ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -3
గాంధి వ్యూహం
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి గాంధీజీ వ్యూహం లో ఉన్న అంశాలు .ముందుగా హింసా కార్యాన్ని ఆదిలోనే తు౦చేయాలి .దీనికి చేసే ప్రయత్నం శక్తివంతంగా పూర్తిగా అహింసా పద్ధతిలోనే ఉండాలి .హింసను ఆపటానికి భౌతిక నియంత్రణ బలమైన శక్తి తో చేయాలి .రెండవది భయ పెట్టట౦ ,వినాశనం ఐతే ఇవి గాంధీ పోరాట సిద్ధాంతానికి విఘాతం కలిగించేవి ,సమస్యా పరిష్కారానికి అవరోధం కలిగించేవి .టెర్రరిజం వెనుక ఉన్న సమస్యలకు ఆయన మార్గాలు కొన్ని ఉన్నాయి ,ఉగ్రవాద కార్యాలపై ఊర్తిగా దృష్టి కేంద్రీకరించాలి .జాతి ద్వేషం నిలువరించటానికికి పూనుకోవాలి .ఉగ్రవాదానికి పూను కొనే వారు అలా ప్రవర్తించటానికి వెనుక ఉన్న కారణాలు అన్వేషించాలి .
ఉన్నతమైన నీతి తో ప్రవర్తించాలి . వారి విశుద్ధ ప్రవర్తన అపమార్గ గాములకు కను విప్పు కలిగిస్తుంది .అధికారులు హింసా విధానం తో ప్రవర్తిస్తే బలప్రయోగానికి దారి తీస్తుంది .అందుకే గాంధీ నెత్తీ నోరూ కొట్టుకొని నైతిక లక్ష్యం మాత్రమె సమస్యకు మార్గ దర్శనం చేస్తుంది అన్నాడు .వినటానికి ఈ నీతి సూత్రాలు బానే ఉంటాయి .అవి పని చేసి ,ప్రభావం చూపుతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న .బలమైన హి౦సాత్మకత ముందు అహింసా విధానాలు చెవిటి వాడి ముందు శంఖం ఊది నట్లుగా నిష్పలమౌతాయని చాలామంది అనేక సందర్భాలలో ఆయన్ను ప్రశ్నించారు .ఇజ్రాయిల్ లో పాలస్తీనా హింసకు కఠిన ప్రతిస్పందన హమాస్ కు ఉప్పెనలాగా ఉపయోగపడి ,టెర్రరిస్ట్ కార్యాలను పెంచాయి . అమెరికాలో సెప్టెంబర్ 11 దాడి తర్వాత, జిహాదీ ఉద్యమంపై ప్రతీకార చర్య ,ఉగ్ర దాడులు ప్రపంచ వ్యాప్తంగా తగ్గ క పోవటం మనకు అనుభవమే . టెర్రరిజం పై అమిత బలప్రయోగం మంచి ఫలితాల నిచ్చిన దాఖలాలు పెద్దగాలేవు .
హింస హింసనే సృష్టిస్తుంది .పూర్తి హింస పూర్తి వినాశనమే కలిగిస్తుంది .కానీ అహింస హింస మూలాలనే ఛేదిస్తుంది .అహింస శాంతి కి మార్గమై అంతిమ విజయం చేకూరుస్తుంది .ఇందులో కోల్పోయిన వారు గాయపడరు . బ్రిటిష్ ప్రభుత్వ టెర్రరిజం పై గాంధీ అహింసా పద్ధతులతోనే అనేకసమస్యలపై పోరాటాలు చేసి ,ఘన విజయాలు మనకు సాధించి పెట్టాడు .ఒక్కోసారి గత్యంతరం లేని పరిస్థితులలో హింసను ప్రయోగించటం .తప్పదని ఆయన చెప్పిన విషయం ఇదివరకే తెలుసుకొన్నాం .ఏది ఏమైనా హింస స్వయం వినాశకం .అహింస చిరంజీవి .హింస మనుష్యులను చంపితే ,అహింస మనుష్యులను చంపనే చంపదు.అందుకనే ఐక్యరాజ్య సంస్థ మొదలైనవి అహింసా విధాన పరిష్కారాలకోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది.దీనికి సహన శీలత తో కూడిన రాజకీయ విజ్ఞత ,పూనిక ,నిశ్చయ బుద్ధి ,ఓపిక ,పట్టుదల ,తోపాటు అహింసపై పూర్తి విశ్వాసం కావాలి .హింస ఎప్పుడూ విజయం సాధించదు.
ఆధునిక ఉగ్రవాదం ఎవరో ఒక వ్యక్తీ లేక అలాంటి వ్యక్తుల సమూహం అడపాదడపా చేసే హింసా కృత్యాలు కాదు .అది జాతీయ సీమలను దాటి ఉన్న సుశిక్షితులైన అత్యాధునిక ఆయుధ సైనిక పటాలం.వాళ్ళ సిద్ధాంతాలు వారివి .వారి నైతికత,వారిది .వారి నెట్ వర్క్ ,ఆయుధ సామగ్రి నుంచే వాళ్ళ అసలైన బలం వస్తుంది .దానినే నమ్మి మిగిలినవారిని ఆకర్షించి శిక్షణ నిచ్చి ఉగ్రవాదం పెంచుతున్నారు .అదే మంచి అని నమ్ముతున్నారు .వాళ్ళ ఈగోలను తృప్తి పరచుకొంటున్నారు . పిచ్చి వాళ్ళ స్వర్గం అనే ఊహా స్వర్గం లో విహరిస్తూంటారు.వీరిని కూడా అహింసా విధానం లోనే ఎదుర్కోవాలి .బలమైన యదార్ధ నైతికత వారి మనసులను మారుస్తుంది అప్పుడే జనజీవన స్రవంతిలో కలిసిపోతారు .లేకపోతె టెర్రరిజం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు.తాము నమ్మిన కుహనా సిద్ధాంతాన్నే నమ్ముకొంటూ టెర్రరిస్ట్ లు మరింత పేట్రేగి క్రూర హింసకు పాల్పడుతారు అంటాడు ఆవేదనతో ఆహి౦సామూర్తి మహాత్మా గాంధీజీ .
ఆధారం –అశుతోష్ పాండే సంకలించిన ‘’ రెలెవెన్స్ ఆఫ్ గాంధి ఇన్ 21స్ట్ సెంచరి ‘’పుస్తకం లో అనురాగ్ గార్గ్ వ్యాసం –‘’గాంధీ అండ్ టెర్రరిజం ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-7-19-ఉయ్యూరు
.
ఎనుక

