ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్ -2
వ్యష్టి సత్యాగ్రహం రోజుల్లో పట్వర్ధన్ ,అశోక్ మెహతా జైలు జీవితం గడుపుతూకలిసి ‘’కమ్యూనల్ ట్రయాంగిల్ ఇన్ ఇండియా ‘’అనే ఉద్గ్రంధం రాశారు .మహాదేవ దేశాయ్ దీన్ని మెచ్చారు క్రిప్స్ రాయబారం విఫలమయ్యాక గాంధీ ‘’క్విట్ ఇండియా ‘’ఉద్యమం మొదలు పెట్టాడు .1942ఆగస్ట్ 7 న బొంబాయి కాంగ్రెస్ మహా సభలలో అంతిమ స్వాతంత్ర్య సమరం చేయాలని నిర్ణయించారు.చివరి హెచ్చరిక ఇవ్వటానికి గాంధీకి సర్వాధికారాలు ఇస్తూ కాంగ్రెస్ తీర్మానించింది .ఆయన ఉద్రేకం తో ఊగిపోయి ప్రసంగింఛి ‘’డు ఆర్ డై’’నినాదం ఇచ్చాడు .తొమ్మిదో తారీకున జరిగే కాంగ్రెస్ కమిటీలో తీర్మానం ఆమోదించాలి . 8రాత్రికే తెల్లప్రభుత్వం భయపడి గాంధీని కార్యవర్గ సభ్యులను అరెస్ట్ చేసి కనిపించని చోటికితీసుకు వెళ్ళింది .
దిశా నిర్దేశం చేసే వారు లేక ప్రజలు వెతకసాగారు .విషవాయువు లాఠీచార్జి ,కాల్పులతో ప్రభుత్వం భీభత్సం సృష్టించింది .గాంధీ ఆదేశాన్ని అనుసరించి ప్రభుత్వం తో పోరాటానికి ప్రజలు సిద్ధపడ్డారు .అరెస్ట్ కు ముందు గాంధీ దగ్గరకు బాలకృష్ణ శర్మ వెళ్లి ‘’మాకిచ్చిన కార్యక్రమం ఏమిటి ??’’అని అడిగాడు .గాంధీ కోపం తో ‘’నా ఉపన్యాసం అంతా కార్యక్రమమే .దాన్ని అర్ధం చేసుకోలేని వాళ్ళను నమ్మి యుద్ధం ఎలా చెయ్యను ?’’అన్నాడు .దీనినే శిరోధార్యంగా భావించి ప్రజలు ఉద్యమించారు .దేశమంతా విప్లవజ్వాలలు ఎగసి పడ్డాయి .ఎక్కడ చూసినా స్వాతంత్ర్య వీరుల రక్త ప్రవాహాలే .బొంబాయిలో ఏడు రోజులు ప్రభుత్వమే లేదని పించారు .మధ్య రాష్ట్రాలలో ఆరుజిల్లాలు ఉత్త్రరాష్ట్రాలలో 13జిల్లాలు ,ఆంధ్రా అస్సాం బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు బ్రిటిష్ ప్రభుత్వ అధికారానికి ప్రజలు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు .
ఆగస్ట్ 9నుంచి 1942డిసెంబర్ చివరి వరకు ప్రభుత్వ దౌర్జన్యకాండల ఫలితాలు సెంట్రల్ అసెంబ్లీలో హో౦ మెంబర్ వివరాలు ప్రకటించాడు .అరెస్ట్ అయినవారు -66,229,జిల్లాలో మగ్గుతున్నవారు -18,000.మిలిటరీ పోలీస్ కాల్పుల్లో చనిపోయినవారు -940,తుపాకీ గాయాలైనవారు -1630.మిలిటరీ సాయంకోరిన చోట్లు -60,తుపాకీ కాల్చవచ్చిన సంఘటనలు -538,విమానాలద్వారా ప్రేల్చిన ప్రదేశాలు -5.
