ఓరుగల్లు జిల్లా ప్రాతస్మరణీయుల కైమోడ్పుకాతి పు౦జమే   –డా. శ్రీరంగస్వామి ‘’స్పూర్తిమూర్తుల జీవన రేఖలు ‘’

ఓరుగల్లు జిల్లా ప్రాతస్మరణీయుల కైమోడ్పుకాతి పు౦జమే   –డా. శ్రీరంగస్వామి ‘’స్పూర్తిమూర్తుల జీవన రేఖలు ‘’

వరంగల్ జిల్లా హసన్ పర్తి వాస్తవ్యుడు శ్రీలేఖ సాహితీ సారధి ,ఆత్మీయుడు డా .టి.రంగస్వామి తన సంస్థ 141వ కాంతి రేఖగా ఈ జనవరిలో వెలువరించిన ‘’మన కాంతి పుంజాలు ‘’అనే వరంగల్ జిల్లా స్ఫూర్తి మూర్తుల జీవన రేఖలు ,140వ కిరణంగా విడుదల చేసిన సాహిత్య వ్యాస పుష్పగుచ్చం ‘’వెలుగుల గుత్తి ‘’నిన్న రాత్రి అందగా వెంటనే అందినట్లు మెసేజ్ పెట్టాను .ఇవాళ ఉదయం  కాంతి పుంజాలు వెలుగు రేఖలను కళ్ళారా చూసి అంటే చదివి ,ఆతేజో మూర్తులు ఎవరికైనా ఆదర్శ మూర్తులే అనే భావనతో స్పందిస్తున్నాను .రెండవ పుస్తకం సాహిత్య సంబంధం కనుక  అందులో నా ప్రవేశం అంతంత మాత్రమె కనుక తీరిగ్గా చదివి స్పందిస్తా.

 మన కాంతి పుంజాలు లో 57మంది జగజ్జెట్టీలు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారున్నారు .వీరి జీవన రేఖల  కాంతి పుంజాలను లోకానికి ప్రసరిప జేయటానికి అవిశ్రాంత కృషి సల్పిన రంగస్వామి నిజంగా సాహితీ’’ రంగ సామే’’ .అతని శ్రీలేఖ ‘’సాహితీ శ్రీరంగమే’’ .ఈ కాంతి పుంజాల కాంతి కణాలను మీకు సూక్ష్మ౦గా అంద జేస్తున్నాను .

ముందుగా ఉమ్మడి వరంగల్ దారి దీపాలను పరిచయం చేశారు .వీరిలో నృత్త రత్నావళి కర్త  మా కృష్ణాజిల్లావాడు జాయపసేనాని ,పాల్కురికిసోమన ,తిరునామాలకర్త ,విద్యానాధుడు ,దూపాటి ,నీతి సారం రాసిన  కాకతి రుద్రదేవుడు అధ్యాత్మ రామాయణ కర్త పరశురామపంతుల గురుమూర్తి లింగమూర్తి లను వివరించి సమకాలీన సాహితీ మూర్తులకు నీరాజనాలు అందించారు .ఆశువుగా రామునిపై సీసాలు రాసిన వరకవి కిరం భూమా గౌడ్ ,జ్యోతిష జాతకనిపుణుడు పరాంకుశం నమ్మల్వారయ్య ,ధార్మికుడు ఆకారం నరసింగం గుప్త ,ఒద్దిరాజు సోదరులు వారి కవితా ప్రతిభ ,వారి అనాటమీ భౌతిక శాస్త్ర అనువాదాలు చేతిపనులు –102యోగాలు వివరించి ,,ప్రకృతి వైద్యాచార్యగంగుల సాయి రెడ్ది ,కర్ణాభ్యుదయకర్త పండితప్రకర్ష అంబటి లక్ష్మీ నరసింహరాజు ,కౌముది సూత్రాలను నాలుకపై నిత్యం నర్తి౦పజేసిన గార్లపాటి రాఘవ రెడ్ది ,దేశ సేవా పరాయణురాలు, పంతులమ్మ’’శ్రీకృష్ణుని దేశ సేవ ‘’కావ్యకర్త  చాట్రాతి లక్ష్మీ నరసమ్మ,కాళి దాస ఋతు కావ్యానికి అనువాదం రాసిన కవిరాజు గొట్టుముక్కల రాధా కృష్ణారావు ,సంపాదనలో శ్రేష్టి దాతృత్వంలో మేటి  ,విద్యాదాత ,చెరువు నిర్మాణం చేసిన ఇంటిపేరు’’ చందా’’ను సార్ధకం చేసుకొన్న’’దర్జే అవ్వల్’’ చందా కాంతయ్య శ్రేష్టి ,క్రీస్తు గీతాలురాసిన పనివారలపత్రిక సంపాదకురాలు కేశపోగు గుల్బానమ్మ ,అర్చకత్వ ,పౌరోహిత్యాలతోపాటు పోలీస్ పటేల్ అయిననెహ్రు నిర్యాణ పద్యకావ్య కర్త  కందాడై గోపాలా చార్యులు,రైతు రామాయణం రాసిన సేద్యకవి ‘’మడికవి’’గా వాసికెక్కిన వానమామలై జగన్నాధా చార్యులు ,మనోరమకవి ఉదయరాజు శేషగిరిరావు ,త్రిపురారహస్యం ను తెనిగించిన దేవీ ఉపాసకులు హరి రాధా కృష్ణ మూర్తి,కాళోజి బ్రదర్ ,కళా హృదయ రసజ్ఞుడు కలాం ఎ షాద్ కాళోజి రామేశ్వర రావు ,పాండిత్య శిఖరం సంస్కృతాంధ్ర కాలేజి సెక్రెటరి లీలావతార తాత్పర్యాది రచయిత ముదిగొండ శంకర శాస్త్రి ,కాకతీయ మెడికల్ కాలేజి స్థాపనకు సహకరించిన టి.ఎస్.మూర్తి  కష్టపడి వేదాంత నిఘంటువు రాస్తే ఉపాధ్యాయుడైన కొడుకు బజ్జీల కొట్టు వాడికి చిత్తు కాగితాలకింద అమ్మి,పుస్తకం కనపడకుండా పోగొట్టుకొన్న విధి వంచితుడు వృక్షాలజగాన్నాధం కధ దయనీయం .

