నా దారి తీరు -107
అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ
అడ్డాడలో నా పని గురించి చెప్పే ముందు గెలాక్షీ ఆఫ్ హెడ్ మాస్టర్స్ లో నాకు ప్రాతస్మరణీయులైన ఇద్దరి గురించి తెలియ జేస్తాను .
1 -కీశే .శ్రీ జె వి ఎస్ .ప్రసాద శర్మగారు
గురుత్వం
నేను ఉయ్యూరు హై స్కూల్ లో 1956 లో ఎస్. ఎస్ . ఎల్. సి . చదువుతుండగా సైన్స్ టీచర్ శ్రీమతి పుష్పావతమ్మగారు బదిలీ అయి శ్రీ జె వి ఎస్ ప్రసాద శర్మగారు వచ్చారు .అసలు పేరు జంధ్యాల వెంకట శివ ప్రసాద శర్మగారు .ఒకరకం గా నన్ను తీర్చి దిద్దిన వారు వీరే . తెల్లని పంచె తెల్లని పొడవైన షర్ట్ పైన ఉత్తరీయం తో స్వచ్ఛతకు పరాకాష్టగా ఉండేవారు . కొంచెం ముందుకు వచ్చిన పలువరుస మాట్లాడుతుంటే ఆనందం ఆత్మీయత మూర్తీభవించినట్లు ఉండేది ..మా నాన్నగారు తెలుగు పండిట్ గా చేసి రిటైర్ అవటం శర్మగారు మా ఇంటి ఎదురుగా శ్రీ వంగల దత్తుగారింట్లో కాపురం ఉండటం తో కుటుంబ పరిచయము ఎక్కువగానే ఉండేది . మా గురుపత్ని శ్రీమతి అన్నపూర్ణమ్మగారు .నేను అంటే విపరీతమైన వాత్సల్యం .చామన ఛాయ అయినా, ముఖం లో అమ్మవారి కున్నా పవిత్రత స్పష్టంగా కనిపించేది . ఇద్దరూ మా ఇంటికి తరచూ వచ్చేవారు . శర్మగారిది మచిలీ పట్నం .తండ్రిగారు హిందూ కాలేజీ హై స్కూల్ లో తెలుగు పండిట్ అని గుర్తు . శర్మగారి తమ్ముళ్లలో ఒకతను నాకు క్లాస్ మేట్ కానీ సీనియర్ కానీ అని జ్ఞాపకం .
మాస్టారు సైన్స్ బోధిస్తే మళ్ళీ పుస్తకం చదవక్కర్లేదు .చక్కని నోట్స్ ఇచ్చేవారు . లాభ రే టరీ కి తీసుకు వెళ్లి ప్రయోగాలు చేసి చూపించేవారు .ఇవి నాకు తర్వాత సైన్స్ బోధనలో మార్గ దర్శకాలయ్యాయి .నా ఎస్ ఎస్ ఎల్ సి బుక్ ను వారే ఓపెన్ చేశారు . మా హెడ్ మాస్టారు శ్రీ కామినేని రాధాకృష్ణారావుగారు . .మా క్లాస్ టీచర్ శ్రీ వి పూర్ణ చంద్రరావు గారు .ఇంగ్లిష్ ప్రోజ్ చెప్పేవారు హెచ్ ఏం గారు పొయిట్రీ ,ఆల్జీబ్రా చెప్పేవారు .ఆ రెండూ మాకు’’ గ్రీక్ అండ్ లాటిన్’’ .అందులో నాకు ఏమీ వచ్చేదికాదు . ఏదో’’అత్తెసరు’’మార్కులు పొంది 356 మార్కులతో స్కూల్ సెకండ్ గా పాసయ్యాను .
నా ఉద్యోగ నియామక పత్ర ప్రదాత –కుటుంబ మిత్రులు
నేను సైన్స్ డిగ్రీ పొంది బీఎడ్ చేసి మోపిదేవిజిల్లాపరిషత్ హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా 1963 లో చేరి ,రెండేళ్లు పనిచేసి ఉయ్యూరు కు వచ్చాను . నా అపాయింట్ మెంట్ ఆర్డర్ బందరు జిల్లా పరిషత్ ఆఫీస్ నుంచి తెచ్చి నాకు ఇచ్చి 19-8-1963న అమావాస్య అయినా చేరమని లేక పొతే సీనియారిటీ దెబ్బతింటుందని హితవు చెప్పింది మా సైన్స్ మాస్టారు శర్మగారే .అలాగే చేరి కొన్ని అడ్డంకులెదుర్కొన్నా విజయవంతంగా సైన్స్ మాస్టర్ గా ,హెడ్ మాస్టర్ గా వారి చలువ ,దీవెనల వలెనే నా సర్వీస్ పూర్తి చేశాను . నేను డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉండగా ,మా అన్నగారు లక్ష్మీ నరసింహ శర్మ హాస్పెట రైల్వే స్టేషన్ మాస్టర్ గా పని చేస్తూ హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు . రైల్వే వారికి అప్లికేషన్లు పెట్టించటం వారివ్వాల్సిన బకాయిలన్నీ తెప్పించటం లో మా నాన్నగారికి శర్మ గారు చేసిన సాయం మరువ లేనిది . అందుకనే వారు మా కుటుంబ మిత్రులయ్యారు .
