‘’అక్షర గుడి సేవ ‘’కుని తెలుగు ఆరాధనా శతకం –‘’దీని తస్స దియ్య తెనుగు తెనుగు ‘’
108 ఆట వెలదులతో కవి గుడిసేవ విష్ణుప్రసాద్ ఆడుకొన్న శతకం ఇది .శీర్షికే శతక మకుటం .ఎవ్వరిని అడిగినా ‘’బాస యన తెనుగు బాసయే బాస ‘’అంటారని మొదలుపెట్టి ,అప్పయ్య దీక్షితుల నానుడి చెప్పి ,ఒన మాల తో ఓంకారమనిపించి దైవ భక్తీ నేర్పే భాష ,తెనుగు నేరిస్తే తేజం అబ్బుతు౦దని ,జనపదులలో జానపదులు రాయబారపద్యాలు గేదేలమీద ఎక్కి పరవశించిపాడి వ్యాప్తి చేశారని ,చంకలో పిల్లాడిని లాలిస్తూ గోరుముద్దలు పెట్టె బాష అనీ ,ప్రేమంతా కురిపించి అమ్మపెట్టే భోజనం లాటిదని ,వాలుజడల సత్యభామ వంపు సొంపులభాష అనీ ,భారత మాత క౦ఠ హార భాష అన్నారు .
జీవాలను నిలిపే తేట తియ్యని బాస ,కాంతల సిగలో మూర మల్లెపూలను ముడిచి తావులీను భాష ,జీవన మంజూష ,పిల్లతెమ్మెర హాయి గూర్చు భాష ,పౌష్యలక్ష్మి పకపకా సంక్రాంతికి నవ్వే భాష ,అనుబంధాల పిలుపుల భాష ,అన్నమయ్య పదాలాతో పులకించిన భాష .సర్వ ధర్మ సంస్కారం బోధించే గురు భాష .జక్కన్న శిల్ప శోభతో విలసిల్లె భాష , కర్ణపేయమైన కమ్మని బాస .వివిధ జానపద కళలు వర్షిల్ల జేసినభాష .అందుకే ‘’తగిన ప్రేమనుంచి తరియి౦పవలెనురా –‘’దీని తస్స దియ్య తెనుగు తెనుగు ‘’అంటూపొంగిపోతూ ముగించాడు శతకం .ప్రతి పద్యం పరిమళ భరితంగా ,పెద్దనగారి కప్పురపు విడెం గా ,తెలుగు వారి మల్లె పూవు లా శోభాయమానంగా ఉంటూ ‘’దీని సిగ దరగ –ఇదేమి శతకమురా ‘’ఆని నోళ్ళు తెరుచుకోనేట్లు చేస్తుంది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-24-ఉయ్యూరు .

