శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –22
51—‘’శివే శ్రుంగా రార్ద్రా ,తదిత ,రజనే ,కుత్సువ పరా సరోషా,గంగాయాం ,గిరిశ చరితే ,విస్మయ వతీ
హరా హిభ్యో భీతా ,సరసి రుహ ,సౌభాగ్య జననీ –సఖీషు ,స్మేరా ,తే ,మయి ,జనని ,దృష్టి స్సకరుణా‘’
తాత్పర్యం –నిత్యా నంద కరీ!నీ కంటి చూపు పరమ శివుని పై శృంగార భావం చూపి ,మోహనం గా కన్పిస్తోంది .ఇతరుల పై భీభత్స దృష్టీ (ఏవగింపు )సపత్ని యైన గంగ పై రోషం తో కూడిన రౌద్ర దృష్టి కలిగి ఉంది .త్రిపుర సంహారం మొదలైన శివుని విజయ గాధలు విని ,విస్మయంతో ,అద్భుత రాసా వేశంగా ఉంది .(శివుని మూడవ నేత్రాన్ని మన్మధ దహనం లో చూసి –అద్భుత రసం).పరమ శివుని ఆభరణాలైన పాములను చూసి ,భయానక రసం కల్గిస్తోంది .యెర్ర కలువ కాంతి ,ఎరుపు కలిగి వీర రసం గా ఉంది .సఖీ జనం పట్ల ,లేత నవ్వు తో కూడిన స్థిర మైన హాస్య దృష్టి ఉంది .నిన్ను స్తుతించే భక్తు డైన నాయందు కరుణా రస దృష్టి ఉంది .నీ దృష్టులు నవ రసాలతో నిండి ఉన్నాయి .
విశేషం –భగవతి దృష్టి అధికార భేదం చేత నవ రసాలు ఒకే సారి కన్పింప జేస్తున్నాయి .నవ రాసా వాస భూతం ఆమె దృష్టి .దీనికి శివుడే వ్యాఖ్యాత .ఆయన సమస్త కళ్యాణ గుణ దారి .ఆమె అనుగ్రహ లబ్ధ నాముడు అని వ్యవ హరింప బడుతున్నాడుసదా శివుడు .
52—‘’గతౌ కర్ణాభ్యర్ణం ,గరుత ఇవ ,పక్ష్మాణి దధతీ –పురా భేత్తుస్చిత్త ప్రశమ రస ,విద్రాణ ఫలే
ఇమే నేత్రే ,,గోత్రాధర పతి ,కులోత్తంసకలికే –తవా కర్నాకృష్ణ స్మరశరవిలాసం కలయతః ‘’
తాత్పర్యం –పర్వత రాజ తనయీ !నేను ధ్యానిస్తుంటే ,నా హృదయ కమలం లో ప్రత్ర్యక్షం అయినావు .నీ దర్శన భాగ్యం కలిగింది నీ కనులు చెవుల వరకు వ్యాపించాయి .ఆ నేత్రాల రెప్పల పై గల వెంట్రుకలు ఎలాగఉన్నాయంటే ,బాణానికి రెండు ప్రక్కలా కట్ట బడిన గ్రద్ద ఈకలు గా ఉండి ,పరమ శివుని మనసు లో నిస్పృహ ను పోగొట్టి ,శృంగార రాసోత్పాదన చేస్తున్నట్లు న్నాయి .ఆ కర్ణాంతం లాగిన మన్మధ బాణ సౌందర్యాన్ని కల్గిస్తున్నాయి .
విశేషం –మన్మధుడు పంచ బాణుడు .ఆరవ బాణం స్త్రీ ల కడ గంటి చూపు .శివుని పై పంచ బాణాలు వేసి ,గెలవ లేక భస్మమైనాడు మన్మ్సధుడు .అలాంటి శివుని మనస్సు ను మోహ పర వశం తో మున్చేత్తేట్లు చేస్తున్నాయి శ్రీ దేవి చూపులు .అంటే ప్రకాశఅంశ మైన బ్రహ్మం లో సృష్టికి కారణ మైన వివర్శ అంశ స్పందనాన్ని కల్గిస్తోంది .అంటే అతి దుర్ఘట మైన కార్య కారణాన్ని చేసే సమర్ధత ఆమె చూపులకు ఉంది అని భావం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –18-10-12-ఉయ్యూరు

