చిలుకూరు వారి వచన వాల్మీకి రామాయణం -6
సుందర కాండ
శ్రీ రామ కృష్ణ తపోవనం నుండి శ్రీ చిలుకూరు వారి విజ్ఞప్తి
శ్రీ హనుమ సముద్ర లంఘనం లో సురస ను ఎదుర్కొనే టప్పుడు శరీరాన్ని తొంభై యోజనాలకు పెంచాడు అనటం అసంబద్ధం గా ,పిల్లల సంతోషం కోసం చెప్పి నట్లుగా ఉందనటం నాకు నచ్చిన విషయం .కొన్ని చోట్ల ఇలాంటి ఔచిత్య భంగాలు బాధిస్తాయి .లంకలోని భావన సముదాయాలన్నిటి గురించి చెప్పిన విధానం తెలుసుకో తగినది .నాలుగు ద్వారాలుండేది ‘’పద్మం ‘’అని ,ఇవి సర్వతో భద్రమని ,పశ్చిమ ద్వారం లేక మధ్య వంపు తిరిగిన చతుస్శాల గృహాన్ని‘’హయాననం ‘’అంటే ,గుర్రపు ముఖం అని ,దక్షిణ ద్వారం లేని దాన్ని ‘’వర్ధమానం ‘’అంటారని ఇది ధన ప్రదమని ,తూర్పు ద్వారం లేని ది‘’స్వస్తిక గృహం ‘’అని ఇది పుత్ర ,ధన ,సంపదల నిస్తుందని కేటగరైజ్ చేయటం కొత్త విషయాలను తెలియ జేసింది .వీటి వివరణ ఇవ్వటానికి చిలుకూరు వారు ఎంతో శ్రమించి ఉంటారని పిస్తుంది .
పుష్పక విమానం యజమాని మనస్సును బట్టి నడుస్తుందని ,యజమాని నియంత్రణ లోనే పని చేస్తుందని ,ఏ వేగం కావాలంటే ఆ వేగం లో వెళ్తుందని వాల్మీకి చక్కగా వర్ణించిన విషయాన్ని తేట తెలుగు మాటల్లో వర్ణించటం బాగుంది .మన విమానాల్లో ఇంకా రావాల్సిన మార్పులను ఈ పుష్పకం సూచిస్తోందని పిస్తుంది .రామ రాజ భూషణుడు రాసిన ‘’వసు చరిత్ర ‘’ప్రబంధం లో ఇంద్రుడు వసు రాజుకు మహా మహిమాన్విత మైన విమానాన్ని బహూక రిస్తాడు .అందులో ఎయిర్ కూల్ ,ఎయిర్ కండిషనింగ్ కూడా ఉంటాయి .పుష్పకం కంటే మెరుగైందన్న మాట .’’వసు రాజు విమానం ‘’పేరుతో చాలా ఏళ్ళ క్రితం నేనొక వ్యాసం రాశాను ‘’మూసీ మాస పత్రిక ‘’లో ప్రచురితమైంది .ఊరికే కంపారిజన్ కోసం చెప్పాను .రావణాసురుడు కుబేరుని దగ్గర నుంచి పుష్పకాన్ని లాక్కొంటే ,వసురాజు దివ్యత్వాన్ని మెచ్చి దేవేంద్రుడు ఈ విమానాన్ని కానుక గా ఇచ్చాడు అదీ కధ .
సీతా దేవి ని తప్ప స్త్రీల నెవ్వరిని రావణుడు బలాత్కారం గా లంకకు తీసుకొని రాలేదని ,అతని గుణాలకు ఆకర్షితులై వారే వచ్చారని ,మరో పర పురుషుని పై వారికి ప్రేమ లేదని అందరు సత్కుల సంజాతలే నని ఈ కాండలో ఉన్నది .కాని ఉత్తర కాండ లో దీనికి విరుద్ధం గా విషయాలున్నాయి .రావణ గాంభీర్యానికి ప్రతిభకు ,హనుమ అప్రతి భుడయ్యాడని కాని భయ పడ లేదని మంచి వివరణ నిచ్చారు వెంకటేశ్వర్లు గారు .
యుద్ధ కాండం
యుద్ధానికి బయల్దేరిన వానర సైన్యానికి సూచన లిస్టు ,సుగ్రీవునికి శ్రీ రాముడు చాలా హెచ్చరికలు చేశాడు .శత్రువులు కంద మూలాల్లో ,ఫలాల లో విషం కలిపే ప్రమాదం ఉందని ,ఏమరు పాటు ఏ మాత్రం తగదని ,భూ సైన్యానికి‘’air protection ‘’ఉండేట్లు చూడమని చెప్పటం యుద్ధ సమయం లో రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకో వాలో తెలియ జేసే యుద్ధ విధానమే కాక, యుద్ధ నీతి కూడా ఉంది.సూర్య మండలం చుట్టూ చిన్న యెర్రని గూడు కడితే అందులో నల్ల మచ్చ ఉంటె రాబోయే ప్రళయానికి సూచన అని మహర్షి వాల్మీకి తెలియ జేశాడు .ఇది లంకకు చేటు కనుక ,ఆ సమయం లోనే యుద్ధం ప్రకటించాలని రాముడు లక్ష్మణుడి తో అనటం రాజనీతికి గొప్ప ఉదాహరణ .యుద్ధ తన్త్రానికి మకుటం .జాంబ వంతుడు ‘’గద్గదుని ‘’కుమారుడని ,అతని తమ్ముడి పేరు ‘’ధూమ్రుడు ‘’అని మనం తెలుసు కొంటాం .
