మద్రాస్ స్త్రీ సేవా మందిర్ లో మానవత్వం పూయించిన శ్రీ మతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రావు బహదూర్ కల్లి చిట్టబ్బాయి నాయుడు శ్రీమతి వత్సమణి దంపతులకు చన్న ఘంటమ్మ 17-11-1913 న పుట్టింది.ఆమెకు అన్న తమ్ముడు చెల్లెలు ఉన్నారు .స్త్రీవిద్య కు ఆదరం లేని ఆ రోజుల్లో ఆమె తల్లి ఈమెకు మిషనరీల సాయంతో ఇంగ్లీష్ ,కుట్లు అల్లికలు నేర్పించింది .వయోలిన్ కూడా బాగా వాయించే నేర్పు అలవడింది .కానీ ఎనిమిదవ ఏటనే కన్న తల్లిని కోల్పోయిన అభాగ్యురాలు .
తండ్రి స్వగ్రామం అయిన పూళ్ళ పంచాయితీ అధ్యక్షుడుగా చాలాకాలం పని చేసి గ్రామానికి లైట్లు రోడ్డు స్టేషన్ ,పోస్టాఫీస్ సౌకర్యాలు కల్పించాడు .స్వంతఖర్చులతో మాధ్యమిక స్కూల్ స్థాపించి సగం ఖర్చు భరించి 20ఏళ్ళు నిర్వహించిన త్యాగశీలి .అక్కడ స్త్రీలు ఘోషా పద్ధతిలోనే ఉంటారు .తలెత్తకుండా ఆస్కూల్ కు వెళ్లి క్లాస్ లో కూర్చుని చదువుకొన్నది .హైస్కూల్ చదువుకోసం రాజమండ్రి వెళ్ళింది ..హాస్టల్ సౌకర్యం లేకపోవటంతో స్త్రీల ట్రెయినింగ్ కాలేజి హాస్టల్ లో ఉండేది . తన ఈడు పిల్లలు అక్కడ లేకపోవటంతో నవ్వుకు ఆటాపాటలకు దూరం అవాల్సి వచ్చింది .ఘోషా ఉండటంతో జంకు పోలేదు .అందుకని గంభీర విషయాలు ఆలోచించటం ,మనన చింతన బాగా అలవాటయ్యింది .వీరేశలింగం గారి శరణాలయాలు విద్యాలయాలు ఆమె స్మృతి పధం లో మెదిలేవి .శ్రీమతి ముత్తు లక్ష్మీ రెడ్డి చెల్లెలు శ్రీమతి నల్లముత్తు అమ్మాళ్ హైస్కూల్ సూపరింటెండెంట్ గా ఉండేది .విదేశాలు తిరిగి వచ్చిన ఆమె పిల్లలలో ఎన్నెన్నో నూతన భావాలు ప్రవేశపెట్టటానికి ఉత్సాహ పడి అమలు చేసింది . ఆమె ఆలోచనలు సంఘ సేవ సంస్కారం సేవా బాధ్యతా క్రమశిక్షణ అందరికి ఆదర్శంగా ఉండేవి .ఇతరుల కష్టాలలో పాలు పంచు కోవటం మానవుల ఉత్కృష్ట ధర్మం అని నిరంతరం బోధించేది .ఈ విశిష్ట లక్షణాలన్నీ చన్న ఘంటమ్మ మనసులో బాగా నాటుకు పోయాయి .
ఒక రోజున అమ్మాళ్ విద్యార్ధినులకు బాగా నచ్చిన అమ్మాయిని రహస్య వోటింగ్ ద్వారా ఎన్నుకోమని చెబితే ,అందరు చెన్న ఘంటమ్మనే ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆమెకు చన్నమ్మాళ్ రాజగోపాలన్ రజత పతకం ప్రదానం చేశారు .కోస్తా జిల్లాలలో ఇంగ్లీష్ లో అత్యధిక మార్కులు పొంది రికార్డ్ స్థాపించి బహుమతి అందుకొన్నది .కాలేజీ చదువుకు మద్రాస్ వెళ్లి ,ఇంటర్ చదివి తెలుగు సాహిత్యం లో బొబ్బిలి రాజా ప్రైజ్ పొందింది .ఫస్ట్ క్లాస్ లో బిఏ .పాసైంది . ఎం ఏ ఫిజిక్స్ చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకొన్నది .కాలేజిలో మళ్ళీ నల్లముత్తు అమ్మాళ్ సాహచర్యం తో ‘’అవ్వై హోమ్ శరణాలయాలు ,అనాధాశ్రమాలు,వితంతు శరణాలయాలు గురించి చేబుతూఉంటే మంత్రోప దేశం పొందిన అనుభూతి పొందేది ఘంటమ్మ . 1937 చన్న ఘంటమ్మకు మద్రాస్ వాస్తవ్యుడు అన్నాప్రగడ వెంకట కృష్ణారావు తో వివాహం జరిగింది .ఆయన భౌతిక శాస్త్రవేత్త. ఫిజిక్స్ పరికరాలు తయారు చేసేవాడు .వీటి నిర్మాణంలో వర్క్ షాప్ లో భర్తకు ఆమె సహాయ సహకారాలు అందించేది .అప్పటికే ఎల్.టి.శిక్షణ కూడా పొంది ఉండటంతో నాలుగేళ్ళు స్కూల్ టీచర్ గా పని చేసింది .కానీ ఎందుకో చాలా చప్పగా ఉందనిపించింది .