ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 )
బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు 1875 శ్రీ యువ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ సప్తమి నాడు శ్రీ తల్లాప్రగడ వెంకటరామయ్య ,లచ్చమాంబ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న కోనాల గ్రామం లో జన్మించారు .ఓం నమశ్శివాయ శివ పంచాక్షరితో విద్యాభ్యాసం ప్రారంభించి రామాయణ ,భారతాలు స్తంభాలుగా తన విద్య సౌధాన్ని నిర్మించుకున్నారు .శ్రీ అత్తోట కామయ్యగారి వద్ద ఆంగ్లం నేర్చారు .కోనాల లో ప్రాధమిక విద్య పూర్తి చేసి తణుకు వెళ్లి మెట్రిక్ చదివి పాసై ,రాజమండ్రి చేరి ఎఫ్ ఏ తో పాటుసెకండ్ గ్రేడ్ ప్లీడర్ సర్టిఫికేట్ కూడా పొందారు .1911 వరకు తణుకు లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి గొప్ప పేరు ప్రతిస్ట, లక్ష్మీ కటాక్షమూ సాధించారు .ప్లీడరీ వృత్తిలో ఉంటూనే బెంగాలీ మరాటీ పాళీ భాషలలో లోతైన పాండిత్యాన్ని గడించారు .భారతీయ భాషలలోని అనేక నవలలు నాటకాలు ,కవిత్వం కధలను సులభ సుందరమైన తెలుగులోకి అనువదింఛి లబ్ధ ప్రతిస్టితులయ్యారు.స్వయంగా చాలానవలలు రాశారు .అందులో ‘’సంజీవ రాయ చరితం ‘’గొప్ప పేరు పొందింది .నాటి బ్రిటిష్ ప్రభుత్వం పంతులుగారి సాహితీ కృషిని మెచ్చి ఏం ఏ డిగ్రీ ప్రదానం చేసింది .
భారతీయ తత్వ శాస్త్రం పై మక్కువ ఏర్పడి కర్మ జ్ఞాన,మోక్ష రహస్యాలను పూర్తిగా ఆకళింపు చేసుకొని మన ప్రాచీన వైభవాన్ని అర్ధం చేసుకున్నారు .ఈ భావాలను వ్యాప్తి చేయాలనే దృఢ సంకల్పం మనసులో నాటుకు పోయింది .తన కలలు సార్ధకం కావాలంటే సంస్కృత తెలుగు భాషలే మిక్కిలి అనువైనవని ఎంచుకున్నారు .ఇదే తన జీవిత ధ్యేయం అని నిర్ణయించుకున్నారు . కనుక తనక తగిన వాతావరణం కోసం అన్నిటికీ అనువైన గోదావరీ తీరాన ఉన్న గోష్పాద క్షేత్రమైన కొవ్వూరు కు1912 లో మకాం మార్చేశారు .
గౌతమమహర్షి తపస్సు చేసిన పవిత్ర క్షేత్రం కొవ్వూరు .ఆత్మ విద్యకు అనువైన క్షేత్రం కొవ్వూరు అని భావించారు .భారతీయ సంస్కృతీ, ఆంద్ర ,గీర్వాణ భాషాభివృద్ధికోసం కొవ్వూరులో తమ చిరకాల కల నెరవేర్చుకోవటానికి ‘’ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం’’సంస్థను 1912 లో నెలకొల్పారు .దీనికోసం తమ స్వంతభూమిని కొంత ఇచ్చారు .1913 లో గవర్నింగ్ బాడీ ఏర్పడి విద్యాపీఠం సాకారమై విద్యలకు అందుబాటులోకి వచ్చింది .పంతులుగారి ముఖ్య ఉద్దేశ్యం ఈ పీఠం లో విద్యార్ధులు ప్రాచ్య ,పాశ్చాత్య విద్యలు రెండిటిలోనూ నిష్ణాతులు కావాలని .తులనాత్మక పరిశీలన ,కీలక భావనల సాధన విద్యార్ధుల లక్ష్యం కావాలని భావించారు.అంతేకాదు వేదాలు ముఖ్య ఆధార భూమిగా ఉండి,స్తంభాలు ,పైకప్పు పాశ్చాత్య విద్యలతో ఏర్పడాలని పంతులు గారి హృదయం .
