కాళి దాసు ప్రియంవద -1
కవికుల గురువు కాళిదాసు ”అభిజ్ఞాన శాకుంతలం ”నాటకం లో తన అమృత కవితా సంపదను నిక్షిప్తం చేశాడు .కవిత్వం పలు పోకడలు పోయి ,దివి భువులను ఏకం చేస్తుంది .భారతీయ జీవన విధానం యొక్క ఉత్రుష్టతను చాటి చెప్పిన నాటకం .ప్రేమైక జీవులు ప్రేమ మైకం లో పడి ,బాధ్యతలను ,గృహస్తాశ్రమ ధర్మాలను విస్మరించ రాదనీ యెలు గెత్తి చెప్పాడు మహా కవి .ఇందులో ఆయన చిత్రించిన నాయికా నాయకులు ,శకుంతలా దుష్యంతులు సాహిత్యా కాశం లో చిర కాలమ్ ప్రకాశించే ధ్రువ తారలు గా నీలి చారు .ప్రధాన పాత్రల విషయం లోనే కాదు ,అతి సామాన్య పాత్రలను కూడా ,వ్యక్తిత్వం తో నిండి వున్నట్లు ,అతి శ్రద్ధగా పోషించారు .ప్రతి పాత్రను ,ఔచితీ యుతం గా ,నిర్దుష్టం గా మలిచిన మహా శిల్పి కాళి దాసు .ప్రస్తుతం శాకుంతల నాటకం లో శకుంతల చెలి కత్తె ”ప్రియంవద ”పాత్ర నిర్వహణ లో కాళిదాసు చూపిన ప్రతిభా పాటవాన్ని వివరించటమే ఈ వ్యాసం ధ్యేయం .ఎవరి దృష్టీ సోకని పాత్ర ప్రియం వద .1974 లో వ్రాసిన ఈ వ్యాసం ”తెలుగు విద్యార్ధి ”మాస పత్రిక లో ప్రచురిత మైంది .ఇప్పుడు మీ కోసం .
వల్కలా శిధిలం
నాటకం మొదటి అంకం లో దుష్యంత మహా రాజు కణ్వా శ్రమం ప్రవేశించి ,ఆశ్రమ వాస విశిష్టతను అభినుతిస్తూ న్న సమయం లో శకుంతల ,తన ప్రియ చెలి కత్తెలు అనసూయ ,ప్రియంవద లతో ,చెట్లకునీళ్ళు పోయటానికి రాగా వారిని చెట్టు చాటు నుండి చూస్తాడు .శాకున్తక్ల స్తన వల్కలం శిధిల మైంది .మళ్ళీ ముడి వెయ్య మని ప్రియంవద ను కోరింది .ఇద్దరు చెలికత్తె లలో చిన్నదీ ,చిలిపిదీ అయిన ప్రియంవద ”అత్ర పయోధర విస్తారయిత్రు మాత్మనో ,యౌవన ముపాలభస్వ.మాం కిం ఉపాలభసే ” అంటుంది .అంటే ,ఇంతకు ముందే నీ స్తన వల్కలం బిగించాను .ఇంతలోనే పాలిండ్లు పొంగాయా ?”అని మేల మాడింది .ఇక్కడ ఆమె రాజును చూడక పోయినా ,ఒక ప్రియా కర్షణ శకుంతలను ఉత్తేజితం చేసినందు వల్ల ,వల్కలం ముడి జారి పోయిందని పరోక్షం గా మనం గ్రహించాలి .
