సోమగిరి కోదండరామ శతకం

సోమగిరి కోదండరామ శతకం

చిత్తూరు జిల్లా శశిగిరి పుర నివాసి శ్రీ గండ్లూరి చంగల్వ రాయ కవి రాసిన ‘’సోమగిరి కోదండ రామ శతకం ‘’ను శ్రీ చేగు నారాయణ శెట్టి ,శ్రీ పార్లపల్లి పాపి రెడ్డి గార్ల ఆర్ధిక సాయం తో చిత్తూరులోని శ్రీ వెంకట శివారెడ్డి గారి శ్రీ శారదా ముద్రాలయం  లో 1914న ప్రచురింపబడింది .వెల అణన్నర –(0-1-6).

  పీఠిక లో ఆలయ చరిత్ర వచనంగా రాశాడు .విజయనగర సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలకాలం లో చంద్రగిరి పురం లో విశ్వామిత్ర  మహర్షి చే ప్రతిష్టితమైన అతి ప్రాచీన శ్రీ కోదండ రామ దేవాలయం ఉండేది .అందులో శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలు మహా సుందరమైనవి .చాలా కాలం మహా వైభవంగా స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ కళ్యాణాలు దిగ్విజయంగా జరిగాయి కొంతకాలానికి  లక్ష్మణ స్వామి  విగ్రహం చోరీ కి గురైంది .క్రమంగా ఆలయమూ శిదిలమైంది .స్థానిక భక్తులలో కదలిక వచ్చి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలనే సంకల్పం కలిగి 1912 డిసెంబర్ లో నూతనాలయ నిర్మాణం చేసి ,నారాయణ శెట్టి ,పర్లే పాపిరెడ్డి గారు పూనుకొని లక్ష్మణ స్వామి విగ్రహాన్ని విశ్వకర్మతో చేయించి యధా విధిగా మూర్తులను పునః ప్రతిష్టించి  ఎన్నేళ్ళు గానో జన హృదయాలలో ఉన్న కోరిక తీర్చారు .ఈ చరిత్రను మన కవి గారు పద్య కావ్యంగా రాయాలని మనసులో అనుకోగానే ,మిత్రులు ప్రోత్సహించి ,ప్రతిపద్య పాదం మొదట్లో రామచరితం ఉండేట్లు108 కంద పద్యాలతో శతకం రాయమని  సలహా ఇవ్వగా ,అది తన శక్తికి మించినది అని కవి భావించి భారమ౦తా కోదండరాముని పై వేసి ,భక్తి తత్పరతతోరాసి పూర్తి చేశాడు చంగల్వ రాయ కవి .ఇందులోని తప్పొప్పులను మన్నించమని సుజన విధేయుడైన కవి మనవి చేశాడు .దీన్ని ‘’ప్రతి పద్య పాద పాదాది కవి యిచ్ఛావాక్య ఘటిత అష్టోత్తర శత కంద  రామాయణ సంగ్రహ శ్రీ సోమగిరి కోదండ రామ శతకం ‘’అని సార్ధక నామ ధేయం గావించాడు కవి .కోదండరామునికే అంకితమిచ్చి ధన్యుడయ్యాడు కవి .

  ప్రార్ధన పద్యాలలో మొదటిది శ్రీ రాముని గురించే –‘’శ్రీభూ సుత కుచయుగమృగ-నాభం .బెద నంటి యు౦డు నలినాక్షుం డై-శోబిల్లెడి వరసారస-నాభుడు శ్రీరాము డేలు నను దినమునన్’’.తర్వాతనే కరి వక్త్రుడైన వినాయక ప్రార్ధనచేసి తన ప్రణాళిక తెలియ జేశాడు .రామ చరిత్రను ఎలా రాశాడో చూద్దాం –సిరులకు నునికియయి ‘’అంటూ రామకధను అయోధ్యాపురి దశరథ మహా రాజు కథ తో ప్రారంభించాడు – ఇప్పుడు పద్య నడక ఎలా సాగిందో చూద్దాం –‘’సిరి కరి తురగాదుల చా –రు రమణులన్ భ్రుత్య దేనుభోగము చే జా –ల రసో జ్వలుడై రిక్తుల-కురు కల్ప ద్రుమము భంగి గోర్కెల నిడుచున్ ‘’ఇలా మొదటి కంద పద్యం చెప్పాడు .ఇందులో ప్రతిపాదం మొదటి అక్షరం లో కథ పైన చెప్పినట్లు నడుస్తుంది .ఒకరకంగా సర్కసు ఫీట్ లా ఉంటుంది .

  మధ్యలోకి వెడితే –చెలగగ లక్ష్మణ విగ్రహము ‘’అనే కధాంశం లోని కడాలరుచి చూద్దాం –‘’చెలియేమొఎడురాదుకొ-లల నిటు నా మీద నలిగి లావణ్యము నున్ –గల తనువును సూపింపక –గలుషము బూమి నట్లు నాకు కష్టము నిడెనో’’’’బుధ వరులయిన తమకు సతతము నతు లొనరిచెద’’అన్న భావంతో 100వ పద్యం నుంచి 105వరకు రాసి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకొన్నాడు కవి .-‘’నలినాక్షు డయోధ్యపు-రి లలిత మాధుర్యమైన మృదు భాషణులన్ –చెలియతొబలుకుచు వానర –దళముజేరి రపుడు తద్దయ నుండన్ ‘’అంటూ మళ్ళీ అయోధ్యకు చేర్చాడు రామ కథను .ఈ మధ్యలో రామాయణ ముఖ్య ఘట్టాలన్నీ అందంగా  కందాలలో రాశాడు.

 శ్రీ రామ పట్టాభి షేకాన్ని ఈ నియమం లేకుండా రాశాడు –‘’భరతుడు శత్రుఘ్ను౦డును  -నిరు పార్శ్వముల౦దు  మెరయ నినజుండును యా –దొరయ౦గజుండును రాక్షస –వరుడువిభీషణుడు జాబవంతుండు వరుసన్ ‘’,’’కరువలి దిశ మెరయగవర –సరదభ్రసురుచుల దేహ శ్యామలకాంతి- సరసిజ ముఖుడై రాముడు –ధర విలసితుడయ్యియుండె తా మధ్యమునన్ ‘’-‘’ఘనమగు ప్రభువై ధరణిని-జనపాలన చేయు మంచు జితురత రామున్ –ముని చంద్రుడగు వసిష్టుడు –తిన పట్టాభిషిక్తు జేసి దీవెన లోసగెన్ ‘’-‘’సోమ గిరి పురంబున –బాసిలు కోదండరామ భవ్యునకు నే –వాసిగ నంకిత మొసగితి – భాసురముగ వ్రాసి దీని పల్వురు మెచ్చన్ ‘’-‘’మంగళ మా రామునకున్-మంగళమా సోమ శైల మందిరునకుస – న్మంగళముధీనిధి శుభ-మంగళమా వనిజ పతికి మహానియ్యునకున్ ‘’.

అంటూ శతకం పూర్తి చేశాడు చెంగల్వ రాయ కవి .కవుల చరిత్ర లో ఈ శతకం చోటు సంపాదించు కొన్నదో లేదో తెలియదు కాని కొత్తపోకడతో రాసిన శతకం.మెచ్చదగిన శతకం .ఆదరించాల్సిన శతకం.

   నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-21-ఉయ్యూరు     

 

ttps://ia800709.us.archive.org/6/items/shriisoomagiriko036171mbp/shriisoomagiriko036171mbp.pdf

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.