జయప్రకాశనారాయణ ,అచ్యుత పట్వర్ధన్ ,రామమనోహర్ లోహియా ,అరుణా ఆసఫాలీ మొదలైన వారు రహస్య మార్గాలద్వారా విప్లవాన్ని సాగిస్తూ ,ప్రజల ఉద్రేకాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపారు .ప్రభుత్వం కంటపడకుండా పట్వర్ధన్ నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం .పట్వర్ధన్ నాయకత్వం లో మహారాష్ట్ర సతారా జిల్లాలో ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజలే ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టించారు .రహస్యంగా అచ్యుత్ ‘’క్విట్ ఇండియా ‘’పత్రిక లను రాసిదేశామంతా వెదజల్లాడు .అచ్యుత్ లోహియా ,ఉషా మెహతా రహస్య రేడియో ద్వారా దేశమంతా ప్రచారం చేశారు .చివరికి ప్రభుత్వం కనిపెట్టి పట్టేసింది .జయప్రకాష్ లోహియాలను అరెస్ట్ చేసింది .పట్వర్ధన్ ఉషాలిద్దరూ ప్రభుత్వం కన్ను గప్పుతూ ,రహస్య కార్యకలాపాలు చేస్తూ ప్రజా మార్గదర్శకత్వం చేశారు .విసిగి వేసారిన ప్రభుత్వం వీరిపై ఉన్న అరెస్ట్ వారెంటు ఉపసంహరించుకొన్నది .
అజ్ఞాతవాసం లో పట్వర్ధన్ చేసిన మహాకార్యం సతారా జిల్లాలో బ్రిటిష్ ప్రభుత్వ కూకటి వ్రేళ్ళను పెకలించిపారేసి ప్రజాప్రభుత్వం అనే ప్రతి సర్కార్ లేక పారలల్ గవర్నమెంట్ నిర్మించి పాలించటమే .చత్రపతిశివాజీ స్పూర్తితో ఆయన అలా నిర్వహించాడు . రెండేళ్ళు అయ్యాక అకస్మాత్తుగా మిలిటరీ గుంపులు సతారా చేరి భీభత్సం సృష్టించి ప్రజలను భయభ్రాంతులను చేసి సతారా జిల్లా వశపరచుకొన్నారు .కామ్రేడ్ సోలీ బాట్లే వాలా ఆజాద్ హింద్ ఫౌజు న్యాయ విచారణకు కావలసిన భోగట్టా సేకరించటానికి వచ్చి ,అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన హి౦సా దౌర్జన్యాలు తెలుసుకొని పత్రికా ముఖంగా ప్రకటించాడు .ఇన్ని చేసినా ప్రజల స్వాతంత్ర్య కాంక్ష పెరిగిందేకాని తగ్గనే లేదు .గొప్ప సంచలనం ఆగస్ట్ ఉద్యమం కలిగించింది .దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అన్ని పార్టీలు హర్షించాయి .
అచ్యుత్ అజ్ఞాతం లో ఉన్నప్పుడు ఒక వింత సంఘటన జరిగింది .ఆయన్ను పట్టిస్తే 5వేలరూపాయలు బహుమానంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది .ఆబహుమతి పొందాలనే తహతహతో ఒక పోలీస్ ఆఫీసర్ పోలీసులతో సతారాజిల్లలో అనుమానమున్న గ్రామాలన్నీ వెతికి వెతికినిరాశ తో వెనక్కి వెళ్లిపోతుంటే ,అతడు ఎక్కిన రైలులోనే పట్వర్ధన్ ప్రయాణించాడు .ఆ రాత్రి ఆపోలీసాఫీసర్ పక్కనే కూర్చున్నాడుకూడా .కానీ గుర్తించలేక దిగులుమొహం తో పూనాలో దిగి వెళ్ళిపోయాడు .ఇలాంటి సంఘటనలు కధలుగాధలుగా ఆనాడు చాలా చెప్పుకొనేవారు .
