అవధూత నిట్టల ప్రకాశం గారు

అవధూత నిట్టల ప్రకాశం గారు

 అవధూత నిట్టల ప్రకాశం గారు యానాం కు ఆయన 50 వ ఏట వచ్చినప్పుడు తన చిన్నతనం లో చూశానని శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు రాశారు .అప్పటికి ప్రకాశం గారికి కవిగా గుర్తింపులేదు .ఆయనను ఎవరూ ఎరగరు కూడా .అలా ఒకరోజున ఆయన తనకు కొద్దిరోజుల్లో కవన శక్తి కలగబోతోందని ,దానిని పరిశీలించమని యానాం లోని ప్రముఖులతో చెప్పుకొన్నారు .శాస్త్రిగారి పుట్టినూరు కూడా యానాం .యానాం దేవాలయం దగ్గరు ఆసక్తికల వారందరూ రావచ్చునని ప్రకాశం గారు ప్రకటించారు .ఊరి పెద్దలు ఎవ్వరూ ఆయనమాటలు లక్ష్య పెట్టలేదనీ ,లైట్ తీసుకోన్నారనీ ఎవరూ రాలేదనీ ,ఎవరో పది మంది ‘’లాకాయ్ లూకాయ్ గాళ్ళు ‘’మాత్రమె వచ్చారని శాస్త్రిగారు చెప్పారు .నిట్టలవారు ఆశువుగా ,ధారాళంగా చెప్పిన పద్యాలను వినటం మాత్రమె కాక అప్పటికప్పుడు తాను  పుస్తకం లో రాసుకొన్నాననీ చెళ్ళ పిళ్ళ వారు చెప్పారు.అందులోని కవిత్వంకూడా చాలా గొప్పగా ఉందనీ వారికీర్తనలు చాలామందికి కంఠోపాఠం గ వచ్చుననీ శాస్త్రిగారు ఉవాచ .తమకు గుర్తున్న కీర్తనలు ఆయన తెలియజేశారు .

   ఆదితాళం లో కీర్తన –‘’హరా నిన్నే నమ్మినానుగదరా  –

అనుపల్లవి –కరుణాకర పురహర నీపాద మును నమ్మినానురా

 మ్రొక్కు చుంటినిరా ‘’అని సాగుతుందని ప్రాసయతి తో కీర్తన మనోజ్ఞంగా ఉందనీ శాస్త్రిగారన్నారు .అయన కీర్తనలు భద్రాచల రామ దాసు గారి కీర్తనలాగా మనోహరంగా ఉంటాయన్నారు .నిట్టల వారి స్వగ్రామం పెద్దాపురం కావచ్చుననీ తనకు తెలిసినప్పటి నుండీ ఆయనకు స్వగ్రామం లేదనీ భార్యను కూడా వదిలేసి రోజుకో గ్రామం లో తిరిగేవారనీ చెప్పారు .సంతానం అసలే లేదు  .కుల నియమం పాటించకుండా అన్ని వర్ణాల వారిళ్ళలో భోజనాలు చేస్తూసారాకు అలవాటు పడ్డారని చెప్పారు .భోజనమున్నా లేకున్నా మందు ఉంటె చాలు .

  యానాం వచ్చినప్పుడు నిట్టలవారి  మకాం సారా కొట్టే అని చెళ్ళపిళ్ళ వారు జ్ఞాపకం చేసుకొన్నారు .పల్లెకారులు భోజనం తెచ్చి పెట్టేవారు .చేపలు మాంసం పెట్టేవారుకాదు .భయం తో మాలలు ఆయనకు భోజనం పెట్టలేదన్నారు .కొద్దికాలం బ్రాహ్మణులు పిలిస్తే వెళ్లి తినేవారు,కానీ చివరికి ఆయన ఆతిధ్యం అంతా పల్లె కారులదే.అన్నం కంటే మద్యమే ప్రియం ఆయనకు .అవదూతలకు మద్యం నిషేధం కాదని తన చిన్న తనం నుంచీ తెలిసిన విషయమే అన్నారు శాస్త్రీజీ .

