వీక్లీ అమెరికా -26 (18-9-17 నుండి 24-9-17 వరకు )-2
57 వ సుందరకాండ ,3 రుద్రాభిషేకాలు 4 భోజనాల వారం -2
24-9-17 ఆదివారం -సాయి పవన్ పద్మశ్రీ దంపతుల ఇంట్లో రుద్రాభిషేకం
శ్రీ కృష్ణాష్టమి నాడు మా ఇంట్లోభజన రోజునే సాయి తో వీలున్నరోజు ఉదయమే మహాన్యాసం తో దశశాంతులు సామ్రాజ్య పట్టాభిషేకం తో రుద్రాభిషేకం జరిపి అష్టోత్తర సహస్ర శివ పూజ ,బిల్వాష్టోత్తరం తో మనం నలుగు రైదుగురం ఒకరి ఇంట్లో ‘’మోడల్ రుద్రాభిషేకం ‘’చేసుకొందాం ‘’అన్నాను క్షణం ఆలోచించకుండా ‘’మా ఇంట్లోనే చేద్దాం .అన్నయ్య రాంకీని వేలూరి పవన్ ను కూడా సంప్రదించి డేట్ ఫిక్స్ చేస్తాను అసలు నా మనసులో ఉన్న మాట మీరే ముందు చెప్పేశారు ‘’అన్నాడు సంతోషమేసింది .సుమారు 15 రోజులక్రితం వాళ్ళఇంటికి మా మనవళ్లను సంగీతం క్లాస్ కు తీసుకు వెళ్ళినప్పుడు అతనే ఈ విషయం మళ్ళీ ప్రస్తావించి తన ఇంట్లోనే 24-9-17 ఆదివారం ఉదయం 7-30 కే ఏర్పాటు చేశానని చెప్పాడు సరే అన్నాను . ఆ తర్వాత మెయిల్ లో మళ్ళీ తెలియ జేస్తాడేమోనని అనుకొన్నా .నేను నవరాత్రి సందర్భం ఉదయం మా ఇంట్లో 21-9-17 గురువారం 25-9-17 సోమవారం మహాన్యాసం తో అభిషేకం 22-9-17 శుక్రవారం నుండి 30-9-17 శనివారం ఉదయం నా 57 వ (షార్లెట్ లో 3 వ)శ్రీ సుందరకాండ పారాయణ చేస్తున్నట్లు అందరికి తెలియ జేశాను . సాయి ఇంట్లో ఉదయం 7-30కి అభిషేకం కనుక ఆ రోజు ఆదివారం నా కార్యక్రమం తెల్లవారుఝామున 4 గంటలకే అనీ ముందే అందులో రాశాను . సాయి నుంచి కన్ఫర్మేషన్ వస్తుందనుకున్నాను .మా అమ్మాయికి మెసేజ్ వచ్చినట్లు చెప్పింది సరే .
అందుకని ఈ ఆదివారం ఉదయం 4 గంటలకే ప్రారంభించాలనుకొని ,శనివారం రాత్రి ఇంటికొచ్చేసరికి 11 దాటటం ఫోటోలు పంపటం తో 12 -30 దాకా నిద్ర లేదు . కలత నిద్ర కొంత సేపు పోయా .మూడింటికి అలారం పెట్టుకున్నా .సుందరానికి తొందరెక్కువ ‘’అన్నట్లు ‘’మాసుందరికి’’నిద్రరాక అర్ధరాత్రి 2 గంటలకే లేచి కాఫీ ఏర్పాటు చేసింది . నేనూ 3 గంటలకే లేచి స్నానాదికాలు పూర్తి చేసి 3-30 కు కూర్చుని నిత్యపూజ శ్రీ ఆంజనేయ అష్టోత్తర సహస్రనామ పూజ శ్రీ లలితా అష్టోత్తర ,దుర్గా సరస్వతీ ,గౌరీ గాయత్రీ అన్నపూర్ణా అష్టోత్తరాలతో శ్రీసూక్తం గా నిత్యం చేస్తున్నట్లే చేసి ,సుందరకాండ మూడవ రోజు పారాయణ చేసి శతకం చదివి పూర్తి చేసేసరికి ఉదయం 6 అయింది . టాప్ గా హాయిగా సంతృప్తిగా చేసుకొన్నాను రోజూ ఏదో ఒక ప్రసాదం మా శ్రీమతి చేస్తే నైవేద్యం పెడుతున్నా. .ఇవాళ పాలలో అటుకులు నానేసి ఇచ్చింది . రామకోటి రాసి భగవద్గీత చదివి డైరీ రాసి పాలటు కుల నైవేద్యం తిని మందులు వేసుకొని సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నేను 6 -30 కె రెడీ అయ్యానన్నమాట .మా రైడర్ అంటే మా అమ్మాయి విజ్జి లేచి కాఫీ తాగేసరికి ఏడున్నర దాటింది .