నా దారి తీరు –8 సాంస్కృతిక కార్యక్రమాలు

 నా దారి తీరు –8

            సాంస్కృతిక కార్యక్రమాలు

    మోపిదేవి స్కూల్ లో వార్శికోత్సవాలను బాగా నిర్వహించే వారు .నేను కృష్ణ శాస్త్రి గారు రాసిన ‘’జయ జయ ప్రియ భారత జనయిత్రి పుణ్య ధాత్రి ‘’జాతీయ గీతాన్ని  ఇద్దరు తొమ్మిదో తరగతి ఆడ పిల్లలకు నేర్పి పాదించాను చాలా అద్భుతం గా పాడారు అందులో ఒకమ్మాయి ఎర్రగా సన్నగా ఉండేది కమ్మ వారమ్మాయి .రెండో అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరిది రావి వారి పాలేమే . రెండేళ్ళ క్రితం పడమట హైస్కూల్ లో రామ లక్ష్మణా చార్యులు అనే తెలుగు పండితుల రిటైర్ మెంట్ సభలో అయన నాకు మొదట సన్మానం చేసి తర్వాత స్కూల్ వాళ్ళతో చేయిన్చుకొన్నారు అది ఆయన నాకు ఇచ్చిన గౌరవం స్నేహం .పైన చెప్పిన మొదటి అమ్మాయి అప్పుడు పెద్దావిడ గా కనీ పించి నా దగ్గరకు వచ్చి తాను మోపిదేవిలో నా దగ్గర చదువుకోన్నానని ,పాటలు నేర్పించి పాడిం చానని  తాను  తెలుగు పండిట్ చేసి ఇక్కడే రిటైర్ అయ్యానని గుర్తు చేసింది నా శిష్యులు రిటైర్ అవ్వటం నాకే ఆశ్చర్యం గా ఉంది .మోపిదేవి లో నేను మహా మంత్రి తిమ్మరుసు ఖైదు లో ఉండి పడే బాధను, రాజ్య రక్షణ గురించిన ఆలోచనలను ఏక పాత్రాభినయం గా రాసి ,నాన్చారయ్య అనే ముఖం మీద వెడల్పైన చుట్ట కాల్చిన గుర్తు గల పదవ తరగతి విద్యార్ధికి నేర్పి వేయించా అతను చాలా బాగా నటించి నాకు ,తనకి పేరు తెచ్చాడు .అలాగే భమిడి పాటి వారి ‘’అంతా ఇంతే ‘’నాటిక ను నేను విద్యార్ధులకు నేర్పి ,వేయించాను అందులో కొక్కిలి గడ్డ సుబ్బారావు అనే తొమ్మిదో తరగతి విద్యార్ధి చేత ‘’డొక్కా లంబోదరం ‘’పాత్ర వేయించాను .చాలా గొప్ప గా చేశాడు వేషం సరిగ్గా సరిపోయింది నల్లగా పొట్టిగా ఉంటాడు .ఆ తర్వాతా ఉయ్యూరు రెండు మూడు సార్లు వచ్చి ఆ నాటకం జ్ఞాపకం చేశాడు అతను కాంట్రాక్టర్ గా ఉన్నాడు .మిగిలిన పోర్షన్లు ఎవరు వేశారో గుర్తు లేదు ‘’పడవ పాట‘’ను నేను బి.యి.డి.చదువుతున్నప్పుడు ఒకతను మా కాలేజి లో గొప్పగా పాడేవాడు ఆ పాట గుర్తు పెట్టుకొని నేర్పించాను ఇందాక చెప్పిన ఆడ పిల్లలిద్దరూ బాగా పాడారు .ఇక్కడి నుంచి  నేను పని చేసిన ప్రతి స్కూల్ లోను ఈ విధ మైన సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించాను .భారతి అనే అమ్మాయి  అప్పడు చదివింది ఆమె మాతో పాటు మేస్టర్ర్ అయి స్పాట్ వాల్యుయేషన్ లో కనీ పించేది ఆమె బందరు మునిసిపల్ స్కూల్ హెడ్ గా పని చేసి రిటైర్ అయింది ఇప్పటికి కనీ పించినప్పడల్లా ఆ నాటి విద్యార్ధి గానే ఉంటుంది సంస్కారం అది ‘’జయ జయ ప్రియ భారత జనయిత్రి ‘’పాటను ఎప్పుడు కనపడ్డా గుర్తు చేస్తుంది .