బందరు హిందూ కాలేజీ లో నేను ఫిజిక్స్ డిమాన్ స్ట్రేటర్ గా పని చేస్తూ, నేనూ ,డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న మా అతమ్ముడు మోహన్ ఒక అద్దె ఇంట్లో ఉంటె మేము పగలు కాలేజీకి వెళ్ళినప్పుడు దొంగలు పడి మా ట్రంక్ పెట్టె దోచుకు వెడితే అందులో ఉన్న నా ఎస్ ఎస్ ఎల్సీ బుక్ పోయింది .మాస్టారుగారికి చెబితే వెంటనే డూప్లికేట్ సర్టిఫికెట్ కు నాతో అప్ప్లై చేయించి మూడు నెలలలో హైదరాబాద్ లోని బోర్డు ఆఫీస్ నుంచి తెప్పించి నాకు అంద జేశారు .వారి ఋణం మరువ లేనిది .
చదువుకొన్న చోటే మాస్టారితో కలిసి పని చేసే అదృష్టం
మోపిదేవి నుండి ఉయ్యూరు హై స్కూల్ కు 1965 లో బదిలీ అయి వచ్చాను . గురు శిష్యులం ఇప్పుడు సహ ఉద్యోగులమయ్యాము . నాకు లెక్కలు ,సైన్స్ క్లాసులు వచ్చేట్లు టైం టేబిల్ వారే తయారు చేశారు నామీద ఉన్న అభిమానం తో .సమర్ధంగా బోధించి అందరి అభిమానం పొందటానికి ఇదే కారణమయ్యింది .మాస్టారు చేసిన మరొక మహోపకారం ఉంది ..నేను బి ఎస్ సి ఫిజిక్స్ మెయిన్ వాడిని మాథ్స్ కెమిస్ట్రీ సబ్సిడియరి . డిగ్రీలో మాకు మొదటి ఏడాది ఇంగ్లిష్ ఉండేది .ఒక్కటే పేపర్ . కనుక బి ఎస్ డిగ్రీ ఉన్నవాళ్లు హై స్కూల్ లో పై తరగతులకు ఇంగ్లిష్ బోధనకు అనర్హులు .అందుకని మాస్టారుగారు నన్ను బి ఏ ఇంగ్లిష్ చేయమన్నారు.అంటే ఇంగ్లిష్ సబ్జెక్ట్ మాత్రం రెండు ప్రోజులు రెండు నాండీటైల్స్ ,రెండు డ్రామాలు చదివి రెండేళ్లు వరుసగా పరీక్ష రాసి పాసైతే బిఎ లిటరేచర్ డిగ్రీ వస్తుంది అని హితవు చెప్పి నన్ను పరీక్ష రాయించారు .నాతోపాటు మానికొండ హై స్కూల్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేసిన శ్రీ అల్లూరి సీతా రామ రాజుగారికి నేను చెప్పి ఆయన కడతాను అంటే పరీక్షకు కట్తాం .బెజవాడ లయోలా కాలేజీ సెంటర్ . బెజవాడ ఆర్ ఎస్ ఎస్ ఆఫీస్ లో పరీక్షల సమయం లో మేమిద్దరం ఒక రూమ్ లో ఉండి పరీక్ష రాసాం . నేను పాసయి బిఎ డిగ్రీ పొంది ఇంగ్లిష్ టీచింగ్ కు అర్హత పొందగలిగాను మాస్టారి సలహా దయ ఆశీస్సువలన .రాజు గారు మాత్రం పాస్ కాలేకపోయారు . ఆతర్వాత వైరెండు మూడు సార్లు రాసినా పాస్ కాలేదాయన. కానీ ఆయన చనిపోయే దాకా మా ఇద్దరి మధ్య మంచి మిత్రత్వం నడిచింది మేము మానికొండకు వెళ్ళటం వారు ఉయ్యురు వచ్చి మా ఇంట్లో మా చిన్ననాటి గురువుగారు స్వర్గీయ వణుకూరు గరుడా చలం మేష్టారిఇంటికీ రావటం చాలాకాలం జరిగింది .ఇప్పుడు వారిద్దరూ స్వర్గస్తులు మానికొండలోనే అటెండర్ రాఘవరావు మాకు ముగ్గురికి అత్యంత సన్నిహితుడు .ఆతను కూడా రాజుగారితో పాటు వచ్చేవాడు . ఇప్పుడు రాఘవరావూ స్వర్గస్తుడే .
ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ ఫేర్ అండ్ ఎక్సి బిషన్
నేనూ మాస్టారూ కలిసి ఉయ్యూరు హై స్కూల్ లో సైన్స్ అండ్ మాథ్స్ ఫేర్ ఎక్సిబిషన్ నిర్వహించాలని నిర్ణయించాం . మాస్టారు నన్ను’’ప్రసాదూ ‘’ అని పిలిచేవారు ‘’ప్రసాదూ ఇందులో నాకేమీ తెలియదు .నువ్వే దగ్గరుండి అన్ని చూడు నీకు ఏ రకమైన సహాయం కావాలన్నా నేనున్నాను ‘’అని బాధ్యత అంతా నామీదే పెట్టేశారు . హెడ్ మాస్టారు శ్రీ కె విఎస్ ఎల్ నరసింహారావుగారు నేను 8 చదువుతున్నప్పుడు ఆయనే హెడ్మాస్టర్ .నాకు బాగా చనువు .నా దగ్గర తెలివైన ట్యూషన్ పిల్లలు యద్దనపూడి సాంబశివరావు ,వెంట్రప్రగడ ఉమామహేశ్వరరావు మొదలైన వాళ్ళు ఉండేవారు .సాంబ బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి డాక్టరై మంచి పేరు పొందాడు .ఉమా మా ఇంటిముందువాడు .వాళ్ళనాన్న సాంబయ్యగారు చనిపోయాక కుటుంబ బాధ్యత తీసుకొని ఐదారేళ్లక్రితం చనిపోయాడు. వీళ్లకు ఇన్నోవేషన్ బాగా ఉండేది . నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం తో వీరందరి సహకారం తో మేష్టారి ఆధ్వర్యం లో సైన్స్ మ్యాథ్స్ సోషల్ ఎక్సిబిషన్ పెద్ద ఎత్తున రెండు పెద్ద పాకలలో విద్యార్థులకు వివరించి చెప్పటానికి ట్రెయినింగ్ ఇచ్చి పెట్టాం .అప్పుడు శ్రీ కాకాని వెంకటరత్నం గారు వ్యవసాయ శాఖా మాత్యులు .వారిని ఆహ్వానించి వారితో ప్రదర్శన ప్రారంభింప జేశాము .ఊళ్ళో వాళ్ళు చుట్టుప్రక్కల స్కూల్ వాళ్ళు ,పెద్దలూ పిన్నలూ అత్యుత్సాహంగా వచ్చి చూసి మమ్మల్ని మెచ్చు కొన్నారు .ఎస్కిమో జీవితం అని సోషల్ విభాగం లో దూదితో ఇగ్లు ఇల్లు స్లెడ్జ్ బండి కుక్కలు ఏర్పాటు చేసాం సైన్స్ లో పిపెట్ ల ఆధారం గా ఫౌంటెన్ దానిపై పింగ్ పాంగ్ బాల్స్ ఎగరటం ఏర్పాటు చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు . అప్పటికి ఏ జిల్లాపరిషత్ హై స్కూల్ లో ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ నిర్వహించలేదని అనేవారు . ఈ స్కూల్ లో మళ్ళీ ఎప్పుడూ ఏ సైన్స్ మాస్టారూ ఇలాంటి ప్రదర్శనకు నడుం కట్టలేదు . ఆ రోజులు వేరు ఆ ఆలోచనలు వేరు .నేనూ ఇక్కడ ఆతర్వాత రెండు సార్లు పనిచేశా కానీ మళ్ళీ అప్రయత్నం నేనూ చేయలేదు .ఇది నా జీవితం లో ఒక హై లైట్ గా నిలిచింది . మాస్టారి ప్రోత్సాహం వల్లనే ఇది విజయవంతం అయింది
నా గైడ్ అండ్ ఫిలాసఫర్
శర్మ మాస్టారు నా గైడ్ అండ్ ఫిలాసఫర్ .నాకు ఎప్పుడు ట్రాన్స్ ఫర్ వచ్చినా ఆయన పని చేస్తున్న కంకిపాడుదగ్గరున్న గొడవర్రుకో లేక కాజ కో ,లేక బందరు కో వెళ్లి సలహా తీసుకొనే వాడిని . 1987 లో నేను హెడ్ మాస్టార్ అయ్యాక కూడా మా గురు శిష్య సంబంధం అవిచ్చిన్నంగా కొనసాగింది .