- మనకు తెలియని మహాయోగులు—14
27-లక్ష్మీ కాంతానంద యోగి -1888-1970
నటుడు గాయకుడు వైద్యుడు ,త్రిభాషా పండితుడు ,యోగి లక్ష్మీకా౦తానందయోగి గుంటూరు జిల్లా కొత్తరెడ్డి పాలెం గ్రామకరణం చెన్నం రాజు ,కామేశ్వరమ్మలకు 11-1-1888సర్వజిత్ పుష్యబహుళ త్రయోదశి బుధవారం మూలా నక్షత్రం లో జన్మించాడు గుంటూరు ఎసి కాలేజిలో మెట్రిక్ పాసై ,18వ ఏట మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో డ్రాఫ్ట్స్ మన్ ప రీక్ష పాసై కృష్ణా –గుంటూరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం లో చేరాడు .తండ్రి చనిపోయాడు .ప్రతియేటా ఇంట్లో జరిగే సీతారామ కళ్యాణ బాధ్యత మీద పడింది .అధికారులు సెలవు ఇవ్వనందున రాజీనామా చేసి ,అనసూయమ్మను పెళ్ళాడి ,గ్రామకరణీకం వ్యవసాయం సీతారాముల సేవలో గడిపాడు .నాటకాలలో హరిశ్చంద్ర ,నల బాహుక సారంగధర నరకాసుర భీష్మ పాత్రలు ధరిస్తూ మంచి పేరు పొందాడు .హిందీ ,సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేశాడు .సుశ్రావ్యంగా గానం చేసేవాడు .వీణావాదనలో దిట్ట అనిపించాడు .హరికథలు ,పురాణ ప్రవచనాలలో రాణించాడు ,ఆయుర్వేద గ్రంథాలు చదివి జీర్ణం చేసుకొని ఆయుర్వేద మందులు తయారు చేసి పేదలకు ఉచితం గా అందించేవాడు .
లక్ష్మీ కాంతుని గుణ శీలాలు,ఆధ్యాత్మిక చింతన గుర్తించి చంద్ర శేఖరానంద సరస్వతీ స్వామి తమ ఆశ్రమ స్థలం తోట ఆయనకు వదిలేసి కాశీ వెళ్ళిపోయారు .తమ్ముడు సుబ్బారావు తో కలిసి అక్కడ ఆధ్యాత్మిక సాధన చేశాడు .హఠాత్తుగా తమ్ముడు చనిపోవటం తో విరక్తికలిగి ,మనసు వికలమై, ఆ ప్రదేశం లో ఆనందాశ్రమం అనే పేరుతొ మూడు కుటీరాలు నిర్మించి ఉత్తర భారతయాత్రకు బయల్దేరాడు .కాశీలో బ్రహ్మానంద సరస్వతీ స్వామి ఋషీకేశ్ లో ఆన౦ద యోగి లను దర్శించి ,యోగ రహస్యాలు గ్రహించి ,కాశ్మీర మాధవానందులతో కలిసి ,హిమాలయాల్లో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఆనందాశ్రమం లో శివ లింగం ప్రతిష్టించి రుషి వాటికగా మార్చారు .ఆనందశ్రమం లోనిఒక కుటీరం లో భూ గృహం ఏర్పాటు చేసుకొని అక్కడ రోజుకు కనీసం అయిదు గంటలు యోగ సాధన చేసేవారు .అద్భుతాలు మహిమలు ప్రదర్శించారు .సేవాకార్యాలు సాంఘిక సంస్కరణకర్యక్రమాలు చేబట్టారు.సుమారు 25గ్రంథాలు రాశారు .21-11-1970సాధారణ సంవత్సర కార్తీక బహుళ అష్టమి శనివారం 82 వ ఏట లక్ష్మీకా౦తానంద స్వామి తమ ఆరాధ్యదేవత గాయత్రీ మాత ను హృదయం లో నిలుపుకొని బ్రహ్మైక్యం చెందారు .
28-ప్రణవానంద స్వామి -1888-1969
కేరళలో పుట్టి కృష్ణాజిల్లా గుడివాడలో స్థిరపడి గుడివాడ ప్రణవానంద స్వామిగా ఖ్యాతి పొంది.భారత దేశానికి జ్ఞాన భిక్ష ప్రసాదించిన ఆయన కేరళ పాల్ఘాట్ లో ఆల్తూరు గ్రామంలో 15-5-1888సర్వధారి వైశాఖ శుద్ధ చవితి మంగళవారంజన్మించారు పసితనం లోనే తలి దండ్రులు గతించారు .గురుకులం లో చదివి ఆధ్యాత్మిక భావ సంపద పొందారు .మళయాళ సంస్కృత తమిళ కన్నడ భాషలు నేర్చి శ్రీ కృష్ణానంద అవధూత శిష్యులై బ్రహ్మ విద్య గ్రహించారు .విద్యార్ధిగా ఉండగానే బ్రహ్మచర్యం పాటించి తత్వాన్వేషణ చేసి సన్యసించాలి అనే కోరిక బలీయంగా ఉండేది .పాద చారియై దేశ సంచారం చేస్తూ ,1917లో గుడివాడ చేరారు .
గుడివాడలో తాతిరెడ్డి తోట ను తపోభూమిగా చేసుకొని నిష్కళంక నిరాడంబర జీవితం గడుపుతూ దీక్షగా తపోసాధన చేశారు .సులభంగా అందరికీ అర్ధమయేట్లు గహనమైన వేదాంతాన్ని బోధిస్తూ అందరి మనసులను ఆక్రమించారు .మీర్జాపురం రాజా దంపతులు భక్తులై ,1936లో ప్రణవాశ్రమం నిర్మించి శంకర ప్రతిష్ట చేసి ,నిత్యా రాదనకు తోడ్పడ్డారు .గుడివాడ ,పరిసర ప్రాంత ప్రజలు ‘’సనాతన హిందూ ధర్మ ప్రబోధ సంఘం ‘’స్థాపించి ,స్వామివారితో చాలా చోట్ల ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయించారు .స్వామి ఎవరినీ శిష్యులుగాచేర్చుకోకపోవటం ప్రత్యేకత .ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్దరించారు .విశ్వహిందూపరిషత్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వారు .గా౦ధీస్మారక నిధికి విరాళాలు సేకరించి అందించారు .హృషీకేష్ లోని స్వామి శివానంద దివ్య జీవన సంఘానికి గుడివాడలో 1930లో ఒక శాఖను ఏర్పాటు చేశారు .కవిపండిత నటగాయక నర్తక హరిదాస భాగవతులను ఆహ్వానించి ,ఆదరించి సన్మానించేవారు .
ప్రణవాశ్రమం లో ప్రాతి ఏడాది సప్తాహ దీక్ష తోపాటు గణపతి, దేవీ, నవరాత్రులు కృష్ణాష్టమి గీతాజయంతి ,త్యాగరాజ ,విద్యారణ్య జయంతి ,రామానుజ ,మధ్వాచార్య, జయంతి రమణమహర్షి జయంతి మొదలైనవాటిని వైభవోపేతంగా నిర్వహించేవారు .దేశమంతా అయన పేరిట అనేక ఆశ్రమాలు ఏర్పడ్డాయి .80వ ఏట కూడా నిరంతర పరిశ్రమ చేసేవారు .1967లో అనారోగ్యానికి గురయ్యారు .1969 మే15 సాయంత్రం 3గంటలకు 81వ ఏట ప్రణవాన౦దస్వామి బ్రహ్మైక్యం చెందారు .ఆశ్రమం ప్రక్కనే సమాధి నిర్మించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-9-20-ఉయ్యూరు