మాల్య వంతుడు రావణుడి పిన తాత .రావణుడికి నీతి బోధిస్తూ మహర్షులు అగ్ని వలె ప్రకాశిస్తారని ,ధర్మ సంరక్షకులని ,వారి యాగ ధూమానికి రాక్షసులు చెల్లా చెదరౌతారని ,రాక్షస తేజాన్ని అణచే సర్వ సమర్ధులు మునులని ,వారి తపోగ్ని రాక్షసులకు తాపం కలిగిస్తుందని వారిని బాధించటం వల్ల రావణుడు పతనం కొని తెచ్చుకోన్నాడని బోధించాడు మాల్య వంతుడు .రామునితో సంధి చేసుకొమ్మని రావణుని తల్లి కైకసి ,’’అవిద్ధుడు ‘’అనే ముసలి మంత్రీ హితవు చెప్పారు .వినలేదు .వినాశ కాలే విప రీత బుద్ధి అంటే ఇదే .
పాదాల్లో పద్మ రేఖలున్న స్త్రీలు సామ్రాజ్యాధి పతుల భార్య లవుతారని హస్త సాముద్రికం చెప్పాడు వాల్మీకి .పుష్పక విమానం విధవలను తీసుకొని పోదు అనే విషయం విమాన రహస్యం .భరద్వాజుడు విమాన శాస్త్రాన్ని రచించాడని మనకు తెలుసు .దీన్ని జర్మన్ ,జపాన్ దేశాల వారు తీసుకొని వెళ్ళి ,విమానాలు తాయారు చేశారని మన వాళ్ళ నమ్మకం .కుంభ కర్ణుడు నీతులు బోధిస్తుంటే నిండా మునిగిన రావణుడు నీతులతో చర్చించే సమయం కాదని తన తెలివి తక్కువ ,భ్రాంతి వల్ల లోపాలు చేశానని ఇప్పుడు కర్తవ్యమేమిటో ఆలోచించమని దశగ్రీవుడు అనటం తక్షణ కర్త్వవ్య బోధ యే.జరిగి పోయిన్దాన్ని గురించి నిర్ణయం తీసుకొనే సమయం లో ఆలోచిస్తూ కాలం వృధా చెయ్య రాదనీ అందరు గుర్తిన్చుకోవాల్సిన విషయం .అతని తప్పుల్లో అందరికి బాధ్యత ఉంది..ఎలా అతడిని బైట పడేయ్యాలో ఇప్పుడు సూచించాలి .లక్ష్మణ మూర్చ సందర్భం గా రామ విలాపం లోనీ ఉచితానుచితాలను చిలుకూరు వారు చక్కగా చిలికి విశ్లేషించారు .ఆదిత్య హృదయాన్ని అతి తక్కువలో అందులోని ఆంతర్యాన్ని సూక్క్ష్మం గా చెప్పటం విశేషం .బాగుంది .
ప్రేమించే గుణం లేని రాజుతో యుద్ధానికి పోవటం సైనికులు ఇష్టపడరని కనుక యుద్ధ ము లో పాల్గొనే వానర వీరులను ముందే సత్కరించమని రాముడు విభీషణుడికి చెప్పి చేయించాడు .ఇది త్యాగానికి తగిన గుర్తింపు నివ్వటమే .అందుకే మన ప్రభుత్వం వీర ,శౌర్య చక్ర,పరమ వీర చక్ర పురస్కారాలిచ్చి సత్కరిస్తోంది .సైనికులను సంతోష పరుస్తున్నారు .అయోధ్యకు వెళ్తూ శ్రీ రాముడు భరద్వాజ మహర్షి ని సందర్శించి తాను వెళ్ళే దారిలో వృక్షాలు అన్నీఅకాలం లో కూడా సమృద్ధిగా ఫలాల నివ్వాలని ,పుష్ప ఫల భరితం గా ఉండాలని కోరాడు .ప్రజా క్షేమం అడుగుడుగునా రాజు కర్తవ్యం అని తెలియ జేసే సంఘటన .రాముని తరఫున రాజ్యం చేస్తున్న భరతుని కాలం లో అన్నీ పది రెట్లు అభి వృద్ధి చెందాయట .అది విని అందరు ఆనంద బాష్పాలు రాల్చారట .తన పై ఉంచిన బాధ్యతలను భరతుడు ఎంత సక్రమం గ నిర్వర్తిన్చాడో ,ఎంత నియమ బద్ధం గా పరి పాలన నిర్వ హించాడో మనకు తెలుస్తుంది .ఇదంతా తన గొప్ప కాదని రామ భద్రుని ప్రభావమే నని అతి వినమ్రం గా భరతుడు చెప్పటం అతని సుగుణ సంపత్తిని రెట్టింపు చేస్తుంది .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-1-13—ఉయ్యూరు

