శ్రీ దాసు లింగమూర్తి -4
గోదావరి జిల్లాలో సత్కార్యాలు
అనేక సేవాకార్యక్రమాలలో మునిగి తేలుతున్న దాసుగారి ఆరోగ్యం దెబ్బతినటం వలన విశ్రాంతికోసం సెలవుపెట్టి అత్తగారింటికీ వెళ్ళారు .దారిలో వారికొడుకు కృష్ణారావు చనిపోయాడు .మరదలి అత్తగారి ఊరు రాజానగరం వెళ్ళారు. అక్కడ తోడల్లుడు సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ .ఒకరోజు ఒకకుమ్మరి జాతక రహస్యాలు దాసుగారు చెప్పగా ,ఆయన ప్రతిభ లోకానికి బాగా చాటింపు అయింది .జనాలు వచ్చి తమ జాతకాలు చెప్పించుకోనేవారు ఒకరోజు తోడల్లుడు అడిగితె ఏడాది లోపల మరణం ఉందని చెప్పారు .ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే భార్యకూడా నాలుగేళ్ళలో చనిపోతుందని చెప్పారు.ఈ వూళ్ళో రామ సప్తాహం వైభవంగా జరిపించారు .
అక్కడినుంచి జగ్గం పేటవచ్చి సప్తాహం మొదలుపెట్టారు .రెండురోజులతర్వాత పూజలో ఉన్న రామపట్టాభిషేకం చిత్రాన్ని చూసి జనం భయపడిమూర్చ పోగా ,ఒక జమీందారు వచ్చి ‘’మీ రాముడిని చూసి జనం వణుకుతున్నారు ఏదైనా ప్రయోగం చేయండి ‘’అంటే తనకు మంత్రాలు ప్రయోగాలు రావని ,రాముడే సప్తాహాన్ని పూర్తీ చేయిస్తాడని చెప్పారు .మర్నాడు ఒకగుమాస్తాను పంపగా ఆతడుకూడా పట౦ చూసి మూర్చపోయాడు .రాత్రి 9గంటలకు రామ పటం ఫెళఫెళ మంటూ విరిగిపోయింది .మడపం అంటుకొన్నది .ఓం శాంతి అంటూ జపించగా మంటలు చల్లారాయి .మంటపం లో దాసు గారి పట్టు పంచ ,ఒక బ్రాహ్మణుడి రామాయణపారాయణ గ్రంథం, పట్టు బట్ట కొన్ని కాగితాలు తగలబడ్డాయి .ఆతగులబడిన ఒకకాగితం లో ‘’ఆ రోజు ప్రాలుమాలి చదువమాని తదనంతర కథ ముగించాను ‘’అని ఆబాపడు రాసుకొన్న విషయం తెలిసింది .అంటే పారాయణం లో ఒకరోజు చేయాల్సింది చేయకుండా మర్నాటి పారాయణం చేయటం వలన జరిగిన అనర్ధం అన్నమాట .
పెద్దాపురం లో అంతకు ముందు ఎప్పుడూ మంచి కార్యాలు జరగకపోవటం చేత దానికి ‘’పంచ మహా పాతక పట్టణం ‘’అనే పేరొచ్చిందట .ఇక్కడ దాసుగారు బ్రహ్మాండమైన సప్తాహం చేసి ఆపేరు పోగొట్టే ప్రయత్నం చేశారు .ప్రతి ఇంటి గోడపై సీతారామ అని రాసుకొన్నారు .తినేది అంతా సీతారామ ప్రసాదంగా భావించారు .తర్వాత రామపట్టాభి షేకమూ జరిపించారు .’’ఇలు వెడలని కులకాంతలు –చెలరేగి ‘’నమో నమో హృషీ కేశ ‘’యటం-చెలుగెత్తిపల్కుచును వీ –ధుల నడచిరి భక్తితమ మతుల నుప్పొంగన్ ‘’అని మహాభక్త విజయం లో రికార్డ్ అయిన సప్తాహం ఇది . అప్పుడే శివుడికి లక్ష బిల్వార్చన అమ్మవారికి లక్ష కుంకుమ పూజ కూడా జరిపించారు ,రాముడికి లక్ష తులసిపూజ కన్యకాపరమేశ్వరికి కొత్త యంత్రస్థాపన ,లక్ష కుంకుమార్చన అపూర్వమైన అన్నదానం బీదలకు వస్త్ర సమర్పణ నభూతో గా జరిపించారు దాసుగారు .మొదట్లో నిరుత్సాహపరచిన ధనికులు క్రమగా దాసుగారి సద్భావనకు ముగ్ధులై దాసోహమన్నారు .
