కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం

కంచి పరమాచార్యుల 70వ జయంతి సందర్భంగా  బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు ‘’ఆంద్ర ప్రభ ‘’లో రాసిన వ్యాసం

1937 ప్రారంభం లో కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు కాశీ యాత్ర పూర్తి చేసి ,ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి ,గోదావరి జిల్లాలో సంచారం ప్రారంభించారు .గ్రామాలలో తమ దివ్య సందేశాలతో ఆస్తిక జనులను ఉత్తేజితులను చేశారు .తర్వాత అక్కడి కోన సీమ లో ముక్కామల గ్రామం చేరారు .అక్కడున్న ఉద్దండ పండితులైన శ్రీ దువ్వూరి వెంకటేశ్వర్లుగారు ,శ్రీ భమిడిపాటి సోమనాధ శాస్త్రిగారు మొదలైనవారు మంగళవాద్య, పూర్ణ కుంభం లతో స్వాగతం పలికి పుష్పమాలాలంకృతులను చేసి ,స్వస్తి  వాచకాలతో ముక్కామల గ్రామం లోకి ప్రవేశపెట్టారు .

  అది స్వామి వారి జయంతి మహోత్సవ సమయం కనుక శ్రీ దువ్వూరి బాలకృష్ణ మూర్తి గారు శ్రీ వారి అధ్యక్షతన తొమ్మిది రోజులు ‘’బ్రహ్మ సత్రం ‘’జరపాలని ఉన్నదని ఎరిగించి వారి అనుగ్రహం పొందారు .బ్రహ్మానంద భరితులైన మూర్తిగారు ఈవిషయాన్ని దేశం లో ఉన్న అనేక మంది పండితులకు గృహస్తులకు ఆ క్రతు మహోత్సవం లో పాల్గొనవలసినదని ఆహ్వానాలు పంపారు .వారిఆహ్వానానికి విశేష  స్పందన కలిగి ముక్కామల గ్రామం యతులతో ,పండితులతో  గృహస్తులతో నిండి పోయి కను విందు చేసింది .

   అప్పుడు నెల్లూరులో ఉన్న బ్రహ్మశ్రీ మండలీక వేంకట శాస్త్రి గారు తనకు అందిన ఆహ్వానాన్ని మహా భాగ్యంగా భావించి విచ్చేశారు .ఆ రోజే శ్రీవారి ప్రధమ దర్శన భాగ్యం వారికి దక్కింది .క్రతు సమాప్తి వరకు అక్కడే ఉండి, శ్రీవారి అధ్యక్షతన’’బ్రహ్మ సభ ‘’గా జరురుగుతున్న   సభలో పాల్గొని వారి అనుజ్ఞ తో ప్రవచనాలు చేస్తూ , స్వామి దివ్య దర్శనం తో పులకించిపోయారు .క్రతువు పరిసమాప్తి అయ్యాక శ్రీవారి అనుమతితో నెల్లూరు చేరారు .

  1938లో శ్రీవారు చాతుర్మాస్య వ్రతానుస్టానం పూర్తి చేసి ,మార్కాపురం లో శరన్నవరాత్రుల ఉత్సవాలను జరిపి ,మార్గ శిరమాసం లో నెల్లూరు చేరారు .గ్రామజనుల కోరికపై అక్కడే మూడు నెలలు ఉండి పోయారు .ఒక రోజు వారి సమక్షం లో ప్రవచనం చేస్తున్న మండలీక వేంకట శాస్త్రిగారు ప్రసంగవశాన ‘’చరమ వృత్తి ‘’అని ఏదో చెప్పబోయారు .వెంటనే శ్రీవారు ‘’శాస్త్రీ !చరమ వృత్తి అంటే ఏమిటి ‘’?అని ప్రశ్నించారు .అప్పటికప్పుడు శాస్త్రిగారు ‘’మరణ కాలీనమైన వృత్తి’’అని చెప్పారు . వెంటనే పరమాచార్యులవారు ‘’ధ్యాన పరిపాక అవస్థ లో కలిగే అఖండ బ్రహ్మాకార వృత్తి నే’’ చరమ వృత్తి’’అంటారు అని సెలవిచ్చారు .శ్రీవారు చెప్పారు అంటే అది పరమ సిద్ధాంతమే అని శాస్త్రిగారు నమ్మి ,తాను  చెప్పింది కూడా ఎక్కడో ఉన్నది తానూ చదివిందే అని గుర్తుకు వచ్చి ‘’స్వామీ ! రేపు ఈ విషయం గూర్చి మనవి చేస్తాను ‘’అని చెప్పి ,ఆరాత్రి తమవద్ద ఉన్న ‘’అద్వైత సిద్ధి ‘’గ్రంథాన్నితిరగేశారు .అందులో మూడు చోట్ల ‘’చరమ  వృత్తిః మరణ కాలినా , అఖండ బ్రహ్మాకార వృత్తిః’’అని అని ఉండటం తో తాము  చెప్పింది సరైనదే అని నిశ్చయం చేసుకొని  వాటిని గుర్తుపెట్టుకొని ,మర్నాడు శ్రీవారి సన్నిధి చేరి వాటిని వివరించారు .

