నవ్వించి, కవ్వించి ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు రేపింది.ఎదిరించి, ఏడ్పించి కంట తడి పెట్టించింది….
రాముడైనా, కృష్ణుడైనా ఇలా ఉంటారని ఎన్టీఆర్‌ను చూపింది. కన్నెపిల్లల మదిలో చిలిపి తలపులు రేపే దొంగరాముణ్ని (ఏఎన్నార్‌గా) సృష్టించింది. అంతలోనే ఉలికి పడేలా కీచకుడ్ని (ఎస్వీఆర్‌లో) చూపింది. వెన్నెల్లాంటి స్వచ్ఛమైన నవ్వు అంటే ఇలా ఉంటుందని సావిత్రి దరహాసాన్ని గుండెల నిండా నింపింది… వెరసి శతవసంతాల వెండితెర వినోదాల వెన్నెల జడిలో తడిసి మురిసిన ప్రేక్షకుడి మదిలో హాయిని నింపింది.. వినోదానికి చిరునామా అయింది… వెండి తెరకు వందేళ్ళు నిండిన సందర్భంగా జిల్లాలో విరబూసిన కళా కుసుమాలపై ప్రత్యేక కథనం.(మచిలీపట్నం కల్చరల్,మే 2)
దేశ వెండితెరకు వందేళ్లు నిండాయి. ఈ నూరేళ్ల సినిమా ప్రస్ధానంలో ఎందరో సుప్రసిద్ధులు ఈ రంగం అభివృద్ధికి, అంతర్జాతీయ స్ధాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టల పతాకం రెపరెపలాడడానికి ఎంతో దోహదపడ్డారు. వారంతా చరిత్ర కారులే.
*తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు. 1909లో లండన్ నుంచి క్రోనోమెగాఫోన్ అనే సినిమా ప్రదర్శనా యంత్రాన్ని, కొన్ని రీళ్ళను కొనుగోలు చేసి మద్రాసులో మొదటి సినిమాను ప్రదర్శించారు. 1921లో స్టార్ ఆఫ్‌ది ఈస్ట్ ఫిలిమ్స్ పతాకంపై రఘుపతి వెంకయ్య కుమారుడు రఘుపతి ప్రకాష్ దర్శకత్వంలో భీష్మ ప్రతిజ్ఞ సినిమా నిర్మించారు. ఇలా తొలి స్టూడియో అధినేతగా, చలన చిత్ర నిర్మాతగా రఘుపతి వెంకయ్య పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
* తెలుగు చలన చిత్రరంగంలో నటసార్వభౌమగా వందలాది చిత్రాల్లో నటించిన నందమూరి తారక రామారావు పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడిగా వివిధ పాత్రలను ధరించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు.
* ప్రముఖ నటుడు శోభన్‌బాబు వెల్వడంలో జన్మించారు. ప్రముఖ హీరో చంద్రమోహన్ పమిడిముక్కలకు చెందిన వారు.
*1924లో వెంకటరాఘవాపురంలో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలన చిత్ర రంగంలో మకుటంలేని మహారాజులా చలామణి అవుతున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వీరు వందలాది పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించారు.
*ప్రముఖ సినీ నటి కొమ్మారెడ్డి సావిత్రి 1937లో చిర్రావూరులో జన్మించారు. దేవదాసు, పాండవ వనవాసం,మూగమనసులు, మాతృదేవత వంటి ఎన్నో సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
* సినీనటులు నిర్మలమ్మ, సుత్తివేలు, అచ్యుత్, కమలాకర కామేశ్వరరావు బందరుకు చెందిన వారే.
* ప్రముఖ సినీనటుడు ఎస్.వి. రంగారావు నూజివీడులో జన్మించారు. 300పైగా చిత్రాల్లో వీరు నటించారు. నటుడు రావు గోపాలరావు కూడా నూజివీడు వారే.
* కౌతవరంకు చెందిన కైకాల సత్యనారాయణ నటునిగానే కాకుండా ఎంపీగా అందరికీ సుపరిచితులు.
*తెలుగు సినిమాలో స్వర్ణ యుగానికి ప్రారంభం పలికిన గూడవల్లి రామబ్రహ్మం మన జిల్లాలోని నందమూరులో జన్మించారు. 1938లో వీరు దర్శక నిర్మాతగా సినీరంగంలో ప్రవేశించారు. మాలపిల్ల చలన చిత్రాన్ని నిర్మించారు. ఆతరువాత నిర్మించిన రైతుబిడ్డ ప్రజాదరణ పొందింది. ప్రభుత్వం ఈ సినిమా ప్రదర్శనలపై ఆంక్షలు విధించింది.
