గీర్వాణ కవుల కవితా గీర్వాణం –
463-సత్య నారాయణ పాంచాలీ కర్త –భరత చంద్ర రే(1712 -1760)
భరత చంద్ర రే గుణకార్ 18 వ శతాబ్ది ప్రముఖ సంస్కృత బెంగాలీకవి .రాజాస్థానకవి కూడా .అన్నపూర్ణ మంగళ కావ్యం తో సుప్రసిద్ధుడయ్యాడు .భరత చంద్ర గా సుపరిచితుడు .నాడియా మహా రాజు కృష్ణ చంద్ర ‘’గుణకార్’’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .అప్పటి నుంచి ‘’రే గుణకార్ భరత చంద్ర’’ అని అందరూ పిలువ సాగారు .
నరేంద్ర నారాయణ రే,భవానీ దంపతులకు 1712 లోబెంగాల్ లోని ‘’పెన్రో భూర్షట్ ‘’గ్రామం లో జన్మించాడు . ఈ గ్రామం ఇప్పుడు హౌరా జిల్లాలో ఆమ్టా కు దగ్గరలో ఉంది. నలుగురు సంతానం లో చివరివాడు .తండ్రి –వర్ధమాన రాజు కీర్తి చంద్ర రే తో ఆస్తి తగాదా పడి రాజమాత బిష్ణు కుమారి ని అవమానించాడు .దీనితో రాజు కినిసి వీళ్ళ భూములన్నీ స్వాధీనం చేసుకొన్నాడు .చేతిలో చిల్లిగవ్వ కూడా లేని తండ్రి నారాయణ రే ఊరు వదిలి పారిపోయాడు .కొడుకు భరత చంద్ర ను మాతా మహుల ఇంట్లో నయాపారాలో ఉంచారు .అక్కడే ఉంటూ దగ్గర గ్రామం తాజ్ పూర్ లో సంస్కృతం అభ్యసించాడు .14 ఏళ్ళకే సంస్కృతం లో అద్వితీయ పాండిత్యాన్ని సాధించి తలమానికమై భాసించాడు .ప్రక్కనే ఉన్న శారద గ్రామానికి చెందిన నరోత్తమ ఆచార్య కుమార్తెను వివాహం చేసుకొన్నాడు .
తిరిగి స్వగ్రామానికి చేరిన తమ్ముడు భరత చంద్ర సంస్కృత పండితుడైనందున ఆ భాష కూడు గుడ్డ పెట్టదని ఈసడించి అన్నలు అవహేళన చేశారు .అవమానం పొందిన భరతచంద్ర స్వగ్రామం వదిలేసి హుగ్లీ జిల్లాలోని బాష్ బెరియా లోని దేబానంద పుర కు వెళ్ళాడు .అక్కడ రామ చంద్ర మున్షి ఇంట్లో ఉంటూ పర్షియన్ భాష నేర్చి పట్టు సాధించి మాస్టర్ అనిపించుకొన్నాడు .పిత్రార్జిత సంపదను కాపాడుకోవటానికి మోఖ్తార్ అయ్యాడు .అన్నలతో ఆస్తితగాదాలు, వారిని సంప్రదించకుండా వివాహమాడటం తో మళ్ళీ ఇల్లు వదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది .ఎక్కడా నిలువ నీడ లేక దేశాటనం చేస్తూ కొంతకాలం మహారాష్ట్ర పాలనలో ఉన్న ఒరిస్సాలోని కటక్ లో ఉన్నాడు .మళ్ళీ బెంగాల్ వెళ్ళిపోయాడు .