  జాతీయ ఉద్యమంలో ఊపిరులు అందించిన తిరురంగం హయగ్రీవా చార్యులు ,స్వాతంత్ర్య సమరయోధ కలికితురాయి ,జండా ప్రతిష్టాపనలో ఖాసిం షరీఫ్ బల్లానికి గురై ప్రాణాలు అర్పించిన బత్తిన మొగిలయ్య , బాడ్మింటన్ లో స్టార్ ఆఫ్,ఇండియా ,అర్జున అవార్డీ  బాట్ మాంత్రికుడు జమ్మలమడుగు పిచ్చయ్య  ,మాతృస్మృతికర్త తిరుకోమూరు రామానుజస్వామి ,కమ్యూనిస్ట్ నాయకుడు మద్దికాయల ఓంకార్ ,హాస్యప్రియ ,శ్రీకృష్ణ వైష్ణవాష్టకం కర్త  వివాహ తంతును దృశ్యకావ్యం గా సాగించిన యాజ్నికుడు తిరునగరి వెంకటేశ్వర్లు , కళ్యాణ రాఘవం రాసిన అవధానకవి చిలకమర్రి రామానుజా చార్యులు ,పేపర్ బాయ్ గా ప్రవేశించి పత్రికా సంపాదకుడుగా ఎదిగిన పత్రికా’’ నీలమణి ‘’ ఏం ఎస్ ఆచార్య ,నటుడు,ప్రయోక్త ప్రజామిత్ర వారపత్రిక సంపాదకుడు దివ్వెల హనుమంతరావు ,పోతన సరస్వతీ సాక్షాత్కారం సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల చిత్రకారుడు ,ఫోటోగ్రాఫర్ దెందుకూరి సోమేశ్వర రావు ,భారతీయ రచయితల సమితి స్థాపకుడు ఆర్ ఎస్ ఎస్ నాయకుడు గొప్పవక్త మహా రచయిత,పృధ్వీ సూక్తం ,రాసి పోతన విజ్ఞాన పీఠం నెలకొల్పిన భండారు సదాశివరావు లను సముచితంగా వివరించారు .1994 లో రాజమండ్రి లో భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారి ఆధ్వర్యంలో  మూడు రోజులు కప్పగంతుల మల్లికార్జునరావు నిర్వహణలో  జరిగిన సభలలో అగ్రస్థానం భండారు వారిదే .అప్పుడే శ్రీరంగస్వామి తో పరిచయం అయింది .అప్పుడే జానకీజానిగారితోనూ పరిచయమై  వారి జీవితాంతం వరకు ఆమైత్రి కొనసాగిందినాకు మా బావమరిది ఆనంద్ కు .అక్కడే ఆచార్య జివి సుబ్రహ్మణ్యం ,విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ మల్లమపల్లి శరభయ్య గారు,తనికెళ్ళ భరణి పరిచయం జరిగింది .