మాస్టారు ఉయ్యూరు వస్తే మా ఇంటికి రాకుండా వెళ్లేవారు కాదు ఎన్నో సంగతులు గుర్తు చేసుకొనే వాళ్ళం హైదరాబాద్ లో వారున్నప్పుడూ మా దంపతులం వెళ్లి చూసాం . వారిమేనకోడలు ఉయ్యూరులో ఆ మధ్య మా ఇంటి లో అద్దెకున్నారు ఆమె భర్త టెలిఫోన్ ఎక్స్ చెంజి ఉద్యోగి .ఇలా మళ్ళీ మేష్టారితో అనుబంధమేర్పడింది .ఆవిడా మా ఆవిడా కైలాస గౌరీ నోము చేసుకొన్నారు .చాలా సహాయకారిగా ఉండేవారు ఆవిడ తలిదండ్రులు -అంటే మాస్టారి చెల్లెలు, భర్త గారు .ఈ చెల్లెలును చూస్తే అచ్చంగా మాష్టారు గుర్తుకోచేవారు . వారి సహకారం వలననే నోము చాలా బ్రహాండంగా జరిగింది . మాస్టారి తమ్ముడు కూడా వచ్చాడు .. జ్ఞాపకాల తేగలపాతర త్రవ్వుకొన్నాం . మాస్టారు కూచిపూడి దగ్గర చినముత్తేవి లో పని చేశారు .
ఈ విధంగా నన్ను తీర్చి దిగిన మా గురు వరేణ్యులు శ్రీ జె వి ఎస్ ప్రసాద శర్మగారు సుమారు పదేళ్లక్రితం అకస్మాత్తుగా చనిపోయారు .మాస్టారు గొప్ప హోమియో పతి వైద్యులు .ఎందరికో ఎన్నో వ్యాధులు నయం చేసిన భిషగ్వరేణ్యులు . ఈ నాడు ఉపాధ్యాయ దినోత్సవం నాడు మా గురువరేణ్యులను ఈ రకంగా సంస్మరించగలగటం నా అదృష్టం .
ఇవాళే నాకూ మా మైనేనిగారికి సుమారు 70 ఏళ్ళ క్రితం ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేణ్యులు కీశే కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురుపూజోత్సవం కూడాఉయ్యూరులో సరసభారతి తరఫున స్థానిక అమరవాణీ విద్యాలయం తో సంయుక్తంగా నిర్వహించి శ్రీ మైనేని గోపాలకృష్ణయ్య శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన స్వర్గీయశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి శ్రీమతి కోట సీతమ్మ దంపతుల స్మారక నగదు బహుమతి 10 వేల రూపాయలు పదవ తరగతి చదువుతున్న పేద ప్రతిభగలవిద్యార్థికి ,మరొక 10 వేల రూపాయల నగదు బహుమతిని ఒక విద్యార్థినికి సరసభారతి తరఫున అంద జేశాము .మా గురుపుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట గాయత్రి ప్రసాద్ ,శ్రీ కోట సీతారామాంజనేయులు గార్లు తమ తలిదండ్రుల స్మారక నగదు బహుమతిగా ఏర్పాటు చేసిన 10 వేల రూపాయలు డిగ్రీ చదువుతున్న పేద ప్రతిభగల విద్యార్థికి వారి చేతులమీదుగా ఇప్పించాం .శ్రీ వారణాసి సదాశివరావు తమ తల్లిగారు స్వర్గీయ శ్రీమతి దుర్గగారి స్మృత్యర్థం అందజేసిన 5 వేల రూపాయలు మరొక పేద ప్రతిభ ఉన్న విద్యార్థికి అందించాము .
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గా ఏర్పాటు చేసిన శ్రీ కోట మాస్టారి గురు పూజోత్సవ0 నాడు 10 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు సరసభారతి తరఫున సన్మానం చేసాం .నేను ఉయ్యూరులో లేకపోయినా ఈ కార్యక్రమాన్నిమా అబ్బాయి, సరసభారతి కోశాధికారి గబ్బిట వెంకట రమణ ,అమరవాణి ప్రిన్సిపాల్ శ్రీ పి వి నాగరాజు సమర్ధ వంతంగా నిర్వహించగా సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి గార్లు సభానిర్వహణ సమర్ధ వంతం గా చేశారు .
