విశేషార్ధాలను బహు గ్రందాలనాధారంగా వివరిస్తూ వేద, వేదాంత ,ఉపనిషత్,పురాణాల ఆంతర్యాన్ని జోడిస్తూ ,ప్రతిదానికీ ఉపపత్తి చూపుతూ వ్యాస వాల్మీకి హృదయాలను ఆవిష్కరిస్తూ ,అందుకు భిన్నంగా ఎవరైనా రాసినా,పలికినా,తీవ్ర నిరసన తెలుపుతూ సంస్కృత మూల౦ లో ఉన్న భావానికి సరితూగే తెలుగు కవుల పద్యాలను హాయిగా చదివి కైమోడ్చుతూ ,మహాకవి తిక్కనకూడా ,వ్యాస హృదయాన్ని అర్ధం చేసుకోనిని సందర్భాన్ని నిర్భయంగా బయటపెడుతూ ,వ్యాస హృదయన్ని గొప్పగా చాటిన పద్యాలను ఉచ్చైశ్వరం తో గానం చేస్తూ ,కరుణశ్రీ పద్యాల రామనీయకత్వాన్ని వివరిస్తూ ,ధూర్జటి భక్తీ గరిమను శ్లాఘిస్తూ ,కాలిదాస అతిలోక కవిత్వాన్ని ఉదాహరిస్తూ ,చమత్కారం జోడిస్తూ భక్తిభావ రసోల్లాసంగా గా౦గ ఝరీ వేగంతోఅమృత తుల్యం గా ప్రవచనం చేసే నేర్పు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారిది .ఇదంతా తమతాతగారు బ్రహ్మశ్రీ మల్లాది రామకృష్ణ చయనులుగారి శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహ౦గా భావిస్తారు. వారి ప్రార్ధనా శోకాలతోనే ఒక గోప్పఆధ్యాత్మిక భూమికను సృస్టిస్తారు .అందులో ప్రవేశిస్తే వారు మల్లాది వారు కానేకారు అపరా శుకులు ,పరాశరులు, సూతులు ,అనిపిస్తారు .అలాంటి మహా మహుని జీవిత విశేషాలను తెలియ జేయటమే నేను చేసే ప్రయత్నం .
శ్రీ చంద్ర శేఖర శాస్త్రి గారి తలిదండ్రులు శ్రీమాన్ దక్షిణా మూర్తి దంపతులు .తాతగారు రామకృష్ణ విద్వత్ చయనులుగారు .శాస్త్రిగారు 22-8-1925క్రోధన నామ సంవత్సర భాద్రపద తదియ నాడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా కోసూరు మండలం హస్సనాబాద్ లో జన్మించారు .గుంటూరుజిల్లా అమరావతిలో నివాసం .పురాణ ప్రవచన ,ప్రబోదాధ్యాపనాలే వారి వృత్తి. యవ్వనం లో వేదం ,తర్కం ,మీమాంస శ్రౌత ,స్మార్త ,వ్యాకరణ ,వేదాంత సాహిత్య శాస్తాలను మహామహులైన వేత్తల వద్ద అధ్యయనం చేశారు .వీటిలో నిష్ణాతులయ్యాక తాతగారి మార్గం లో భాగవత భారత రామాయణ పురాణ ప్రవచనం ప్రారంభించి వేలాది ప్రవచనాలు చేశారు.19వ ఏటనే స్వగ్రామం లో రామాయణం పై ప్రవచనాన్ని మహా పండితుల ఎదుట చేసి తన సత్తా చాటుకొన్నారు .తర్వాత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి అధ్యక్షతన విజయవాడలో అద్భుత ప్రవచనం చేసి అందర్నీ ఆకట్టుకొన్నారు .ప్రవచనం లో శాస్త్రి గారిదోరణి విలక్షణమైనదని,సర్వోత్కృష్టమైనదని అందరూ ప్రశంసించారు .రామాయణ భారత భాగవతాదులేకాక శ్రీ దత్తాత్రేయ స్వామిపై కూడా ప్రవచనాలు చేశారు .క్రమంగా ఇంతింతై వటు డింతయై ఆన్నట్లు ప్రవచనం లో విశ్వరూపం ప్రదర్శించి ,తమ విరాట్ సత్తాను రుజువు చేసుకొన్నారు ‘
సంస్కృత తెలుగు లోని అష్టాదశ పురాణాలపై గొప్ప ఆధిపత్యం సాధించారు శాస్త్రిగారు .అన్నీ కరతలామలకాలే వారికి .హ్యూమన్ కంప్యూటర్ లాగా ఏదైనా వెంటనే స్ఫురించి వివరించటం శాస్త్రిగారి విశిష్ట లక్షణం .అందుకే వారికి ‘’పురాణ వాచస్పతి ‘’అనే అరుదైన బిరుదు లభించింది .భద్రాచల సీతారామ కల్యాణం ,తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయం లో శాస్త్రి ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానం ,లక్షలాది మందిని ఉర్రూత లూగించింది .ఎందరికో ఒజ్జబంతి గా నిలిచింది .తిరుమల దేవస్థానం తరఫున ఆంద్ర ప్రదేశ ప్రభుత్వ ఆహ్వానం పైనా మల్లాది వారు చేసిన పంచాంగ శ్రవణ౦విలక్షణం ,అద్వితీయం .దూర దర్శనిలో హిందూమతం మొదలైన ఆధ్యాత్మిక అంశాలపై వేసిన ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాలు సమాదరణీయాలు ,,సముచితాలు ,విశేషాలు కూడా .ఇలాంటి కార్యక్రమం ‘’ధర్మ సందేహాలు ‘’గా’’ధర్మ సూక్షాలు’’గా శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ లో కూడా ప్రసారమై వారి దార్మిక వివేచనా దృష్టీ ,తీర్పు లకు ప్రేక్షక జనులు నీరాజన౦ పట్టారు .
తిరుమల తిరుపతి దేవస్థానం వారి పురాణప్రవచన కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసి ,ఎందరికో మార్గదర్శనం చేశారు .శాస్త్రి గారి ప్రవచనాలు రచనల కు ‘’అభినవ వ్యాస ‘’ అనే సార్ధక బిరుదు లభించింది .ప్రవచన ,పంచాంగ శ్రవణాలను నిత్యజీవితం తో అనుసంధించి ,చమత్కారం, హాస్య రస౦ రంగరించి చెప్పటం రమ్యంగా ఉంటుంది . వింటున్న కొద్దీ వినాలనే అనిపిస్తుంది . హనుమాన్ లాగా ఒక వేదాంత విషయాన్నుంచి మరో దానికి దానినుంచి మరో ధర్మసూక్షానికి దూకి మనల్నీ తమతో పాటు దూకిస్తారు .గొప్ప చలన శీలత,తాదాత్మ్య్తత వారి ప్రవచనం లో ఉంటుంది .ఖంగుమనే ఆ కంఠం దేవాలయ ప్రణవ ఘంటానాదమే .అదే వారి ప్రత్యేకత .
మల్లాది వారి శక్తి సామర్ధ్యాలకు తగిన గౌరవ పురస్కారాలు లభించాయి .శ్రీ రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం 2005లో అందుకున్నారు .ఒక లక్ష రూపాయల నగదు ,సన్మానం తోపాటు శాస్త్రిగారికి కానుకగా అందించారు .అమెరికా న్యు జెర్సీ లోని తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారి తరఫున డాక్టర్ వి కే రావు ,డాక్టర్ జ్యోతి రావు దంపతులు మల్లాది శాస్త్రిగారిని సన్మానించి 2 వేల డాలర్ల నగదును కానుకగా అందజేశారు.కానీ శాస్త్రిగారు ఆ భారీ మొత్తాన్ని సద్గురు శివానంద మూర్తి గారు విశాఖలోని భీముని పట్నం లో నిర్వహిస్తున్న ‘’సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ‘’కు అందించి ఆసంస్థ ధార్మిక కార్యక్రమాలకు తోడ్పడిన దొడ్డ హృదయంచాటారు .
శృంగేరి శంకర మఠం వారు ‘’సవ్యసాచి ‘’బిరుదు ప్రదానం చేసి గౌరవించి సత్కరించారు .సద్గురు శివానంద ట్రస్ట్ వారు ‘’ఎమి నెంట్ సిటిజెన్స్ అవార్డ్ ‘’ అందించి ఘనంగా సత్కరించారు .ప్రతి ముఖ్య నగరం సాహిత్య సంస్థ వారిని సన్మానించి గౌరవించింది .శృంగేరి పీఠ౦ శాస్త్రిగారి విద్వత్తును గుర్తించి ఆత్మీయులను చేసుకొన్నది . కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ పద్మ పురస్కారం త్వరలో అందించాలని ,శతాధిక ఆయుస్సుతో ఆరోగ్యంగా శాస్త్రి గారు ఉండాలని కోరుకుందాం ..
శాస్త్రి గారు 1-భారతము ధర్మ సూక్ష్మ దర్శనం 2-కృష్ణ లహరి –స్వేచ్చానువాదం ,రామాయణ రహస్య దర్శిని గ్రంథాలు రచించారు .ఇవికాక రామాయణ రహస్యము ,భాగవత తత్వము కూడా రాశారు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-20-ఉయ్యూరు

