తిక్కన భారతం –23 శాంతి ,అనుశాసనిక ,అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -1
కౌరవ ,పాండవ స్త్రీ ల ఆక్రందనం ఆధారం గాపోషించ బడిన ”నిర్వేదం ”ఆ తరు వాత ”శాంతి” గా మారింది . శాంత రసానికి నిర్వేదమే స్తాయీ భావం అని ఆలంకారికుల భావన .అందుకనే ,శోక భరిత మైన స్త్రీ పర్వం తర్వాత ఈ పర్వాల ను రచించటం సర్వోత్తమం గా ఉంది, ఉచితం గానూ ఉంది .భారత ఇతి వృత్తాన్ని బట్టి ,ధర్మ రాజు జీవిత పరిణామాన్ని అనుస రించి కూడా స్త్రీ పర్వం తర్వాత శాంతిని ప్రతిష్టించటం సముచితమే .యుద్ధ పరిణామ ఫలాన్ని ప్రత్యక్షం గా అనుభవించటం వల్ల ,దుఖం తో ప్రజా పరి పాలనకు విముఖు డైనాడు ధర్మ రాజు .శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించటం తో భీష్మ పితామహుని చేరి ఉపదేశం పొందాడు .తన లోని చీకటి ని పోగొట్టు కొని ,స్వధర్మాన్ని అనుసరించటం ఇందులో ప్రధాన వృత్తాంతం .
సంఘం లో ధర్మం నశించటం ,కౌరవుల పాప ప్రవర్తన ,దాని ఫలితం గా 18 అక్షౌహిణుల సైన్యం లోని వీరాధి వీరులు నశించి పోయారు .ఇప్పుడు న్యాయం ,ధర్మం కొంత జ్ఞాపకానికి వచ్చాయి .ఆ స్తితి లో ధర్మ పరుడు ,నీతి కోవిదుడు ,శిష్టాచార సంపన్నుడు ,అనుభవజ్ఞుడు ,నిరాసక్తుడు అయిన కర్మ యోగి ,లోక కళ్యాణం కోసం రాజ్య పాలనకు పూను కొంటే నే ,ధర్మం లోకం లో మళ్ళీ ప్రతిష్టాపించ బడుతుంది .ఆ స్తితిని కలిగించాలనే కృష్ణుని ఆశయం ,సిద్ధిస్తుంది .కాని ,యుద్ద్ధం వల్ల వికల మనస్కుడైన ధర్మజుడు ,నిర్వేదం తో సంసార విముఖుడయి నాడు .–”ద్రుత రాష్ట్రుండు ,దనూజు కీడు సమబుద్ధిం జూడ కన్నేచు ,డే –గతి జన్నం జన ,నిచ్చే గాని ,మగుడం గా దివ్వడయ్యేన్ ,నిరా –కృత శీలుండగు నా సుయోధనుండు ,సంక్షీణంబు సేసెం ,గులం –బతని జంపంగ ,గోప మారే ,మది శోకా క్రాన్తంమయ్యెం దుదిన్” –అని బాధ పడ్డాడు .”ఆ దుర్జనుడైన దుర్యోధనుడు దుష్టం గా ప్రవర్తిస్తే ,సరి పుచ్చు కోలేక పోయాను ..రాజ్యం కావాలని నాలో కోర్కె ఉండటం వల్లే ఇంత పాపం చేశాను . పరిగ్రహ దోషం పరిత్యాగం వల్ల కాని పోదు .పరిగ్రహ త్యాగం చేస్తే ,మనిషి జన్మా ,మరణం ,దుఃఖాలను పొందడు అని వేదం చెబుతోంది .కనుక అపరిగ్రహం ఒక్కటే నన్ను శుద్దున్ని చేస్తుంది .”అని విశుద్ధ మనస్కుడై వివరించాడు .అంతటి మానసిక క్షోభను అనుభవించాడు .మాటలతో చెప్ప రాని వేదన అది .దుర్యోధనుడు అపకారం చేశాడు కనుక అతని వధీంచటం తో తన కోపం తీరి పోయింది .,కాని ఇప్పుడు శోకం తో మనస్సు నిండి పోయి ఉక్కిరి బిక్కిరి అయి పోతున్నాడు .మనసులో వితర్కించు కొంటున్నాడు .హింసకు ప్రతి హింస జవాబు కాదు .ప్రతి హింస తో మనకు మనశ్శాంతి చేకూరదు .పైగా ,దానికి వ్యతి రేక మైన ఫలాన్ని అనుభ విన్చాల్సి వస్తుంది .ఇది ప్రకృతి సత్యం .”vengence recoils itself on the perpetrator ”.
