విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ
భారత దేశ రక్షణ శాఖ సలహాదారుగా ,ప్రధాని నెహ్రూకు శాస్త్రీయ అంతరంగిక సలహాదారుగా ఉన్న ఆంధ్రా శాస్త్ర వేత్త సూరి భగవంతం గారి గురించి మనలో చాలామందికి తెలియదు అంటే ఆశ్చర్యమేమీ లేదు .ఆయన సత్యసాయి బాబావారి ఆంతరంగిక శిష్యుడు అంటే ఎక్కువ మందికి తెలుసు .’’ఆచట పుట్టిన చివురు కొమ్మైన చేవ ‘’అన్నట్లు ఆయన కుమారుడు సూరి బాలకృష్ణ భూ భౌతిక శాస్త్ర వేత్త అంటే అస్సలు ఎవరికీ తెలిసి ఉండదన్నది యదార్ధం .ఇద్దరూ కృష్ణా జిల్లావారవటం జిల్లాకు, మనకు గర్వకారణం .
శ్రీ సూరిభగవంతం
భగవంతం గారు ప్రముఖ సైంటిస్ట్ ,భారతరత్న నోబెల్ పురస్కార లెనిన్ పీస్ ప్రైజ్ గ్రహీత ,సి .వి .రామన్ శిష్యులు .శాస్త్రీయ దృక్పధం, ప్రయోగ నైపుణ్యాలే ఆయనను రామన్ కు సన్నిహితుని చేశాయి .మద్రాస్ యూ ని వర్సిటి నుంచి ఎం .ఎస్ .సి. పొంది ,అందులోనే భౌతిక శాస్త్ర లెక్చర గాచేరి ప్రొఫెసర్ గా,డిపార్ట్ మెంట్ అధిపతిగా చకచకా 28 ఏళ్ళ వయసుకే ఎదిగారు .అదే యూని వర్సిటి ఆయనకు డి.ఎస్ సి,ప్రదానం చేసింది .1948 వరకు ఇక్కడే పని చేశారు .1948- 49 లో లండన్ లో’’ ఇండియన్ సైంటిఫిక్ లైజాన్ ఆఫీసర్ ‘’అయ్యారు అంటే సైంటిఫిక్ అడ్వైజర్ అన్నమాట .బ్రిటన్ ,యూరప్ దేశాలు రష్యాలలో పర్యటించి యూని వర్సిటీలలో ఉపన్యాసాలిచ్చారు .అప్పటి లండన్ హై కమిషనర్ వి.కె. కృష్ణమీనన్ తో పరిచయం పెంచుకొని ,ఇండియా వచ్చి , ఉస్మానియా యూని వర్సిటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్, లాబ్ డైరెక్టర్ , వైస్ చాన్సలర్ అయ్యారు .
