శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం )

శ్రీ ముఖలింగేశ్వరశతకం -2(చివరి భాగం )

మొదటిపద్యం –‘’శ్రీ కంఠ రజిత గిరినివాస విశ్వేశ –లోక రక్షక దేవశోకనాశ-మందరాచలదీర మహిత దివ్యప్రభా –ఫాలలోచన కోటి భాను తేజ –సోమ సూర్యాగ్ని సుశోభిత నేత్ర ని-గమగోచర శశా౦క ఖండ మకుట –హిమశైల జాదిప హేమాద్రి ధన్విత్రి-పురనాశన త్రిశూలి భుజగ హార-భక్త జన రక్షనిఖిలసంపత్సమేత-పూత చారిత్ర మమ్మిల బ్రోవుమయ్య –ముక్తి దాయక సర్వేశ భక్త వరద –అంగభవ భంగ శ్రీ ముఖ లింగవాస ‘’

3-శ్రీముఖ లింగాన శీతాంశు ధర యమ్మ –వారాహి తోడుగ వరలినావు’’ –

6-వామదేవుని యజ్ఞభాగంబు గైకొన –వేంచేసి గాంధర్వ బృందమెల్ల-కండకావరమున కన్నుగానక భిల్ల –వనితల జెరచిరి వక్రబుద్ధి-వామదేవుడు వారల శపియింప-భిల్లులై తిరిగిరి భీతి గొనుచు –ద్వాపరా౦తము న౦దు వారాహి దేవితో –ఇప్ప చెట్టు మొదల ఇచట వెలసి –ఆననాబ్జము లింగాన యమర దాల్చి –శాపమంతము జేసితి   శైల చాప ‘’

12-‘’ఒక వంక నెలవంక నకలంకముగదాల్చి –మకుట కిరణజాల మొకటి వెలుగ –దక్షిణ కరమందు దగ పుర్రె ధరియించి –దాపట బూని సుదర్శనంబు-గళసీమ కుడిప్రక్క కంకాళములు వేర-ముత్యాల హారంబు మురుపు సూప –ఫాలమందును నేత్ర పద్మ౦బు బొలుపార – వక్షమందున కౌస్తుభంబు మెరయ –హరిహరాద్వైతము దెలుప నాలయమున –వెలుగు నీ మూర్తి నే గొల్చి వినుతి జేతు’’

అంటూ స్వామి హరిహరాద్వైత రూపాన్ని కళ్ళముందుకట్టించారు కవి .

15-చిత్ర సేనుడు భార్య ‘’చిత్తని’’యామోద-మును బొంది చిత్కళ మనువు గొనియె-అన్ని కాలములందు నమరంగ బూచెడి-ఇప్ప శాఖల నిచ్చె నిరువురకు ‘’చిత్కళ భక్తికి బంగారు పుష్పాలిచ్చి ,చిత్తిని చెట్టు మొదలంటా ఖండించగా ముఖ రూపాన్ని పొందాడు స్వామి .వేదముఖోద్గత నాలుగు వేదాలు ,వ్యాకరణ౦  మొదలైన షడంగాలు  విజ్ఞాన వార్తాది విద్యలు సర్వ శకున ధర్మ సాముద్రికాలు ,దాతు పదతద్ధితాలు చదివితే బుద్ధి పెరుగుతుంది కాని-‘’కైవల్యపదము గాంచ గలడె- నీదు నామ స్మరణ లేక నిగమవేద్య’’అని చదువులు ముక్తిమార్గం చూపించవన్న ఎరుక తెలియజేశాడు కవి .

45-జయ భూత నాథాయ జయ చంద్ర చూడాయ –జయ నీల కంఠాయ జయము జయము —జయ వేద వేద్యాయ జయ కృత్తినివాసాయ –జయ నాగ భూషాయ జయము జయము ‘’

  ఈ సీసాలు శ్రీనాథ మహాకవిని ఆయన శివభక్తి తత్పపరత ను గుర్తుకు తెస్తున్నాయి .

59-ఓంకార మనువుగా యురగభూషణు మంత్ర-పఠనము జేయునవియె వక్త్రములు –నిష్టమై భస్మమ్ము నిండార బూసిన- తనువు తర్కి౦ప గా తనువు సుమ్ము ‘’పద్యం పోతనగారి ‘’కమలాప్తు నర్చి౦చు కరముకరము ,శ్రీనాథు  వర్ణించుజిహ్వ జిహ్వ ‘’పద్యానికి కు సాటిగా పోటీగా ఉంది .