లతాసనాధం
ప్రియంవద ,శకుంతలను పొగడ వృక్షం కింద కూర్చోమని చెప్పింది .ఆమె అలాగే కూర్చుంది .వెంటనే ప్రియంవద ”త్వయా ఉపగతాయా లతాసనాద ఇవ ,అయం కేసర వృక్షః ప్రతి భాతి ”అని నవ్వుతు అంది .దీని అర్ధం ”నువ్వు దగ్గర వుండటం వల్ల ,తీగేతో కూడిన దాని లాగా ,ఈ పొగడ చెట్టు ప్రకాశిస్తోంది ”అని .ఇక్కడ మహా కవి ”లతాసనాద”అనే శబ్దాన్ని సాభిప్రాయం గా ప్రయోగించాడు .ముందు జరుగ పోయే ఘట్టానికి తగిన మాట ఇది .ఒక సూచన ,ఒక చిహ్నం .భావి శుభ సూచన ఇక్కడ ధ్వనిస్తోంది తీగకు చెట్టు ఆసరా అంతే కాదు ,ఆ రెంటి కూర్పునేత్రానందం కూడా .”లతా ”అంటే తీగ ను స్త్రీ మేను తో పోల్చటం కవులకు ఆచారం .అదో ప్రతీక .ఈ మాట విన్న శకుంతల ”అందుకే నువ్వు ప్రియంవద వై నావు ”అంటుంది ఈమె కూడా నర్మ గర్భం గా .అంటే ఆమెకూ ఈ మాట ఆనంద దాయకం గానే ఉందన్న మాట .కళ్యాణ ఘడియ దగ్గర పడిందని ,మనకూ సూచన కూడా .చెలికి ఇష్టమైన ప్రియాన్ని మాట్లాడు తుంది కనుక ఆమె ప్రియంవద అయింది .శకుంతల కు ఈ మాట ”సౌభాగ్య ప్రశంస ”గా వుంది .దుష్యంతుడు చెట్టు చాటునే వుండి అంతా గమనిస్తూనే వున్నాడు .”ప్రియంవద నిజమే చెప్పింది ”అని మురిసి పోయాడు .ఆయన మనసు లో వున్న కోరికను కూడా కవి మనకు తెలియ బర్చినట్లే .
వనజ్యోత్స్న
ఆ వనం లో ”వనజ్యోత్స్న ”అనే లతను శకుంతల చాలా మురిపెం గా పెంచు కొంటోంది .ఆ మాట అర్ధం వనాకినే వెన్నెల .ఆ లత ,బాల సహకార శాఖను ఆలంబనం గా చేసుకొని ,వనానికి నిజం గానే వెన్నెల పూయిస్తోంది .ఆ లత అంటే శకుంతలకు ప్రాణం .అదే ఆమె బహిప్రాణం .తన కళ్ళ రెప్పల్ని చూసుకున్తున్నాంత జాగ్రత్త గా దాన్ని చూసు కుంటుంది .ఇప్పుడు తదేక ధ్యానం తో రెప్పలార్ప కుండా ,ఆ లతను వీక్షిస్తోంది .ఈ విషయాన్ని ప్రియంవద వెంటనే పసి కట్టేసింది .ఇంకో చెలి కత్తె అనసూయతో ”సఖీ అనసూయే -ఆపి జానాపి కిన్నిమిత్తం -శకుంతలా వనజ్యోత్స్నం -అతి మాత్రం పశ్యతి ?”అని మేల మాడింది .అనసూయ ఈమె కంటే పెద్ద దైనా ,మాయా మర్మం తెలీంది .”నాకేం తెలీదు .నువ్వే చెప్పు ”అంది అమాయకం గా .మంచి చాన్సు లభించింది ప్రియంవద కు చాలా నేర్పుతో సందర్భోచితం గా ”యధా వన జ్యోత్స్నా అను రూపేణ ,పాదపెన సంగతా ,ఆపి నామైవ మహామపి ఆత్మనో ,రూపం వరం లభేయ మితి ”అంది కొంటె కోణంగి ప్రియంవద .ఇందులోని భావం ”వనజ్యోత్స్న కు ఎలా అనురూప మైన ఆధారం లభించిందో ,తనకు కూడా అలాగే లభిస్తుంది కదా “‘.ఇది పుంభావ సరస్వతి కాళిదాస మహాకవి కావ్య సృష్టి లో అద్భుత ,అపూర్వ ఘట్టం .ఆ మాటలు దుష్యంత మహా రాజు వింటూనే వున్నాడు కదా .అతని హృదయం లోను కళ్యాణ ఘంట మోగింది .శాకున్తలకూ మిక్కిలి ప్రియం గానూ వుంది .గుండె లోతుల్లోని కోర్కె కొంటెగా బయట పడింది .ఆమె నాయిక కదా .అంత తేలిగా బయట పడదు .అందుకని సిగ్గు తో మాట వరుసకి శకుంతల ఆమె తో ”ఆ!అది నీ మనసు లోని కోరిక ,అనవసరం గా నాకు అంట గడు తున్నావు ”.అంది .అందరు ఆ మాటకు కడుపారా నవ్వు కున్నారు .నిజం గా శకున్తలే ఆ వనానికి ”జ్యోత్స్న ”.ఇదీ కాళి దాసు గారి మహా నాటక నిర్వహణ .మరిన్ని విషయాలు మరోసారి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -01 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