మరొక మార్గ దర్శి
నేను 1987 లో గండ్రాయి జిల్లాపరిషత్ హై స్కూల్ సైన్స్ మాస్టర్ పోస్ట్ నుంచి వత్సవాయి హెడ్ మాస్టర్ పోస్ట్ కు ప్రమోట్ అయ్యాను .అప్పుడు మా హెడ్మాస్టారు శ్రీ పివి సుబ్రహ్మణ్యంగారు .మంచికి ,సిన్సియారిటీకి ,చదువు క్రమశిక్షణలకు మారుపేరు .కొంచెం స్పటకం మచ్చలతో దాదాపుగా కాఖీ పాంట్ తెల్ల ఖద్దరు షర్ట్ తో ఉండేవారు . నేను ఎన్నో విషయాలు ఆయన వద్ద నేర్చుకున్నాను .నాకు ప్రమోషన్ ఆర్డర్ రాగానే ఆయన ‘’ప్రసాద్ గారూ -హెడ్ మాస్టర్ అంటే Early to come ,late to go ‘’అనే ‘’తిరుమంత్రం ‘’ తెలుసుకొంటే సక్సెస్ అవుతారు అని బోధించారు.నేను అక్షరాలా ఆయన లా నడిచాను . ఒక రకంగా నాకు మెంటార్ వారు . ఆఫీస్ వర్క్ అంతా కరతలామలకం వారికి .జగ్గయ్యపేట లో ఉండి గండ్రాయి కి బస్ లో వచ్చేవారు .ఏనాడూ ఒక్క నిమిషం కూడా ఆలస్యం గా వచ్చేవారుకాదు . ఏ పనీ పెండింగ్ ఉండేదికాదు . ఇంక్రిమెంట్ వంటివి అడగాల్సిన అవసరం ఉండేదికాదు .లెక్కలు ఇంగ్లిష్ బాగా బోధించేవారు .జగ్గయ్యపేట చుట్టూ ప్రక్కల అలాంటి హెడ్ మాస్టర్ లేరు అని చెప్పేవారు .నేను హెడ్ మాస్టారుగా వత్సవాయి లో చేరాక పి ఆర్ సి అమలు జరిగింది .బిల్స్ ఎరియర్ బిల్స్ చేయటానికి మా గుమాస్తా శ్రీ లగడపాటి వెంకటరత్నం తాను బాగా నిష్ణాతుడే అయినా ‘’సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు మనం వెడితే మీకూ విషయాలు తెలుస్తాయని’’ చెబితే వెళ్లి సలహాలు పొందాం. మంచి గైడ్ సుబ్రహ్మణ్యం గారు . ఉపాధ్యాయ దినోత్సవం నాడు శ్రీ పివి సుబ్రహ్మణ్యంగారిని జ్ఞాపకం చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతం .వీరు జగ్గయ్యపేట లో ఆరోగ్యంగా నే ఉన్నారు .
కొసమెరుపు -.నేనేదో మా మాస్టర్లను గుర్తు చేసుకొన్నానాని కాలర్ ఎగ రేస్తుంటే -’’తగ్గు బాలయ్యా తగ్గు తగ్గు ‘’అన్నట్లుగా 19 96-97 లో నేను కృష్ణాజిల్లా పామర్రు దగ్గరున్న అడ్డాడహై స్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేసినప్పుడు 9 ,10 తరగతులు చదివి ఫస్ట్ క్లాస్ లో పాసై అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో ముందు ఉంటూ విద్యార్థి నేతగా సమర్ధతను చూపుతూ నా అభిమానం పొందిన విద్యార్థిని శ్రీమతి కోడూరు పావని చదువులు పూర్తి చేసి 12 ఏళ్ళనుండి అమెరికాలో భర్తా పిల్లలతో ఉంటూ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ , ఆగస్టు 21 న ఒహాయో రాష్ట్రానికి కుటుంబం తో మారి ఇవాళ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఇప్పుడే ఫోన్ చేసిఅభినందనలు తెలిపి తన గురు భక్తిని చాటింది . పావని మన బ్లాగ్ కు వీరాభిమాని అన్నీ చదువుతానని చెబుతుంది . శుభాశీసులమ్మా పావని నీకూ నీ కుటుంబానికీ !-
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-9-17 కాంప్ షార్లెట్-అమెరికా