కాటుక కొండను సముద్రంలో కలిపి సిరాచేసి ,కల్ప వృక్ష శాఖలు ఖండించి కలాలు గా చేసి విద్యలరాణి వాణి లోకాలున్న౦తకాలం రాయలనుకొన్నా ‘’వ్రాయ దరమే ‘’అంటారు కవి శంకరాచార్య స్పూర్తితో .శర్వుడుగా జలమూర్తి ,భవనామం తో వసుధ , ఉగ్రనామంతో హుత భుక్ అంటే అగ్ని ,మహాదేవ నామం తో అబ్జుడు ,భీమనామం తో వ్యోమకేశుడు ,రుద్రనామం మారుతుడు ,పశుపతి నామంతో యజ్ఞపురుషుడు.ఈశాన నామంతో సూర్యుడు ,పంచభూతాలు ఇన శశి పావకులుగా  వెలిగే అష్టమూర్తి శివుడు అని చక్కగా వర్ణించారు .ఓంలో నాథుడు,అ ఉ మలతో త్రిగుణా త్మకుడు వేదత్రయం ,విశ్వకర్తలు జాగ్రత్ స్వప్న సుషుప్తులు,ప్రాజ్ఞ తైజస విశ్వ పరమ రూపాలు శరీర త్రయం వర్ణాలకు ఆద్యుడు ఒట్టిఓంకార రూపుడు శివమహా దేవుడు అని తత్వమంతా విప్పి చెప్పారు 70వ పద్యం లో .90వ పద్యంలో గాలికి గంగకు అగ్నికి భూమికి శరీర౦లొని  రక్తమాంసాలు  ,పాలకు సూర్యునికి ప్రకృతికి వృక్షాలు లతలకు పూలకు కులమేది అని తార్కిక ప్రశ్నలు  సంధించి ‘’కుసుమ కోదండ హర  నీకు కులము గలదె-గుణము గొప్పది గావలెకులములేల ‘’అని మనకు చెంప దెబ్బలు వాయిస్తాడు కవి .

100-నీదు లింగము గననీలలోహిత రాయి –శంకరా నీ సతి శైలతనయ –నీహార శైలుండు నీ మామ బాంధవ –వర్గంబు పరికింప భర్గ శిలలు –భవదీయ చాపము పశుపతీ శిల గదా-‘’మెడలో పుర్రెలమాల ,చేతిలో పుర్రె ,ఉన్న నీవుమాత్రం ‘’కారుణ్య వత్సలుడవు ‘’అంటాడు చమత్కారంగా కవి .

108- వ పద్యంలో తన గురించి చెప్పుకొన్నాడు .కోమర్తి గ్రామవాసి .హరితస గోత్రం .పేరు రమణయ్య .తండ్రి మాధ్వుడు మహిత యశ శ్శాలి ,సత్వ గుణ సంపన్నుడైన గ్రామాధికారి నరసింగ రాయడు .తల్లి రమణమ్మ . వ్యక్తిగా తీర్చి దిద్దినవారు చొప్పల్లి జగన్నాథ స్వామి ,తెలుగు భాషా యోష తీరు తెన్నులు చెప్పి అభిలాష కలిగించినవారు గంటి నరసింహ శాస్త్రి .పద్యం అల్లటం కర్రి సుబ్బారావు ,రాఘవ పాండవీయం బోధించినవారు బంకుపల్లి సూర్యనారాయణ శాస్త్రి,రఘువంశం లక్ష్మణ శాస్త్రి  గార్లు బోధించారు. ఈ విధంగా పరమభక్తాగ్రేసరకవి శ్రీ మొసలికంటి వెంకటరమణయ్య గారినీ వారి’’శ్రీ ముఖ లింగేశ్వర శతకం’’ను పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది . తెలుగు లెక్చరర్ అవటం సంస్కృతాంధ్రాలలో మంచి పట్టు ఉండటం ,శాస్త్ర పరిచయం లోతుగా ఉండటం తో శతకరచన  శ్రేష్టంగా కనిపిస్తుంది ..

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.