గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
446-మధ్య ప్రదేశ్ రాష్ట్ర గీర్వాణ భాషాసేవ (20 వ శతాబ్దం )
మధ్యప్రదేశ్ లో డా కైలాష్ నాధ్ కట్జూ తర్వాత1957 లో ముఖ్యమంత్రి అయినపండిట్ రవి శంకర్ శుక్లా హయ్యర్ సెకండరీ స్కూల్స్ లో సంస్కృతభాషను కంపల్సరీ చేశాడు .డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో సంస్కృతం అభ్యసించేవారికి సదుపాయాలూ ప్రోత్సాహకాలు రెట్టింపు చేశాడు .ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక బోర్డు ను ఏర్పరచి సంస్కృత వ్యాప్తికి కృషి చేశాడు .ఆర్ధికమంత్రి విద్యామంత్రి నాలుగు యూనివర్సిటీ ల వైస్ చాన్సలర్లు సంస్కృతకాలేజి ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ,విద్యా సెక్రెటరీ ,ప్రభుత్వ సెక్రెటరీ దీనిలో సభ్యులు .ఈ బోర్డు సూచనలను తక్షణమే అమలు జరిపాడు . 87 శాతం హయ్యర్ సెకండరీ పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయులను నియమించాడు .అదనంగా డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాడు .ఆకర్ష వంతమైన జీత భత్యాలు ఏర్పాటు చేశాడు .సంస్కృత విద్యార్థులకు స్కాలర్షిప్ లు ,ప్రోత్సాహకాలు కల్పించాడు .సంస్కృత నాటకాలను విద్యార్థులతో ఆడించాలని ఉత్తర్వులు జారీ చేశాడు ముఖ్యమంత్రి రవి శంకర్ శుక్లా .
కాళిదాస్ సమారోహ్
1958 నవంబర్ 20 న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘’కాళిదాస్ సమారోహ్ ‘’ను ఉజ్జయిని లో ఏర్పరచి భారత ప్రధమ రాష్ట్రపతి డా రాజేంద్ర ప్రసాద్ చేత ఆవిష్కరింపజేసి వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు .భారత దేశం లో ఇది మొట్టమొదటి అత్యంత ప్రధాన సాంస్కృతిక ఉత్సవంగా పరిగణింప బడింది .భారత దేశం లోని అనేక ప్రముఖులు ,రష్యా జపాన్ చైనా ఇరాన్ ,జర్మన్ విద్యా బృందాలు అత్యుత్సాహంగా పాల్గొని దిగ్విజయం చేకూర్చాయి .విక్రమ్ విశ్వ విద్యాలయసంస్కృత ప్రొఫెసర్ ఆధ్వర్యం లో సెమినార్ నిర్వహిస్తే ,ఇటలీ లోని ట్యూరిన్ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా మేరియో వల్లూరి ,పశ్చిమ జర్మనీ మ్యూనిచ్ విశ్వవిద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ డా. గుస్టేవ్ రోత్ ముఖ్యఅతిథులుగా పాల్గొని కాళిదాసు పై సెమినార్ పత్రాలు రాసి చదివారు .నాట్య సమారోహం ,శిల్ప చిత్ర ప్రదర్శన బాగా ఆకట్టుకొన్నాయి .మద్రాస్ యూనివర్సిటీ సంస్కృత ప్రొఫెసర్ వ్.రాఘవన్ ,కలకత్తా యుని వర్సిటీ ప్రభుత్వ సంస్కృతకాలే జ్ ప్రిన్సిపాల్ డా.గౌరీ నాథ శాస్త్రి ‘’మాళవికాగ్నిమిత్రం’’అభిజ్ఞాన శాకుంతలం తాము నటిస్తూ దర్శకత్వం చేస్తూ ‘’నాటకాలు ప్రదర్శించారు . 1957 లో చైనాలోని పెకింగ్ లో శకుంతల నాటకం ను డైరెక్ట్ చేసి ప్రదర్శించిన డబ్ల్యు .షుజ్ కూడా పాల్గొన్నాడు . ఈ కార్యక్రమమం అంతర్జాతీయంగా బ్రిటిష్ ఓరియెంటలిస్ట్ డా ఏ ఎల్ భాషం,జపాన్ కోట్యో బుద్ధిష్ట్ యూనివర్సిటీప్రొఫెసర్ హీమో కుమరా,వెస్ట్ జర్మనీ కి చెందిన పాల్ ధీమ్ ,వాల్టర్ లీఫెల్ వంటి ప్రముఖులతో పాటు అందర్నీ ఆకర్షించి సంస్కృతం పై అభిమానం పెంచింది . .అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు .
కాళిదాస్ అకాడెమి
ఉజ్జయినిలో 1977 లో కాళిదాస అకాడెమీ ఏర్పాటు చేశారు .ఏదో కంటి తుడుపుగా ఆ మహాకవి పేరు మీద ఏర్పాటు చేయటం కాదు సంస్కృత భాషను సంస్కృతీ సంప్రదాయాలను సజీవంగా నిలబెట్టటానికి పూర్వ వైభవం సంతరించటానికి ఏర్పడిన సంస్థ .విక్రమ్ కీర్తిమందిరం పురాతన వస్తు ప్రదర్శన శాల ఏర్పాటైంది .ఈ రెండు సంస్థలు ,విక్రమ్ యుని వర్సిటీ కలిసి ప్రభుత్వ ఆధ్వర్యం లో ఎన్నో కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తున్నాయి .ఇతర దేశ నాటక సమాజాలను ఆహ్వానించి ప్రదర్శనలిపీస్తున్నారు ప్రతి సంవత్సరం దేశం లోని సంస్కృత విద్యావేత్తలు ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేసి వారి సృజనకు ‘’కాళిదాస సమ్మాన్ ‘’ పురస్కారం అందిస్తున్నారు .మన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఈ పురస్కారం అందుకొన్నారు . .
మధ్య ప్రదేశ్ సంస్కృత అకాడెమి
1985 లో మధ్యప్రదేశ్ సంస్కృత అకాడెమి ఏర్పడింది . సామాన్యప్రజలకు సంస్కృతాన్ని దగ్గరకు తెచ్చింది .సృజనాత్మక రచనలను ప్రోత్సహించి ఘనమైన నగదు బహుమతులను ఇస్తోంది .యువతకు అవసరమైన సంస్కృత జ్ఞానాన్ని అందిస్తోంది
సంస్కృత సాహిత్య సృజన
సాగర్ యుని వర్సిటీ సంస్కృత ప్రొఫెసర్ డా రాధావల్లభత్రిపాఠీ గొప్ప సంస్కృతకవి విద్యావేత్త .ఇరవయ్యవ శతాబ్ది ఆధునిక సంస్కృతం లో మంచి ప్రవేశం ఉన్నవాడు .ఆధునిక విధానం లో సంస్కృతం నేర్పే అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు .పండిత ఉర్వీ దత్త శాస్త్రి ‘’సుల్తాన్ జహాన్ వినోద మహాకావ్యం ను 2 వేల శ్లోకాలతో 1935 లో భోపాల్ లో రాశాడు .జబల్ పూర్ కు చెందిన డా రహస విహార్ ద్వివేదీ,ఇండోర్ వాసి శ్రీపాద శాస్త్రి హసుర్ఖ ర్ (1888-1974 ) ఉజ్జయిని విక్రమ్ యుని వర్సిటీ సంస్కృత శాఖాధ్యక్షుడు డా కె యెన్ జోషి ,వంటివారెందరో సృజన రచనలతో సంస్కృత సాహిత్యాన్ని రసప్లాఅవితం చేశారు .
447-త్రిపుర కాంగ్రెస్ స్వాగతానంద కల్లోలహ్కావ్య కర్త -పండిట్ లోకనాథ శాస్త్రి (20 వ శతాబ్దం )
మధ్యప్రదేశ్ జబల్పూర్ కు చెందిన పండిత లోకనాథ శాస్త్రి భారత దేశ సమకాలీన రాజకీయాలపై ‘’త్రిపుర కాంగ్రెస్ స్వాగతానంద కల్లోలహ్ ‘’అనే సంస్కృత కావ్యం రాశాడు . ఇదికాక అనేక భక్తి అష్టకాలు రచించాడు
ఇండోర్ కు చెందిన పండిట్ గజానన రామచంద్ర కల్మార్కర్ 100 కు పైగా సంస్కృత రచనలు చేశాడు .ఆయన కవిత్వం జాతీయభావాలకు ఆటపట్టు .మధుర మంజుల కవిత్వం ఆయన సొత్తు
సాగర్ వాసి ,ప్రస్తుత వారణాసి నివాసి డా.రామాజీ ఉపాధ్యాయ వచన సంస్కృతం బాగా రాశాడు .’’ద్వా సుపర్ణ ‘’రచనలో శ్రీ కృష్ణ సుదాముల మైత్రిని గొప్పగా వర్ణించాడు .ఇందులో గాంధీ గారి జీన జనోద్ధరణ గ్రామ వికాసం ,చేతిపనుల పునర్వైభవం రంగరించాడు.
