తెలుగు కవితేజం -2
7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 )
నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి సీతాంబాల పుత్రుడు వేంకటశాస్త్రి ప.గో . జి. తాడేపల్లి గూడెం లో 1828 లో పుట్టి 1915 లో 87 వ ఏట మరణించాడు .తణుకు లో వెలగదుర్రు లో నివాసమున్నాడు .ఇరవై ఏళ్ళు వచ్చేదాకా అష్టపదులు ,తరంగాలు మృత్యుంజయ విలాసం కీర్తనలు నేర్చుకుని పాడుకుంటూ గడిపాడు .మృదంగ విద్వాంసుడు కూడా కావటం తో ఒక సారి ఒక శాస్త్రి గారు వచ్చి సంస్కృతం లో సంభాషించాడు .అప్పుడు పట్టుదలపెరిగి సంస్కృతం నేర్చి రచనలు చేసి ప్రసిద్ధి చెందాడు .గోపీనాధ కవి రాసిన విచిత్ర రామాయణాన్ని గద్య పద్య రచనగా మలిచాడు .గౌరీ ,వెంకటేశ్వర శతకాలు కూడా రచించాడు .
8-నాగానంద నాటకీయ నవలా రచయిత-నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి (1933 )
నరసింహ దేవర వెంకట శాస్త్రి సత్యవతి దంపతులకుమారుడే ఉమామ హేశ్వర శాస్త్రి .1933 లో జగన్నాధ గిరి లో పుట్టాడు .’’సుకవి కోకిల ‘’బిరుదున్నవాడు .సత్యవతి ,కావ్యసరసి, వినాయక వైభవం పద్యకావ్యాలు ,విరాట పర్వం యక్షగానం ,నవ్యాంధ్ర పంచకావ్య పరిశీలనం(సౌందర నందం ,రాణా ప్రతాప చరిత్ర ,శివ భారతం ,ఆంద్ర పురాణం బాపూజీ ఆత్మకధ ) వ్యాసపీఠం భారత కధలను కదా తోరణంగా ,భాగవత కధలను భాగవత కదా సుధా గా ,నాగానందాన్ని నాటకీయ నవలగా ,పారిజాతాపహరణాన్ని వచన కధ గా రాశారు .మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి శిష్యుడు .వీరి పంచకావ్యాపరిశీలన గ్రంధాన్ని ఆంద్ర విశ్వ విద్యాలయం బి ఏ కు పాఠ్య గ్రంధంగా ఎంపిక చేసింది .
9-ఉత్తరా పరిణయ ప్రౌఢ ప్రబంధ కర్త –రేమెల వెంకట రాయ కవి (18 20-1847 )
1820 లో పుట్టి ఇరవై ఏడు ఏళ్ళు మాత్రమె జీవించి 1847 లో మరణించిన రేమెల వెంకటరాయ కవి తండ్రి భావయ .అంతకు మించి వివరాలు లేవు కాని యవ్వనం లోనే ఉత్తరాపరిణయ ప్రౌఢ ప్రబంధ రచన చేసిన దిట్ట .ప్రకృతికవి అని బిరుదు .జ్యోతిశాస్త్రం లో నిధి .జాతకరీత్యా తాను 27 ఏళ్ళు మాత్రమే బ్రతుకు తానని తెలుసుకొని పెళ్లి చేసుకోకుండా గ్రంధ రచనలో జీవితాన్ని ధన్యం చేసుకున్న పుణ్య మూర్తి .
10-పండిత రాయ శతక కర్త –తాడూరి లక్ష్మీ నరసింహ రాయ కవి (1856-1935)
తాడూరి రామారావు సీతమ్మ దంపతులకు 1856లో పుట్టి 79 వ ఏట 1935లో చనిపోయిన తాడూరి లక్ష్మీ నరసింహ రాయ కవి జన్మస్థల వివరాలు తెలియదు .శృంగార భూషణం ఉన్మత్త రాఘవం ,రుక్మిణీ స్వయం వరం ,భోజకుమారం ,లక్ష్మీ సంవాదం ,చంద్రాలోకం మేఘ సందేశం ,దైవ ప్రార్ధనం ,ఆంద్రీకృత భగవద్గీత ,శృంగార తిలకం ,ఋతు సంహారం ,సనత్సుజాతీయం ,నీతికధానిధి ,చమత్కార చంద్రిక ,పండితరాయ శతకం రాశాడు
11- కామినీ నిర్మోజన తారావళికర్త -త్రిపురాన తమ్మయ దొర(1849-1890 )
కామినీ నిర్మోజన తారావళికర్త త్రిపురాన తమ్మయ దొర 184 9 లో చిట్టేమాంబ వెంకటస్వామి దొరలకుపుట్టి, 41ఏళ్ళు జీవించి 1890లో చనిపోయాడు .దేవీ భాగవత పురాణాన్ని ఆంధ్రీకరించిన వారిలో ముఖ్యుడు. నీతి శతకం పా౦డు రంగస్తోత్తరం ,కామినీ నిర్మోజన తారావళి ,ముఖ లింగేశ్వర శతకం ,నిద్రా విజయం రాశాడు .దొర కనుక ఆస్థానానికి వచ్చిన కవి పండితులను ఘనంగా సత్కరించేవాడు .
12-రామచంద్రోపాఖ్యాన కావ్య కర్త –వారణాసి వేంకటేశ్వర కవి (1820 )
1820 లో పుట్టాడు అన్న ఒక్క విషయం మాత్రమె వారణాసి వేంకటేశ్వర కవి గురించి తెలిసిన విషయం .రామ చంద్రోపాఖ్యానం అనే ఆరు ఆశ్వాసాల కావ్యాన్ని రచించి పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామికి అంకిత మిచ్చాడు కనుక ఆ ప్రాంతపు కవి అనుకో వచ్చు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-2-18 –ఉయ్యూరు

