ఆధునిక ఆంద్ర శాస్త్రవేత్తలు
47-ప్రామాణిక సామాజిక శాస్త్రవేత్త –శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ
గుంటూరు జిల్లా ఇంటూరులో శ్రీ కాట్రగడ్డ బాలకృష్ణ 26-9-1906 న జన్మించారు .మద్రాస్ వేస్లికాలేజిలో ఎం.ఏ.చదివి ,1921లో బ్రిటన్ వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరి ఏకాగ్రత కుదరక అమెరికా వెళ్లి హార్వర్డ్ యూని వర్సిటిలో పొలిటికల్ సైన్స్ అధ్యయనం చేశారు .ఇక్కడే రెండు సార్లు వరుసగా ఫెలోషిప్ పొందిన తొలి భారతీయ మేధావిగా గుర్తింపు పొందారు .సామాజిక ,అర్ధ తత్వ, శాస్త్రాలను కూలంకషంగా మధించారు .సిద్ధాంతవ్యాసం రాసి యూని వర్సిటీ వారి చే పిహెచ్ డి పొందారు .1939లో గ్రంథ ప్రచురణ జరిగింది .అనేకమంది మేధావులతో ,సామాజిక సంస్థలతో అనుబంధం పెంచుకొన్నారు .
ఇండియాకు తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్య పోరాటం లోపాల్గొని అరెస్ట్ అయి రాయవెల్లూరు జైలు లో ఉన్నారు .విడుదల అయ్యాక బెల్గాం యూని వర్సిటిలో ,బొంబాయి టాటా సంస్థలో ఉద్యోగించారుకాని ఇమడ లేకపోయారు .వైవిధ్యభరిత సామాజిక అంశాలు ముఖ్యంగా మైనారిటీల సమస్యలపై అత్యద్భుత గ్రంథ రచన చేసి ,తామే మైనారిటీ గా రూపొంది శారీరకంగా ,మానసికం గా కుంగిపోయిన బడుగు జనోద్దరణ శీలి బాలకృష్ణగారు .ఆయన అముద్రిత రచనలు చాలా ఉన్నాయి .వాటిని ఈ తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది .మానసికంగా కుంగిపోయిన కాట్రగడ్డ బాలకృష్ణగారు అతి తక్కువవయసు 42 ఏళ్ళకే భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన నాలుగు నెలలకే 18-12-1948 న పరమపదించారు .
48-ఆర్కిడాలజి శాస్త్రవేత్త –శ్రీ ఎ.నాగేశ్వరరావు
గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించిన శ్రీ ఎ.నాగేశ్వరరావు ఆంధ్రా యూని వర్సిటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ‘’ఆర్కిడ్స్ ఆఫ్ అరుణాచల ప్రదేశ్ ‘’అనే సిద్ధాంతవ్యాసం రాసి ,టి.పి.ఆర్కిడ్ పరిశోధన కేంద్రం లో అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ గా చేరి ,అరుణాచల ప్రదేశ్ అరణ్యాలలో విస్తృతంగా తిరిగి ఆ సబ్జెక్ట్ పై అపార విజ్ఞానం సంపాదించారు .
1980లో టి.పి.ఆర్కిడ్ స్టేషన్ లో చేరి ఆర్కిడ్స్ పై విస్తృత పరిశోధనలు చేశారు .అస్సాం లో తేజపూర్ కు 65కిలోమీటర్లలో టి.పి.ఉంది ఇక్కడ పది హెక్టార్ల అంటే పాతిక ఎకరాలలో ఈ పరిశోధన కేంద్రం ఉన్నది .ఇక్కడే పరిశోధనలు చేసి నాగేశ్వరరావు గారు 250 ఆర్కిడ్ లను సృష్టించి రికార్డ్ చేశారు .ఒకటి రెండు రోజుల్లో వాడిపోయి స్వరూపస్వభావాలు కోల్పోయే పూల స్థానం లో ఆర్కిడ్ లు ప్రవేశం చేయటానికి రావు గారి కృషి అద్వితీయం .వీటికోసం విదేశాలలో లక్షలాది డాలర్లు కుమ్మరిస్తున్నారు .ఆర్కిడ్స్ తాజాతనం కోల్పోకుండా ఆకర్షణీయంగా ఉంచటానికి రావు గారి కృషి ఫలించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .
ఇంతకీ ఆర్కిడ్స్ అంటే ?పుష్పించే సాధారణ మొక్కల లాగానే ఉండే ఒకజాతి గడ్డి మొక్కలను ఆర్కిడ్స్ అంటారు .ఇవి ’’ఆర్కిడిసి ‘’కుటుంబానికి చెందినవి .పుష్పాలంకరణ లో వీటికి విశేష ప్రాధాన్యత ఉన్నది .దేశం మొత్తం మీద 1200రకాల ఆర్కిడ్స్ ఉంటె నాగేశ్వరరావు గారి పరిశోధనఫలిత౦ గా అరుణాచల ప్రదేశ్ లో 250రకాలు ఉండి దేశం లో అగ్రస్థానం గా అరుణాచలప్రదేశ్ ను నిలిపిన ఘనత నాగేశ్వరరావు గారిదే .ఇందులోని 30రకాల ఆర్కిడ్స్ ప్రపంచం లో మరెక్కడా లేవు .అందుకే అరుణాచలప్రదేశ్’’ఆర్కిడ్స్ రాజధాని –కేపిటల్ ఆఫ్ ఆర్కిడ్స్ ‘’అయింది .
ప్రపంచం లో సహజ సిద్ధంగా ఉన్న ఆర్కిడ్స్ 30 వేల రకాలు ఉంటాయి .వాటిద్వారా శాస్త్రవేత్తలు క లక్షా ముప్ఫై వేల రకాల ఆర్కిడ్స్ సృష్టించారని తాజా నివేదికలు తెలియ జేస్తున్నాయి .డాక్టర్ నాగేశ్వరరావు సృష్టించిన 250 ఆర్కిడ్స్ లో అయిదారు కొత్తరకాల హైబ్రిడ్ లను రిజిస్టర్ చేశారు .ఆర్కిడ్స్ విజ్ఞాన రంగం లో అంతర్జాతీయ ప్రతిభ ఉన్న కొద్ది మంది శాస్త్రవేత్తలలో నాగేశ్వరరావు గారు ఉండటం అందునా ఆంధ్రులు కావటం అందరికి గర్వకారణం . ‘అరుణాచలేన్సిస్ ,బీర్ మానియా ,జైనియానా ,ఒజోరోనియా ,కంలాంగినేస్ మొదలైన ప్రజాతి ఆర్కిడ్ లను అభి వృద్ధి చేసిన గొప్పఆర్కిడ్ శాస్త్రవేత్త శ్రీ ఎ.నాగేశ్వరరావు గారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-7-19 ఉయ్యూరు