  స్వామీజీ ‘’ఇంకా రెండు చోట్ల ఉండాలి .చదివి వినిపిస్తావా “”? అని అడిగారు .ఆశ్చర్యపోయిన శాస్త్రిగారు ఇంకా తను వేరే చదవాల్సింది ఏమీ లేదని వినమ్రంగా చెప్పారు .అప్పుడు శ్రీవారు ‘’నువ్వు చెప్పిన దానికి ప్రమాణం చూపావు బాగానే ఉంది .మరి నేను చెప్పిందానికీ ప్రమాణం చూపించు ‘’అన్నారు చలోక్తిగా .మండలీక శాస్త్రిగారు ‘’నేను మానవ మాత్రుడిని కనుక నా వాక్యానికి ప్రమాణం కావాలి. తమరు సాక్షాత్తు భగవత్ స్వరూపులు .భగవంతుని ముఖం నుంచి నిర్గతమైన వేదం లాగా శ్రీవారి ముఖ నిర్గత వాక్యానికి ప్రమాణం అవసరం లేనే లేదు ‘’అన్నారు. .శ్రీవారు ఉదారం గా నవ్వుతూ ‘’నీకు వకాల్తా ఇస్తున్నాను .నేను చెప్పిన వాక్యానికి కూడా ప్రమాణం చూపించి చెప్పు ‘’అని ఆదేశంలాంటి అనుగ్రహం చేశారు .

  స్వామివారు చెప్పిన వాక్యానికి ప్రమాణం ఎక్కడ వెతకాలో అర్ధంకాక శాస్త్రిగారు  ఇంటికి చేరి అదే ఆలోచనలో ఉండి పోయారు .కాకతాళీయంగా శాస్త్రిగారు తమ పుస్తకాల బీరువా వెతుకుతుండగా భగవద్గీత కు శ్రీ మధు సూదన సరస్వతి స్వాములవారు రాసిన ‘’గూడార్ధ దీపిక ‘’అనే వ్యాఖ్యానం కనిపించి. అందులో 18 వ అధ్యాయం పై దృష్టిపడింది  .చూశారు .అందులో అద్వైతులకు దేహాదుల స్థితి ఎలా కలుగుతుంది అనే  ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి .1-  బ్రహ్మజ్ఞానం కలుగగానే అజ్ఞానం పూర్తిగా నశించదు .ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది .ఈ కొద్దిదానివలన మళ్ళీ శరీర ధారికావచ్చు .ఈ లేశమైన అజ్ఞానం మరణ సమయం లో అఖండ బ్రహ్మాకార వృత్తి మళ్ళీ కలిగి నశిస్తుంది .అప్పుడే విదేహ ముక్తి సిద్ధిస్తుంది .ఈ విషయం లో ‘’చరమ  వృత్తి అంటే మరణకాలీన అఖండ బ్రహ్మాకార వృత్తి అని అర్ధం .కాని అజ్ఞానం కొద్దిగా అంటే లేశమాత్రంగా మిగలటం అసంభవం అని భావించి ,అజ్ఞాన సంస్కారాను  వృత్తి ని చెప్పారు .

2-కరెంట్ స్విచ్ ఆన్ చేయగానే ఫాన్ తిరిగి ,కరెంట్ ఆపేసినా కొంతకాలం తిరిగి ఆగిపోతుంది .అలాగే బ్రహ్మవేత్తకు ధ్యాన పరిపాకం చివర కలిగిన అఖండ బ్రహ్మాకార వృత్తి రూప జ్ఞానం వలన  దేహ ఇంద్రియాలకు చెందిన అజ్ఞానం నశిస్తుంది .ఫాన్ ఉదాహరణలో చెప్పినట్లే ,సంస్కార వశంతో కొంతకాలం దేహే౦ద్రియాదులు తిరిగి ,తర్వాత సంస్కారం నశించటం వలన ,మరణకాలం లో బ్రహ్మ జ్ఞానం అవసరం లేకుండానే స్వయంగా దేహెం దేహే౦ద్రియాదులు పోతాయి .ఈ పద్ధతిలో చరమ వృత్తి అంటే ధ్యాన పరిపాకం చివర కలిగే వృత్తి ‘’అని చెప్పబడింది. దీనినే శ్రీవారు ఉటంకించింది .

  మర్నాడు స్వామి వారి సన్నిధికి వెళ్లి శాస్త్రిగారు తాను చూసిన విషయాలు చెప్పారు .వెంటనే ‘’ఆ పుస్తకం చూడాలని  నీకుఎలా  తోచింది  ?’’అని ప్రశ్నించారు .శాస్త్రిగారు ‘’నాకు తెలియకుండా ,నాకు కనిపించకుండా ఎవరో ఈ సాయం చేశారు .అంతకంటే నేనేమీ చెప్పలేను ‘’అన్నారు నతమస్తకులై శాస్త్రిగారు .శ్రీవారి  సన్నిధిలోఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ,వారితో సంభాషిస్తే ఎన్నో సిద్దా౦త రహస్యాలు బయటపడతాయని, వారి దివ్య దర్శనం తో ఎందరికో వ్యాధులు నయమయ్యాయని శ్రీవారి దివ్య ఉపదేశ అమృత సేవనం తో ప్రజలకు అత్యంత శాంతి లభిస్తుందని బ్రహ్మశ్రీ మండలీక  వేంకట శాస్త్రి గారు పరమాచార్యుల సప్తతి జయంతి మహోత్సవ సందర్భంగా ఆంద్ర ప్రభలో రాశారు .అందులోని ముఖ్య విషయాలు నా భాషలో మీకు తెలియజేశాను .శ్రీ వారిపై శాస్త్రిగారు రచించిన శ్లోకం –

‘’అజ్ఞానా౦తర్గహన  పతితా ,నాత్మ విద్యోప దేశైః-త్రాతుం లోకాన్ భవదవ శిఖా తాపపాప చ్యమానాన్ ‘’

ముక్ష్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతీ- శంభో ర్మూర్తిః,చరతి భువనే శంకరాచార్య రూపా ‘’

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-19-ఉయ్యూరు

— 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.