మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం )

మహా భక్త శిఖామణులు

21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం )

అప్పుడు హైదరాబాద్ లో నాజరు ద్దౌలా నవాబ్ ఉండేవాడు .అతనికి మహా రాష్ట్ర బ్రాహ్మణుడు ధర్మాత్ముడు చండ శాసనుడు ,సన్మార్గ ప్రవర్తకుడు  ,సమర్ధుడు ,భక్తుడు అయిన చందూలాల్ ప్రధాన మంత్రి గా ఉండేవాడు .ఒకరోజు ఈయకలలో శ్రీరాముడు కనిపించి ‘’నీ దగ్గరకు నరసింహ దాసు వస్తున్నాడు .వాడు నా ప్రియ భక్తుడు సుమా ‘’అని చెప్పాడు .నిద్ర మేల్కొని నరసింహ దాసు దయవలన తనకు రామ దర్శనం కలిగిందని అబ్బురపడి  నమస్కరించి ,దాసు గారికోసం కన్నులు కాయలు కాసెట్లు ఎదురు చూస్తున్నాడు .కొన్ని రోజులకు దాసు గారు హైదరాబాద్ చేరి చందూలాల్ మందిరానికి వెళ్లి ,’’రాజాధిరాజా సలాం ‘’అని మ్రొక్కగా ,ఊర్ధ్వ పు౦డ్రాలతో ,తులసిపేరులతో ,విశాల నేత్రాలు ,నీర్కావి ధోవతిలో నవ్వు ముఖంతో దాసు గారు తనను ‘’మీ రాజ్యం లోని భద్రాద్రి వాసిని.నరసింహ దాసు డను ‘’ అని పరిచయం చేసుకోగా గద్దె మీదనుంచి అమాంతం లేచి వచ్చి కౌగిలించుకొని ‘’శ్రీరామ చంద్ర పరమాత్మ అనుగ్రహం పొందిన మహాత్మా !భక్త పుంగవా !మీరాకతో నన్ను పవిత్రుని చేశారు .నేను మీ బంటును ఎమికావాలో  సెలవిస్తే  క్షణాలమీద నిర్వహిస్తాను ‘’మా ఇల్లు పావనం చేయండి రండి ‘’అని అత్య౦త వినయంగా నమస్కరించి చేతులొగ్గి చెప్పాడు లాల్ .దాసుగారు కూడా లాల్ గారిని ఆప్యాయంగా కౌగలించుకొని ‘’అంభోజ గర్భాదులరయంగ రానిశ్రీరామ చంద్రు నీక్షించ  గలిగితివే .యెంత ధన్యుడవు తండ్రీ !’’అంటూ కొంత సేపు ఇద్దరూ మాట్లాడుకొన్నారు .లాల్ ఇంట్లో కొన్ని రోజులుండి రామ తారక మంత్రోప దేశం చేయగా పరమానందం పొందదాడు