రెండోసారికాఫీ తాగి ఆ మేము ముగ్గురం కారెక్కేసరికి 7-53 .సాయి వాళ్ళ ఇంటికి 8-15 కు చేరాం .అప్పటికే రాంకీ సాయిలు అభిషేకం డ్రెస్ లో తయారు గా ఉన్నారు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి .వంటలు కూడా చేస్తున్నారు మాకు కాఫీ ఇచ్చారు ,ప్రభల ప్రభాకర్ గారూ వచ్చే ఉన్నారు .అంతా సరి చేసుకొని పూజ అభిషేకం ప్రారంభించేసరికి ఉదయం 9 అయింది . నేను కూడా కూర్చుని అభిషేకం చేసుకొందామన్న ఉద్దేశ్యం తో వచ్చాను వాళ్ళు అన్నీ గురుముఖతా నేర్చినవారు ,ఇలాంటి అభిషేకాలు వాళ్లకు కొట్టిన పిండి వారి తండ్రిగారు తాతగారు వీరి సోదరులను ఇందులో తీర్చి దిద్దారు కనుక వాళ్ళ ఆధ్వర్యం లో నేను మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకొనే భాగ్యం కలిగిందికదా అని సంబరపడ్డాను .కానీ సాయి బాంబు పేల్చాడు ‘’మీరే మాతో చేయించాలి మీ ఆధ్వర్యం లోనే జరగాలని మా కోరిక అన్నాడు ‘’రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరవనట్లు అయిష్టంగానే సరే అన్నాను .అలామొదలైంది ఇక్కడి రుద్రం .అందరం కలిసి మంత్రాలు చదువుతూ గణపతి పూజ ప్రారంభించాం. సాయి పద్మశ్రీ దంపతులు కూర్చుని పూజ చేశారు .పద్మశ్రీ పట్టుబట్ట కాషాయ బోస్ గా కట్టి సంప్రదాయంగా పెద్ద ముత్తైదువగా వ్యవహరించింది . ప్రభాకర్ ,వేలూరి పవన్ సాయి వాళ్ళ ఇంటి పక్కనున్న తమిళ దంపతులతో భర్త కూడా అభిషేకం లో కూర్చున్నారు బులుసు సాంబమూర్తి గారు పద్మజ దంపతులు వచ్చారు .సాయికి బంధువుతో స్నేహితుడా శ్రీమతి విద్యుల్లత భర్త కూడామాతో పట్టుబట్టలతో కూర్చున్నారు .బులుసువారు ‘’సివిల్ డ్రెస్ ‘’లో ఉండటం ,పిల్లల డ్రాపింగ్ పికప్ డ్యూటీ ఉండటం తో మాతో కూర్చోలేదు వాతావరణం చాలా బాగాపవిత్రంగా సెట్ అయింది
.సాయి ఇంట్లో అభిషేకానికి కావాల్సిన సామగ్రి అంతా ఉంది .అందరికి రాగి పంచ పాత్ర ఉద్దరిణె రాగి పాత్రలున్నాయి అభిషేకం చేయటానికి అనువైనఇత్తడి వేదిక ఉంది .దానిపై శివలింగాలను వాళ్ళు తమ విధానం లో చక్కగా అమర్చాడు సాయి .నా సాలగ్రామాలు ఆంజనేయ విగ్రహం ,స్పటిక లింగాన్ని కూడా అమర్చాడు . పంచామృతాలతో అభిషేకానికి ఏర్పాట్లు జరిగాయి . ఆవాహన అయ్యాక మహాన్యాసం ప్రారంభించాం రాంకీ సోదరులు నేనూ ,ప్రభాకర్ చదివాము . కనుక మూడు సార్లు చేస్తే 11 ఆవర్తనాలు పూర్తి అవుతాయని మొదటి నమకం తర్వాత నాలుగు చమక అనువాకాలు ,రెండో నమ్మకం తర్వాత మరో నాలుగు చమక అనువాలాలు మూడో నమకమ్ తర్వాత 3 చమకానువాకాలతో ఏకాదశ రుద్రాభిషేకం తర్వాత వాళ్ళపద్ధతిలో పంచసూక్తాలు నా పద్ధతిలో దశ శాంతులు సామ్రాజ్య పట్టాభిషేకం ,శివాష్టోత్తర సహస్రనామ బిల్వాష్టోత్తర పూజ చేసాం పుష్పాలంకారం సాయి చాలా ముచ్చటగా చేశాడు బాగా ఆకర్షణీయంగా ఉంది . అంతా అయ్యేసరికి నాలుగున్నర గంటల సమయం పట్టి మధ్యాహ్నం 1-30 అయింది .