రౌతు జగన్నాథ రాయుని జీవిత చరిత్రము

రౌతు జగన్నాథ రాయుని జీవిత చరిత్రము
అనే పద్యకావ్యాన్ని విజయనగర వాస్తవ్యులులు విజయనగర ఆస్థాన నాట్య శాల కవీశ్వరుడు శ్రీ సోమయాజుల సూరి దాస కవి రచించి ,శ్రీ సెట్టి నరసింహం గారిచే సరి చూడబడి ,తిరుపతి పుండరీక ముద్రాక్షర శాలలో 1920లో ప్రచురింపబడింది .వెల వివరాలు లేవు .
ఉపోద్ఘాతం లో కవి ‘’ఇప్పటి మనుషుల జీవితం రాయటం కష్టమే అయినా ,సత్పురుషుడు సుగుణ శీలి అయిన రౌతు జగన్నాథ రాయుని గురించి అనేకులు చెప్పటం ,కవిగాయక శిఖామణులు పేర్కొనటం చేత ఈ సత్పురుషుని జీవితం శ్రీ మదాన్జనేయ స్వామి అనుగ్రహం తో రాస్తున్నాను కాని నాకున్న గ్రంథ పరిచయం చాలదు ‘’అని వినయంగా చెప్పుకొన్నారు .
మొదటగా తన గురువు దాస నారాయణ గారి గురించి సీసం లో వివరిస్తూ అజ్జాడ గ్రామవాసి ,సౌందర్య చారు యశో శీలి ,విద్యలభోజుడైన విజయనగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థాన పండితోత్తముడు ,దేవ దేవుని సత్కథలెన్నో తెలిపినవాడు ‘’అని తెలియజేశాడు .
తన వంశాళి గురించి సీసం లో –‘’విజయనగరం లో సోమయాజుల సోమశేఖర ,భద్రాంబ దంపతులకు జన్మించి ఇంగ్లీషు విద్య కొంత నేర్చి ,సర్కారు నౌకరీ చేసి ,మానేసి నాటక రంగాన్ని ఎన్నుకొని ‘’వనితా వేషము దాల్చి వర నృత్య గీతాభినయ విద్యల ‘’చే ప్రజల మెప్పుపొంది ,ప్రఖ్యాతిపొంది కొన్ని సమాజాలేర్పరచి ,గురువై వారికి నేర్పి ,చివరికి సర్కస్ కంపెనీ కూడా పెట్టి .తర్వాత గురువు దాస నారాయణాఖ్యుని చేరి హరికథాగానం నేర్చి ,ఆ అనుభవంతో ఈ కావ్యం రాశాను ‘’అని చెప్పాడు .
ఇష్ట దేవతా ప్రార్ధనలో మొదటగా ‘’దానవ భంజన రామ భక్త,నిష్కామ యశో చారు ,వనఖండన కారణ వాయు నందనుని’’ స్తుతించాడు .తర్వాత విఘ్నేశ్వర సరస్వతి ,స్తుతి చేసి కాళిదాసాది కవులను వినుతించి ‘’పండితుడ నని బింకము జూపను ,సూరి దాసుడన్ తగు సరసుండు రౌతు కులధన్యుడు గాన చరిత్ర వ్రాసెదన్ ‘’అన్నాడు .
మొదటిభాగం లో రౌతు వంశాన్ని వివరించాడుకవి .రౌతు వెంకట కృష్ణమ్మకు వెంకట నరస మా౦బ దంపతులు సుఖ జీవితం గడుపుతూ పుత్రికలను పొంది రామసేవలో తరిస్తున్నారు .పుత్రులు లేరనే చింతతో ఎన్నో దానాలు ధర్మకార్యాలు చేశారు .జగన్నాథాది క్షేత్ర సందర్శనం చేయగా స్వామి అనుగ్రహం లో పుట్టిన పెద్ద కుమారునికి జగన్నాథుడు అని ,చిన్నవాడికి బలరాముడు అనీ పేర్లు పెట్టుకొన్నారు.పెద్ద కూతురు విశాఖ లోమండవిల్లి అప్పలనరసయ్యకిచ్చి పెళ్లి చేశారు .ఆయన గొప్ప వైద్యుడు .వైద్యో నారాయణ అనే మాటకు సార్ధకత తెచ్చాడు హస్తవాసి మంచిది .బావ వెంకట కృష్ణమ్మ కొడుకులను చదివించక పోవటం వలన జగన్నాథుడిని తానె తీసుకువచ్చి చదివించాడు .
