ఆయన వివాదాల పుట్ట ,యే క్షణం లో ఏమి ఆలోచిస్తాడో తెలీని క్షణికావేశ పరుడు ,ఎడ్డెమంటే తెడ్డెం అనే బాపతు ,ఊరిన్దరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది ఇంకో దారి అని అనేక సార్లు నిరూపించుకొన్న వాడు ,యాభై ఏళ్ళ తిరుగు ,ఎదురు లేని పోరాటం నడిపిన యోధుడు ,ఎవర్ని ఎప్పుడు మిత్రకూటం లో చేరుస్తాడో ఎవరిని పురుగు లా ఏరి పారేస్తాడో తెలీని విచిత్రవ్యక్తి ,తాను అనుకొన్నది సాధించే నేర్పున్నా ,ఓర్పు లేదని ముద్ర పడ్డ వాడు ,అయిన వాళ్ళు దూరమైనా భేఖాతరు చేసిన వాడు ,గర్జన ,ఘర్షణలె ఆయుధాలుగా సైన్యాన్ని నడిపించిన వాడు ,అపర శివుడి సేన గా శివ సేన ను నిర్మించి తన‘’సుప్రీమసి’’ ని అణుక్షణంనం కాపాడుకొన్న వాడు ,నిలకడా స్తిరత్వం,విశాల దృక్పధం ఉంటె భారత ప్రధాని కాగలిగిన వాడు ,అయినా ఎక్కడున్నా మరాథాలోను హస్తిన లో ను చక్రం తిప్పిన మేధావి ,శివాజీ మహారాజ్ తర్వాత మళ్ళీ హిందూ జాతిని ఏకీకృతం చేశాడనే గొప్ప పేరు సంపాదించుకొన్న వాడు ,కార్టూన్లతో వ్యంగ్యోక్తులతో ప్రజాహృదయాన్ని దోచుకొన్న వాడు మరాఠా ప్రజల హృదయ సింహా సనాన్ని శాశ్వతం గా అధిష్టించి కూర్చున్న వాడు ,’’మరాఠా టైగర్ ‘’అని పించుకోవటమే కాదు, అలా నిజం గా నే గర్జించి,ప్రతాపం చూపి , అందర్ని తన కను సన్నలలో నిలుపు కొన్న వాడు ,రాజకీయాలను బాల్(బంతి )ఆట గా ఆడిన శివ సేనాధి పతి థాకరే .
నియంత’’ హిట్లర్ ‘’అంటే అభిమానించే థాకరే నడక అంతా అదే పోకడ లో నే నడిచింది .సమస్యలను స్వయం గా సృష్టించటం ,అందులోంచి తెలివిగా బయట పడటం మళ్ళీ ఇంకో దాన్ని కాళ్ళకు చుట్టుకోవటమే ఆయన జీవితానికి సరి పోయింది .ఆయన నోటికి ఉప్పూ ,పత్రీ లేదని చాలా సార్లు రుజువు చేసుకొన్నాడు .ఎంతటి వాడి నైనా ఎదిరించే సాహసం .ఎంతటి తక్కువ వాడి నైనా నెత్తిన పెట్టుకొనే నేర్పు ఆయన స్వంతం .ఆయన వ్యతి రేకించిన’’ప్రేమికుల రోజు ‘’ఆగకుండా పోయిందా? /పాప్గాయకుడిని అందలం ఎక్కించిన ఆయన విదానమేమిటి అంటే ప్రశ్నార్ధకమే ..క్రికెట్ ఆటలో కళల విషయాలలో మరీ సంకుచితం గా వ్యవహిరించాడని అందరు అనుకొన్న మాటే .అంతటి తో ఆటలూ మానలేదు, పాటలూ తగ్గలేదు .అయితే ఇవన్నీ ఆయన కు’’ గొప్ప బేస్ ‘’నిచ్చాయి .ఉద్యమాలకు వీలు కల్పించాయి ,నిత్యం ప్రజల మధ్య ఉండే అవకాశాలు కల్పించుకొన్నాడు .శివ సేన సిద్దాన్తమేమిటో ఆ కార్య కర్తలకూ తెలీని పరిస్తితి .మహారాష్ట్ర లో ఏది జరిగినా దాన్ని మహారాష్ట్రుల ఆత్మ గౌరవం తో ముడి పెట్టి ప్రజల్ని చైతన్యం చేశాడు ..అధికారాన్ని పూర్తి మెజారిటీ తోసంపాదించిన రోజులు ,పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన రోజులు ,పొత్తులో లాభ పడిన సందర్భాలు ,ఆ పొత్తుల్ని గుడ్డ పీలికల్లా చీల్చేసిన సందర్భాలు అన్నీ ఆయన చేశాడు .ఏది చేసినా ఆయన ముద్ర ఉండాలి ,పడాలి ,ఆయన ఆజ్న శిరసా వహించాలి .లేకుంటే ఉక్కు పాదం తో అణటమే .అందుకే ఆయన కు ‘’నన్ను టచ్ చేస్తే బొంబాయి మట్టి కరుస్తుంది ‘’అని చెప్పే సాహసం వచ్చింది .ఆయన మాటకాదని ముంబై లో నిల బడ గల సత్తా మేటి సినీ నటులకూ లేదు .’’ముంబై ముంబాయిలాడే అని గర్జిన్చినా అది అమలు కాలేదు కదా .అక్కడా వెనకడుగే .అయితే ఇంత ఉక్కు పాదం తో నిరంకుశుడైన ఆయన ‘’అండర్ వరల్డ్ ‘’వారినేమీ చేయ లేక పోవటం విడ్డూరమే . ‘’సామ్నా ‘’పత్రికా సంపాదకుడి గా ఆయన రాసే ప్రతి మాటలో నిప్పులు కురిపించే విధానం ఉంది ,అందర్ని ఆకట్టుకొనే సామర్ధ్యం ఉంది .తన ప్రసంగాలతో జనాన్ని ఉత్సాహ ,ఉద్రేక పరచి తన మార్గానికి వాళ్ళను తెచ్చుకొనే పోరాట పటిమ ఉన్నత నాయకత్వం అయన స్వంతం చేసుకోన్నాడు .ఆయన ఎంతటి వివాదాస్పడుడైనా ఆయన ఈల వేస్తె లక్షలాది మరాఠీలు కార్య రంగం లోకి దుముకు తారు .ఆయన చెప్పింది తు ఛా తప్పక ఆచరిస్తారు నిప్పుల్లో దూక మంటే దూకు తారు .ఆయనది సుగ్రీవాజ్న .ఆయన మరణం తో శోకించని మరాఠా వ్యక్తి లేడు .ఇంత సుస్తిర స్థానాన్ని జన హృదయం లో నిలుపు కొన్న వ్యక్తీ ఈ అర్ధ శతాబ్ది లో లేనే లేరంటే అతి శయోక్తి కాదు .వారి భావన లో బాల్ థాకరే అమరుడే .,
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com