ఆరగా ఆరగా ‘’అరకొడుతూ’’అంటే కాఫీ తాగుతూ ఉచ్చై శ్వరం తో జరిపాం ఆతర్వాత ఉద్వాసన .సాయి దంపతులకు ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -1 మొదటిభాగం కానుకగా ఇచ్చాము .తర్వాత భోజనాలు . ఆరవ దంపతుల తండ్రి మద్రాస్ లో కేటరింగ్ ఎక్స్పర్ట్ పేరు పద్మనాభన్ .చెన్నై అన్నా నగర్ లో ఉంటారట అడ్రస్ ఇచ్చి వచ్చినప్పుడు తప్పక రమ్మన్నారు .ఆయన ,కూతురు ఇక్కడ సాయి వాళ్ళ ఇంట్లో వంట చేశారు . నాకోసం వంకాయ కూర అందరికోసం దొండకాయ కూర ,పప్పు వడ పులిహోర కరివేపాకు పులిహోర అల్లం చట్నీ సాంబారు పెరుగన్నం తో భోజనం .నేను ఒకటిన్నర వడ కొద్దిగా పప్పన్నం పులిహోర ,కొంచెం సాంబారన్నం ,పులిహోరలో పెరుగు తో లాగించాను .అల్లం చట్నీ బాగా ఉంది . సుమారు 30 మంది దాకా వచ్చారు .
అందరి భోజనాలఏ సరికి 3 అయింది .సాయి దంపతులు మా ఇద్దరికీ నూతనవస్త్రాలు కట్టబెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం పొందారు . అయిదేళ్లక్రితం అంటే 2017 లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడినుంచి ఇండియా వెళ్లేముందు రాంకీ ఇంట్లో నాతో సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారు అప్పుడు అతని అత్తగారూ మామగారు కూడా ఉన్నారు .దానికి వాళ్ళందరూ చాలా సంతోషించారు సాయివాళ్ళు ఇక్కడ అప్పుడు లేరు 5 ఏళ్లతర్వాత మళ్ళీ రాంకీ తమ్ముడు సాయి ఇంట్లో నే చివరి కార్యక్రమంగా ఈ రుద్రం . తమాషా అని పిస్తుంది ఏమైనా నాలుగున్నర గంటలు వేద మంత్రాలు ఇక్కడ ప్రతిధ్వనించటం మహదానందం కార్యక్రమాన్ని వీడియో తీసి ‘’గొట్టం ‘’లో పెట్టారు .అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని ఇంటికి చేరే సరికి సాయంకాలం 4 అయింది .మంచం మీద కాసేపు అటూ ఇటూ దొర్లా,కానీ నిద్ర పట్టలేదు ఫోటోలు అందరికి పంపాను .
ప్రక్కివారింట్లో డిన్నర్
శ్రీ ప్రక్కి రమణ శ్రీమతి అరుణ దంపతుల ఇంట్లో ఈ రోజు రాత్రి భోజనం మా కుటుంబం పవన్ కుటుంబం పంచాగం ఆయనా ,పిల్లలు అతిధులం .షువర్చలేశ్వర శతకం ఆ దంపతులకు ఇచ్చాము .తర్వాత భోజనం.పప్పు ,వంకాయ కూర ,అల్లం చట్నీ బజ్జీలు ,పులిహోర మినపసున్ని ఉండ ఉప్మా, ముక్కల పులుసు ,తియ్యని గడ్డ పెరుగు .అన్నీ చాలా రుచికరం గా ఉన్నాయి ఇష్టంగా ఆనందంగా అన్నీ తిన్నాను . కొసరి కొసరి వడ్డించింది అరుణ . అయిదేళ్లక్రితం రెండు సార్లు శ్రావణ మాసం లో మమ్మల్ని అరుణ భోజనానికి పిలిస్తే వెళ్లాం మంఛీ మర్యాదా పధ్ధతి ఉన్న అమ్మాయి భక్తి కూడా ఎక్కువే .మా అమ్మాయికి మంచి స్నేహితురాలు .ఇంటికి చేరే సరికి రాత్రి 11 అయింది .రెండు రోజులు వరుస రుద్రాలు ఇంట్లో పారాయణ తో గొంతు బొంగురు పోయింది .హాల్స్ చప్పరిస్తూ ఉపశమనం పొందాను .ఇబ్బందేమీ లేదు
ఈ వీక్లీ ఇంతటితో సమాప్తం .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-17-కాంప్-షార్లెట్-అమెరికా

