28 -అలంకారాభాస హాస్యం

28 -అలంకారాభాస హాస్యం

సుమారు ఆరు నెలలక్రితం’’హేత్వాభాస హాస్యం ‘గురించి రాశాను .ఇవాళ ‘’అల౦కారా భాస హాస్యం ‘’గురించి తెలియజేస్తున్నాను .శరీరానికీ ,కావ్యానికీ అలంకారాలు అందం కోసమే .ఆమె ముఖం చంద్రుని వలే ఉంది అంటే ఉపమాలంకారం కానీ ఆమెముఖం సిబ్బి లాగా ఉంది అంటే మాత్రం అది ఉపమకు ఆభాసం .అలంకారం ఉచితమైనదిగా ఉదాత్త గాంభీర్యంగా ఉండాలి ఈ లక్షణాలు కోల్పోతే ,వికృత భావ గర్భితంగా ఉంటె ,అది అభాస రూపం పొందింది అంటారు అని మునిమాణిక్యం గారు సెలవిచ్చారు .అయితే అభాస రూపం లో అలంకారం ఉంటె హాస్యం పుడుతు౦ది.అదే చమత్కారం .

 అభాస రూపం –లాక్షణికులు కొన్ని పదాలను కావ్యపరంగా నిర్వచించారు .వాటికి హాస్య పరంగా కొత్త అర్ధాలను సృష్టించుకొని హాస్యరసానికి హాస్య భేద ,ప్రభేదాలను సూచి౦చటానికి తగిన పారిభాషిక పదజాలాను సృష్టించుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు మునిమాణిక్యం .ప్రసిద్ధమైన ఉపమ ఉత్ప్రేక్ష ,మొదలైన అలంకారాలు ఆభాస రూపం లో హాస్యం కోసం ఉపయోగించుకోవచ్చు అని మాస్టారు  ఉవాచ .అప్పుడు వాటి ఉదాత్తత ,గాంభీర్యం కోల్పోతాయి .దానినే తాను  ‘’అభాస రూపం పొందటం ‘’అన్నాను అన్నారు సార్.ఈ అలంకారాలు హాస్యానికి ఎలా ఉపయోగ పడతాయో చూద్దాం .

 ఉపమా భాస హాస్యం –ఆమె జడగరిటెకాడ లాగా ఉంది .కీర్తిని శరశ్చంద్ర చంద్రిక లాగా ఉంది అనటం మామూలు .కానీ ఆ కీర్తిని కొబ్బరిముక్కతో ,కర్పూరం తో పోలిస్తే అలంకారం ఆభాసం అయి హాస్యం పుడుతుందన్నారు మునిమాణిక్యం గారు .చీకటిని నల్లసిరాతో ,మేఘాలను సిగ రేట్ పొగతో పోల్చినా ఇలాగే నవ్వు పుడుతుంది అంటారు సార్.

  చిలకమర్తి వారి నరకాసుర వధ లో మందపాలుడు రంభను ‘’ఈమె చక్కని చుక్క .దాని శరీర కాంతి తాటి పేషం వలె ఉంటుంది .వెంట్రుకలు మసిబొగ్గు నలుపు .కొప్పు మాలకాకి ,కళ్ళు ఆలు చిప్పలు లాగా ,మొగం ఇత్తడి సిబ్బిలాగా గుండ్రంగా ఉంటుంది ‘’అన్నాడని మునిమాణిక్యంగారు చెప్పారు .ఇది కొంత జుగుప్స కలిగించేదే అయినా ,మనవాళ్ళు మనకు అందించిన హాస్యం ఇదే అన్నారు మాస్టారు .

  విరోధాలంకారం –పైకి మాత్రం విరోధం కనిపిస్తూ ,అంతరార్ధం లో విరోధం లేకపోతె విరోధాలంకారం అంటారు .’’హాస్య పరంగా విరుద్ధ భావాల పదాల సంయోగం విరుద్ధం ‘’అని మాస్టారు సింపుల్ గా డిఫైన్ చేశారు .ఉదాహరణ –అతడు ప్రకాశవంతమైన చీకటిలో నడుస్తున్నాడు .వాడు మందగమనం తో పరిగెత్తాడు .వీటిలో భిన్నార్ధా  లైన పదాలను ఒకదానికొకటి విరుద్ధమైన వాటిని కలపటం జరిగింది .ఇది ఒక రకమైన ‘’వాక్చమత్కృతి ‘’అన్నారు మునిమాణిక్యం .’’ప్రొఫెసర్ గారు ఏం చేస్తున్నారు ?’’అన్న ప్రశ్నకు  శిష్యుడు ‘’మర్చిపోయిన వాట్ని గుర్తుకు తెచ్చు కుంటున్నారు ‘’’అన్నాడు .మర్చి పొతే ,మళ్ళీ జ్ఞాపకానికి ఎలా వస్తాయి .కనుక ఇది విరుద్ధ భావ సంకలనం అని తేల్చారు మునిమాణిక్యం సార్.

  ఇంకో రకమైన విరుద్ధం  -ప్రసిద్ధ విషయాలకు విరుద్ధంగా మాట్లాడటం .-‘’ఇటలీలోని హిమాలయ గుహలలో ఋషులు తపస్సు చేస్తున్నారు ‘’అంటే విరుద్ధంగా కనిపిస్తుంది .మృచ్ఛకటికం లో రాజుగారి బామ్మర్ది శకారుడు ‘ఏను దుశ్శాసనుని వలె నీ కొప్పు దొరకొందును.జమదగ్ని కొడుకు భీమసేనుడేతెంచిఆపునో ,లేక చాన కుంతికి ఆత్మజుండు శంకరుడు ఆపగల డో”?అంటాడు .ఇది ప్రసిద్ధమైన కవిసమయాలున్న విరుద్ధం అన్నారు మునిమాణిక్యంగారు.అలాగే ‘’కోకిల మావి చివుళ్ళు తిని కడుపు నెప్పితో అరుస్తోంది ‘’అంటే అది విరుద్ధ సమయం కనుక నవ్వొస్తుంది అన్నారు .

 మరో రకం హాస్యం –భర్త భార్యను సినిమాకు రమ్మనిఎన్ని సార్లు పిల్చినా రాకపోతే ‘’వాస్తావా రావా ??’’అని గట్టిగా అరిస్తే ‘’వస్తానండీ ‘’అని ఆమె అంటే .’’ఈముక్క ముందే చెప్పి చావచ్చు కదా ‘’అని అయ్యవారంటే ‘’చెప్పాను చాలాసేపటి కిందటే ‘’అంటే ‘’ఏమని అఘోరించావ్ ‘’అని ఆయన అంటే ‘’ఒక నిమిషం లో వస్తానని అరగంట కిందటే చెప్పాను మీకు ‘’అంటే నవ్వకుండా ఉండలేం .ఇందులో కాలానికి సంబంధించిన వైరుధ్యం ఉంది అన్నారు మునిమాణిక్యంగారు .మరో తమాషా ‘’కృష్ణ శాస్త్రి గారికి 49 వెళ్ళటానికి రెండుమూడు ఏళ్ళు పట్టిందట పాపం.ఎంత బాధ పడ్డాడో ?’’ ‘’అని ఒక కవి మిత్రుడన్నాడని సెలవిచ్చారు మాస్టారు  .ఇవన్నీ విరుద్ధా లంకార ఆభాస  రూపాలు అన్నారాయన .

మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో

 సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.