రెండవ భాగం లో –అయిదేళ్ళ జగనాథుడు పార్వతీ పురం లో అక్షరాభ్యాసం చేయబడి చదువుపై ఆసక్తిపెంచుకొని ,బుద్ధిమంతుడై ,సద్గుణ గరిష్ఠుడై క్రమంగా ,విద్యా గరిష్ఠుడై బియేపాసై ,మద్రాస్ వెళ్లి ,కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం పొంది ,అందరి మెప్పూ పొందాడు .గోపాలరాయడు తనకూతురు విజయలక్ష్మి నిచ్చి పెళ్లి చేశాడు .వెల్లూరులోట్రెయినింగ్ పూర్తీ చేశాడు రెండువందలమందిలో మొదటి వాడుగా ఉత్తీర్ణుడయ్యాడు .
మూడవ భాగం లో- వెంటనే గుంటూరుజిల్లాలో ఒంగోలులో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరి ,లంచాలకు వ్యసనాలకు బానిస కాకుండా ప్రజా క్షేమానికి పాటుపడ్డాడు .ఒక మ్లేచ్చమిత్రుడు అపకారం తలబెడితే ముందే గ్రహించి వాడిని దూరం చేస్తే వాడు వచ్ఛి ప్రాధేయపడితే క్షమించాడు .వేటపాలెం, చీరాలలో పని చేసి ,చాక చక్యంగా అవినీతిని అణచి వేస్తూ పురజనులకు మేలు చేశాడు .లక్షాదిపతులైనా కొటీశ్వరులైనా లెక్క చేయకుండా అన్యాయం చేస్తే కఠినంగా శిక్షించేవాడు. న్యాయ ధర్మాలను రెండు కళ్ళుగా భావించిన సేవామూర్తి .
నాలుగవ భాగం లో-పాలకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేరి ,గుణుపురంలో కాపురం పెట్టాడు .సక్రమగా విధి నిర్వహిస్తూ భార్య విజయలక్ష్మితో కలిసి దానధర్మాలు చేస్తూ దైవభక్తితో జీవితం గడుపుతూ ప్రజాభిమానం పొందాడు .ఒకసారి వరదలవల విపరీతంగా జన ఆస్తి నష్టం జరుగగా సంతర్పణలు చేసి జనుల ప్రాణాలు నిలిపాడు .పర్లాకిమిడిలో సివిల్ మేజిష్ట్రేట్ తగవులన్నీ తన పర్య వేక్షణలో నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పి ప్రజాదరం పొందాడు.భార్య చనిపోయింది అకస్మాత్తుగా .చనిపోయేటప్పుడు భార్య తన సోదరి సత్యమా౦బ పెళ్లి చేసుకోమని కోరగా ,ఆమెమరణానంతరం అలానే పెళ్ళాడాడు .
అయిదవభాగం లో –పార్వతీపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాడు .పేదకన్యలకు పెళ్ళిళ్ళు చేయించాడు .దానం శీలం సత్యం తాపం ధైర్యం కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు .చివరగా
‘’రాయుడు సత్యమా౦బయు రమ్యత మీరగ వెంకటాద్రి నిర్మాయకులై చెలంగుచును మన్నన లందుచు నుండ్రి భక్తులై –కాయము సత్యమే యశము కన్న ధరిత్రిని భాగ్యమే మదే-శ్రేయము ముక్తితీరమును జేరగా జేసేడినావ యు జుడీ ‘’అని ముగించారు కావ్యాన్ని .
కవిగారిది చెయ్యితిరిగిన కవిత్వ విధానం .పద్యాలన్నీ గుర్రం పై రౌతు స్వారిగా మహా వేగంగా సాగిపోతాయి .సందర్భశుద్ధి గా సరళంగా కవిత్వం సాగింది .ఈ కావ్య౦గురి౦చి , కవిగురించీ ఎక్కడా పేర్కొన్నట్లు కనపడలేదు .పరిచయం చేసే భాగ్యం నాకు కల్గినందుకు సంతోషంగా ఉంది .
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -18-1-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.