1957 లో బెంగుళూర్ ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ అయి ,నాలుగేళ్ళు పనిచేశాక ఈయన ప్రతిభ గుర్తించి మీనన్ ఈయన్ను కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్ బాధ్యత అప్పగించాడు , ఈ పదవిలో ఉంటూనే డిఫెన్స్ రి సెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్ జనరల్ గా కూడా వ్యవహరించారు .దేశ రక్షణ వ్యవస్థకు దీన్ని అత్యంత శక్తివంతమైనదిగా తీర్చి దిద్దారు .అప్పుడే భారతదేశం మిస్సైల్స్ ,ఏయిరో ఇంజెన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, టాంకులు అనబడే కా౦బట్ వెహికల్స్, ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్ ,హై ఎక్స్ప్లోజివ్స్ ,అండర్ వాటర్ మెషిన్స్ మొదలైనవి 9 ఏళ్ళ కాలపరిమితిలో అందుబాటులోకి తెచ్చారు .వీటి అభి వృద్ధికి విశాఖ, లే ,తేజ్ పూర్ మొదలైన చోట్ల లాబ్స్ ఏర్పాటు చేయించారు.డి. ఆర్. డి. వో. అభి వృద్ధి అంతా భగవంతం గారి కృషియే .రక్షణ సామగ్రిని దేశీయంగా నిర్మించి విదేశీ దిగుమతులపై ఆధార పడకుండా చేసిన అసలైన సైంటిఫిక్ సలహాదారు ఆయన .ఒకరకంగా భారత రక్షణ వ్యవస్థకు భగవంతుని వంటి వారు భగవంతం గారు .ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భౌతిక శాస్త్ర విభాగానికి 1946 లో అధ్యక్షులయ్యారు .రామన్ ఎఫెక్ట్ పై అనేక కోణాలలో అధ్యయనం చేసిన సైంటిస్ట్ భగవంతం మూడు ఉద్గ్రంధాలు రాశారు .అందులో లొ1961 లో వచ్చిన ‘’క్రిస్టల్ సెమెట్రి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ‘’కు మంచి పేరుంది .ఇదికాక గ్రూప్ దీరీ ,రామన్ ఎఫెక్ట్ గ్రంధాలు కూడా అత్యంత ప్రామాణికమైనవే .రామన్ ఎఫెక్ట్ పై ప్రామాణికత, సాధికారత ఉన్నవారు భగవంతం .300లకు పైగా పరిశోధనా పత్రాలు రాసిన మేధావి .ఆయన రచనలు పలు భాషలలోకి అనువాదం పొందాయి .అనేక సైంటిఫిక్ , ప్రొఫెషనల్ సంస్థలకు ఫెలో గా ఎన్నికయ్యారు .తెలుగు ,సంస్క్రుతాలలోనూ ఆయన పాండిత్యం అమోఘం మంచి వక్త .హాస్యం ,చతురత కలబోసి మాట్లాడే నైపుణ్యం ఆయనది . సూరి భగవంతం గారు 6-2-1989 న 80 వ ఏట మరణించారు ఆయన జననం 14-10-1909 కృష్ణాజిల్లా గుడివాడలో .
శ్రీ సూరి బాలకృష్ణ
శ్రీ సూరి భగవంతం గారబ్బాయి శ్రీ సూరి బాలకృష్ణ గుంటూరులో 3-8-1941 జన్మించారు .19 53 లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి ఏం ఎస్ సి .సాధించారు .19 55లో ఉస్మానియా యూని వర్సిటి నుండి పి హెచ్ డి అందుకున్నారు .195 2 నుంచే భూ విజ్ఞానం భూ భౌతిక శాస్త్రాలలో విశేష పరిశోధనలు చేశారు .భూజల అన్వేశానపి గొప్ప కృషి సల్పిన శాస్త్ర వేత్త బాలకృష్ణ .ఉస్మానియా యూని వర్సిటిలో 19 53 లో రిసెర్చ్ స్కాలర్ గా చేరి ,జియాలజీ అధిపతి అయి 19 61 నుండి 64 వరకు పని చేశారు .ఇదే విభాగానికి రీడర్ గా 19 5 7 నుండి నాలుగేళ్ళు పని చేసి ,19 6 2 లో హెడ్ 19 64 లో గౌరవ ప్రొఫెసర్ ,19 6 5 లో అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు .ప్రతి శాఖలోనూ తన ప్రతిభను చాటారు
హైదరాబాద్ లోని నేషనల్ జియో ఫిజికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్కు అసిస్టెంట్ డైరెక్టర్ గా యాక్టింగ్ డైరెక్టర్ గా 19 7 9 నుంచి 81 వరకు సేవలందించారు .ఇండియన్ జియో ఫిజికల్యూనియాన్ కు కార్య దర్శి గా ఉంటూ ఫెలోషిప్ అందుకున్నారు .ఆంద్ర ప్రదేశ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఫిలోశిప్ కూడా పొందారు .జియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కు ఫౌండర్ ఫెలో శ్రీ బాలకృష్ణ ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షునిగా కూడా పని చేశారు
న్యు ఢిల్లీ లోని నేషనల్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో రిసెర్చ్ ఫెలో గా 1954 లో చేరారు .1956-5 7 కాలం లో హార్వర్డ్ యూని వర్సిటి లో పోస్ట్ గ్రాడ్యుయల్ రిసెర్చ్ ఫెలో గా గుర్తింపు పొందారు .జపాన్ ప్రాభుత్వ గౌరవ పురస్కారం తో పాటు ,జపాన్ జియోలాజికల్ సొసైటీ ఫెలోషిప్ నూ అందుకున్న జియాలజీ ఘనాపాఠీ బాలకృష్ణ .
