గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4
283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856 )
1856 లో పుట్టిన కవి ధర్మదత్త అలియాస్ బక్కా ఝా ‘’సులోచన మాధవ చంపు’’సంస్కృత కావ్యం రాశాడు.గంగూలీ వంశం లో సకూరి శాఖకు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి దుర్గాదత్త ఝా ,తాత మహా మహోపాధ్యాయ బాబూరియా ఝా .బక్కా ఎంచక్కా ముజఫర్ నగర్ డి ఎస్ ఎ.కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .భారతీయ దర్శన శాస్త్రాలన్నిటి లో నిష్ణాతుడు .ఇతని చంపు పద్మ పురాణం లోని ‘’క్రియా యోగ సార సంగ్రంహం ‘’లో 5,6 అధ్యాయాల సారం . 36 ఉచ్చ్వాసాల కావ్యం .కధలో మార్పు లేవీ చెయ్యకుండా తన కవిత్వం తో రక్తి కట్టించాడు .సులోచన ను మభ్యపెట్టే ప్రచేస్ట పాత్ర సృష్టి బాగా చేశాడు .వచన రచనలో బాణ భట్ట ప్రభావం బాగా కనిపిస్తుంది .అనుప్రాస ఉత్ప్రేక్ష ఉపమ అర్దాల౦కారాలను బాగా సమర్ధవంతంగా వాడుకున్నాడు .సులోచన మాధవులమధ్య ప్రేమ శృంగారమే అసలు కధ.విప్రలంభ శృంగారానికి విశేష ప్రాధాన్యత నిచ్చాడు .చివరలో సంభోగ శృంగారాన్నీ దట్టించాడు .ఈ కావ్యాన్ని’’ పంచ తీర్ధి’’అంటారు .ఇందులోని 2498 శ్లోకాలను వివిధ ఛందస్సులలో రాశాడు .మూడవ ఉచ్చ్వాసం లో దండకం కూడా వడ్డించాడు.
కవి శేఖర బదరీ నాద ఝా ‘’గుణేశ్వర చరిత చంపు ‘’రాశాడు .ఇది తన పోషక రాజు మహారాజ కుమార గుణేశ్వర సింహా పై రాసిన చంపు .మిదిలను దాటి చేసిన తీర్ధ యాత్రా విశేషాలు ఇందులో ఉంటాయి . .ఖండబాల వంశ రాజులు- మహా రాజ మాధవ సింహ నుండి మహారాజాధి రాజ కామేశ్వర సింహ వరకు రాజులను వర్ణించాడు .ఋతు వర్ణన బాగా చేసి వాల్మీకిని గుర్తుకు తెస్తాడు .దీన్ని అన్ని హంగులూ ఉన్న కావ్యం గా తీర్చి దిద్దాడు .సందర్భ శుద్ధిగా అలంకారాలను వాడాడు .వీర ,యుద్ధవీర ,దానవీర ,ధర్మవీర రసాలను చక్కగా పోషించాడు .
మిధిలకు చెందిన చంపూ కావ్యాలలో కిశోరీ ఝా రాసిన విద్వద్విలాస ,గిరిజానంద ఝా రాసిన దాశరధ భీశాప, బున్ని లాల దాస రాసిన అభిజ్ఞాన మైధిల ,శ్యామ సుందర ఝా రాసిన రామేశ్వర చంపు లు ఎన్నదగినవి .
ఆధారం –Contribution of Mithila to Sanskrit
సశేషం