చందర్ మగూర్ లోని ఇంద్ర నారాయణ చౌదరి అనే ఫ్రెంచ్ ప్రభుత్వ దివాన్ ఇంట్లో అద్దె కున్నాడు భరతచంద్ర . చంద్ర లోని విద్యా పటిమను గుర్తించి,న దివాన్ కృష్ణ నగర్ మహారాజు కృష్ణ చంద్ర ఆస్థాన కవిగా నియమించే ఏర్పాటు చేశాడు . మహారాజు కవిగారి విద్వత్తు కు తగిన ‘’రే గుణకార్ ‘’బిరుదునిచ్చి గౌరవించి సన్మానించటమే కాక మూలజోర్ లో అనేక వందల ఎకరాల భూమిని ప్రదానం చేశాడు .బెంగాలీ భాష లో ‘’ప్రధమ ప్రజాకవి’’ గా భరత చంద్ర గుర్తింపు పొందాడు .బెంగాలీ భాషను తన కవిత్వం, రచనలతో భరత చంద్ర సుసంపన్నం చేసి శాశ్వత కీర్తి తనకూ భాషకూ సాధించి చిర కీర్తి పొందాడు .
భరతచంద్ర రచనలలో ముఖ్యమైనది 1752 లోరచించిన ‘’అన్నదా మంగళ్’’అనే అన్నపూర్ణ మంగళ్ .ఇది మూడుభాగాలు .మొదటి భాగం లో ‘’అన్నదా మంగళ్’’అనే అన్నపూర్ణా దేవి స్తోత్రం ఉంది.రెండవ భాగం ‘’కాళికా మంగళ్’’ .ఇందులో విద్యా , సుందరుల కథ ఉంది. మూడవది అయిన చివరి భాగం లో మొదటి మాన్సింగ్ ,అన్నపూర్ణ మంగళ్ అనే భవానంద మజుందార్ ల చరిత్ర ఉన్నది . భానుదత్తుడు మైధిలీ భాషలో రచించిన ‘’రసమంజరి ‘’ని బెంగాలీ భాషలోకి భరతచంద్ర అనువదించాడు . భరతచంద్ర సంస్కృత బెంగాలీ భాషా పటిమకు నిదర్శనంగా నిలిచిన రచన ‘’నాగాస్టకం ‘’. సంస్కృత ఛందస్సు పై తన సాధికారతను రుజువు చేసిన రచన ఇది .ఇదికాక సంస్కృతం లో గంగాస్టకం రాశాడు . చండీ నాటకం ,తో పాటు మరొక అసంపూర్ణరచన ‘’సత్యనారాయణ పాంచాలీ కూడా రాశాడు .
మధ్యయుగ బెంగాలీ గీతాల నుంచి ఆధునిక బెంగాలీ గీతాలవరకు అనేక వందల పాటలు రాసి భాషా సౌందర్యం తో తీర్చి దిద్దిన ప్రజాకవి భరత చంద్ర . కేవలం దేవీ దేవతలకు మాత్రమే పరిమితమైన ‘’మంగళ గానం ‘’ను ప్రజా పరం కూడా చేసి భాషకు, సంగీతానికి సొగసులు దిద్దాడు . స్వేచ్ఛగా మంగళగానం చేసే వీలుకల్పించాడు .రాధాకృష్ణుల శృంగారాన్ని,ప్రణయాన్నీ ‘’పదావళి కీర్తనలు ‘’గా రచించాడు . దీనిద్వారా రాం ప్రసాద్ సేన్ ,నిధుబాబు అనబడే రాం నిధి గుప్తాలకు మార్గ దర్శి అయ్యాడు .
భరతచంద్ర రచన ‘’అన్నదా మంగళ్’’ను’’ గేరాసీ లెబ్ దేవ్’’ రష్యన్ భాషలోకి అనువాదం చేశాడు .భరతచంద్ర సంగీతం సమకూర్చిన వాటినీ కలకత్తా లో నాటకాలకు వాడుకొన్నాడు .48 ఏళ్ళు మాత్రమే జీవించినా, శాశ్వత యశస్సు సాధించిన గుణకార్ భరతచంద్ర ఈ నాటి 24 పరగణాలలో ఉన్న ములజోర్ లో 1760లో మరణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-11-17- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
| Bharatchandra Ray Gunakor | |
|---|---|
—