                      ఘంటసాల గారి దర్శనం

                  స్కూల్ లో సుబ్రహ్మణ్య దేవాలయం పూజారి గారబ్బాయి సుబ్బయ్య చదివే వాడు అతని తండ్రిడ్రి ప్రఖ్యాత గాయకులూ స్వర్గీయ ఘంట సాల వెంకటేశ్వర రావు గారి మేన మామ .ఒక గారి ఘంట సాల పూజారి గారింటికి వచ్చారు సుబ్బయ్య ఆ విషయం మాకు తెలియ జేసి వారింటికి రమ్మన్నాడు మేము పర్మిషన్ తీసుకొని వెళ్లాం అప్పుడే ఆయన దేవాలయం లో దైవ దర్శనం చేసుకొని వీధి అరుగు మీద చాప మీద కూర్చున్నారు మేము వెళ్ళ గానే మమ్మల్ని ఆదరం గా పలకరించారు .సుమారు గంట సేపు వారితో వివిధ విషయాలను ముచ్చటిమ్చాం అన్నిటికి చక్కని సమాధానాలు చెప్పారు నేను ‘’మీరు ఇప్పటికే పేరు, ప్రఖ్యాతి, ధనమూ సంపాదించుకొన్నారు కదా .ఎవరైనా ఏ ఊరుకైనా పిలిచి కచేరీ చేయమంటే ఉచితం గా చేస్తారా ?’’అని అడిగాను .అప్పుడు వారు నవ్వుతు ‘’చూడు బాబూ ! చాలా కాలం నా బృందాన్ని తీసుకొని ఖర్చులన్నీ నేనే పెట్టుకొని అడిగిన చోట్ల కచేరీలు చేశాను వారిచ్చినా ఇవ్వక పోయినా దేశ మంతా తిరిగాను .కాని నా వయసు మీద పడుతోంది బృందమూ పెరిగింది వారి అవసరాలు పెరిగాయి నన్ను నమ్ముకొన్న వారు మరి నేను వారి సంగతి చూడాలి కదా నా కు అంటుఎమీ ఇవ్వక్కర్లేదుకాని వారికయ్యే ఖర్చులు భరిస్తే చాలు వెళ్లి వస్తున్నాను ‘’అన్నారు .వారితో సంభాషించే మహద్భాగ్యం మాకు కలిగిందని చెప్పుకొని గర్వ పడే వాళ్ళం .మా అదృష్టం .ఎవరికీ దక్కని అనుభవం మాది ఈ అరుదైన అదృష్టం కల్గించిన మా సుబ్బయ్య అభి నందనీయుడు .ఆ తర్వాత రెండు మూడు సార్లు ఆ దేవాలయానికి వెళ్లాను .సుబ్బయ్య కనీ పించి పలకరించి మాకు స్పెషల్ గా పూజ చేసే వాడు సుమారు పాతికేళ్ళ క్రితం అతను  పోయాడని తెలిసి బాధ పడ్డాం .ఘంట సాల పుట్టింది పేద కళ్ళే పల్లి దగ్గర టేకు పల్లి లో మేన మామ గారింట్లోనే .ఆ తర్వాత్ గుడివాడ దగ్గర ఇంకో మేనమామ గారింటి వద్ద పెరిగారు .