  నిషా దారుడే అయినా నిట్టల అవదూతగారికి సంబంధించిన కొన్ని విచిత్ర గాధలు ప్రచారం లో ఉన్నాయన్నారు శాస్త్రి గారు .ఇందులో కొన్నైనా యదార్ధాలే అని తాము నమ్మినట్లు చెప్పారు .ఆయన్ను తరచుగా సేవించేవారు పల్లెకారులు అనే అగ్నికులక్షత్రియులు .అధికభక్తితో సారా సమర్పణ చేయటం వలన ఆయనకు అదొక కుతిగా మారింది .దానితో కిక్కేక్కి తన్మయత్వం ఏర్పడేది.సారా కొట్టు దగ్గరకు వెళ్లి ‘’కాస్త పొయ్యి ‘’అనిఅదిగితే ‘’లేదు పో ‘’అని చిరాకు చూపిస్తే ‘’సరే లేకుండా నే పోతుందిలే ‘’అని వెళ్లి పోయేవారట .ఈమాట అని కొంచెం దూరం వెళ్ళగానే కొట్టువాడు జాడీల్లో సారా చూసుకొంటే చాలాభాగం ఖాళీ గా కనిపించేదట .అప్పుడు ఆయనమాట మహిమ అర్ధమై ,వెళ్లి కాళ్ళమీద పడి వేడుకొంటే ,కనికరంచూపితే జాడీలు మళ్ళీ ఫుల్ గా నిండా ఉండేవట .ఆ కాలం లో ఆయన తృప్తిగా తాగే సారా ఖరీదు కేవలం అణన్నర  అంటే ఒకటిన్నర అణా మాత్రమె .యాచకుడు అనుకోని ఆయనకు ఎవరైనా డబ్బు ఇస్తే ప్రకాశంగారు  తీసుకొనే వారుకాదు .మరీ బలవంత పెడితే అణన్నర మాత్రమె పుచ్చుకొని మిగిలింది అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం చాలామంది చెప్పగా తాము విన్నామని శాస్త్రిగారన్నారు  .మాంచి నిషాలో ఉన్నప్పుడు నిట్టల వారి నడక ‘’గోమూత్రం ‘’ఆకారంగా అంటే ఈమూల నుంచి ఆమూలకు ఆమూలనుంచి ఈ మూలకు అన్నట్లుగా ఉండేది .

   ఈ విధమైన అపమార్గం లో తిరుగుతున్న భర్తకు పిచ్చి ఎక్కిందని భార్య పోలీసు స్టేషన్ లోరిపోర్ట్ చేస్తే ఆయన్ను తీసుకువెళ్ళి మూడు  రోజులు ఉంచారు .నాలుగో రోజుఉదయం  స్నానం చేయాలని చెప్పి స్టేషన్ నుంచి  సంకెళ్ళతో ,ఇద్దరు పోలీసుల  పహారాతో  గోదావరికి వెళ్లి ‘’జై పరమేశ్వరా ‘’అని ఒక్క మునుగు మునిగి ,అర్ధ ఫర్లాంగు దూరం లో తేలి ,నీటిపై బాసిన పట్టు వేసుకొని కూర్చుని –‘’గౌతమి నే కనుగొంటిని –కనుల పండువుగానూ –రాతి నాతిగ చేసిన సీత రాముని కరుణ రసమున ‘’అని ఆదితాళం లో కీర్తన మొదలుపెట్టి –‘’అంగజారి శిరమున ఆడుచు  నుండేటి గంగ-పొంగి తరంగముల చేత  భూమి నిండును –అ౦గ లింగభంగ ధరుల  సంగమున జెలంగు-కోటి లింగముల —-‘’అని పాడారట .ఇంకాకొన్ని చరణాలున్నాయి కాని అరవై ఏళ్ల క్రితం విన్నవికనుక పూర్తిగా జ్ఞాపకం లేవని వెంకటశాస్త్రి గారన్నారు .భజనపరులకు చాలామందికి ఈకీర్తన వచ్చు అన్నారు .