పర్వతాలు, శిలల స్థితి స్థాపకత్వం (ఎలాస్టిసిటి )మీదా ,భూ సంబంధ లక్షణాలున్న వాటి అనుబందాలపైనా పరిశోధించి సాధికారిక పత్రాలు రాశారు .అనేక దేశాలు పర్యటించి ఉపన్యాసాలిచ్చి ,అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని విలువైన 125 ప్రామాణిక పరిశోధనా పత్రాలు సమర్పించారు ..భూ ప్రకంపనాలు, భూ కంపాలు, భూ అయస్కాంత క్షేత్రాలు ,గురుత్వాకర్షణ క్షేత్రాలు ,వాటి పని తీరు లపై సునిశిత పరిశోధన చేసిన పరిశోధనా పరమేష్టి ఆయన . భూ విజ్నానశాస్త్రం లో సాటిలేని విజ్ఞాన ఖనిగా ,పాలనా దక్షునిగా ,క్రమ శిక్షణగల నాయకునిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మేధావి సైంటిస్ట్ శ్రీ సూరి రామకృష్ణ తండ్రి భగవంతం గారికి తగ్గ తనయుడు అనిపించారు .
బాలకృష్ణ గారి శాస్త్రీయ కృషికి 1967 లో కృష్ణన్ గోల్డ్ మెడల్ ,1979 లో ఆంధ్రప్రదేశ్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ అవార్డ్ పొందారు .హైదరాబాద్ లో ఉప్పల్ రోడ్డు లో ఉన్న యెన్. జి .ఆర్. ఐ ..సంస్థలో స్థిరపడ్డారు బాలకృష్ణ .ఆయనకు ఇప్పుడు 77 ఏళ్ళ వయసు .అంతకు మించి వివరాలు తెలియలేదు .గూగుల్ లో అసలు ఆయన గురించే లేకపోవటం దురదృష్టం .
విఖ్యాత సైంటిస్ట్ లయిన తెలుగు తండ్రీ తనయులు శ్రీ సూరి భగవంతం ,శ్రీ బాల కృష్ణ
అని నిన్న రాసిన వ్యాసం లో శ్రీ సూరి బాలకృష్ణ గారి చివరి రోజులు గురించి తెలియక రాయలేదని చెప్పాను .ఈ ఉదయం వారి బంధువులు హైదరాబాద్ వాసి శ్రీ సూరి ఆంగీరస శర్మ గారికి ఫోన్ చేసి వివరాలు అడిగాను . బాలకృష్ణ గారు భగవంతం గారు జీవించి ఉండగానే మరణించారని చెప్పారు .భగవంతం గారికి నలుగురు కుమారులు ,ఒక కుమార్తె అనీ ,ప్రస్తుతం తనకు తెలిసిన దాన్ని బట్టి రెండవ కుమారుడు శ్రీ రామకృష్ణ శర్మ గారు ఒక్కరే జీవించిఉన్నారని ,మిగిలిన వారంతా గతించారని తెలిపారు .ఆంగీరస శర్మ గారికి ధన్యవాదాలు తెలియ జేస్తూ -దుర్గాప్రసాద్

ఆధారం –శ్రీ వాసవ్య రచన –ఆంద్ర శాస్త్ర వేత్తలు
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-7-18 –ఉయ్యూరు