448-గాంధీ శత శ్లోకి కర్త -పండిత గణపతి శుక్ల (20 వ శతాబ్దం )
మధ్య ప్రదేశ్ ఉత్తర నిర్మార్ జిల్లా ఖర్గాన్ కు చెందిన పండిత గణపతి శుక్లా ‘’కధామృతం ‘’అనే చిన్నకధలను ,చిన్నపిల్లలకు సరళమైన కవిత్వాన్నీ సంస్కృతం లో రాశాడు స్వాతంత్య్ర ఉద్యమప్రభావం తో గాంధీ మహాత్మునిపై ‘’గాంధీ శత శ్లోకి ‘’రాశాడు .’’భూదాన యజ్ఞ గాధ ‘’కూడా రచించాడు .
449-రామ వన గమనం నాటక కర్త -శ్రీమతి డా వనమాలా భావల్కర్ (20 వ శతాబ్దం )
మధ్యప్రదేశ్ లోని సాగర్ ,ఉజ్జయిని ,నాగపూర్ యుని వర్సిటీలలో సంస్కృత ప్రొఫెసర్ శ్రీమతి వనమాలా భావల్కర్ సంస్కృత నాటకాలు కవితలు రాసింది .అందులో ‘’రామ వన గమనం ‘’నాటకం ప్రసిద్ధమైనది .ఇదికాక ‘’పార్వతీ పరమేశ్వరీయం ,‘’పాద దంద’’లలో ఆమె కవిత్వం పరవళ్లు తొక్కింది .సంగీతానికి అనువుగా ఉండటం తో శ్రవణ సుభగంగా ఉంటాయి ఆమె కవితలు .
449-అజాత శత్రు నవలాకారుడు -డా శ్రీనాథ శాస్త్రి (20 వ శతాబ్దం )
మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన డా శ్రీపాద శాస్త్రి హాసూర్ఖార్ కుమారుడే శ్రీనాథ శాస్త్రి .ఉద్యోగ విరమణ తర్వాత ఆయనలోని సంస్కృత సాహిత్యం కట్టలు తెంచుకొని ప్రవహించింది .జాతీయ భావాలతో గొప్పనవలలు రాశాడు అందులో ‘’అజాత శత్రు ‘’,ప్రతిజ్ఞాపూర్తి ‘’,సింధుకన్య ‘’,దావానలః ,చెన్నమ్మ నవలలు విశేష ప్రాచుర్యం పొందాయి .సింధుకన్య నవలకు సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .దీనికే మధ్యప్రదేశ్ సాహిత్య అకాడెమి భోపాల్ ఉత్తరప్రదేశ్ సంస్కృత సంస్థాన్ లు శాస్త్రి సృజనాత్మక సంస్కృత ప్రతిభను మెచ్చి అవార్డు లను అందించి గౌరవించాయి .
450-అనేక సంస్కృత రచనలు చేసిన పండిట్ సుధాకర శుక్ల (1913 -1985)
పండిట్ సుధాకర్ శుక్లా మధ్య ప్రదేశ్ లో 1913 లో జన్మించి 19 85 లో మరణించాడు.ధైతీ య లో స్థిరపడ్డాడు . అనేక కాండల సంస్కృత మహా కావ్యాలు, దీర్ఘ కవితలు రాశాడు . నాటకాలు కవితలూ కూడా రచించాడు .రాష్ట్రం లోను దేశమంతటా పేరు ప్రఖ్యాతులు పొందాడు అనేక బిరుదులూ ,పురస్కారాలు గౌరవ డాక్టరేట్ లు లభించాయి .గ్వాలియర్ జివ్వాజి యుని వర్సిటీ ఆయనంకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సన్మానించింది . ఇంత ప్రసిద్ధుడైన ఈ కవి గురించి పూర్తి సమాచారం లభించకపోవటం దురదృష్టం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-17 -కాంప్-షార్లెట్-అమెరికా
—