    రాజా నృసింహ దాసు

 కొన్ని రోజులతర్వాత వచ్చిన పని ఏమిటో చెప్పమని అడిగాడు .అప్పుడు దాసుగారు భద్రాద్రిలో జరుగుతున్న అకృత్యాలన్నీ పూసగుచ్చినట్లు  అక్కడ అన్ని కార్యక్రమాలు యధా విధిగా జరిగేట్లు చూడమని చెప్పాడు .చందూలాల్ వెంటనే ‘’మీరే ఆఅధికార౦  తీసుకోండి ‘’అనగా వేరే విధంగా భావి౦చవద్దన్న దాసు గారి మాటలకు మంత్రి అడ్డుపడి –‘’భద్రాద్రి పాల్వంచ  పరగణా లెల్ల –భద్రంబు గా నీవు పాలి0పదగుడు –వాయుర్వికెల్లనీ వధికారము మూని  -చేయుము న్యాయ స౦సిద్ధి బాలనము –రాజితమైనట్టి రాజా బిరుదము –నే జెల్వగా నీకిదె నొసగితిని – చెలగి నిన్ ‘’రాజా నృసిహ దాసంచు’’-బిలుతు రింతటి నుండి ‘’అంటూ దాసుగారు వద్దు మహా ప్రభో అంటున్నా వినకుండా శాసనం తయారు చేయించి దాసు గారి చేతికిచ్చాడు లాల్ .దీనితోపాటు రెండు ఒంటెలు రెండు ఏనుగులు ,నాలుగు గుర్రాలు ‘’సరిఫేష్తురాయి ,సరిగంచు సెల్వ’’ప్రదానం చేసి ,కనకాభి షేకం చేసి ,కొద్ది దూరం ఆయన వెంట నడిచి వీడ్కోలు చెప్పాడు .ఖరనామ సంవత్సర ఆషాఢకృష్ణ చతుర్దశికి రాజా నరసింహ దాసు భద్రాద్రి చేరాడు.ఆరోజు నుండి తాలూకా అధికారిగా గజ౦తైశ్వర్యం  లభించి ,అదంతా రామార్పణం చేసి,శ్రీరామ కైంకర్యం వేళ త్రప్పకుండా జరిగేట్లు చేశారు దాసు గారు .అప్పటినుంచి భద్రాద్రి నిత్యకళ్యాణం పచ్చతోరణం అయింది .కలియుగ వైకుంఠమే అయింది –‘’రాముడు దయాది రాజిలదగిన –శ్రీమద్విధులకొప్పు చెల్వంపు గృతులు –గద్య పద్యాదులు కాదు హృద్యములుగ-విద్యా రస ప్రౌఢి వెలయ గావించి – శ్రీరమ సత్పదా౦చిత పూజ లందు –గోరికలార నెక్కొనగ స్థాపించె-బాడు చుంద్రెల్ల ప్పటికినీ నా కృతులు-వేడుక నా రఘు వీరు సన్నిధిని ‘’అని  రాసి తన  చరిత్రలో చెప్పారు దాసుగారు .అధికారం భోగం లభించినా సాదా సీదాగానే ఉంటూ జనకుడు రాజ్యం చేసినట్లు కుచేలుడు ఐశ్వర్యాన్ని అనుభావిచ నట్లు ఆదర్శంగా జీవించారు .

  నందన కరువు దాసుగారి సేవ

  అప్పుడు ఆప్రాంతం లో భయంకరమైన క్షామం వచ్చింది .అదే నందన కరువు .ఆసమయంలో దాసు గారు చేసిన సేవ అపారం .పెద్ద అన్న సత్రం ఏర్పాటు చేసి ఎన్నో కుటుంబాలకు  భరోసా కల్పించారు –‘’ఎందరు వచ్చిన నేమి పోయంచు –నందరకొనరించె నాన్న దాన౦బు –శిశువులకు బాలు చేరి ఇప్పించే-బశు సమితికి మేత బాటించి కూర్చె-మాలమాదిగల కేమరక అన్నంబు –జాలుజాలన లెస్సగా సమకూర్చె-ముమ్మారు తిను విధంబున నమరించె—ఆనాడు కట్టినట్టి కుండంబు –లీనాటికిని నిల్చిఎసగు భద్రాద్రి ‘’అని రాశారు .కొంతకాలానికి సమృద్ధిగా వర్షాలు పడి కరువు మాయమైంది .