జన్మతహా జమీందారు అయిన పంతులుగారు గీర్వాణ విద్యా పీఠం కోసం తన సర్వస్వం ధారపోసి పెంచి పోషించారు .దర్జాలకు విలాసాలకు వైభవాలకు,గౌరవానికి ,ప్రతిష్ట కు అలవాటు పడిన జీవితం ఆయనది .తన శ్వాస ఊపిరి ధ్యాస అయిన విద్యాలయం కోసం అన్నిటికీ క్రమక్రమంగా దూరమై అతి సామాన్య గృహస్తు లా జీవిస్తూ,విద్యార్హులకు సౌకర్యం కోసం ,పాఠశాల అభి వృద్ధి నిధులకోసం ,అవసరమైతే కొవ్వూరు పురవీధులలో జోలె పట్టుకుని తిరిగిన సందర్భాలు అనేకం .తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడిచే సందర్భాలవి .అంతటి స్వార్ధ రాహిత్య వ్యక్తిత్వం పంతులు గారిది .
పంతులు గారి విద్యా సేవకు ,పడుతున్న తపనకు కొవ్వూరులోని వదాన్యుల గుండెలు ధన రూపంగా ద్రవించి నిధుల ప్రవాహం తో పంతులుగారి పూనికకు బలమైన ఆసరా లభించి ఆ సరస్వతీ మందిర సౌభాగ్యానికి శక్తి యుక్తులు చేకూరాయి .మద్రాస్ విశ్వ విద్యాలయం కూడా అర్ధం చేసుకొని విద్యా పీఠాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ లోకి చేర్చి ఆర్ధిక స్వాస్త్యత కల్పించి,.పంతులుగారికి కొండంత అండగా నిలబడింది .
కాశీలో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నిర్మించి చదువు కోవాలనే వారందరికీ అవకాశం కల్పించటానికి పండిత మదనమోహనా మాలవ్యా గారు ఎంత శ్రమ పడ్డారో ,ఎంత కృషి చేశారో , యెంత వేదన అనుభవించారో అవన్నీ ఇక్కడ కొవ్వూరులో తల్లాప్రగడ పంతులుగారు అనుభవించి తన కలను సాకారం చేసుకొన్నారు .అందుకే పంతులుగారిని ‘’ఆంధ్ర మాలవ్యా ‘’అని గౌరవంగా సంబోధించేవారు .వీరిద్దరూ కారణ జన్ములు.స్వార్ధ రాహిత్యమే వారి పెట్టుబడి . నమ్మకమే వారి వెన్ను దన్ను .భారతీయ సంస్కృతీ భాషా వికసనాలకు వీరిద్దరి సేవ అనిర్వచనీయం ,అజరామరం.
పంతులుగారి పేరు మీద ‘’సూర్యనారాయణీయ గ్రంథ మాల ‘’ ఏర్పడి ఎన్నో గ్రంథ కుసుమాలను ముద్రించి వారి కీర్తిని శాశ్వతం చేశారు .ఎందరెందరో ఏ విద్యా పీఠం లో లెక్చరర్ లుగా ,ప్రిన్సిపల్స్ గా పని చేసి సంస్థకు వన్నె తెచ్చారు .’’గీర్వాణ విద్యా పీఠం విద్యార్ధులం అని రొమ్ము విరిచి ,గుండె చూపి గర్వం గా చెప్పుకుంటారు విద్యార్ధులు .అదీ పంతులుగారి విద్యా భిక్ష ,నిరంతర కృషి, దీక్షా ఫలితం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-2-18- కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్ .
—

