సినిమాకు ‘వంద’నం

‘చిత్ర’మైన దేశం మనది. ఎన్నో వి’చిత్రాలను’ సృష్టించిన దేశం మనది. గురజాడ ఉండుంటే ఇపుడు ‘దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే సినిమాలోయ్, సినీ అభిమానులోయ్’ అనేవారేమో. ఎందుకంటే తెరమీద బొమ్మల్ని చూసి నవ్వి ఏడ్చాం..ఏడ్చి నవ్వాం.. నటులకు గుడులు కట్టాం…కటౌట్లకు పాలాభిషేకం చేశాం. అంతలా మాయ చేసిన మన భారతీయ సినిమాకు నేడు సగర్వంగా ‘వంద’నం చేస్తున్నాం…
గర్వంగా ఉంది
– అక్కినేని నాగేశ్వరరావు
వందేళ్ళ సినిమా ప్రయాణంలో నా భాగస్వామ్యం 70, 75 ఏళ్లు ఉన్నందుకు చాలా గొప్పగానూ, గర్వంగానూ ఉంది. ఈ వందేళ్ళలో సినిమా కథల విషయంలో చాలా మార్పులొచ్చాయి. కుల వివక్షలకు, మత వివక్షలకు, రాజరికానికి వ్యతిరేకంగా; సంఘంలో రావాల్సిన మార్పుల గురించి ఉద్బోధిస్తూ మొదట్లో చాలా మంచి సినిమాలు వచ్చాయి.
సామాజిక స్పృహతో మనుషుల్లో మంచిని పెంచడానికి కృషి చేశారు తొలినాటి దర్శక నిర్మాతలు. ఇప్పుడు సెక్స్, వయొలెన్స్ మోతాదు బాగా పెరిగిందనిపిస్తోంది. సినిమా వాడిగా, సినిమాలో బతికిన మనిషిగా ఈ మార్పుల్ని విమర్శించనూ లేను. పొగడనూ లేను. అప్పటి కథాబలం ఇప్పుడు పలచబడింది. అప్పటి సాంకేతిక బలహీనత పోయి ఆ నైపుణ్యమే ఇప్పుడు దాని ప్రధాన బలమైపోయింది.
అంటే సహజ సౌందర్యం కన్నా అలంకరణ పాలు ఎక్కువైపోయింది. రెండూ సమపాళ్ళలో ఉంటేనే సినిమాకు అందమూ, బలమూ అని నా ఉద్దేశం. ఆ స్థితి నేను బతికుండగానే రావాలని నా కోరిక. దాన్ని కళ్ళారా చూడాలని నా ఆశ. ఏదేమైనా జీరోగా ఉన్న నన్ను హీరోను చేసి ఇన్నేళ్ళ పాటు నన్ను ఇంతటి ఉచ్ఛస్థితిలో నిలబెట్టిన సినిమా పరిశ్రమకు నేనెల్లప్పుడూ కృతజ్ఞుడినే. నాకున్న అన్ని సెంటిమెంట్లలోకి ఇదే ముఖ్యమైంది.
కథే జీవం
– డి. రామానాయుడు
సినిమాకి ఇవ్వాళ్టితో వందేళ్లు నిండడం నిజంగా సంతోషించాల్సిన విషయం. అందులో నావి యాభై. అంటే సినిమాతో నాకున్న అనుబంధానికి 50 యేళ్లు అన్నమాట. సినిమా ప్రొడక్షన్‌లోకి కొత్త వాళ్లు ఎంతోమంది వస్తున్నారు. మంచి పరిణామమే. అయితే నిర్మాత ఎక్కువకాలం నిలదొక్కుకోవాలంటే స్క్రిప్ట్, క«థ గురించిన అవగాహన ఉండాలి. అలాగే దర్శకుడికి, నిర్మాతకి మధ్య సదవగాహన కుదరాలి. ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను గౌరవించగలగాలి.
మేము ఇదివరకు నాలుగు విషయాలను దృష్టిలో ఉంచుకుని సినిమా మొదలుపెట్టే వాళ్లం. వాటిలో 25 శాతం నటన, 25 శాతం సంగీతం, 25 శాతం సెంటిమెంట్, మిగతా 25 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా చూసుకునేవాళ్లం. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్, మ్యూజిక్ కీలక పాత్ర వహిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇప్పుడివే కోరుకుంటున్నారు.
ఇక ఖర్చుల విషయానికి వస్తే ఇదివరకు సినిమాకి పదిలక్షల రూపాయలు ఖర్చయితే అందులో 70 శాతం డిస్ట్రిబ్యూటర్లు పెట్టుకునేవారు, 30 శాతం నిర్మాత భరించేవాడు. కాని ప్రస్తుత పరిస్థితి అలా లేదు. జిల్లాల వారీగా, థియేటర్ల వారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సినిమాకి స్క్రిప్ట్ మాత్రమే జీవాన్ని పోస్తుంది. ఈ విషయాలన్నీ జ్ఞప్తికి పెట్టుకుని సినిమా తీస్తే నిర్మాత తప్పక విజయం సాధిస్తాడు. లేదంటే రావడం, పోవడం అన్నట్టు ఉంటుంది.
మన వాటా ఎంత?
