మనకు తెలియని మహాయోగులు—15 29యోగి రాజు -మాదిరాజు వెంకట అప్పారావు -1859-1935

మనకు తెలియని మహాయోగులు—15

29యోగి రాజు -మాదిరాజు వెంకట అప్పారావు -1859-1935

కవి రాజు ,రాజయోగి మాది రాజు వెంకట అప్పారావు గుంటూరు జిల్లా మునుమాక లో కాశ్యపస గోత్రీకులైన నియోగి బ్రాహ్మణ భక్తులు ,నిష్టా గరిష్టులు వెంకమాంబ ,లక్ష్మీ నారాయణ దంపతులకు 23-7-1859 సిద్ధార్ధి నామ సంవత్సర ఆషాఢ బహుళ అష్టమి శనివారం జన్మించాడు .ఉపనయనం జరిగి తొమ్మిదవ ఏటనే వేదాధ్యయనం మొదలు పెట్టాడు .18వయేత తండ్రి చనిపోవటం తో ,ఖమ్మం కోర్టులో వాది ,ప్రతి వాదులకు తెలుగు,ఉర్దూ భాషలలో కాగితాలు రాసిస్తూ ,వచ్చే కొద్ది ఆదాయంతో జీవితం గడిపాడు .తర్వాత చి౦తిరేల పోస్ట్ మాస్టర్ గా ఉద్యోగం వస్తే చేరాడు .అక్కడ వేదాంత విద్యా విశారదుడు రాళ్ళబండి నరసింహ శాస్త్రి గారి తో పరిచయమై ,వేదాంత గ్రంథాలు అధ్యయనం  చేస్తూ , చర్చలు చేసేవాడు .ఉద్యోగం లో అకారణం గా నిందకు గురై ,విచారణలో తాను  నిర్దోషి అని రుజువు అయినా కూడా,విరక్తి చెంది ,తల్లిని మేనమామ ఇంటికి పంపేశాడు .

  నరసింహ శాస్త్రి గారితో కలిసి అప్పారావు హైదరాబాద్ వెళ్లి ,అక్కడ ‘’పీల్ఖానా శంకర ప్రభు ‘’ను దర్శించగా ,ఆయన పంచ ముద్రలు ,అష్టాంగ యోగం బోధించి ,శ్రీశైలం లో నిర్జన ప్రదేశం లో సాధన చేయమని ఆదేశించాడు .శ్రీ శీలం చేసి శ్రీ భ్రమరాంబా ,మల్లికార్జునులను దర్శించి ,నిర్జన ప్రదేశం లో తపస్సు చేశాడు .కొంతకాలం గడిచాక పీల్ఖానా ప్రభువు అప్పారావు ను పిలిపించి ,ఆహారం తినమని చెప్పి ‘’అచల జ్ఞానం ‘’బోధించారు .త్రివిధ దీక్షలు ,త్రివిధ ప్రసాదాలు అనుగ్రహించి ,జీవ బ్రహ్మైక్య సంధానం చేశారు .ద్వాదశీ ,షోడశీ మంత్రోప దేశం చేసి ,పునర్జన్మ లేని మార్గం చూపించారు .సన్యాసం వద్దనీ ,రాజయోగమే మార్గమని బోధించి ,పెళ్లి చేసుకొని ,సంసారం చేస్తూ తల్లికి సంతోషం కలిగించమని హితవు చెప్పారు .అలాగే ఇంటికి వెళ్లి వివాహం చేసుకొని ,మళ్ళీ శంకర ప్రభు గారిని కలిశాడు .ఇంటి పేరును మాధవ రాజుగా ,పేరును  వెంకటేశ్వర దాసుగా మార్చుకోమన్నారు .అప్పటినుంచి మాదిరాజు వెంకట అప్పారావు మాధవరాజు వెంకటేశ్వర దాసుగా పిలువబడ్డాడు .

  శంకర ప్రభు సిఫార్సు చేసి రెవిన్యు ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇప్పించారు వెంకట దాసుకు .ఖమ్మం లోనే ఉంటూ ఉద్యోగం చేశాడు .తన ఆధ్యాత్మిక ప్రగతికి ఉద్యోగం అడ్డంకిగా ఉందని భావించి వదిలేసి ,చెక్ పోస్ట్ లో’’ కరోడ్గిరీ మాస్టర్’’ గా చేరి ,క్రమంగా పదోన్నతులు పొందుతూ ,తిరిగి చింతిరేల చేరాడు .కొన్నాళ్ళకు ఈ ఉద్యోగమూ వదిలేసి గురు సన్నిధి చేరాడు .

  శంకర ప్రభు కటాక్షించి ‘’పరిపూర్ణ జ్ఞానానంద దేశిక ‘’అనే సార్ధక బిరుదు ప్రదానం చేసి మంత్రం దీక్ష ఇచ్చే అధికారం కలిగించారు అప్పారావు కు .1900లో కూతురు పెళ్లి చేసి ‘’భాక్తానంద సాగరం ‘’అనే గ్రంథం రచించాడు .శిష్య బృందం పెరిగారు .వేమవరం లో స్థిరపడి సహజకవి అప్పారావు ,’’జ్ఞానామృతం ‘’,’’సీతా కల్యాణం ‘’పుస్తకాలు అనేక భక్తీ వేదాంత గ్రంథాలు రాశాడు .అద్భుతాలు ,మహిమలు ప్రదర్శించేవాడు.కొంతకాలం తర్వాత పక్షవాతం వచ్చి తగ్గింది .27-8-1935 యువ నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య మంగళవారం సాయంత్రం 4గంటలకు76వ ఏట కవి రాజు యోగిరాజు మాదిరాజు వెంకట అప్పారావు సహస్రారం చేదించుకొని బ్రహ్మైక్యం చెందారు .అప్పటినుండీ నవరాత్రి ఉత్సవాలు భవానీ చంద్ర శేఖర కల్యాణం ,శ్రీవారి ఆరాధనోత్సవాలు నిరంతరం వైభవంగా జరుగుతున్నాయి .

30-పేరంటపల్లి బాలానంద స్వామి -1900-1976

కేరళ రాజకుటుంబం లో బాలానంద స్వామి 1900లో జన్మిఛి ఉండవచ్చు నని భావిస్తారు .ఎప్పుడూ ఏకాగ్రతా సాధనలో ఉండటం వలన విశ్వ మాతసాక్షాత్కారం పొందారు .వివేకాన౦దస్వామి రచించిన ‘’మై మాస్టర్స్ ‘’పుస్తకం చదివి,దివ్యానుభూతి సాధించాలనే లక్ష్యం తో ఏకాగ్రతతో భగవత్ దర్శనం కోసం పరితపింఛి ,పరి వ్రాజకులై దేశ సంచారం చేశారు .1925లో పోచవరం ప్రాంతంలో ఒక రోజు రాత్రినిద్రిస్తున్న ఆయనను  ఆజానుబాహువైన ఒక శ్యామలాంగి తనతో ,పెద్ద పెద్ద చెట్లు ,పొదలు డొంకలు ఉన్న చోటుకు తీసుకు వెళ్లి వదిలేసి  అంతర్ధాన మైంది .తెల్లారి లేచి చూసేసరికిస్వామికి పానవట్టం తో ఉన్న శివలింగం కనిపించింది .ప్రక్కనే ఉన్న సెలయేటిలో స్నానం చేసి ,లింగానికి అభి షేకం చేసి ,అక్కడే ఆశ్రమం నిర్మించి  కొంతకాలం తపస్సు చేశారు  .

   తర్వాత భద్రాచలం వెళ్లి అక్కడి శివాలయం లో నాలుగు నెలలు మౌనంగా తపస్సు చేశారు అనేక సార్లు దివ్యానుభూతి, శబ్ద బ్రహ్మాను భూతి కలిగాయి.కూనవరం దగ్గర మందారం లో శ్రీ రామకృష్ణ పరమహంస సశరీరంగా ప్రత్యక్షమై ,అనేక వేదాంత రాజకీయ,వేదకాలం నాటి సమసామాజిక  ఆదర్శాలు , ధర్మాలు బోధించారు .అదే ఆదేశంగా భావి౦చి పేరంటపల్లి చేరి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ,స్వామి ఆ ఆదర్శాలను ప్రచారం చేస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేయటం ప్రారంభించారు  .ఆశ్రమం లో శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ రామతీర్దుల చిత్ర పటాలను పెట్టి నిత్య పూజ చేసేవారు .

  పేరంటపల్లి ఆశ్రమానికి ‘’శ్రీ రామ కృష్ణ ముని వాటం ‘’అంటారు .12సూత్రాలతో ఆశ్రమ నియమావళి రూపొందించారు బాలాస్వామి .కొంతకాలం ఆశ్రమ౦ వదిలేసి ,పైన ఉన్న కొండపై చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని ధుని వెలిగించి తపస్సు చేశారు . శ్రీ కృష్ణుని  దివ్య దర్శనం లభించి౦ది .ఇంగ్లీష్ భాషలో అరడజను ఆధ్యాత్మిక గ్రంథాలు రాశారు .స్వాతంత్ర్య ఉద్యమానికి తోడ్పడ్డారు .దీన జనులకు చేయూత కలిగించారు. సమాజాభి వృద్దికి తోడ్పడ్డారు .15-1-1976రాక్షస నామ సంవత్సర పుష్య శుద్ధ త్రయోదశి గురువారం ఉదయం 4గంటలకు 76 వ ఏట బాలస్వామి చైతన్యం విశ్వ చైతన్యం లో లీనమైంది .మర్నాడు పేరంటపల్లిలో సమాధి  చేశారు .భక్తియోగి కర్మయోగియై ,ప్రకృతిని సేవించే ప్రకృతి యోగియై ,జ్ఞానయోగియై ,బాలయోగి విశ్వచైతన్యం లో లీనమయ్యారు .ఏటా అక్కడ ఆరాధనోత్సవాలు జరుగుతాయి .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-9-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.