ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -1
కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో కల్చరల్ చానల్ సహకారం తో అక్టోబర్ 17,18తేదీలలో సాయంత్రం 5-30గం.లకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వినూత్న ప్రయోగంగా ‘’ ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం ‘’అనే సాహిత్య కార్యక్రమం వివిధ రచయితలతో నిర్వహించింది .17వ తేదీ సాయంత్రం సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ ప్రారంభోపన్యాసం చేసి కార్యక్రమ నిర్వహణ ఉద్దేశ్యం వివరిస్తూ ,కరోనా కాలం లోనూ కవులు రచయితలూ అవిచ్చిన్నంగా రచనలు చేసి సాహితీ ఫలాలు అందించారానీ ,వారందరినీ ఇలా కలుపుతూ చేబట్టిన ఈ ప్రక్రియ ఫలప్రదం కావాలని కోరారు .సంఘ ప్రధాన కార్య దర్శి శ్రీ పూర్ణ చ౦ద్ లక్ష్య ప్రస్తావన చేస్తూ ,అందరూ తమకిచ్చిన 10నిమిషాల వ్యవధిలో తమ సాహితీ కృషి వివరించాలని ,ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించి జయప్రదం చేయమని కోరారు .ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘’సాధారణం గా నాకు ఖాళీ గా ఉండే సమయం దొరకదు .ఈ కరోనా కాలం లో పుష్కలంగా సమయం తీరక దొరికి ఆరు పుస్తకాలు రాసి ముద్రించాను ,మరికొన్నిటికి కావలసిన ముడి పదార్ధం సేకరి౦చు కొన్నాను .’వలస కార్మికుల దయనీయగాథ ప్రభుత్వాల నిర్లక్షం నన్ను బాగా కలచి వేసింది .వాటిపై సుదీర్ఘ నవల రాస్తున్నాను ‘’’అన్నారు .శ్రీ విహారి ‘’ఎన్నెన్నో కవితలకు, కవితా, కథా సంకలన సంపుటాలు సమీక్షించా. ముందు మాటలు రాశాను .ఎప్పటినుంచో రాయాలనుకొంటున్న ‘’జగన్నాథ పండిత రాయల జీవితం ‘’పై ఎవరూ రాయని విశేషాలతో నవల రాశాను .ఇది నాకు చాలా సంతృప్తి నిచ్చింది .’’అన్నారు .శ్రీ దీర్ఘాసి విజయభాస్కర్ ‘’నేను శ్రీకాకుళం జిల్లా వాడిని .అక్కడి కొన్ని కులాల పేర్లు,ఇంటి పేర్లు ఎవరికీ తెలియవు .వలస కార్మికులు అనే పదం నాకు నచ్చలేదు .అలాయితే కలెక్టర్లు జడ్జీలు మొదలైన వారంతా దేశం లో ఏదో ప్రాంత౦ లో జన్మించి వివిధ రాష్ట్రాలలో విధి నిర్వహణ చేస్తున్నారు. మరి వారికి వలస పదం వర్తింప చేయగలమా ?వలస కార్మికులు దేశ కార్మికులు. దేశాని కంతటికీ చెందినవారు .కనుక గౌరవంగా ‘’జాతీయ కార్మికులు ‘’అందా౦ .నేను కూడా మా ప్రాంత విషయాలపై సమగ్ర నవల రాస్తున్నాను ‘’అన్నారు . ప్రాచార్య శలాక రఘునాథ శర్మ ‘’భారతం అనువాదం తో రోజూ కనీసం ఆరు గంటలు శ్రమిస్తున్నాను .ఆర్ష విజ్ఞానం అందరికీ వెన్నముద్ద ల్లాగా అందించాలని నా తలపు .’’అన్నారు .శ్రీ రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి ‘’కడప బ్రౌన్ లైబ్రరీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ,ఎందరో రచయితలను వెన్నుతట్టుతూ వారి రచనలు ప్రోత్సహిస్తున్నాను .నిరంతరం సాహిత్య జీవనం లోనే గడుపుతున్నాను ‘’అన్నారు .శ్రీ రసరాజు తాను రాసిన ఘజల్స్ గానం చేశారు .