వైస్రాయి వేవెల్ సిమ్లా సమావేశ సన్నాహం లో ఉంటె ,పట్వర్ధన్ సతారలో ఒక బహిరంగ సభలో ఉపన్యాసం చేశాడు .అజ్ఞాతం లో ఉంటూ బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యాడు .1945డిసెంబర్ 11న కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమై ఆగస్ట్ ఉద్యమం ఆజాద్ హింద్ ఫోజు యడల అవలంబించైనా వైఖరి వలన వైఖరి కాంగ్రెస్ అహింసా సిద్ధాంతంపై అపోహలు కలిగాయని తెలుసుకొని నివారించేప్రయత్నం లో ఒక తీర్మానం చేసింది .సమావేశం లో పట్వర్ధన్ కాంగ్రెస్ పెద్దల వైఖరిని తీవ్రంగా విమర్శించి అచ్యుత్, అరుణా కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడుమౌలానా ఆజాద్ కు ఒక పెద్ద లేఖ రాసి అంద జేశారు .దీనికి కాంగ్రెస్ చరిత్రలో గొప్ప ప్రాధాన్యత లభించింది .ఆ లేఖలోని ముఖ్య విషయాలు ‘’కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ తర్వాత ప్రజలకు నాయకత్వం లేక ఎవరికి తోచినట్లు వారు నడిచారు .మేము అజ్ఞాతంలో ఉంటూ సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసి మూడేళ్ళుపాలించాం .ప్రజలు మాకు మద్దతునిచ్చారు .మాదీ అహింసా విధానమే .పోలీసులు యెంత దౌర్జన్యం చేసినా మేము పోరాడామేకాని లొంగి పోలేదు .ప్రజా సంఘటన శక్తి అపారం కాగా ,మేము మోతాదు లను బుద్ధిపూర్వకంగా ప్రయోగించాం .లేకపోతే శిక్షణ లేని ఆగస్ట్ ఉద్యమ మహా సంరంభం కొన్ని వారాల్లోనే దిగజారి పోయేది .మా అమోఘ నిశ్చయానికి మా అంతరాత్మ సాక్షి .దూర ప్రాంతాలవారికీ వార్తలు అందించగలిగాం .కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఒక రాష్ట్రంలో సహాయనిరాకరణ ఉద్యమం జయప్రదంగా చేశాం .కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అనే తోక కాంగ్రెస్ శరీరాన్ని ఆడిస్తోందని గ్రహించండి .కాంగ్రెస్ ప్రజా భిమానం ఉప్పెనలో ఉంది .దీనికి మీ దగ్గర నివారణ లేదు పరిపాలనా విధానం గురించి ప్రనణాళికలేదు మీకు .సత్యాగ్రహం విఫలమైనా ఎన్నికల విజయం పంచుకొన్నాం .శాసన సభలు రాజీమార్గానికి విఫలమైనప్పుడు ,నిర్మాణకార్యక్రమం ఆదర్శంగా మిగిలిపోయినప్పుడు ,ముఖ్య వ్యవస్థ నిరోధక శక్తి తగ్గుతున్నప్పుడు ,జైలుకు పోవటం నామమాత్రం అయినప్పుడు ,కాంగ్రెస్ విషమ పరిస్థితి ఎదుర్కోక తప్పదు.ఈ ప్రశ్నలన్నీ మమ్మల్ని బాధించాయి గాంధీ అభిప్రాయానికి భిన్నంగా కాంగ్రెస్ చాలా సార్లు అహింసా తీర్మానం చేసింది .1940జులై 7న కాంగ్రెస్ అధ్యక్షుడు ‘’కాంగ్రెస్ ప్రపంచ శాంతి స్థాపించే సంస్థకాదు రాజకీయ సంస్థ .అహింస విషయంలో గాంధీతో నడవలేదు .అరాచకం ,విదేశ దాడి పెరిగితే హింసా విధానం పూర్తిగా విడవగలమని మాలో చాలా మంది అనుకోము ‘’అన్న విషయం గుర్తుందా ?గత సంఘర్షణల్లో పాల్గొన్న వారనేకులు ఇపుడు నోరు విప్పలేకపోతున్నారు .మేమేదో తప్పుచేశామనే తీర్మానం మాకు బాధ కలిగిచింది .మేము దోషం చేశామని అనుకోవటం లేదు .మేముకోరేది ఆత్మగౌరవ సంర్ధనం కాదు .మా దృక్పద గణ్యతను సమర్ధించమని కోరుతున్నాం .మాకోరికను మీరు హర్షించగలరని భావిస్తున్నాం.’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు

