మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-2
ఆంధ్ర భీష్మన్యాపతి సుబ్బారావు ,యుగకర్త కందుకూరి వీరేశలింగం ,ఆంద్ర కేసరి ప్రకాశం ,ఆంద్ర బెర్నార్డ్ షా చిలక మర్తి ,గాంధేయవాది బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం,వందేమాతరం ఉద్యమనాయకుడు గ్రంథాలయోద్యమ సారధి గాడి చర్ల హరి సర్వోత్తమ రావు గార్ల కార్యక్షేత్రమైన రాజమండ్రి లో ,’’ఆఖరి శ్వాస వరకు రాజమండ్రిలోనే ఉంటూ దేశసేవ చేస్తాను’’అని భీష్మ ప్రతిజ్ఞ చేసి నిలుపుకొన్న మద్దూరి అన్నపూర్ణయ్య గారి కార్యభూమి కూడా రాజమండ్రి యే.
పిఠాపురానికి 8మైళ్ళ దూరం లో ఉన్నకొమరగిరి గ్రామం లో మద్దూరి కోదండ రామ దీక్షితులు సంపన్న గృహస్తు, నిరతాన్న దాత .ఒక బాపడు అన్నదానం తో ఇంతటి పేరురుతెచ్చుకోవటం ఏమిటని పిఠాపురం రాజా ఆశ్చర్యపోయి ,మారు వేషాలతో వందమందితో వేళకాని వేళ దీక్షితుల వారింటికి భోజనానికివచ్చాడు .అందర్నీ సాదరంగా ఆహ్వానించి ,అప్పటికప్పుడు నాలుగు బస్తాల బియ్యం తెప్పించి ,గాడిపొయ్యి మీద క్షణాలలో వంట చేయించి అందరికి తృప్తిగా భోజనాలు పెట్టించాడు .భోజనానంతరం రాజు తనను తాను పరిచయం చేసుకొని ,తక్షణం దీక్షితులుగారికి కొంత భూమి ఈనాము గా ఇచ్చినట్లు చెళ్ళపిళ్ళవారు తమ కథలు –గాథలు లో చెప్పారు .దీక్షితుల గారి పరమ యోగ్యతను గుర్తించి రాజు ఆయన్ను సాదరం గా ఆస్థానానికి పిలిపించి సత్కరించాలనుకొన్నారు .దీక్షితులు గారు వెళ్ళే సరికి రాజు స్నానం చేస్తున్నాడు .తడి బట్టలతోనే వచ్చి ఆహ్వానింఛి తర్వాత గౌరవించాడు .అలాంటి దీక్షితుల గారి స్వయానా మనవడే మన మద్దూరి అన్నపూర్ణయ్య గారు .
మద్దూరి జయరామయ్య రాజమ్మ దంపతుల నలుగురు సంతానం లో పెద్దవాడు కోదండ రామ దీక్షితులు ,రెండవవాడు బుచ్చి వెంకయ్య ,మూడు అన్నపూర్ణయ్య ,నాలుగు కృష్ణమూర్తి .అన్నపూర్ణయ్య కొమరగిరిలో 20-3-1899 పుట్టారు .చదువు కొమరగిరి ,పెద్దాపురం లో జరిగింది .1911జూన్ లో కాకినాడ కాలేజి హైస్కూల్ లో ధర్డ్ ఫారం ఎ సెక్షన్ లో ,విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సి సెక్షన్ లోనూ చేరి చదివారు .పూర్ణయ్యగారి పెద్దన్న ఈ కాలేజిలోనే ఇంటర్ చదివేవాడు .ఆ సంవత్సరం డిసెంబర్ 11న అయిదవజార్జి రాజు పట్టాభి షేక మహోత్సవం కాకినాడలో వైభవం గా జరుపుతున్నారు .విద్యార్ధులు ‘’శశిరేఖా పరిణయం ‘’నాటకం ప్రదర్శించాలనుకొన్నారు .