శ్రీ రావి రంగారావు అమరావతీ సాహితీ మిత్రుల సమావేశాలు వివరిస్తే ,ఆచార్య మాడభూషి సంపత్కుమార్ ‘’చెన్నై లో తమ విశ్వవిద్యాలయం లోని తెలుగు శాఖ పని తీరును ,తన పదవీ విరమణ విశేషాలు అప్పుడు తమ విద్యార్ధి బృందం నిర్వహించిన జూమ్ అభినందన సభ విశేషాలు కళ్ళకు కట్టించారు .శ్రీ ఈమని శివనాగిరెడ్డి ‘’కరోనా బారి పడి,ఆయుర్దాయం దక్కించుకొన్న అదృష్టవంతుడిని .ప్రక్కమీద ఉంటూనే చాలాపుస్తకాలు చదివాను .మూడుపుస్తకాలు రాసి ప్రచురించాను ‘’అన్నారు .శ్రీ నటరాజ రామకృష్ణ గారి ముఖ్యశిష్యులు డా.సప్పా అప్పారావుతమ ఆంధ్రనాట్య రచనలు సవివరంగా తెలియజేశారు శ్రీ పివి సివి ప్రసాదరావు, డా సాధనాల వెంకటస్వామి నాయుడు, శ్రీ యలవర్తి రమణయ్య శ్రీ ఈతకోట సుబ్బారావు ,శ్రీ కిలవర్తి దాలి నాయుడు కూడా తమ రచనా ప్రక్రియలు వివరించారు .నాకు గుర్తున్న౦త వరకు పై రచయితలు చెప్పినదాని సారాంశమే చెప్పాను అంతకు మించి కూడా వారు చెప్పారు .అందరితో పాటు నేను కూడా 10 నిమిషాల వ్యవధిలో నా సాహితీ కృషి తెలియ జేశాను .కాని నేను చెప్పాల్సింది చాలా ఉ౦దికనుక పూర్తిగా దాన్ని మీకు ప్రత్యేకంగా వివరిస్తాను .అందరూ చక్కగా సమయపాలన పాటించి జయప్రదం చేశారు . ఒక నావెల్ ప్రోగ్రాం నిర్వహించి జయప్రదం చేసినందుకు అందరూ అభినందనీయులే .సరిగ్గా సాయంత్రం 5-30కి ప్రారంభమైన కార్యక్రమం రాత్రి 9గంటలకు అంటే మూడున్నర గంటలు సాగింది .ఒకరికొకరు పరిచయమయ్యారు .ఎవరి కృషి ఏమిటో తెలుసుకొన్నారు . వీరిలో ఒకరిద్దరు తప్ప అందరూ కరోనా కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని సాహితీ వ్యవసాయం చేసి ,పుష్కలంగా పంట పండించిన వారే .అందరూ అభినందీయులే .
రెండవ రోజు 18వ తేదీ ఆదివారం కార్యక్రమ౦లో శ్రీ భువన చంద్ర ,డా ఆర్ అనంత పద్మనాభరావు ,డా తుర్లపాటి రాజేశ్వరి ,డా శిఖామణి ,ఆచార్య బూదటి వెంకటేశ్వర్లు శ్రీ అట్టాడ అప్పలనాయుడు ,శ్రీ యక్కలూరి శ్రీనివాసులు ,శ్రీమతి తేళ్ళ అరుణ ,శ్రీ అంబళ్ళ , జనార్దన్ ,శ్రీ కరీముల్లా ,శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ సరికొండ నరసింహరాజు ,శ్రీమతి గుడిపూడి రాదికారాణి,శ్రీ విజయ చంద్ర ,శ్రీ కలిమిశ్రీ ,డా ,నూనె అంకమ్మారావు లు పాల్గొన్నారు .మొత్తం మీద పాతతరం ,మధ్యతరం ,కొత్తతరం కవులు రచయితలు ,కవయిత్రులు అందరికీ సరైన స్థానమే లభించి అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు .ఈ రెండోరోజు కార్యక్రమం నేను మా శ్రీ సువర్చాలాన్జనేయస్వామి దేవాలయం లో శరన్నవ రాత్రుల ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొనటం వలన, వీక్షించలేక పోయాను .ఇందరు మహానుభావుల దర్శనం, వారి అమృతవాక్కులు వింటూ , చూసే అదృష్టం కోల్పోయానని బాధగా ఉన్నది .
రెండవ భాగం లో’’ కరోనా కాలం లో నా సాహిత్య కృషి ‘’సమగ్రంగా తెలియ జేస్తాను .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-20-ఉయ్యూరు