                     ప్రభావతి కాపురానికి రావటం

    మా వివాహం 1964 ఫిబ్రవరి ఇరవై ఒకటి న జారి గిందని ముందే చెప్పాను పెళ్లి అయిన నెల రోజుల్లోపే ప్రభావతి కాపురానికి వచ్చింది అప్పుడు మా కు ఉన్నది ఒకే ఒక మడత మంచం .దాని మీదే మా కాపురం .లెక్కల మేష్టారి భార్య కమలమ్మగారు మా ఆవిడకు మంచి దోస్తీ .బాగా కబుర్లు చెప్పుకొనే వారు ఆవిడ అత్తగారు మహా చిలిపిగా మాట్లాడే వారట సరదాగా ..కొత్తకాపురం కదా ఉడికించే వారట .మా మరదలు దుర్గ వేల్పు చర్ల నుంచి చూడ టానికి వచ్చింది కొన్ని రోజులుఉన్నది ..మా అమ్మ కూడా వచ్చింది మాపెళ్ళి అయిన నెల తర్వాత లొల్ల బాల కోటేశ్వర రావు గారు మాతో శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి కల్యాణాన్ని దేవాలయం లో చేయించారు నూట పదహారు రూపాయలు కడితే అన్నీ వాళ్ళే ఏర్పాటు చేసి కల్యాణం చేయిస్తారు అమ్మ కూడా వచ్చింది .ఇలా రోజుకొకరు చొప్పున నెల రోజులు చేశారు .మా అదృష్టం అది అనుకొంటాం ఇప్పటికి ..చల్ల పల్లి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళం .ఒక సారి బందరు మధ్యాహ్నం వెళ్లి సాయంత్రం ఆట భాను తి రామా రావు ల సినిమా ‘’వివాహ బంధం ‘’చూసి రాత్రికి ఇంటికి చేరాం శివ గంగ దేవాలయం దర్శించాం .చిలకల పూడి పాండురంగ స్వామిని చూశాం..పెదప్రోలు నుండి వేల్పు చర్ల వెళ్ళేవాడిని ప్రభావతి పుట్టింటికి వెళ్ళినప్పుడు ,గర్భవతి గ ఉన్నప్పుడు .వెళ్ళేవాడిని .కోడూరు గుడివాడ బస్ ఎక్కి గుడివాడ దిగి అక్కడ ఎలూర్ బస్ పట్టుకొని ఎలూర్  వెళ్లి అక్కడ ప్రైవేట్ బస్ ఎక్కి వేల్పు చర్ల వెళ్ళేవాడిని ఒక సారి ఆలస్యం అయితే నాగయ్య గారి ‘’రామ దాసు ‘’సినిమా చూసి తెల్లారే దాక బస్టాండులో గడిపి ఫస్ట్ బస్ కు వెళ్ళాను అలాగే మేమిద్దరం వేల్పు చర్ల నుండి బస్ ఎక్కి వచ్చి ఎలూర్ లో సినిమా చూసి రాత్రికి హోటల్ లో పడుకొని ఉదయం వేల్పు చర్ల వెళ్లాం మా ‘’అత్తక్క గారు‘’బాగా చూసేది మా మామ గారు ఎప్పుడైనా ఎలూర్ బస్ నాతో పాటు ఎక్కితే తన టికెట్టు తాను తీసుకొనే వాడు .మోపిదేవి లో ఉండగానే మా పెద్దబ్బాయి శాస్త్రి పుట్టాడు .

                        ఇంకొందరు మేస్టార్లు

 

                   కే.శ్రీరామా మూర్తి అనే క్రాఫ్ట్ మేష్టారు మాతో కలిసే తిరిగే వారు కోమట్లు వ్యాపారం ఉండేది పెదప్రోలు నివాసి . మంచి మనిషి .రోడ్డు మీద పింగళి వారుండే వారు ఆయన రాజా గారి దివాణం లో పని చేసే వారు పింగళి లక్ష్మీ కాంతం గారి బంధువులే ఏలేశ్వరపు కృష్ణ మూర్తి గారనే బ్రాహ్మణులు రాజావారి పెర్సనల్ సెక్రెటరి .రాజా గారు ఏ హోదాలో ఉన్నా అంతా ఈయన చేతి మీదే నడిచేది త్రాన్స్ఫెర్ల దగ్గర నుండి పోస్టింగు దాకా అయన ప్రభావం ఉండేది వాళ్ళమ్మాయి అప్పుడు స్కూల్ లో చదివేది .ఆయన మేము పని చేస్తుండగానే చని పోయారు ఆయన అబ్బాయికి బందరు పీచు గారు అంటే చింతల పాటి వారి అమ్మాయి నిచ్చారు .అంటే బాలమ్మ గారి అమ్మాయి ..లెక్కల మేష్టారు గా మస్తాన్ రావు గారనే కమ్మాయన గుంటూరు జిల్లా వారు వచ్చారు .ఆయన పలుచని గ్లాస్కో పంచ కట్టే వారు డ్రాయర్ ఉండేది కాదు .లోపల అంతా కనీ పించేది గుంటూర్ యాస తో మాట్లాడే వారు ఆడ పిల్లలు ఇబ్బంది పడే వారు ఎవరో హెడ్ మాస్టర్ గారి దృష్టికి తెస్తే ఆయన కొంత కౌన్సెలింగ్ ఇచ్చి జాగ్రత్త పడేట్లు చేశారు ఆయన చివర్లో వి.కొత్తపాలెం హెడ్ గ పని చేశాడు నాకు మంచి ఫాను దోస్తీ .చల్ల పల్లి లో రాజ గారి కోట ఉంది .విశ్వనాధ పల్లి తిరుణాల చాలా ప్రసిద్ధ మైనది నేనెప్పుడు వెల్ల లేదు అప్పుడు విజయ వాడకు ఉదయం తోమ్మిది గంటలకో  బస్సు సాయంత్రం అయిదింటికో బస్సు ఉండేది అది అందకా పోతే వచ్చేదాకా పడిగాపులే నన్ను బస్సు ఎక్కిన్చేదాకా శ్రీరామ మూర్తి ,మాధవ నిలువు కాళ్ళ జీతం మీద ఉండే వాళ్ళు వాళ్ళ ఋణం నేను తీర్చుకోలేనిది .ఆ తర్వాత నేను అక్కడి నుండి వచ్చే ముందే బస్సులు పెరిగాయి .లేక పోతే పామర్రు దిగి అక్కడినుండి ఉయ్యూరు వెళ్ళాల్సి వచ్చేది రోడ్డు కూడా దారుణం గా ఉండేది .ఇన్ని కష్టాలున్నా ఉద్యోగం హాయిగా ఉండేది మంచి విద్యార్ధులు ,మంచి మేస్టార్లు మంచి హెడ్ మాస్టర్ నాకు చదువు చెప్పుకోవటానికి మంచి అవకాశం అన్నీ కుదిరాయి అందుకని నాకు ఇంకా ట్రాన్స్ఫర్ మీద ధ్యాస రాలేదు

