మనకు తెలియని మహాయోగులు—10
19-దివ్యమాత కోన అంజనాదేవి -1917-1977
అన౦తపురం జిల్లా పెనుగొండ తాలూకా పైదేటి గ్రామంలో నిరుపేద కుమ్మరి కుటుంబం లో అంజనాదేవి 1917లో పుట్టింది .ఆమె బాల్యంలో పెనుగొండ బాబయ్య అనే ముస్లిం యోగి సమాధి వెనుక శివాలయం దగ్గర చక్కర చెట్టునుంచి రాలే పంచదారను ప్రసాదంగా పంచేది .15వ ఏట నారాయణప్పతో వివాహం జరిగి ,30 ఏళ్ళుసంసారజీవితం అనుభవించి దైవ బలంతో ఎందరికో మేలు చేసేది ,కోన క్షేత్ర పాండురంగ స్వామి కలలో ఒక రోజు కనిపించగా ,తనజీవితాన్ని గుట్టూరు కోన కణ్వాశ్రమం లో గడపాలని నిర్ణయించింది .
భక్తులెందరో వచ్చేవారు ఆపదలలో ఉన్నవారిని ఆర్తులనుదీనులను రోగులను ఆదుకోన్నది .జ్ఞానబోధ చేసేది .కోన అంజనా దేవిగా కోన మాతగా దివ్యమాతగా ప్రసిద్ధి చెందింది .వాక్శుద్ధి భవిష్యవాణి లతో అందరినీ దగ్గరకు చేర్చింది. 4-6-1977పింగల సంవత్సర జ్యేష్ట బహుళ చవితి శనివారం సాయంత్రం దివ్యమాత అంజనాదేవి 60 వ ఏట దివ్యలోకాలకు చేరింది.
20-కళా ప్రపూర్ణ ఓరుగంటి నృసింహ యోగీంద్రులు -1914-1978
తూర్పు గోదావరిజిల్లా రాజోలు తాలూకా గంటి గ్రామం లో ఓరుగంటి సీతమ్మ లక్ష్మీనారాయణ అనే సంపన్న బ్రాహ్మణ దంపతులకు లక్ష్మీ నరసింహ మూర్తి 17-10-1914 ఆనందసంవత్సర ఆశ్వయుజ బహుళ త్రయోదశి శనివారం ముంగండ లో జన్మించాడు .8వ ఏట ఉపనయనం చేసి వేదం నేర్పించారు .పదేళ్ళ వయసులో షహీద్ భగత్సింగ్ ,అల్లూరి సీతారామ రాజుల వీర గాధలకు ప్రేరణ చెంది ,దేశస్వాతత్ర్యం కోసం ఇల్లు వదిలి వెళ్ళాడు .అన్నవరం దగ్గర కనిపిస్తే తండ్రి ఇంటికి తెచ్చాడు .
మళ్ళీ పారిపోయి గుంటూరులో కాశీ కృష్ణాచార్యుల వారివద్ద సంస్కృతం నేర్చి తెలుగు హిందీ సంస్కృతాలలో అనర్గళం గా మాట్లాడే నేర్పు సంపాదించాడు .తాతగారు నరసంహం గారికితెలిసి ఇంటికి తీసుకు వెళ్లి ,గట్టికాపలా పెట్టి కావ్య పాఠాలు చెప్పించారు .సిద్ధ పురుషులను సేవించి మహిమలు సాధించాలనే బలీయమైన కోరికతో ,మళ్ళీ1926లో ఒక అర్ధరాత్రి ఇల్లువదిలి తణుకు లో రైలు ఎక్కగా ,హరిద్వార్ కు చెందిన ఒక మార్వాడీ దంపతులు తమతో ఇంటికి తీసుకు వెళ్లారు .ఆరు నెలలలో అనేక శాస్త్రాలు నేర్చాడు .1927లో మార్వాడీ దంపతుల అనుమతి తో బదరీ యాత్రకు బయల్దేర్రి ,ఎనిమిది రోజులు నడిచి పాండవులు స్వర్గారోహణ చేసిన ‘’శీతో పథం’’దగ్గర పర్వత గుహలో సమాధి నిష్టుడైన 350ఏళ్ళ సిద్ధ పురుషుడు సర్వానందావ దూతను దర్శించి శిష్యుడై హఠయోగం లో కొన్ని క్రియలు నేర్చాడు .గురువు ఈయనకు 7రొజులు తర్వాత మంచు వాతావరణం లో తట్టుకొనే శక్తిని ప్రసాదించాడు.
గుర్వాజ్ఞాపై హరిద్వారం చేరి మార్వాడీ దంపతులింట్లో ఉండి,మరికొంతశాస్త్రాధ్యయనం చేసి గురువును చేరాడు. పూర్తి హఠయోగం,ఇతర యోగాసాధనలు నేర్పాడు .సచ్చిదానంద అవధూత గురువు మూర్తిని ఆయనగురువు రామాలాల ప్రభువును ఆశ్రయించమనీ , ,ఆయనే మోక్ష ప్రదాత అని చెప్పి సిద్ధి పొందాడు .
లక్ష్మీ నరసింహమూర్తి 2-10-1930న రామాలాల ప్రభువును రుషీకశ్ లో దర్శించగా ,’’నర్సింగ్ ‘’అని పేరు పెట్ట గా, మహా కృష్ణ భక్తుడై మధురకు వెళ్లి కృష్ణనామ స్మరణతో కొంతకాలం గడిపి ,ఏక సంతాగ్రాహి కనుక అక్కడ బృహద్భాగవతం కంఠస్తమైంది .మళ్ళీ రామలాలా గురువును చేరి పత౦జలి యోగసూత్రాలు కొన్ని సాధన చేసి ,1936లో స్వగ్రామం గంటి వెళ్లి శాస్త్రాధ్యయనం చేసి రామలాలా దేహం చాలించేముందు ఋషీకేశ్ చేరాడు ..గుర్వాజ్ఞపై ఆంధ్రదేశానికి తిరిగివచ్చి లక్ష్మీదేవిని పెళ్ళాడి ,చాలామందికి ధ్యాన దీక్షనిచ్చి ,దేశమంతా పర్యటించి భాగవత ఉపన్యాసాలు చేశాడు .నెహ్రు ,రాజేంద్ర ప్రసాద్ వంటి వారివద్ద ‘’వజ్రోళి’’వంటి యోగశక్తులను ప్రదర్శించి ఆశ్చర్యపరచాడు . వజ్రోళి అంటే హఠ యోగం లో ఒక ముద్ర . వీర్యాన్ని నిలువ చేసి, వదిలేసి మళ్ళీ సేకరించటం . 1975లో ఆంద్ర విశ్వ విద్యాలయం ‘’కళా ప్రపూర్ణ ‘’బిరుదప్రదానం చేసి సత్కరించింది .నృసి౦హ యోగి 16-6-1978న 64వ ఏట చనిపోయాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-9-20-ఉయ్యూరు

