కాళిదాసు ప్రియంవద –5 -చివరి భాగం

కాళిదాసు ప్రియంవద –5 -చివరి భాగం 

                                           దూర్వాస శాపం 
          
 కాళిదాసు రాసిన అభిజ్ఞాన  శాకుంతల నాటకం లో నాల్గవ  అంకానికి పరమ ప్రాముఖ్యత వుంది .ఈ అంకం లోను ప్రియంవద వ్యక్తిత్వావిష్కరణ జరిగింది .తాత పాదులు అంటే కణ్వ మహర్షి వస్తే ,ఆయనకు శకుంతలా దుష్యంతుల గాంధర్వం తెలిస్తే కోపగించు కొంటారేమో   నని సందేహిస్తుంది అనసూయ .ఇక్కడే అనసూయకు ,ప్రియంవడకు వున్న తేడా మళ్ళీ మనం గమనిస్తాం .తాత్కాలిక విషయాలలో ప్రియంవద బుద్ధి పాదరసం లా పని చేస్తుంది .చిట్కాలు చెప్పి అపాయాలు తప్పించ గలదు .అయితె దూర దృష్టి తక్కువ .అనసూయకు ఎక్కువ -పెద్దది కూడా కనుక సహజం .అందుకే కాష్యపుల విషయం లో ఒక స్థిర నిర్ణ యానికి రాలేక సందేహించింది .ప్రియంవద మాత్రం గౌతముడు ఒప్పు కుంటారని చెప్పింది .
         దూర్వాస మహర్షి శాప విధానం కూడా తమాషా గానే వుంటుంది .శకుంతలకుతెలియని   స్థితి లో ,మన్మదావస్థ  లో వున్నప్పుడు ముని ,ఆమెను శపిస్తాడు .ప్రియంవదకు శాప వృత్తాంతం తెలిసి ప్రధమ తప్పిదం కనుక చెలిని మన్నించ మని వేడింది .అంతటి కోపిస్టి మహర్షి చేతనే శాప విమోచనాన్ని చెప్పించిన నేర్పరి ఆమె .ఇక్కడ మనకే కాదు ,కాలిదాసుకు కూడా ప్రియంవద పైనే మక్కువ ఎక్కువని తెలుస్తుంది .ఆమె వ్యక్తిత్వాన్ని ఈ విధం గా పెంచి పోషించాడు కవి .దుర్వాసుని వద్దకు ప్రియంవడనే పంపటం శాప నివారణోపాయాన్ని ముని చేతనే చెప్పించటం ,ఆమె సమర్ధ త కు నిదర్శనం .శాపిష్టిమౌని ఎదుట nishkaapatyam గా ప్రవర్తించే సమర్ధత ఆమె కే వుంది అని నిరూపించాడు కవి .
                                 తాత పాదుల ఆగమనం 
        కణ్వ మహర్షి ఆశ్రమానికి విచ్చేశారు .ఆయన శాకుంత లను దీవించిన విషయాన్ని ,కాళిదాసు ప్రియంవద చేతనే  చెప్పిస్తాడు .అయితే ,ఈ విషయం తమ ముగ్గురికే తెలుసు .మహర్షికి ,ఎవరు చెప్పారని అనసూయ  కు  అనుమానం వస్తుంది .అప్పుడు ప్రియంవద చెప్పిన సమాధానం అద్భుతం గా వుంది చూడండి -‘ఛందోమయ మైన వెద వాక్కు అతి పవిత్రమైన హోమ గుండం వద్ద పలుక బడింది ”.అంటుంది .ఛందోమయ మైన వాక్కు కు ,మహాత్మ్యం వుంటుంది .అది తిరుగు లేని సత్యం .పుట్ట బోయే  చక్ర వర్తి,గుణాతి శయం సూచింప బడింది . ఇంతకీ ఛందో వాక్యం ఏమంటోంది ?
 ”దుష్యన్తే నాహితం తేజో దధానం భూతయే భువః –అవేహి ,తనయాం ,బ్రహ్మన్నగ్ని గర్భాం శమీ మివ ”
