతర్వాత ఎప్పుడో ఆయన కుమార్తె ప్రభుత్వానికి ఆర్ధిక సాయం కోసం విన్నపం పంపిస్తే ‘’సాంబ మూర్తి ఎవరు ?”’అని అడిగారట .అదీ మన జాతీయ నాయకులకిచ్చిన గౌరవం . అందుకే సాంబ మూర్తిగారిని ‘’నెగ్లెక్టెడ్ పేట్రియట్  ‘’అన్నారు … ఈ నెల15 న మనం భారత స్వాతంత్య్ర  దినోత్సవంజరుపుకో బోతున్నాం . ఆ సందర్భం గా మహనీయ త్యాగమూర్తి మహర్షి బులుసు సాంబమూర్తి గారిని సంస్మరించి ధన్యులమవుదాం .శ్రీ బులుసు సాంబ మూర్తిగారింట్లో స్వర్గీయ బులుసు సాంబమూర్తిగారి ని స్మరించుకొని అవకాశం మనకు కలిగినందుకు ధన్యులం దీనికి బులుసు దంపతులను అభినందిస్తున్నాను ‘’అని చెప్పాను . బులుసువారి త్యాగనిరతిని అందరు మొదటి సారి తెలుకొని తరించామని భావించారు  .

          నవ్వులతో ఆట నవ్వులాట

 తర్వాత నవ్వులతో ఆట నవ్వులాట ప్రారంభించాం .ఇందులో అందరూ పాల్గొని తమ అనుభవాలను ,తాము విన్న కన్నా హాస్యపు పనస తొనలను ,జోకులకేకులు తినిపించారు . శ్రీమతి సుబ్బలక్ష్మిగారు ఆమె భర్త కామేశ్వరరావుగారు రాకీ దంపతులు పద్మ దంపతులు  మా అమ్మాయి విజ్జి తమ అనుభవాలను తెలిపారు .బాధ్యత నాదే  దీనికీ ఫినిషింగ్ టచ్ ఇస్తూ

‘’మన హాస్య రచయితలైన చిలకమర్తి వారి గణపతి ,ప్రహసనాలు ,పానుగంటి సాక్షివ్యాసాలు ,వీరేశలింగంగారి ప్రహసనాలు , మొక్కపాటి నరసింహ శాస్త్రిగారి బారిస్టర్ పార్వతీశం  మునిమాణిక్యంగారి కాంత0  కథలు ,భమిడిపాటివారి హాస్య నాటికలు ,శ్రీశ్రీ రిమరిక్కులు ఆరుద్ర కూనలమ్మపాదాలు పఠాభి పంచాంగం జలసూత్రం పేరడీలు  బాపు రమణల హాస్యకథామృతం కార్టూన్లు ,శ్రీరమణ పేరడీలు హాస్యపు చెణుకులు ,రావికొండలరావు హాస్య నాటికలు సినీకవి పింగళి సినీమేటి  హాస్యం  తెలుగు హాస్యం పండించిన శివరావు రేలంగి రమణారెడ్డి ,హాస్యరాజా బాబు ,బ్రహ్మానందం ఏం ఎస్, ధర్మవరపు ,ఏ వి ఎస్  ఆంగ్ల హాస్యం పండించిన చార్లీ చాప్లిన్ లారెల్ ,హార్దీ  .రచయితలు  మార్క్ ట్వైన్  డికెన్స్ అమెరికా కార్టూనిస్ట్ జాన్ ధర్బర్  కోటి కి పడగలెత్తిన కార్టూనిస్ట్ ?తెలుగు హాస్యం అమెరికాలో చిందించిన వంగూరి చిట్టెన్ రాజు లను ఒకసారి గుర్తు చేసుకొందాం . అలాగే ఆవకాయ అత్తగారు తో సంసార ధర్మహాస్యం ఘాటు చూపించిన భానుమతి ,సురేకార హాస్య టపాకాయ్ సూర్యకాంతం  కె ఆర్కే మోహన్ మొదలైనవారు గురించి యెంత చెప్పినా అతక్కువే ..

