అవనిగడ్డలో కృష్ణా జిల్లా రచయితల 16 వ సమావేశం ,శ్రీ మండలి కృష్ణారావు గారి 27 వ వర్ధంతి –పుస్తక సిరి -2
ఆ వేదికపై ముందు ఎడమవైపు కృష్ణారావు గారి బఫ్ట్ సైజ్ విగ్రహం ,ఎదురుగా ఉన్న గోడ మధ్య ఆయన నిలువెత్తు ఫోటో ,దాని చుట్టూ వివిధ సందర్భాలలో ఆయన చేసిన సేవాకార్యక్రమాలు ,ఆయా సమయాలలో విచ్చేసిన ప్రధాని ముఖ్యమంత్రి మొదలైన పెద్దలఫోటోలు ,కుడి ఎడమల గోడలపై జాతీయ నాయకుల ఆకర్షణీయ చిత్రాలు ఒక పవిత్రత కర్తవ్య నిర్వహణ బోధ చేసేవి గా గాంధీ క్షేత్రం ఆనే పేరుకు తగినట్లు ఉన్నాయి .
1- వేదికపై ఆవిష్కరింప బడిన పుస్తకం డా.మండలి బుద్ధ ప్రసాద్ రచించిన ‘’కృష్ణం వందే జీవనాధారం ‘’-కృష్ణా జిల్లా ప్రగతి-నా జ్ఞాపకాలు . ఇందులో కృష్ణా జిల్లాచరిత్ర విహంగ వీక్షణం ,కృష్ణా డెల్టా చరిత్ర ,జిల్లా అభి వృద్ధి ,గాంధీ యుగం లో కృష్ణా జిల్లా ,స్వాతంత్ర్య ఉద్యమానికిఊపిరులూదిన బెజవాడ కాంగ్రేస్,మణి దీపాలు వెలిగించిన దివ్య సీమ విలువలకు పట్టం కట్టిన బందరు పత్రికా ప్రస్థానం,నదీ నాగరకతకు, గుర్తుగా వెలసిన కృష్ణా విశ్వ విద్యాలయం ,సాంస్కృతిక వారసత్వ వారధులు –కూచిపూడి కళాకారులు ,ప్రక్రుతి ప్రకోపం –మానవ స్పందన ,తెలుగు జాతి ప్రకాశం ,తెలుగు భాషా వికాసం లక్ష్యంగా –కృష్ణా జిల్లా రచయితల సంఘం అనే 12 శీర్షికలతో జిల్లా సమగ్ర సమాచారం విహంగ వీక్షణం గా దర్శిస్తాం చదివి పొంగి పోయి పులకిస్తాం .విషయ సేకరణకు నివ్వేరపోతాం .అన్ని వ్యాసాలూ ఆణిముత్యాలే .’’కన్న బెన్న’’అయిన కృష్ణమ్మకు దివ్య ఆభారణాలే శోభాయమానాలే .
2-ప్రపంచ తెలుగు రచయితల 5వ మహాసభలలో ప్రచురితమైన –గమ్యం –గమనం వ్యాస సంకలనం2022 పుస్తకం.కృష్ణా జిల్లా రచయితల సంఘం పుస్తకం అంటేనే అదొక రిఫరెన్స్ గ్రంధం .ఎందరెందరో లబ్ధ ప్రతిష్టులైన రచయితల మేదో మధనం లో వెలువడిన వ్యాస నవనీటాలే పారిజాటాలే .అన్నీ అన్నే అనిపిస్తాయి .తీరిగ్గా ఓపిగ్గా చదివి మెదడుకు మేత నందించే విలువైన ఆకర గ్రంధం .చదివి ఆనంది౦చాలె కానీ మాటలకు అందని మహితాన్విత గ్రంధం .తెలుగు భారతావతరణం ముఖ చిత్రం నన్నయ ,రాజరాజ నరేంద్రుడు లతో పరమ వైభవంగా దర్శన మివ్వటం అద్భుతం
3-ప్రముఖ కవి శ్రీ సరికొండ నరసింహ రాజు నాకు అందజేసిన ‘’తల్లడిల్లే తల్లి వేరు ‘’కవితా సంపుటి .సభలోనే చదివేసి నా అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా కవి గారికి తెలియ జేసి ఆశ్చర్య పరచాను .ఇంటికి వచ్చి చూస్తె ఆపుస్తకం నాటో రాలేదు .ఎక్కడో మిస్ అయింది .అద్భుత కవిత్వం .’’మనం నదిగా మారాలి నదిగా ప్రవహించాలి ‘’అన్న లైన్ మాత్రం జ్ఞాపకం ఉంది .
4-డా.సి చెన్నకేశవ రాసిన ‘’శ్రీ వాణీ శతకం ‘’దీన్ని తనగురువు శ్రీ గరిమెళ్ల సోమయాజుల శర్మకు అంకితమిచ్చారు ఇప్పటికి శతాధిక శతకాలను పరిచయం చేశాను సరస భారతిలో .దీన్ని తాపీగా పరిచయం చేస్తాను .
5-మిత్రుడు తపస్వి శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ఈ జనవరిలో రచించిన ‘’వెంకటేశా నిన్ను వేడుకొందుదేవ ‘’శతకం ను కూడా తర్వాత పరిచయం చేస్తాను
6-మిత్రుడు ,శ్రీ బుద్ధప్రసాద్ ఆస్థాన కవి డా.గుడిసేవ విష్ణుప్రసాద్ రాసిన ‘’దీని తస్సాదియ్య-తెనుగు తెనుగు ‘’శతకం కూడా ఇతీవలిదే .దీన్నీ పరిచయం చేస్తా సావకాశంగా .
7-శ్రీ అక్కిరాజు భవానీ ప్రసాద్ గారి –కృష్ణా డెల్టా –పూర్వాపరాలు వివరణాత్మకమైన చిరు పొత్తం
8-ఉదాహరణ వాజ్మయం ప్రక్రియలో శ్రీ నందుల అత్యుత రామ శాస్త్రి గారు రాసిన ‘’శ్రీ రామోదాహరణం ‘’.ఇది రామాభిరామం గా ఉంది ఆని కితాబిచ్చారు డా ముదిగొండ శివ ప్రసాద్ .చదివి స్పందిస్తాను .
9-శ్రీ సుశర్మ 2016 లో రాసి ప్రచురించిన ‘’శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయచరిత్ర ‘’పరమ పావనం .పూజా విధానంతో సహా వివరంగా ,మంచి చిత్రాలతో సుందరంగా ఉంది .ఇది కూడా తాపీగా చదివి రాస్తాను .
ఈ విలువైన పుస్తకాలు అవనిగడ్డ లో నాకు అందజేసిన కవులకు రచయితలకు ధన్యవాదాలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-24-ఉయ్యూరు

