చలం గారి సన్నిహితుడు ,రఘుపతి వారి శిష్యుడు ,హితకారిణి ఉపాధ్యాయుడు ,సర్వోదయ నాయకుడు ,స్వాతంత్ర్యసమర యోధుడు,’’ఆనంద నికేతనఆశ్రమ ‘’ స్థాపకులు,ధర్మజ్యోతి పత్రిక సంపాదకులు గ్రామసేవక విద్యాలయ ప్రిన్సిపాల్ -శ్రీ తల్లాప్రగడ ప్రకాశ రాయుడు .
ప.గో.జి. ఉంగుటూరులో 15-4-1893న శ్రీ తల్లాప్రగడ ప్రకాశ రాయుడు జన్మించారు .తణుకులో పాఠశాల విద్య పూర్తి ,చేసి ,రాజమండ్రి ఆర్ట్స్ కాలేజిలో చదివి ,బి.ఏ .డిగ్రీ పొందారు .అప్పుడే శ్రీ రఘుపతి వెంకట రత్నం నాయుడు శ్రీ కందుకూరి వీరేశలింగం గార్ల ప్రభావానికి లోనయ్యారు .రాజమండ్రి హితకారిణి పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయులుగా పని చేశారు .విద్యార్ధి దశలో శ్రీ గుడిపాటి వెంకట చలం వీరి సన్నిహిత మిత్రుడు .
రాయుడుగారు బ్రహ్మ సమాజం పట్ల ఆకర్షితులై ,కలకత్తా వెళ్ళి ,అక్కడ ఇంగ్లిష్ లిటరేచర్ లో ఎం.ఎ. పాసయ్యారు .రాజకీయ అరంగేట్రం అప్పుడే చేసిన గాంధీ గారి ప్రబోధంతో 26వ ఏటస్వాతంత్ర్య సమరం లో ప్రవేశించారు .రాజమండ్రి బళ్ళారి, రాయవెల్లూరు ,కోయంబత్తూరు జైళ్ళలో చాలాసార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారు .పగోజి భీమవరం లో సత్యాగ్రహం చేసి తీవ్ర లాఠీ దెబ్బలకు గురై స్పృహ కోల్పోయారు .విద్యాదికులని వీరికి జైలులో రెండవ తరగతి కేటాయించినా ,నిరాకరించి ,తోటి వారితో కలిసి మూడవ తరగతి ఖైదీగానే ఉన్నారు .
పదవి ,అధికారాలకు దూరంగా ఉంటూ,నిరాడంబరంగా మహాత్ముని నిర్మాణ కార్యక్రమాలు అమలు చేయటానికి అహరహం కృషి చేశారు .సహాయ నిరాకరణ ఉద్యమం లో చదువులు మానేసిన వారికి వీరు రాజమండ్రిలో ఒక జాతీయ పాఠశాల నిర్మించి ఉత్తమ ప్రమాణాలతో నిర్వహించారు .1924లో తన వూరి వారైన శ్రీ తల్లాప్రగడ నరసింహ వర్మతో కలిసి చాగల్లు సమీపం లో మహాత్ముని ప్రబోధాలు అమలు చేయటానికి ‘’’’ఆనంద నికేతన ఆశ్రమం ‘’స్థాపించారు .గాంధీజీతో పాటు ఎంతోమంది ప్రముఖులు సందర్శించి దీన్ని ప్రశంసించారు .ఆశ్రమంలోని చాలామంది హరి జన బాలురను తీర్చి దిద్దారు .
1939లో ‘’ఆంధ్ర బ్రహ్మ సాధనాశ్రయం ‘’పక్షాన ‘’ధర్మజ్యోతి ‘’మాసపత్రికను 1939 నుంచి ,జీవితాంతం నడిపారు .పదవులు ఆశించక పోయినా, ప్రకాశం పంతులుగారి కోరిక మన్నించి 1947లో కొంతకాలం అనంతపురం జిల్లా జౌళి కమీషనర్ గా పని చేసి ,తర్వాత గోపన్న పాలెం లో ‘’గ్రామ సేవక విద్యాలయ ‘’ప్రిన్సిపాల్ గా ,సేవాప్రదాన పదవులు మాత్రం నిర్వహించారు .ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారు తమ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించటానికి ముందు తల్లాప్రగడ రాయుడుగారి ప్రత్యెక దీవెనలు పొందారు .1952-55 మధ్య రాయుడు గారు తెనాలిలో ఒక గురుకుల పాఠశాలకు అదిపతి గా ఉన్నారు .ఖాదీ గ్రామోద్యోగా ఉత్పత్తుల అభివృద్ధి వీరికి అత్యంత ప్రియమైనది .గాంధీ స్మారక నిధి సంపాదక వర్గ అధ్యక్షత ,ఆనిది తరఫున జరిగిన అనేక కార్యక్రమాల నిర్వహణ ,,కొవ్వూరులో ‘’ఆంధ్ర గీర్వాణ విద్యా పరిషత్తు ‘’సంపాదకమండలి సభ్యత్వం మొదలైనవి ఎన్నో సర్వ సమర్ధంగా నిర్వహించారు తల్లాప్రగడ వారు .మాహాత్మా గాంధీకి, బ్రహ్మ సమాజ మతానికి సంబంధించిన 15పుస్తకాలు ఇంగ్లిష్ తెలుగు భాషలలో రాయుడు గారు రచించారు .తమ జీవిత చరిత్రను ‘’’’నా రాట్న చక్రం (అనుభవాలు –జ్ఞాపకాలు )గా రచించారు .నిస్వార్ధ నిరాడంబర జీవులైన శ్రీ తల్లాప్రగడ ప్రకాశ రాయుడు గారు 28-2-1988 న హైదరాబాద్ లో 95 వ ఏట పరమపదించారు .
ఆధారం –శ్రీ గండూరి కృష్ణ గారి వ్యాసం
కనుమ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-25-ఉయ్యూరు