– దాసరి నారాయణరావు
“భారతీయ చలనచిత్ర పరిశ్రమ వందేళ్ల పండుగను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. కాకపోతే ఆ పండుగను ఎవరు చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఈ పండుగలో తెలుగు పరిశ్రమ వాటా ఎంతో తెలియడం లేదు. నా 50 ఏళ్ల సినీ జీవితంలో నా అనుభవంలో తెలుగు సినిమాకు దక్కాల్సిన వాటా దక్కలేదు. రావాల్సినంత గుర్తింపు రాలేదు. 100 ఏళ్ల భారతీయ సినిమాకి దక్షిణాది కంట్రిబ్యూషన్ చాలా ఉంది.
అందులో తెలుగు వారి కంట్రిబ్యూషన్ ఎక్కువ. పద్మిని, వైజయంతి మాల, బి.సరోజ, వహీదా రెహమాన్, రేఖ, జయప్రద, శ్రీదేవి, మాధవి, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి, ఏవీయం చెట్టియార్, జెమిని బాలన్, దేవర్, ఆదుర్తి సుబ్బారావు, తాతినేని ప్రకాశరావు, శ్రీధర్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కె. విశ్వనాథ్, బాపయ్య, తాతినేని రామారావు, మణిరత్నం, శంకర్, రామ్‌గోపాల్‌వర్మ, బాట్లీ, విన్సెంట్, పి.ఎల్.రాయ్, నిమాయిఘోష్, కమల్‌ఘోష్, రామానాయుడు ఇంకా ఎంతో మంది ఉన్నారు. దె ఆర్ ఆల్ గ్రేట్ సెలబ్రిటీస్. ఇండియన్ సినిమాకి మన కంట్రిబ్యూషన్ ఇంత ఉన్నా, ఇప్పటికీ ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే అనుకుంటున్నారు. దక్షిణాది సినిమాలను గుర్తించడం లేదు. ఇప్పుడైనా వాళ్లు మనందరినీ కలుపుకుని పోవాలి”
గొప్పతనం ప్రేక్షకులదే
– అంజలీదేవి
మన భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. అది కళ్లారా చూసే అదృష్టం కలగడం ఇంకా సంతోషంగా వుంది. నేను పరిశ్రమకి వచ్చి అరవైయేళ్లయింది. ఆనాటి సినిమాని ఇంకా మరచిపోలేదంటే అప్పటి నటీనటులు, దర్శకులు అంతటి గొప్ప ప్రతిభావంతులు. ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలోనే ఎన్నో ట్రిక్కులు చేసి అద్భుతాలను సృష్టించారు. అయితే ఆ గొప్పతనం ప్రేక్షకులది కూడా. ఎందుకంటే వాళ్లు ఆదరించబట్టే సినిమా ఇంతకాలం మనగలిగింది.
ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చినా ప్రజల ఆదరణే కళాకారులకి అపురూపం. అయితే సినిమా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాల్సి వుంది. సాంకేతికత విషయంలో సినిమా ఊహించనిస్థాయికి చేరుకుంది. కానీ, కథల విషయంలోనే ముందడుగు లేదు. ఇతిహాసాలు, సాంఘిక సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు రావడం లేదు. ఆ దిశగా ఈ తరం కృషిచేస్తారని భావిస్తున్నాను. తెలుగులోను మంచి సినిమాలు తీయాలి. మరో 100 ఏళ్లు సాగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను.
అదే బాధాకరం
– శారద
వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నాను. అదే సమయంలో నేటి సినిమా కూడా అందులో భాగం కావడం చాలా బాధగా వుంది. ఈ తరం సినిమాలో కథ లేదు, సంస్కారమూ లేదు. గూండాయిజం, అమ్మాయిలను కీలుబొమ్మలుగా చూపించడం తప్ప. ఇది చాలా తప్పు. ఇలాంటి సినిమాలు తీయడం సంఘానికి ద్రోహం చేయడమే. ఎన్నో ఒత్తిడుల్లో ఉండే ప్రజలకు సంతోషాన్నిచ్చే మాత్రగా సినిమా ఉండాలేగానీ, పెడతోవ పట్టించకూడదు.
ఏదో ఒక సినిమా విజయం సాధించిందని, విలువల్ని మర్చిపోయి అదే బాటలో సినిమాలు తీయడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది. నిర్మాతకా? లేదే… తరువాత వచ్చేవన్నీ ఫ్లాపులే కదా. దీనివల్ల నిర్మాత అనేవాడు మాయమైపోతున్నాడు. నిర్మాతే లేకపోతే ఇక సినిమా ఎక్కడుంటుంది? ఆ రోజుల్లో నటీనటుల అంకితభావం, వృత్తిని దైవంగా, పవిత్రంగా భావించే స్వభావం వారిని ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవుల్ని చేసింది. ఈ రోజు సినీ పరిశ్రమ ఎంత మురికి అయిపోయిందంటే మాటల్లో చెప్పలేము. ఈనాటి సినిమా పరిస్థితికి ఒక నటిగా బాధపడుతున్నా. చాలా అసంతృప్తిగా వుంది.
నేను ఈ తరానికి చెప్పదలచుకున్నది ఒకటే – ఆడపిల్లలను ఆడపిల్లల్లాగే చూపించే సినిమాలు తీయాలి. స్త్రీని గౌరవించే రోజులు రావాలి. ఒక మహిళగానూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఇదే. చివరిగా ఒకమాట… 100 ఏళ్ల సినిమా గురించి ఆంధ్రజ్యోతి రాసిన వ్యాసంలో ఈ తరం హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన విమర్శ చెంపఛెళ్లుమనిపించేట్లు ఉంది. ఇలా పదిమందీ విమర్శిస్తే అన్నా వారిలో మార్పు వస్తుందేమో చూడాలి.