     మహాప్రస్థానం

 నాగండ్ల వరద రాజు గారికి క్షయవ్యాధి వచ్చి బాగా కృశించిపోయారు .ఆయనకు ధైర్యం చెబుతూ నరసింహ దాసుగారు ‘’నిన్ను చెన్నపురి నుంచి భాద్రగిరికి శ్రీ రామసేవకోసం తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి వైకుంఠానికి నిన్ను వెంట తీసుకు వెడతాను ఇది రామాజ్ఞ’’  అని ఊరడించేవారు .రాజుగారి భార్య తల్లీ  మేమూ మీతో వస్తాం తీసుకు వెళ్ళండి అంటే వల్లె అని ,దాసుగారిభార్య లక్ష్మీ బాయంమగారు ‘’మీరు లేకపోతె నేను బతకలేను మీతో నేనూ వస్తాను ‘’అని వేడుకున్నా ‘’నీకు దేవుడి ఆజ్ఞ లేదు ఇక్కడే కొంతకాలం ఉండాలి ‘’అని నచ్చ చెప్పారు.తన ఇంటిలోని  బంగారు వెండి వస్తువుల జాబితా రాయించి ,రామాలయానికి చేర్చి కావలసినవారికి మిగతా సామాను ఇచ్చేశారు  .-‘’ఏమియు లేకుండనిల్ చూరు విడిచి –ఆ మీద రాజకీయ ప్రసంగములు  -దేశ పాండ్యాలకు తెలియ బోధించి –‘’రామాలయం లో ఉన్న స్థిర చరాస్తుల జాబితాలు తయారు చేయించి  శాసనాలపై చెక్కించి –సరిగా గోవెల యందు స్థాపన చెసె. వరద రాజు గారి ఆరు నెలల పసి బాలుడిని దాసికిచ్చి చక్కగా సాకమని చెప్పి ,తనతో ఉన్న తమ్ముడి కొడుకు రాము ని దీవించి మహా ప్రస్దాన ప్రయత్నం చేస్తూఉండగా వరద రాజు రామభజన చేస్తూనే ప్రాణాలు వదిలాడు .ఆయన శవాన్ని వెంటతీసుకొని కాళ్ళకు గజ్జలు భుజాన తంబురా చేతుల్లో పలకలు పట్టుకొని గొంతెత్తి రామభజన –‘’పోయదమయ్యా వైకుంఠమునకు బోవు చున్నాము ‘’అని పరవశించి పాదుతుండగా ఆకాశ౦ లో   ’’ కోదండరాముడు కనిపించగా –‘’అడుగో కోదండ పాణి అడుగో భాద్రాచలేశుండు ‘’అంటూ శ్రీరాముని ఆపాద మస్తకం గా వర్ణిస్తూ 1833-34విజయ వత్సర భాద్రపద కృష్ణ చవితి సోమవారం సూర్యుడు పశ్చిమాద్రికి చేరే సమయం లో ,ఊరిజనమంతా పూలు చల్లుతూ దండలు వేస్తూ మహా కోలాహలం చేస్తుండగా ,పూర్వం పాండవులు మహా ప్రస్థానం చేసినట్లు,గోదావరీ నదికి వెళ్లి ,వెనక్కి తిరిగి రామాలయ శిఖర దర్శనం చేసి నమస్కరించగా అది అంగీకార సూచకంగా ఊగిందట .అందరూ పడవలు ఎక్కి కూర్చుని రామ భజన లో పులకితులై నది మధ్యలోకి వెళ్లి ‘’జయ రమారమణ గోవింద హరే ‘’అనే నాదంతో భూ నభోన్తరాలు దద్దరిల్లేట్లుగా పలికి ,వరదరాజ శరీరాన్ని గోదాట్లో కలిపారు దాసుగారు .ఒక్కసారిగా గోదారి పొంగగా నరసింహ దాసుగారు’’ రామా రామా’’ అంటూ  ఆ ప్రవాహం లో మునిగి కనిపించలేదు .రాజుగారికిచ్చిన మాటను ఇలా నిలబెట్టుకున్నారు దాసుగారు ఆయనతోపాటు 17మంది భక్తులు ఆయన భార్య,లక్ష్మీ బాయమ్మ గారు గోదాట్లోకి దూకేశారు .అప్పుడు –‘’వింతగా నొక దివ్య తేజంబు –ఘనతర సూర్య ప్రకాశంబు మించి –జనములు సూడంగ జనె-వియద్గతిని ‘’.అందరికి ఆ దివ్య తేజస్సు కనిపించగా ఆశ్చర్య పోయారు .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.