పూర్ణయ్యగారి అన్న దీక్షితులు రఘుపతి వెంకట రత్నం గారి ప్రియ శిష్యుడు .ఆయన శశిరేఖగా తమ్ముడు,అల్లూరి రామరాజు చెలికత్తెలుగా వేషాలు వేశారు .వీరిద్దరూ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. అల్లూరి నారద పాత్రకూడా గొప్పగా పోషించి మధుర కంఠంతో పద్యాలు శ్రావ్యంగా పాడి అందర్నీ మెప్పించాడు .ఈ వేడుకలలోనే నాయుడుగారికి ‘’రావు బహదూర్ ‘’బిరుద ప్రదానం జరిగింది .పూర్ణయ్య ఆబిరుదు తనకే వచ్చినంతగా సంతోషిస్తే ,అల్లూరి ముభావంగా ఉన్నాడు .విద్యార్ధులందరికీ జార్జి బొమ్మతోపాటు జర్మన్ సిల్వర్ పతకాలు కూడా ఇచ్చారు .ఏకంగా అయిదు మెడల్స్ సాధించిన అన్నపూర్ణయ్య అల్లూరికి ఇస్తే ,ఆగ్రహం తో విసిరి అవతలపారేసి ‘’పిచ్చోడా !ఈ పతకం మన బానిసత్వానికి చిహ్నం రా ‘’అని ,అక్కడి నుంచి వెళ్ళిపోయాడు .
చాలా సేపటికి తేరుకొన్న అన్నపూర్ణయ్య సీతారామ రాజు సాహచర్యం తో దేశ భక్తి ప్రపూర్ణుడయ్యాడు . దేశ సేవకు బి.ఎ .డిగ్రీ అవసరం లేదన్నాడు అల్లూరి .పూర్ణయ్యమాత్రం డిగ్రీపొంది లాయర్ కావాలనుకొన్నాడు .స్వేచ్చా జీవనానికి న్యాయవాద వృత్తి భేష్ అనుకొన్నాడు .తాను త్వరలో సన్యాసిగా మారి దేశమాతకు అ౦కిత మౌతానని అల్లూరి చెబుతూ ఉండేవాడు .అర్ధాంతరంగా చదువుమానేసి అల్లూరి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు.
ఒక రోజు అన్నపూర్ణయ్య రైలులో పిఠాపురం నుంచి కాకినాడకు బయల్దేరాడు .టికెట్ కౌంటర్ దగ్గర ‘’అన్నపూర్ణయ్యా ‘’అనే పిలుపు వినిపించి ,తననుకాదేమో అనుకొన్నాడు. మళ్ళీ ఆపిలుపు వినిపిస్తే ,అటుకేసి తిరిగి చూస్తే సన్యాసి వేషంలో చిన్ననాటి స్నేహితుడు అల్లూరి సీతారామ రాజు కనిపించి ఆశ్చర్యపోయాడు .ఏమిటీ వేషం ‘’?అని అడిగితె ‘’చిన్నప్పుడే చెప్పాకదా ‘’అని సమాధానం .తనదగ్గర ఒక మహాపురుషుడు ఉన్నట్లు మహా సంబరపడిపోయాడు పూర్ణయ్య .తనతో కాకినాడ రమ్మన్నాడు .ఆ అవకాశం లేదన్నాడు రాజు .ఎక్కడికి ప్రయాణం అని అడిగితె ‘’నా జీవితం ప్రజా సేవకే అంకితం అని ఆనాడే చెప్పానుకదా ‘’అన్నాడు అల్లూరి .’’అనిబిసెంట్ గై హోం రూల్ లో చేరతారా ?’’మద్దూరి ప్రశ్న .’’నా గురించి క్రమంగా వింటావులే ‘’అని చెప్పాడు రాజు .ఇద్దరూ ఎవరి ప్రయాణం వారు సాగించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-10-20-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్

