‘’ప్రతిష్ట ఎప్పుడు “’?అని ప్రశ్నించిన పరమాచార్యులు
కృష్ణా జిల్లా నాగాయ లంక లాంచీల రేవు ఒడ్డున సంత రోజున చేపలు అమ్ముకొనేవారు కొనేవారు కనీసం వెయ్యి మంది వస్తారు .అక్కడనుంచి లాంచీలమీద పెనుమూడి రేవు ద్వారా గుంటూరు వెడతారు .ఇలాంటి చోట భగవంతుని జ్ఞాపకం చేసే ఆలయం కట్టాలని శ్రీ రాం చరణ్ కుందుర్తి వెంకట నరసయ్య గారికి సంకల్పం కలిగింది .తన స్వంత ద్రవ్యం ప్రజలిచ్చిన సహకారం తో శ్రీ కోదండ రామాలయం ,శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం నిర్మించారు .రాజస్థాన్ జైపూర్ నుంచి చలువరాతి విగ్రహాలు తెప్పించారు .1964 మేనెల 31 న ప్రతిష్ట చేయాలని ముహూర్తం నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేశారు .
మే 25న కంచి పరమాచార్యుల షష్టి పూర్తి మహోత్సవం కంచికి మూడుమైళ్ళ దూరం లో ఉన్న ‘’అంబి’’గ్రామం లో జరుగుతుందని తెలిసింది .రాం చరణ్ గారు ఆయన శిష్యుడు తుంగం నాగభూషణం ఆ మహోత్సవాన్ని చూడాలని .ప్రతిస్ట లోపలే వస్తామని జలాధివాస దాన్యాధివాసాల ఏర్పాటు చేయమని అక్కడి వారికి చెప్పి ఇద్దరూ బయల్దేరారు .అప్పటికే శ్రీ మండలీక వేంకటశాస్త్రి గారు ,శ్రీ కుప్పా లక్ష్మావదానులుగారు ,శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చేరుకొన్నారు .
షష్టి పూర్తి రోజున వీరికి శ్రీ వారి దర్శనం కాలేదు .మర్నాడు దర్శనానికి వెళ్ళారు .శ్రీ రామ శరణ్ గారికి అదే మొదటి సారి స్వామి వారిని చూడటం .స్వామి వారు తీర్ధమిచ్చి ,ఉద్దేరిణ కిందపెట్టి ,’’ప్రతిష్ట ఎప్పుడు “’?అని అడిగారు .’’మా ఇంట్లో మందిరం లో ఎప్పుడో అయింది ‘’అన్నారు శ్రీరామ శరణ గారు .’’అదికాదు .నది ఒడ్డున ఏర్పాటు చేశావే ‘’రామపాద క్షేత్రం ‘’అక్కడి ప్రతిష్ట సంగతి అడిగాను ‘’అన్నారు. అవాక్కయ్యారు ఈయన .’’మే 31న చేద్దామనుకొంటున్నాము ‘’అన్నారు .స్వామి ‘’31 న చేస్తారా ?’’అని ప్రశ్నార్ధకంగా అడిగారు .ఈయనకు ఆ రోజున ప్రతిష్ట జరగదేమో నని అనుమానం వచ్చింది .స్వామి వారు అక్షితలు కుంకుమ ,కిస్ మిస్ పళ్ళు ప్రసాదంగా ఇచ్చి యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహం క్రింద ఉంచమని చెప్పారు .
ఇంతలో మే 28న భారత ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు మరణించటం ,రైళ్ళు ,బస్సులు నడవకపోవటం తో 29న బయల్దేరి 30 సాయంత్రానికి నాగాయలంక చేరారు .’’గురువుగారు లేకుండా ప్రతిష్టా?’’అని ఊరి వారందరూ భావించి ఏ పనీ మొదలు పెట్టలేదు .మళ్ళీ అందరూ ఆలోచించి జూన్ 11న ప్రతిష్టకు ముహూర్తం పెట్టించి కార్యక్రమం పూర్తి చేశారు .
స్వామి ఈ క్షేత్రాన్ని ‘’రామ పాద క్షేత్రం ‘’అని ఎందుకు అన్నారో వీరికి అర్ధం కాలేదు .తర్వాత రెండు నెలలకు నాగార్జున సాగర్ డాం విరిగి ,కృష్ణా నదికి అంతులేని వరద నీరు వచ్చి ,నాగాయలంకలో నూతనంగా ప్రతిస్టింప బడిన శ్రీరామ పాదుకలకు , అంటే దాకా వరద నీరు వచ్చి ,వెనక్కి తగ్గింది .వరద ఇంకొక అంగుళం పెరిగితే ,దివి తాలూకాలో 70గ్రామాలు వరదనీటిలో కొట్టుకు పోయేవి .అదీ రామపాద క్షేత్రం మహాత్మ్యం .ఆ పేరు పెట్టిన శ్రీ వారి దివ్యానుగ్రహం .అప్పటినుంచి నిత్యపూజలు కార్తీక మాసం లో 108 సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ క్షేత్ర వైభవాన్ని పెంచుతున్నారు .తర్వాత వినాయక, ఆంజనేయ ,కేదారేశ్వర విగ్రహాల ప్రతిష్ట కూడా జరిపారు అని ‘’ప్రతిష్ట ఎప్పుడు ?’’అనే వ్యాసం లో శ్రీ రామ శరణ్ కుందుర్తి వెంకటనరసయ్య రాశారు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-7-19-ఉయ్యూరు