దుర్గాబాయిదేశాముఖ్ వీరింటి ప్రక్కనే ఉండేది .అందువలన ఆమెతో ఆంధ్ర మహిళా సభతో సన్నిహిత సంబంధ మేర్పడింది .సేవాభావ బీజాలు ఇదివరకేఉన్నందున అవి మొలకలెత్తటం ప్రారంభించాయి . దుర్గాబాయి కోరికపై మహిళా సభలో స్త్రీలను బెనారస్ మెట్రిక్ పరీక్షలకు తయారు చేయటానికి మొట్టమొదటి టీచర్ గా సంతోషంగా ఒప్పుకున్నది ఘంటమ్మ .ఈమె నైపుణ్యాన్ని అంకితభావాన్ని కనిపెట్టిన దుర్గాబాయి ఆమెపై అనేక గొప్ప బాధ్యతలు పెట్టటం ప్రారంభించింది .ఆంధ్ర మహిళా పత్రిక మహిళా ప్రెస్ ,పారిశ్రామిక శాఖ ,కుటుంబ నియంత్రణ శిక్షణ విభాగానికి చైర్మన్ ,నర్సింగ్ హోమ్ అడ్మిని స్ట్రెషన్ కార్యదర్శి గానేకాక మొత్తం మహిళాసభకు శ్రీమతి జమునాబాయ్ తోపాటుజాయంట్ కార్య దర్శి బాధ్యతలుకూడా సర్వ సమర్ధంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకొని ఘంటమ్మ ‘’చెన్న ‘’మంచి మహిళ అని ప్రసిద్ధి చెందింది .అందరికి తలలో నాలుకగా మెలగింది .వీటన్ని నిర్వహణకు కావాల్సిన ఆదాయం కోసం ఆమె నిరంతరం ఆలోచించేది .ఇన్ని సమర్ధతలున్న ఆమెను దుర్గాబాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సమితికి ప్రధమ చైర్మన్ గా 1954 నియమింప జేయగా 1959 వరకు పనిచేసి విస్తృతంగా పర్యటించి ,అనేక స్వచ్చంద సేవా సంస్థలు స్థాపించింది .1960లో ఈబాధ్యతలన్నీ వదిలేసి తానె స్వయంగా ఆర్తులకోసం పని చేయాలని నిశ్చయించుకొన్నది .
అద్డంకి సుందరమ్మ ,శ్రీ శర్మ దంపతులు మొదలైనవారుకలిసి ‘’స్త్రీ సేవా మందిర్ ‘’స్థాపించి వయోజనులైన స్త్రీలకూ జీవనోపాధి కల్పించటానికి కృషి చేశారు .వృత్తి విద్యలు నేర్పారు .సుందరమ్మ అధ్యక్షులు చన్న ఘంటమ్మఉపాధ్యక్షులుగా తీర్చి దిద్దారు .1960లో నిర్వహణ బాధ్యతలు తీసుకొని ,ఆధునికతకు స్థానం కల్పించి మహిళస్వయంగా తన కాళ్ళ పై తాను నిలబడే అన్ని రకాల సదుపాయాలూ కల్పించింది .పరిశ్రమలు సంక్షిప్త విద్యావిధానం ,కుట్టు అల్లికల క్లాసులు క్రెష్,బాలవాడి కిండర్ గార్టన్ స్కూళ్ళు,మాధ్యమిక ఉన్నత విద్యాలయాలు ,పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, కామర్స్ శిక్షణాలయం వంటివి ఎన్నెన్నో చేర్చింది .రేడియో మెకానిక్స్ ,ఇన్స్ట్రు మెంటల్ మెకానిక్స్ ,ప్రెసిషన్ వర్క్స్ వంటి అనేక నూతన విధానాలు ప్రవేశపెట్టింది .అశోక నగర్ ,సాలిగ్రాం విరుగం బాకం వంటి చోట్ల బ్రహ్మాండమైన స్వంత భవనాలు కట్టించింది .నాలుగు అంతస్తుల ‘’ఉడ్ అండ్ న్యూట్రి షన్ ‘’స్థాపించి పోషక ఆహార విజ్ఞానం బాలికలకు యువతకు కల్గిస్తున్నారు .సమగ్రమైన జ్ఞానంతో వయసుకు పరిస్థితికి సమయానికి తగినట్లు పరిశుభ్ర ఆహార పదార్ధాలు తయారు చేసి నిలవ చేసి అందిస్తున్నారు .సమగ్రమైన ఆరోగ్య సూత్రాలతో నైతిక విలువలతో విద్యాబోధన జరిపిస్తున్నారు .ఈ స్త్రీ మందిర్ నీడన చదువో జీవనోపాధో ,వృత్తో, ఉద్యోగమో ఆశ్రయమో సంరక్షణో పొందేవారి సంఖ్య నాలుగు వేలపైనే ఉంటారు పోలియో వ్యాధితో నేలమీద దేకే జానకిరాం ఈ మందిరంలోనే నడకనేర్చి ,చదివిఉద్యోగం చేసింది . .ఇదంతా శ్రీమతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ ఆలోచన, కృషి ఫలితమే .మహిళాలోకం ఆమెకు సదా కృతజ్ఞత తో ఉంటుంది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-19-4-23- ఉయ్యూరు