  వైష్ణవ కుటుంబంలో ఏకైక ధ్వన్యనుకరణ విద్వన్మణి తిరుకోమూరు మనోహరస్వామి ,ఉభయ వేదాంత ఆచార్య ,మహామహోపాధ్యాయ ,శాస్త్ర రత్నాకర నల్లాన్ చక్రవర్తుల నరసింహా చార్య ,కాకతీయ యూని వర్సిటి సిండికేట్ సభ్యుడు ,లోక ఆదాలత్ వ్యవ స్థాపక  అధ్యక్షుడు భండారు చంద్రమౌళీశ్వరరావు,,వరంగల్ చైర్మన్ పరికి పాటి ఉమా రెడ్ది ,అభినవ ఆంజనేయుడు జమ్మలమడక కృష్ణమూర్తి ,పంచాయతీ రాజ్ అధ్యక్షులు నెమురుగొమ్ముల యతి రాజారావు , ‘’కుమార్ పల్లి’’ అనే హనుమకొండలో యువకులకు వేదిక నిర్మించిన నిస్వార్ధ దళిత నాయకుడు బిఆర్ భగవాన్ దాస్,,ధీశాలి సాహిత్య నాటక రంగ  ప్రవేశమున్న మహమ్మద్ నవాజ్ ఆలీ ,ఛందో శిఖరం ,పోతనభాగవత నీరాజనంకు సంపాదకులు పద్యాన్ని ఊరేగించిన మహామహుడు శ్రీమాన్ కోవెల సంపత్కుమార ఆచార్య .’’వనితల్ నేర్వగరాని విద్దె గలదే ముద్దార నేర్పించినన్ ‘’   అనే పద్యం ఎవరు రాశారు ఎందులోనిది అని మాసాహితీ మిత్రులు బుర్రలు బద్దలు కొట్టుకొంటూ ‘’దీన్ని మీరే సాధించాలి ‘’  అని నానెత్తిన  పడేస్తే నేను మహామహులందరికీ కార్డులు రాస్తే ఒక్క సంపత్కుమార ఆచార్యగారే జవాబు రాసి ప్రసన్న యాదవం నాటకం లోనిదని చిలకమర్తి రాశారని జవాబు రాసిన సహృదయమూర్తి .ఆయన చిట్టిగూడూరు క్లాస్ మేట్ బెల్లం కొండ పురుషోత్తం గురించి అడిగితె మ ఇంటి ప్రక్కనే అయన ఇల్లు  అనీ ,నెల్లూరులో తెలుగు పండిట్ గా ఉన్నాడని  అడ్రస్ తో సహా పంపిస్తే చాలా సంతోషించారు .పెదముత్తేవి లక్ష్మణ యతీన్ద్రులపై ఆయన రాసిన పద్యకావ్యం ను చేరా సమీక్షించి మెచ్చితే ఆయనకు ఆవిషయం కార్డ్ రాస్తే ఆపుస్తకంపంపిన అమృత హృదయులు ఆచార్యశ్రీ .

  సామూహిక చేతనసంఘోపజీవి ముక్తవరపు శ్రీరాములు ,వనమాలి నల్లనయ్యకు మణిమాల అల్లిన తిరునగరి కృష్ణయ్య ,హనుమాన్ చాలీసాకు చక్కని వ్యాఖ్యానం రాసిన డాక్టర్ రామక  లక్ష్మణ మూర్తి ,రంగులకవిత కర్త రంగు చక్రపాణి ,తెలంగాణా చరిత్రను ఔపోసనపట్టిన పరాంకుశం దామోదరస్వామి ,అభినవ మొల్ల విరహగోపిక ,యువతీ శతక కర్త మంథెన ఆండాళమ్మ ,జీవన సమరం నవలా రచయితయం వి తిరుపతయ్య ,తెలంగాణా జాతీయాల పెన్నిధి ,రాజనీతి శతక కర్త వేముల పెరుమాళ్ళు ,నడిచే సరస్వతీ స్వరూపం అష్టకాల నరసింహరామ  శర్మ,,ఆర్యసమాజ సేవకుడు పొగాకు సుదర్శన్ ,ఉత్తమ ఉపాధ్యాయుడు ,చిత్రకారుడు నాటక ప్రయోక్త సిద్దోజు నరసింహా చారి ,కార్మిక పక్షపాతి ,కవనరాజు మొహమాటి, కె మోహన రాజు ,దళితకవి నలభై పుస్తకాల రచయిత తక్కళ్ళ బాలరాజు ,కవి,కధకుడు ,భావుకుడు యం రత్నాకర్ ,ప్రసారికుడు నమిలికొండ బాలకిషన్ రావు ,దళిత ఆది వాసీల హక్కులకోసం పోరాడేసావిత్రీ బాయిఫూలె సంస్థ డైరెక్టర్ కందాళ శోభారాణి జీవిత రేఖలతో 56మంది అయ్యారు  ,చివర్లో57గా  తెలంగాణ దారి దీపాలు సంపాదకుడు గంటా జలంధర రెడ్ది చూసిన ఒక చూపు ‘’తెలంగాణ చలి వెలుగు ‘’తో పుస్తక౦ పూర్తయింది .ఎందఱో మహానుభావులు అందరికి వందనములు .ఎంతో పరిశ్రమించి  విషయ సేకరణ చేసి  రాసిన ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు వెలుగు చుక్కాని .’’సాహిత్య రంగస్వామి’’ని మనసారా అభిన౦దిస్తున్నాను .

ఈ మహానుభావుల చిత్రాలు ఉంటే బాగుండేది .అది లోపం అనిపిస్తోంది .

మంచి ముద్రణ ,చక్కని ముఖ చిత్రాలు ,శ్రీలేఖ సాహితీ సేవ మొదలైన వివరాలతో పుస్తకం సర్వాంగ సుందరంగా ఉంది .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-24-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.