శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )

శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )
మొదటి పద్యం –‘శ్రీ వాణీశ ముఖామర ప్రకరస౦సేవ్యాంఘ్రీ పంకేరుహా –భావాతీత సుమంగళా౦చిత గుణా,భద్రేభ చర్మాంబరా
ధీ విభ్రాజిత దాసకల్ప కుజ దాత్రీ భ్రున్నివాసొన్నతా –గ్రావా ధీశ కుమారికా రమణ భర్గా శ్రీ రామ లింగేశ్వరా ‘’అని మొదలుపెట్టి ‘’ఘనపా౦డిత్యం ,సూరి జన సాంగత్యం సాధన సంపత్తి తనకు లేవని ,శివునిపై భారమేసి శతకం రాస్తున్నాని చెప్పాడు .ఆయన్నుసేవి౦చినవారి పాపాలుపోతాయి ,ఆయన స్మరణైక దాస్యమిమ్మని ,,ఆయన మహిమలు పొగడటానికి శక్యం కాదని ,ఆత్మలో ఆయన పాదాబ్జాలు కొలిచే భాగ్యమిమ్మని కోరుతూ ‘’రారా శైల నికేతనా వడిని సంరక్షించ’’అంటూ ఆయనలాంటి వారు లేరనీ ,’’రంగత్తు౦గ తరంగ గంగ ‘’ను సుమూర్ధం లో ,’’మకుటాగ్రం లో రోహిణీ పతిని దాల్చి శరణన్న వారిని వెంటనే కాపాడేవాడని స్తుతించాడు .ఎద్దు వాహనం క్రూరసర్పాలు హారాలు ధరించటం ఎందుకు నీ మిత్రుడు ధనాధిపతి కదా అన్నాడు .
‘’పరి పూర్ణుడవు ,నిర్వికల్పుడవు శోభా రమ్య దేహుండు ,విద్ధరుచిన్,ప్రాపగు దేవతా మణివి,ఆద్యంతాలు లేనివాడవు ‘’అని కీర్తించాడు .మూర్ఖుడైన వాడి జడాత్మను మార్చటానికియే విజ్ఞుడూ సమర్ధుడు కాడు.’’దక్షుం డద్వర మొప్ప జేయ నట దాక్షయణీపిల్వకే –నక్షుద్రోక్తి ని బోవ ,తారచట గర్వా౦ధ౦బున దూల ప్ర-త్యక్ష ప్రౌఢిని ప్రాణముల్ విడువ వీరావేశతన్ వీరభ –ద్రాక్షుద్ర స్థితి జంప జేసితివి కావా భీమలింగేశ్వారా ‘’అని క్షకార ప్రాసతో దక్ష యజ్ఞ ధ్వంసాన్ని కనులకు కట్టి నట్టు వర్ణించి శ్రీనాధుడు భీమ ఖండం లో క్షకార ప్రాసతో వ్యాసుడుభిక్షా పాత్ర నేలకేసికోట్టటం అన్నపూర్ణమ్మ పిలిచి పెట్టిన కమ్మని భోజనం గుర్తుకు తెచ్చాడు కవి . ,చీమకు ఏ వస్తువు కనిపించినా తన వారికి జాడలు చూపించినట్లు నాకూ దారి చూపించు ‘క్రీడా ఖేలన శైల కంధర హరా శ్రీ భీమేశ లింగేశ్వరా ‘’అని లోకోక్తిగా వేడుకొన్నాడు .సత్యమే జగత్తును ఉద్ధరిస్తుంది అదే మోక్షాన్ని,ఆన౦దాని యిస్తుంది .