                   కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్

          ఈ సంస్థ చాలా బలం గా ఉండేది కాకాని వెంకట రత్నం గారు పెంచిన సంస్థ తర్వాత పిన్నమనేని కోటేశ్వర రావు గారు కొల్లూరి కోటేశ్వర రావు గారి పోషణ లో బాగా వట వ్రుక్షమైంది .అప్పుడు ఆరిక పూడి పూర్ణ చంద్ర రావు గారనే భారీ పర్సనాలిటి ఉన్న హెడ్ మాస్టర్ పామర్రు హెడ్ గా ఉండే వారు తర్వాత పడమట కు వెళ్ళారు ఆయనే గిల్డు గిల్డు అంటే ఆయనే .అలా ఉండేది ఆయనంటే పి.శ్రీ రామ మూర్తి గారికి పడలేదు శ్రీరామ మూర్తి గారు టీచర్ ఏం ఎల్ సి గా చేసి మంచి పేరు పొందారు .పెద్ద మనిషి గా అందరు గౌరవించే వారు అయన పూర్ణ గారి పధ్ధతి నచ్చక గిల్డ్ ను స్వంతం చేసుకోవాలని చూశారు పామర్రు లో ఒక సారి సమావెశం జరిగి రాజీ ప్రయత్నాలు కుదర్లలేదు .తర్వాతా మొవ్వ హెడ్ మాస్టర్ ,తూమాటి వారు ప్రభాకర రావు గారనే సెకండరి మేష్టారు అంతా కలిసి బెజవాడ లో మళ్ళీ ఒక సమావెశం జరిపారు మినిట్స్ పుస్తకాన్ని ఎత్తుకు పోవటానికి ప్రత్యర్ధులు ప్రయత్నిస్తే ఈ వర్గం వారి ఆటలు సాగ నివ్వ లేదు అప్పుడు తూమాటి కోటేశ్వర రావు గారిని తాత్కాలిక అధ్యక్షుని గా చేశారని జ్ఞాపకం .మమ్మల్నందర్నీ తీసుకు వెళ్ళటం తీసుకు రావటం ఉండేది .తర్వాత ప్రభాకర రావు గారు అధ్యక్షులాయి నట్లు  లయి గుర్తు అయన నిడుమోలు లో సెకండరి ఉపాధ్యాయులు రూల్సు బాగా తెలిసిన వారని చెప్పుకొనే వారు .ఇంటిపేరు వేములపల్లి అని గుర్తు .గిల్డ్ వ్యవహారాల గురించే ఖాళీ సమయాలలో చర్చించు కొంటు ఉండే వాళ్ళం .మధ్యాహ్నం హోటల్ లో టీ త్రాగి స్కూల్ వెనక ఉన్న పి.డబ్ల్యు .వారి చిన్న ఆఫీస్ బిల్డింగ్ దగ్గర చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకొని ఫస్ట్ బెల్ కు స్కూల్ లోకి చేరే వాళ్ళం సాయంత్రాలు ఆడే వాళ్ళం బాద్ మింటన్ వాలీ బాల్ అక్కడే   నాకు అలవాటయ్యాయి రిటైర్ అయ్యేదాకా ఆడుతూనే ఉన్నాను మధ్యలో టేన్నికాయిట్ అనే రింగ్ టెన్నిస్ ,షటిల్ కూడా అలవాటయి ఆడను ..

                   సశేషం

                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-2-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.