దుర్యోధన వధ తో కోపం తగ్గి తాత్కాలిక తృప్తి కలిగింది .కాని ,సకల బంధు నాశనం తో శోకం ఇంకా పెరిగి పోయింది .మనసు వికలమై ,రాజ్య విముఖత ఏర్పడింది .కర్తవ్య పరాన్ముఖుడైనాడు .పశ్చాత్తాపంతో సల సలా కాగి పోయాడు .ధర్మ రాజు మనో వైకల్యం పోయి ప్రశాంతత పొందాలి అంటే సద్గురువు ఉప దేశమే శరణ్యం .అతడు విశిష్ట జ్ఞానం తో కర్మ యోగిగా మారాలి. భారతీయుల అభి ప్రాయం ప్రకారం ఆ నాటి మిధిలా నగర చక్ర వర్తి జనక మహా రాజు లాంటి జీవన్ముక్తులే రాజ్యార్హులు .కనుక ధర్మ రాజుకు ప్రజా పరిపాలన కోసం సంపూర్ణ మైన ఐహిక ,ఆముష్మిక జ్ఞానం పుష్కలం గా లభించాలి .జ్ఞానోప దేశం పొంది ,స్వ ధర్మాన్ని అనుస రిస్తూ ,రాజ్య భారం మోస్తూ ,వ్యాస మహర్షి అను సరణ తో ,లోక హితం కోసం అశ్వమేధ యాగాన్ని వేదోక్తం గా నిర్వ హించి ,దేశం లోని రాజు లందర్నీ ఒకే ధర్మ శాసన బద్ధులను చేశాడు .నిరాసక్తం గా, వేదోక్త ధర్మాలను ఆచరించాడు .స్వధర్మాన్ని అత్యంత శ్రద్ధా స క్తులతో నిర్వ హిం చాడు. .స్వధర్మాన్ని శ్రద్ధ తో నిర్వహించటం వల్ల ,గృహస్తుడు కూడా భవ బంధాలను చేదించు కొని మోక్షం పొంద గలడు అని,అశ్వ మేధ పర్వం ద్వారా నిరూపించాడు .ఇందులో ”నక్తు ప్రస్తుడు ”అనే వాని కధ స్వధర్మ నిర్వహణ ను బోధిస్తుంది .
ఈ పర్వం లోనే ధర్మ రాజు తన మనస్సు ,చేసిన అకార్యాలను తలచు కొని వికల మై నట్లు చెప్ప బడింది .సజ్జనుల మనస్సు వజ్ర సన్నిభం .అయినా స్వాభావికం గా కుసుమ కోమలం .ద్రోణ ,అభిమన్యుల అధర్మ వధలకు,తానే కారణం అను కొన్నాడు .తన వంటి అధర్మ ప్రవర్త కుడు రాజ్యం లో ధర్మాన్ని ఎలా నెల కోల్ప గలను ? అని బాధ పడ్డాడు .సంకోచించాడు .మనశ్శాంతికి ముందు ఇలాంటి మానశిక క్షోభ చాలా అవసరం .రాజ్య పరి పాలన విషయం లో వ్యాస ముని అభిప్రాయం కూడా ఉదాత్తం గా నే ఉంది .శ్రీ కృష్ణ ,వ్యాస మహర్షుల ఉపదేశం కారణం గా ధర్మ రాజు లోని చీకటి తొలగింది .చిత్తం ఈశ్వరాయత్తం అయింది . భారతీయ భావన ఇంత ఉదాత్తం గా ఉంటుంది కనుకనే మన పురాణాలు ,ఇతి హాసాలు సార్వ కాలీనాలు అని గౌరవాన్ని పొందాయి .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –2-8-12-కాంప్–అమెరికా