 శ్రీనాధుడు పల్నాటిపై రాసిన చాటువులు తెనాలి పాండురంగనిపై ప్రచారం లో ఉన్న కధలు అన్నీ హాస్యపు తేనే తుట్టెలే . తాగే ఓపికవుంటే మధురమేకాదు అద్భుతః .

పల్నాడులో నీరు  దొరక్క ‘’తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా !గంగ విడువు పార్వతి చాలున్  ‘’అని ‘’కుళ్ళా  యుంచితి కోకచుట్టితి మహా కూర్పాము న్ గట్టితిన్ ,చల్లా యంబలి  ద్రావితి  విశ్వస్తవడ్డి0పగా -తల్లీ కన్నడ రాజ్య  లక్ష్మీ దయలేదా నేను శ్రీనాధుడన్ ;;’ ‘’జొన్నకలి జొన్నన్నము జొన్నపిసరు జొన్నలే తప్పన్ సన్నన్నము సున్నసుమీ పదునుగ పల్నాటిసీమ ప్రజలందరికిన్ ‘’

అలాగే తెనాలి రాముడు తాతా ఊతునా అంటే సరే నంటే తాంబూలం ముఖాన ఉమ్మేస్తే  పాంకోడు పెట్టి పన్ను రాలగొడితే  దుప్పికొమ్ము పెట్టుకొని రాయల సభకి వస్తే రాయలు రవి గానని చో  కవిగాఅంచునే కదా అని సమస్య ఇస్తే -’’ఆ రవి వీరభద్రు చరణాహతి కిన్ డుళ్ళిన బోసి నోటికిన్  కొక్కెర పంటికిం దుప్పి కొమ్ము పల్గా రచియించె నౌరా -రవిగానని చో  కవి గాంచునే కదా ‘’చాటువు -విజయనగరమహారాజు పూసపాటి  ఆనంద  గజపతి రాజు తన ఆస్థాన వైణిక  విద్వాన్ నడిమింటి సంగమేశ్వర  శాస్త్ర గారిని ‘’శాస్త్రి గారూ ఇంకా నడిమిల్లేనా ‘’అని హాస్యమాడితే ‘’ప్రభూ మా నడిమిల్లు మీ’’ పూసపాటి ‘’‘’చేయదా  ?అని ఇచ్చిన రిపార్టీ ,కాంతం ,మునిమాణిక్యం ప్రణయ కోపం తో కొంతకాలం మాట్లాడుకోపోతే ఒక రోజు ఆయన మేడ మెట్లు ఎక్కుతూంటే ఆమె దిగుతుండగా ఎదురుపడితే మునిమాణిక్యం ‘’నేను మూర్ఖులకు దారి ఇవ్వను ‘’అంటే ‘’నేను ఇస్తాను ‘’అని చాచి చెంపమీదకొట్టినట్లు రిపార్టీ ఇవ్వటం ,ఫన్ బకెట్ ఫన్ బకెట్ జూనియర్స్ ,ఫన్నీ ఫెల్లోస్ ,ఫ్రాస్త్రేటేడ్ వుమన్ మొదలైనవన్నీ ఒక్క సారి జ్ఞాపకం జేసుకొని హాయిగా 45 నిమిషాలు నవ్వుకున్నాం ,.  తర్వాత ఉషా పద్మ విజ్జి అంతా కలిసి పాడ  వోయి భారతీయుడా ,మా తెలుగు తల్లికి పాటలు పాడి ముగింపుకు వన్నె తెచ్చారు .అనుకోకుండా కార్యక్రమం అద్భుతంగా ఆనందంగా హాయిగా జరిగినందుకు ‘’ఆల్ హాపీస్’’ .

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-17-కాంప్ -షార్లెట్-అమెరికా


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.