గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
464 –అద్వైత గీత కర్త –మధురకవి ఉమాపతి పద్మనాభ శర్మ (1930-2017 )
తెలంగాణా రాష్ట్రం సిద్దిపేటలో శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మ జన్మించారు .వీరిది పండిత వంశ౦ .పితృ ,పితామహులందరూ సంగీత సాహిత్యాలలో దిగ్దంతులే .తండ్రి నారాయణ శాస్త్రి పండితులేకాక ప్రతిభా వ్యుత్పన్నులు ,సంగీత కళా మర్మజ్ఞులు . మేనమామ ,విద్యా గురువు శ్రీకొరిడే సీతారామ శర్మగారి ఆదేశం తో దేవీ మానస పూజ ను ఒక సంవత్సర కాలం దీక్షగా పారాయణ చేసి ఆత్మ గతం చేసుకొన్నారు .దీనితో వారిలో మధుర కవితా ధార పెల్లుబికింది .’’బ్రహ్మోమాపతి పద్మనాభ నుత !శు౦భత్పద్మసింహాసనా ‘’మకుటం తో అమ్మవారిని స్తుతించిన నపద్యాలలో త్రిమూర్త్యాత్మక రూపినణియైన అమ్మవారే కాకుండా కవి గారూ దర్శన మిస్తారు . తొలితరం తెలంగాణా కధకులలో శర్మగారు అగ్రేసరులు .1960 కాలం లో వారి కధలు ,వ్యాసాలూ ,విమర్శలు ,గేయాలు భారతి ,సాధన ,కృష్ణాపత్రిక లలో ప్రచురితాలు .’’చతురంగం ‘’,’’నవ కథా విపంచి ‘’వీరి కథా సంపుటాలు .’’చివరి ఘడియలు ‘’అముద్రితం .
శర్మగారు వేణువు ,వయోలిన్ ,హార్మోనియం వాయిద్యాలవాదనలో అసమాన ప్రజ్ఞావంతులు .వీరి గాత్రం సుస్వర బద్ధమై వీనుల విందు చేసేది .భువనవిజయ౦ లో రామరాజ భూషణుడుగా జీవించేవారు .వీరి పద్య కవితా గానం మై మరపించేది .కాళిదాస కవిత్వాన్ని ఎంతగా ఆరాదధించేవారో ఓ హెన్రీ కథలనూ అంతగా ఆస్వాదించేవారు .తెలంగాణా ప్రాంతీయ దేశ్య పదాలు ,ప్రాచీనకవుల ప్రయోగాలపై శర్మగారి వ్యాసాలు ఆణిముత్యాలు ..ప్రముఖ పరిశోధకులు నిడదవోలు వెంకటరావు మల్లంపల్లి సోమ శేఖర శర్మగార్ల ప్రశంసలు పొందాయి .దివాకర్ల వెంకటావధాని ,పుల్లెల రామ చంద్రుడు ,దోర్బల విశ్వనాధ శర్మ వంటి సాహితీ ప్రముఖులు శర్మగారి పాండితీ గరిమకు నీరాజనాలు పలికారు .’’అజో-విభో ‘’పురస్కారం సద్గురు శివానంద మూర్తి గారి అమృత హస్తాలనుండి అందుకొన్న పుణ్య మూర్తి .భావకవిత్వోద్యమ ప్రభావం తో ‘’మధురకవి ‘’గా గుర్తింపు పొందారు .ఆయన అధ్యయన శీలత అచ్చెరువు గొల్పుతుంది .ఉద్యోగం చేస్తూ సాహిత్య కృషి కొనసాగిస్తూ ,వేదాంత వాజ్మయ మధనమూ చేశారు .దీనిఫలితంగా పదకొండు వ్యాసాల ‘’హంసనాదం ‘వెలువడింది .అద్వైత,శివాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలను సహేతుకంగా తర్కించి ‘’శివా ద్వైత దర్శనం ‘’రచించి దిగ్భ్రాంతి కలిగించారు .శ్రీ శంకర భగవత్పాదుల ‘’శ్రీ దేవీ మానసిక పూజ ‘’ను శంకరుల అంతర్ దృష్టికి తగినట్లు ఆంధ్రానువాదం చేశారు .
అవసరమైతేనే మాట్లాడే నియమమున్న శర్మగారి మౌన అంతరంగం నుండి 108 శ్లోకాల ‘’అద్వైత గీత ‘’జాలువారి యోగ సాధకులకు దిశా నిర్దేశం గా భాసించింది .తామే దీనికి సులభ వ్యాఖ్య రాయగా ‘’దర్శనం ‘’మాసపత్రిక లో ప్రచురింపబడింది .సహాధ్యాయులైన శ్రీ అప్పాల వాసు దేవ శర్మ గారితో కలిసి ‘’దేవీ సప్త శతి ‘’శ్లోకాలను తెలుగులో లోతైన తాత్విక భావన తో రాశారు .’’తొగుట –రాంపురం ‘లోని శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠాధిపుల ఆజ్ఞమేరకు సంస్కృత భాగవత శ్రీధరీయ వ్యాఖ్యను ద్వితీయ ,దశమ స్కంధాలకు తెలుగు సేత చేశారు .జ్యోతిశ్శాస్త్రం లోనూ శర్మగారు అఖండులే.శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్ధ స్వాములు తెలంగాణా గజవల్లి లో పర్యటించినపుడు సన్మానపత్రం రచించి శర్మగారు శ్రీవారి అభినందన పొందారు .మనసులాగానే స్వచ్చ శ్వేత వస్త్ర ధారణతో ,ఆలోచనా ముద్రతో శర్మగారు కనిపించేవారు .
శర్మగారి మరణానికి సరిగ్గా నెల రోజులక్రితం తెలంగాణా ప్రభుత్వ తృతీయ ఆవిష్కరణ మహోత్సవం నాడు ముఖ్యమంత్రి శ్రీ చంద్ర శేఖర రావు గారి చేతుల మీదుగా పండిత పురస్కారం అందుకొన్నారు .ప్రచారార్భాటం ఇష్టపడని శర్మగారు ఈ కాలపు కవి యోగి పుంగవులు .
పుంభావ సరస్వతులైన శ్రీ ఉమాపతి పద్మనాభ శర్మగారు 2017 జులై 4 న ఉమాపతి సాన్నిధ్యం చేరారు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-17 –ఉయ్యూరు