పెద్దాపుర సప్తాహ అవబృధ స్నానం అయ్యాక దాసుగారు కాకినాడ వచ్చి మహావైభవంగా సప్తాహం చేశారు .పెట్టిన సెలవు అయిపోగానే దాసుగారు గిద్దలూరు సబ్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో హెడ్ గుమాస్తాగా చేరారు .అనుకోకుండా అక్కడ సప్తాహం మొదలుపెట్టి రంగరంగా వైభవంగా పూర్తీ చేశారు
తూగోజి రామ చంద్రాపురం దగ్గర బిక్కవోలు లో కామధేనువు చే ప్రతిష్టింప బడిన గోలింగేశ్వర దేవాలయం శిధిలం లో ఉంది .అక్కడి సుబ్బారాయుడుస్వామికి మార్గశిర శుద్ధ షష్ఠినుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా చేస్తున్నాడు హరికధలు నాటకాలు,పాటకచేరీలు ఏర్పాటు చేసేవాడు .1928బ్రహ్మోత్సవాలలో కూచిమంచి మూర్తిరాజు గారు రామదాసుచరిత్ర హరికధ చెప్పి భక్తులను ఓలలాడి౦చారు .ప్రజలంతా ఆపందిళ్ళలోనే మరో సప్తాహం చేయాలని భావించి ,5వేల రూపాయలు పోగు చేసి ఇచ్చారు .ఊరిజనం లో బ్రాహ్మణ అబ్రాహ్మణ తగాదాలు వచ్చి ముందుకు సాగకపోతే గిద్దలూరులో ఉన్న దాసుగారిని వచ్చి బాధ్యత తీసుకోమని ఆకెళ్ళ వ్యాఘ్రప్ప గారు మరికొందరు విన్నవిస్తూ టెలిగ్రాం ఇవ్వగా ,వెంటనే బయల్దేరి రాగా కొందరు ఆయనకు ఇక్కడి కలహ కారణాలు చెప్పగా దాసుగారు ‘’రామాజ్ఞ పొంది వచ్చాను .రేపటి నుంచి సప్తాహం ప్రారంభమవుతుంది ‘’అని చెప్పి ,మర్నాడు ఉదయం వేలాది జనం తో గోదావరి కాలువలో స్నానం చేసి వీదులవెంట భజన చేస్తూ గోలింగేశ్వరాలయం చేరి పూజారినడిగి రామ పట్టాభి షేకపటాన్ని తీసుకొని సప్తాహం ప్రారంభించారు .రెడ్లుఅడ్డంకులు కల్పించారు మొదటి రెండు రోజుల్లో. కరణ౦గారు దాసు గారిని ‘’ఇక మీరు గిద్దలూరు వేవెళ్లిపోతేనే మంచి దేమో ?’’ అనగా ,మూడో రోజునుంచి ముఠా నాయకుడు ఒకరికి రాత్రి వళ పెద్ద పెద్ద కోతులు కనిపించి పళ్ళు కాయలు తింటూ భయభ్రాంతుల్ని చేయగా మర్నాడు ఉదయమే తోటలోంచి కాయగూరలు కోసి సప్తాహానికి పంపాడు .అసలు మొదట్లో జనమే లేని ఆలయం జనం తో కిటకిటలాడింది .కోలాటాలు భజనలు పరవశంగా జరిగాయి .ఊరివారి ఉత్సాహానికిఅవధులు లేకుండా పోయి సప్తాహం దిగ్విజయమై బీదల అన్నదానం ఘనం గా జరిగి ముగిసి అందరికి సంతృప్తి కలిగించింది .రెడ్డి నాయకులు దాసుగారికి దాసులై రాత్రీ పగలు కంటికి రెప్పలాగా చూసుకొన్నారు .ప్రజలంతా దాసుగారి వెంట రైల్వే స్టేషన్ కు నడిచి వెళ్లి అపూర్వంగా వీడ్కోలు పలికారు .దాసు గారిని భుజాలపై ఎక్కించుకొని స్టేషన్ లో అరగంట సేపు ఆడారు .అందుకని బండీ అరగంట లేటుగా అక్కడి నుంచి బయల్దేరింది
1928లో దాసుగారు బిక్కవోలులో వందరోజుల గోలిన్గేశ్వరస్వామికి కోటి బిల్వార్చన మహా వైభవంగా జరిపించారు .చేతిలో కానీ లేకుండా కార్యక్రమం ప్రారంభించేవారు .పార్వతీ పరమేశ్వరులే తన యజమానులనీ తాను దండోరా వేసే బంటు ను మాత్రమె అనీ నూరురోజుల పూజ ఆయనే జరిపించుకొంటారని చెప్పేవారు ,అనుకోన్నట్లుగానే ప్రతిరోజూ కోటిబిల్వార్చన అమ్మవారికి కోటి కుంకుమార్చన 100రోజులు నిర్విఘ్నంగా అత్య౦త వైభవంగా అందరి సాయంతో దాసు గారు నిర్వహించి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-21-ఉయ్యూరు