*1934లో విజయవాడకు చెందిన పారుపల్లి శేషయ్య ద్రౌపది వస్త్రాపహరణం చిత్రాన్ని నిర్మించారు.
* కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన మీర్జాపురం రాజా ఫిలిం స్టూడియోను నిర్మించి కృష్ణ – జయసుధ చిత్రాన్ని నిర్మించారు.
* బందరుకు చెందిన పింగళి నాగేంద్రరావు విజయ సంస్థలో చేరి మిస్సమ్మ, పాతాళ భైరవి, మాయా బజారు, గుండమ్మకథ చలన చిత్రాలకు మాటలు, పాటలు రాశారు.
* గన్నవరంకు చెందిన కాడారు నాగభూషణం పసుపులేటి కన్నాంబతో 35 చలన చిత్రాలు నిర్మించారు.
* కోలవెన్ను గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కె.ఎస్.ప్రకాశరావు 1941, 42 సంవత్సరంలో హీరోగా నటించారు. 1949లో ప్రకాష్ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు. అదే గ్రామానికి చెందిన డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పెత్తందారు పాత్ర ద్వారా తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమయ్యారు.
* బందరుకు చెందిన పినపాల వెంకటదాసు వేల్ పిక్చర్స్ పేరుతో మద్రాసులో స్టూడియో నిర్మించారు. కృష్ణలీలలు, మాయాబజారు సినిమాలు నిర్మించారు.
* 1918లో విజయవాడలో జన్మించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆది నారాయణరావు సినీనటి అంజలిని వివాహం చేసుకున్నారు. ఆదినారాయణరావు లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌కు సహాయకులుగా పనిచేశారు.
* బందరుకు చెందిన మల్లాది రామకృష్ణశాస్త్రి ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాశారు. పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంకట సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్‌ను స్థాపించారు. వీరు నిర్మించిన భార్యా,భర్తలు, ఇల్లరికం, కులగోత్రాలు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
* ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 1922లో చౌటుపల్లి గ్రామంలో జనిర్మించారు. అనేక సినిమాల్లో వేలాది పాటలు పాడారు. 1970లో భారతప్రభుత్వం వీరికి పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది.
* దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు 1942లో విజయవాడలో జన్మించారు.
* 1917లో పెయ్యేరులో జన్మించిన దుక్కిపాటి మధుసూధనరావు చలనచిత్ర రంగంలో నూతన అధ్యయనాన్ని సృష్టించారు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడం అలవాటు చేసింది వీరే. అక్కినేని నాగేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావును చలన చిత్ర రంగానికి పరిచయం చేసింది ఈయనే.
* రిమ్మనపూడికి చెందిన ఉప్పలపాటి సూర్యనారాయణ, డోకిపర్రు గ్రామానికి చెందిన వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి ఫిలింస్ స్థాపించి దసరా బుల్లోడు చిత్రానికి దర్శకత్వం వహించారు. వీరి కుమారుడు ప్రముఖ హీరో జగపతిబాబు.
* చౌటుపల్లికి చెందిన అట్లూరి పుండరీకాక్షయ్య, చినపాలపర్రుకు చెందిన తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి సుప్రసిద్ధ నిర్మాతలు. పాండవవనవాసం సినిమా తీసిన ఎ.ఎస్. ఆంజనేయులు కోలవెన్నుకు చెందిన వారే.
*ముదునూరుకు చెందిన కె. ప్రత్యగాత్మ ప్రముఖ దర్శకునిగా రాణించారు. నిర్మాత పింజల సుబ్బారావు బందరు వాడే. నిమ్మకూరులో జన్మించి ఉప్పలపాటి విశ్వేశ్వరరావు ప్రముఖ నిర్మాతగా రాణించారు. ఇదే గ్రామంలో జన్మించిన కుదరవల్లి రామారావు, నందమూరి త్రివిక్రమరావు నిర్మాతలుగా అందరికీ సుపరిచితులే. పెదమద్దాలికి చెందిన సి. అశ్వనీదత్, విజయవాడకు చెందిన కె. దేవివరప్రసాద్, కైకలూరుకు చెందిన ఉప్పలపాటి నారాయణరావు, కౌతవరంకు చెందిన కానూరి రంజిత్, జగదీష్, కపిలేశ్వరపురంకు చెందిన విక్టరీ మధుసూధనరావు, సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావులు అందరికీ తెలిసిన వారే.

