ఒకప్పుడు భగవాన్ శ్రీ కృష్ణుడు ,యుదిస్టిరుడైన ధర్మరాజుకు ప్రధమ లేక తొలి లేక శయన ఏకాదశి విశేషాలను తెలియ జేశాడు .దీన్ని బ్రహ్మదేవుడు తన పుత్రుడు నారదమహర్షికి తెలిపాడు అని భవిష్యోత్తర పురాణం పేర్కొన్నది .ఈ సందర్భం గా మాంధాత మహారాజు వృత్తాంతం తెలియ జేయబడింది .మాంధాత పాలనలో ఒకసారి తీవ్ర అనావృస్టి ఏర్పడి భయంకర మైన కరువు సంభవించింది .ప్రజలను ఈ కరువు బాధ నుంచి ఎలా తప్పించాలో ఆయనకు బోధ పడలేదు .అప్పుడు ఆంగీరస మహర్షి రాజుకు వరుణ దేవుని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ,ముందుగా ‘’దేవ శయన ఏకాదశి వ్రతం ‘’ఆచరించమని సలహా ఇచ్చాడు .మహారాజు ఆవ్రతాన్ని నిష్టగా చేయగా విష్ణు మూర్తి ప్రీతి చెంది దేశం లో వర్షాలు తగినట్లు కురిసేట్లు చేశాడు.కరువు కాటకాలనుంచి దేశానికి ముప్పు తప్పింది .ఉపవాసం ముఖ్యంగా ఏకాదశి వ్రతం చేయాలి .
విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు క్షీర సాగరం లో శేష శయనం పై నిద్రకు ఉపక్రమిస్తాడు కనుక శయన ఏకాదశి లేక దేవ శయన ఏకాదశి అంటారు .దీనికే తొలి లేక ప్రథమ ఏకాదశి అనిపేరు .ఇప్పటినుంచే పండుగలు ప్రారంభమౌతాయి శయన ఏకాదశి నుంచి నాలుగు నెలలు నిద్రపోయి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి మేలుకొంటాడు.ఈ ఏకాదశిని ఉత్ధాన ఏకాదశి లేక ప్రబోధిని ఏకాదశి అంటారు .ఈ నాలుగు నెలలు వర్షాకాలం కనుక యతీశ్వరులు, సన్యాసులు పీఠాదిపతులు ఉన్న చోటు నుండి ఎక్కడికీ కదలరు .దీనినే చాతుర్మాస దీక్ష అంటారు .
మహారాష్ట్రలో శయన ఏకాదశి నాడు చంద్ర భాగా నదీ తీరం లో ఉన్న పాండురంగడు కొలువై ఉన్న పండరి పురానికి రాష్ట్రం నలుమూలలనుంచి కాలినడకన పండరి శోభ యాత్ర చేసి వచ్చి చంద్ర భాగ లో స్నానించి పాండురంగ స్వామిని దర్శించి పునీతులౌతారు .ఈ యాత్రలో మహారాష్ట్రలోని అలంది నుంచి సంత్ జ్ఞానేశ్వర్ విగ్రహం ,నార్సి నాం దేవ్ నుంచి సంత్ నామదేవ్ విగ్రహం ,దేహు నుంచి సంత్ తుకారాం విగ్రహం ,పైఠాన్ నుంచి సంత్ ఏకనాథ్ విగ్రహం ,త్రయంబకేశ్వర్ నుంచి సంత్ నివృత్తినాథ్ విగ్రహం ,ముక్తానగర్ నుంచి సంత్ ముక్తాబాయి విగ్రహం ,సస్వాద్ నుంచి సంత్ సోపాన్ విగ్రహం ,షేగావ్ నుంచి గజానన్ మహారాజ్ విగ్రహం లను మోసుకొంటూ పండరి పురం చేరుతారు .ఈయాత్రికులను ‘’వర్కారీలు ‘’అంటారు ,వీరంతా జ్ఞాన దేవ, తుకారాం ల అభంగాలను భక్తి పారవశ్యంతో గానం చేస్తూ పండరి యాత్ర చేయటం విశేషం .
రేపు 12-7-19 శుక్రవారం పవిత్ర తొలి ఏకాదశి శుబాకా౦క్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-19-ఉయ్యూరు
—