  ఒకసారి ఎవరో ‘’అయ్యా తమరు శృంగార కవిత్వం బాగా చెబుతారట .మాకు సెలవియ్యండి’’అని అడిగితె ఆశువుగా  సావేరిరాగం ఆది తాళం లో –‘’జాలిమాలీ వనమాలీ రాడాయే ,నయమో ‘’అని జావళి పాడి ఆశ్చర్య పరచారట  -‘’అంచయాన స్త్రీ హంతకుడగు –శ్రీ పంచ బాణు డిప్డు నన్ను డీ కొని –కి౦చ మాని కొంచ పంచ దలచు –అంచ నెక్కి వెడలె  నడుగో చూడుడు ‘’అని శృంగారం రసాభి నివేశంతో రక్తికట్టి౦చారని వెంకటశాస్త్రీయం  .

  నిట్టల ప్రకాశం అవధూత గారికాలం లోనే నిత్యమౌని రాం భొట్లు  అని మరొక అవధూత ఉండేవారట  .ఈయన నడుస్తూ దారిలో ఉన్న చెత్తా చెదారం ఎడమవైపుది ఎడమవైపు కుడివైపుది కుడివైపు  ఏరి పారేసేవారట .ఎలుగుబంటిలాగా మహా బలిష్టులు.ఈయన పుట్టగోచీ మాత్రమె పెట్టుకొనేవారు .భిక్షాటన చేసేవారు కాదు .నీరు గాలిమాత్రమే వారి ఆహారం అన్నారు శాస్త్రీజీ .తమ 12ఏట రా౦ భొట్లు  అవదూతగారిని చూసినట్లు వెంకట శాస్త్రి గారు చెప్పారు .ఈయనకు ఖేచర గమనం ఉందనీ దానిని పైడా  వెంకన్నగారు కనిపెట్టారనీ జనం చెప్పుకొనే మాటలు తానూ విన్నాను అన్నారు .ద్రాక్షారామ భీమేశ్వరుని దేవాలయం దగ్గర ఉన్న అన్నసత్రం పైడా వారిదే .తరచుగా దాక్షారం వెళ్ళేవారు .ఒకరోజు వెంకన్నగారు ప్రయాణం చేస్తూ వీధి అరుగుమీద పడుకొన్న  రాం భోట్లుగారిని ‘’స్వామీ !దయ చేస్తారా ‘’?అని అడిగితె ‘’మీరు పదండి నేను మీ వెనక నెమ్మదిగా  వస్తాను చివరికి అవ్వా, గుర్రం ఒక్కటే అవుతాయి ‘’అన్నారట .తానేమో బోయీల సవారీలో వెడుతున్నాడు ఈయన ఎకసక్కెం ఆడటం లేదు కదా అనిపించింది .రెండు ఆమడల దూరం లో ఉన్న దాక్షారం చేరేసరికి ,రా౦భొట్లు గారు గోపురం అరుగుమీద కనిపించారట .ఆశ్చర్యపోయి ఆయనకు ఖేచరగమనం అంటే గాలిలో ప్రయాణం చేసే లక్షణం ఉందని అనుకోని ఉండచ్చు అంటారు శాస్త్రిగారు .సిద్ధ పురుషులకు ఎలాంటి గమనం ఉన్నా ఆశ్చర్యపడాల్సింది లేదన్నారుకూడా .అలాగే నిట్టల ప్రకాశం గారు గోదాట్లో సంకెళ్ళ  తోనే నీటిపై ‘’బోసేనపట్టు’(ఇది శాస్త్రిగారి ప్రయోగం ) వేసి కూర్చోటం యోగాభ్యాస ఫలితం కావచ్చు అనీ చెప్పారు .

          సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-8-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.