            శకుంతల గర్భం లో ,సకల లోకాభ్యుదయం కోసం ,దుష్యంత వీర్యం -జమ్మి చెట్టు లో అగ్ని దాగి వున్నట్లు,వున్నది అని ఈ శ్లోక తాత్పర్యం .జమ్మి ,అగ్ని అనటం లో ఆ గర్భ ధారణ లోని ,పరమ పవిత్రతను గోచరింప జేశాడు కవి .ఆ తేజో వీర్యం తో జనించిన మహాపురుషుడు ,లోకారాద్యుడని  ,తెలుస్తుంది .సన్నివేశానికి తగిన ఔచిత్యం .ఔచిత్యానికి పరాకాష్ట కాళిదాసు కవిత్వం .పోలికలలో పవిత్రత ,చెప్పిన విషయం ఛందో బద్ధమై వుండటం అంటే Most scientific .దానిని  అశరీర వాణి ,పవిత్ర హోమ గుండం వద్ద పలకటం  కవికుల గురువు ప్రతిభకు పట్టాభిషేకం .భారతీయ జీవన విధానం లోని పరమ పవిత్రతను ,ఉదాత్త భావాలను అత్యంత ఉదాత్తం గా చెప్పవలసిన విధానాన్ని ,కాళిదాసు చక్కగా గుర్తించి ,ఆచరించి మార్గ దర్శి అయాడు .ప్రియంవద కణ్వ మహర్షి వద్ద ఉన్నప్పుడే ఆ ఛందో వాక్యం విని పించింది .ఆ వాక్యాన్ని ఆమె అలాగే భద్ర పరచుకొని ,తు.చ.తప్ప కుండా మిగిలిన వారందరికీ చెప్పింది .ఇక్కడ కూడా కవి ,ప్రియంవద కే అగ్రాసనం ఇచ్చాడు .
                                 వియోగ సన్నివేశం 
          శకుంతల అత్త వారింటికి ప్రయాణం అయింది .శకుంతలకు ,కణ్వాశ్రమ వనానికి వున్న అన్యోన్యాను రక్తి ని కాళిదాస మహా కవి ,ప్రియంవద చేతనే చెప్పించాడు .”శకుంతల వియోగం చేత లేళ్ళు ,దుఖం తో దర్భలను నోటి నుండి జార విడుస్తున్నాయి నెమళ్లు నృత్యం చేయటం మానే శాయి .లతలన్నీ ఎడుస్తున్నాయా అనట్లు పండు టాకులను రాలుస్తున్నాయి .వియోగ  దుఖాన్ని వనం లోని ,ప్రతి ప్రాణి యెట్లా అనుభావిన్చిందో ప్రియంవద కళ్ళకు కట్టి నట్లు వర్ణించింది -కాదు ,కాదు కాళిదాస మహా కవి ఊహించి ,వాచ్యం చేయించాడు ఆమెతో .ఇది అపూర్వ సన్ని వేశం .అన్యోన్యాను రాగ వర్ణనం కాలిదాసైక సాధ్యం అని పిస్తుంది 
          ఈ విధం గా కాళిదాస మహాకవి ప్రియంవద ను ప్రియాన్నే చెప్పేదానిగా ,శకుంతలకు కూర్మి చెలి కట్టే గా ఆమె మనోధర్మాన్ని గ్రహించి ,సందర్భోచిత సలహాలనిచ్చే నేర్పరిగా ,వ్యవహర్త గా ,అభిజ్ఞాన శాకుంతల మహా నాటకం లో సుప్రతిస్తితం చేశాడు .జీవత్వం తో తోన్కిస లాడిన పాత్ర గా ఆమె ను తీర్చి దిద్దాడు .
           ఇంత ప్రతిభా ,ఉత్పత్తులతో ఈనాటకాన్ని   రాశాడు కనుకనే ,జర్మన్ పండితుడు ,రచయిత ,కవి నాటక రచయిత ,విశ్లేషకుడు గోథె మహాను భావుడు ఈ నాటకాన్ని చదివి” ‘దివి భువి లను ఏకం చేసిన నాటకం ”అని ఆనందం పట్ట లేక నాట్యం చేశాడట .అలాంటి మహా నాటకం లో ఒక చిన్న పాత్రను నేను నా కు తెలిసిన మేరకు ఆవిష్కరించాను .
       మా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా నాన్న గారు స్వర్గీయ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారు మాకు కాళిదాసు గారి రఘువంశ ,కుమార సంభావ కావ్యాలను అర్ధ తాత్పర్యాలతో సంత వేయించి నేర్పించారు .అందుకే వారికి ఈ వ్యాసాన్ని పిత్రూణం గా సభాక్తికం గా అంకిత మిస్తున్నాను .
               సంపూర్ణం 
                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -01 -12 .


— 
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.