‘’పద వైశద్యం అర్ధగౌరవం శోభారమ్యభావం కల చంచలాక్షి లాగా బుద్ధిబలం తో ప్రబంధాలను సత్పద వైశద్యంతో అర్ధగౌరవ శోభా రమ్యత తో రాసేవాడే కవి అన్నాడు ఈకవి ..’’కనులా కల్మష పూతిగంధజల ముక్త ద్వారకా చా౦కముల్ –చనులా క్షీర ప్రవాహ వాహయుగమాంస స్ఫారకంకాళముల్-వెనులా ?బంధుర శల్య సంచయ కళా వేశ్మైక చర్మా ధ్యముల్ –‘’అలాంటి వామాక్షులను కోరటం సబబా ?అని వేదాంత ప్రవచనం చేశాడు కవి .’’శివ ఈశాన పరాత్పరా వరద దాక్షి ణ్యైకభావా౦ బుధీ-పవమానప్రియ భాస్కరాబ్జ నయనా బాలేందు మౌళీహరా –భవమృత్యుంజయ పార్వతీ రమణ సౌభాగ్యప్రదాధీమణీ’’అని ఎలుగెత్తి స్తోత్రం చేశాడు ఆర్తిగా .చంద్రుడు ఏ చుట్టమయ్యా నీకు నెత్తికేక్కి౦చు కొన్నావ్ ?అని ఈసడింపుగా అన్నాడు .
‘’స్వర్ణ గ్రావము కార్ముకంబు రాజతక్ష్మా ద్రంబు వాసంబు –సంపూర్ణజ్యొత మణీప్రముక్త చాయ శంభూ తాబ్ది తూణంబుశ్రీ –పూర్ణ స్ఫారుడవై కరంబు సతతంబు న్ భిక్ష మందేగేదో-కర్ణ భ్రాజిత కుండలా తగునె ఏగన్ భీమ లింగేశ్వరా “’అని ‘’వాయించాడు’’ .పూలను రువ్విన వాడికి దేహం లేకుండా చేశావు .మరి రాళ్ళు రువ్వితే ఏం చేస్తావ్ (ఏం పీకుతావ్ )అని దేప్పిపోడిచాడు .నీటిలో వహ్నిలో కాష్టం లో బయలులో నీరేజం లో భూమిలో వాయువులో సకలప్రాణులలో సంక్రా౦త౦ ఎప్పుడూ ఉంటాడు శివుడు అని ఆయన విభూతిని కీర్తించాడు .అపరిచ్చిన్నం అద్వితీయం ఆద్యన్తశూన్యం అయిన బ్రహ్మం ఒక్కటే సదానందంగా వెలుగుతూ ఉంటుంది .అంటూ 88పద్యాలు చెప్పాడు .
89నుంచి ‘’శ్రీ భీమేశా వరద కవి నుతపద’’లోని మొదటి అక్షరాలతో 91వరకు పద్యాలు చెప్పాడు .99వ పద్యం లో –‘జయ సర్వేశ్వరా శాశ్వతా గిరిధరా సర్వం సహా వందితపదాచంచత్కటాక్షోదయా -జయకాత్యాయినీ నాయకా శశిధరా ,సంక్రందనాభ్యర్చితా –జయ మృత్యుంజయ జూలకల్లు పురవాసా భీమ లింగేశ్వరా ‘’అని పార్వతీ వల్లభుని స్తుతించి ,తర్వాత రెండుపద్యాలలో తనగురించి చెప్పి ‘’శ్రీ భీమ లి౦గేశ్వరార్పణ మస్తు ‘’అంటూ 101పద్యంతో శతకం ముగించాడు శానం పూడి వరద రాజ కవి .
చక్కని ధారా శుద్ధి విశుద్ధమైన భక్తీ తాత్పర్యాలు గొప్ప ఊహా ,కమనీయ కవిత్వం తో శతకం అత్యద్భుతంగా నడిచింది .భక్తులకు కొంగు బంగారం గా వెలసిన శతకమిది .దీన్ని గురించి, కవి గురించి మన మహానుభావుల దృష్టిలో పడి నట్లు తోచదు .ఈ కవినీ, శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నాకు కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

1 Response to శ్రీ భీమ లింగేశ్వర శతకం -2(చివరిభాగం )

  1. mhealthpages's avatar mhealthpages says:

    Teluguvaru Sri Kota Narasimham gari gurinichi raasina Vyasyam baagundi Master garu.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.